బి.సి.లు చంద్రబాబును నమ్మరా?
posted on Jul 13, 2012 @ 10:47AM
2012 ఉప ఎన్నికల్లో పరాజయం తెలుగుదేశం పార్టీ అథినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో తీవ్రమైన మార్పును తీసుకువచ్చింది. ఇంకా రెండు సంవత్సరాల సమయమున్నా సమీక్షలు, సమన్వయ సమావేశాలతో బిజీబిజీగా ఉన్న ఆయన ఇటీవల బిసిలకు తమ పార్టీ తరుపున వంద అసెంబ్లీస్థానాలు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత ఇతర సమావేశాల్లో పడి మళ్లీ బిజీ అయిన చంద్రబాబును తాజాగా బిసికులసంఘాలు సన్మానించాయి.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో వందస్థానాల నుంచి బిసిలు పోటీ చేస్తున్నందున వారి గెలుపుబాధ్యత కులసంఘాలే తీసుకోవాలని కోరారు. తానిచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తే నిధులు కూడా మంజూరు చేస్తానని చంద్రబాబు బిసి సంఘాలకు హామీ ఇచ్చారు. కులసంఘాల నాయకులు కూడా చంద్రబాబు మాటలకు స్పందించారు. ముందస్తుగా బిసిలకు వంద స్థానాలు ప్రకటించినందున తాము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పని చేస్తామని బిసి సంఘాల నేతలు ప్రకటించారు. తమవారి గెలుపుద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలన్న పిలుపుకు అనుగుణంగానే తాము పని చేస్తామని బిసి సంఘాలు తెలిపాయి.
తెలుగుదేశంతో మమేకమై పని చేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న ఆశ తమకు ఏర్పడిరదని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ఏదేమైనా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచి గెలుపు కోసం బిసి సంఘాలను దువ్వటం మొదలుపెట్టారు. ఈయన తీసుకున్న ఈ చర్యల వల్ల ఇతర జాతీయపార్టీలూ బిసిలకు తప్పనిసరిగా వందస్థానాలు కేటాయించాల్సి వస్తుందని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. మరి ఒకే కులం నుంచి ఇద్దరు పోటీ చేస్తే సంఘాలు కూడా గెలుపు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలవా? అసలు బి.సి.లు నిజంగా చంద్రబాబును నమ్ముతారా? గెలుపు కోసం కులసంఘాలను నమ్ముకుని బాబు ఆశలపందిరి అల్లుకోవటం ఎంతవరకూ ఫలితానిస్తుందో భవిష్యత్తులోనే తేలుతుంది.