జగన్‌కు ఓటు వేస్తే గాలికి వేసినట్లే
posted on Apr 20, 2011 @ 4:17PM
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనడానికి కాంగ్రెసు శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కొత్త నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. వైయస్ జగన్‌కు ఓటు వేస్తే కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఓటు వేసినట్లేనని ఆయన అంటున్నారు. ఇద్దరూ అక్రమార్కులేనని అంటున్నారు. వారు వారి అక్రమ సంపాదన రక్షించుకోవాడనికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌కు ఓటు వేస్తే గాలికి ఓటు వేసినట్లే అని చెప్పడం ద్వారా కడపలో ఉన్న మైనార్టీలను తమ వైపుకు మరల్చుకోవాలనే యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కడప పార్లమెంటులో జగన్‌కు ఓటు వేసినా, పులివెందుల అసెంబ్లీ నుండి విజయమ్మకు ఓటు వేసినా కర్ణాటక బిజెపిలో ఉన్న గాలికి ఓటు వేసినట్లేనని అన్నారు. జగన్ ఉప ఎన్నికల తర్వాత బిజెపితో కలవడం ఖాయమని అన్నారు. జగన్ పదవీ కాంక్ష వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని అన్నారు. కాగా మంగళవారం పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్నాటకానికి సూత్రదారి బిజెపి అని చెప్పడం విశేషం. పిసిసి అధ్యక్షుడు బిజెపి సూత్రదారి అని చెప్పగానే పొంగులేటి ఈ కొత్త నినాదాన్ని అందుకున్నాడు.