వైఎస్సార్ ఫోటో కాంగ్రెస్ కే సొంతం
posted on Apr 20, 2011 @ 2:27PM
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారని ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. అందుచేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సొంతమని, ఆయన ఫోటో కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆనం వ్యాఖ్యానించారు. కడప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిపెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆనం వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి పోటీలో ఉన్నారని ఆనం గుర్తుచేశారు. పార్టీని సమన్వయం చేస్తూ ప్రతి నాయకున్ని, కార్యకర్తలను కలుస్తామన్నారు.
కాగా, జగన్‌పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవులు త్యాగం చేస్తే వైయస్ జగన్ పదవి కోసం పాకులాడుతున్నారని ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ సోనియాకు, వైయస్సార్‌కు మధ్యనే అని వైయస్ జగన్ అనడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. వైయస్ జగన్ తన పరిధిని మించి విమర్సలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా తమ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఆయన అన్నారు.