ఆంధ్రా గంజాయి సాగుకు ముంబయ్ మాఫీయా ఫైనాన్స్?
posted on Jul 13, 2012 @ 12:45PM
ఏజెన్సీ, సబ్‌ఏజెన్సీల్లోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగుకు ముంబయ్ మాఫియా పెద్ద ఎత్తున ఫైనాన్స్ చేస్తునట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పండిన గంజాయిని ఎవరి దృష్టిపడకుండా ఒడిశా రాష్ట్రంలోకి, ఇటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అన్ని జిల్లాల ఏజెన్సీలకు అనుబంధమార్గాలు తెలిసిన రవాణాదారులు గంజాయిని చాలా తెలివిగా పక్క రాష్ట్రాలకు తీసుకువెళుతున్నారు. ఎంత నిఘా పెంచినా దొరకకుండా అడవిమార్గంలో తెల్లవారుజామున ఈ రవాణా సాగుతోందని సమాచారం.
విశాఖజిల్లా నర్సీపట్నం పోలీసులు మాకవరపాలెం, గొలుగొండ మండలాల్లో దాడులు చేసి 1650కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 50లక్షల రూపాయలుంటుందని అంచనా. పదిమందిని ఈ దాడిలో అరెస్టు చేశారు. ఒకవ్యాను, ఇండికా కారు, రెండు ద్విచక్రవాహనాలు, 70వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడి వల్ల ముంబయ్ మాఫీయాతో గంజాయిరవాణాదారులకు లింకులున్నాయని తేలింది. ఈ సాగు కోసం ముంబయ్‌మాఫియా ముందస్తుగా అడ్వాన్సులు పంపిస్తోందని, ఆ డబ్బులతో సాగు చేసి గంజాయిని రవాణాదారుల ద్వారా మాఫియా చెప్పిన రాష్ట్రానికి చేరవేస్తున్నారని సమాచారం. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని తెలివిగా ముంబయ్ తీసుకువెళుతున్నారని నిఘావర్గాలూ భావిస్తున్నాయి.