177 జిఓని రద్దు చేయాలి: కాంగ్రెస్ ఎంపిలు
posted on Apr 17, 2011 @ 11:30AM
హైదరాబాద్: ప్రభుత్వం ఉద్యోగులను నియంత్రించడానికి జారీ చేసి 177 జిఓని రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికే 177 జిఓ తెచ్చారని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయానికి సంబంధించి కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లడం సబబు కాదని కూడా వారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ వ్యతిరేకి అయిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహ్ రెడ్డి పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండాను తెలంగాణలో ఎగరకుండా చూడాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో జగన్ ఫ్లకార్డు పట్టుకున్నారని అప్పుడే ఆయన తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ ప్రజలకు అర్థమై పోయిందన్నారు. తెలంగాణపై కడప ఉప ఎన్నికల అనంతరం కాకుండా ఎన్నికలకు ముందే తెలంగాణపై తన పార్టీ అభిప్రాయాన్ని వెలువర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన ఉద్దేశ్యం చెప్పాలన్నారు. జగన్ పార్టీ జెండాలు తెలంగాణలో ఎగురవేసిన వారు తెలంగాణ వ్యతిరేకులే అన్నారు. అయినా జగన్ పార్టీ అభిప్రాయం అవసరం కూడా లేదని అన్నారు. ప్రచారానికి ఎవరు వెళతారనే విషయంతో తమకు సంబంధం లేదన్నారు. అయితే ఎవరు గెలిచినా తెలంగాణకు వ్యతిరేకులే అన్నారు.