రైతులకు రూ.1019 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
posted on Apr 17, 2011 @ 2:48PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి హామీ మేరకు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 1019 కోట్ల రూపాయలను అందజేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వచ్చే వ్యవసాయ సీజన్ కు అవసరమైన 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, ఇతర రకాలైన విత్తనాల నిల్వలు, 90 లక్షల బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ లు సిద్ధంగా ఉంచి సకాలంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ప్రజాపథం పూర్తైన తర్వాత ప్రతీ సంవత్సరం మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, వాటికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపింది.
కడప జిల్లా మినహా రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 10 వేల అంగన్ వాడీ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నాబార్డు సాయంతో దశలవారీగా అంగన్ వాడీ కేంద్రాల భావనల నిర్నామానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. సంబంధిత ఏఎన్ఎం, ఆసా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో నిర్దేశించిన రోజుల్లో పౌష్టికాహార, ఆరోగ్య దినోత్సవాలను ఖచ్చితంగా నిర్వహించేటట్లు చూడాలని ముఖ్యమంత్రి కోరారు. సంబంధిత సీనియర్ అధికారులు ఆయా రోజుల్లో అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి వాటిని పర్యవేక్షించాలని సూచించారు.