'జాతీయ రాజకీయాల్లోకి బాబు రావాలి'
posted on Apr 20, 2011 @ 2:21PM
కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజకీయాల్లో నుండి తప్పుకొని దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుపిఐ అవినీతిని ప్రక్షాళన చేయాలంటే బాబు ప్రధాని కావడమే సముచితమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు ముందు ముందు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, రాష్ట్రంలో మరొకరు పార్టీ పగ్గాలు అంది పుచ్చుకోవచ్చునని చెప్పారు. అందరి ఆమోదంతో ఎవరైనా పార్టీ పగ్గాలు చేపట్టవచ్చునని అన్నారు. కాగా ఇటీవల నందమూరి వంశానికి పార్టీ పగ్గాలు అందించాలనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను బాలకృష్ణకు అప్పగించాలని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కోరుకుంటున్నారా, లేదంటే నారా లోకేష్‌కు అప్పగించాలని వాంఛిస్తున్నారా అనేది తెలియడం లేదు.