విషతుల్యంగా మారిన విశాఖ ఫార్మాసిటి
posted on Jul 13, 2012 @ 11:02AM
విశాఖ ఫార్మాసిటీలలోని ఐదుఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ధృవీకరించటంతో జిల్లా కలెక్టర్ లవ్‌అగర్వాల్ నోటీసులు జారీ చేయనున్నారు. కంపెనీ ప్రారంభించటానికి ముందే ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నిర్దేశిస్తోంది. ప్రతీ పరిశ్రమల జోనల్‌కార్యాలయాల్లో ఈ నిబంధనల జాబితా ప్రదర్శిస్తుంటారు. వాటిలో కాలుష్యం వెదజల్లేలా పరిశ్రమలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఆ హెచ్చరికలు అటు అథికార్లు, ఇటు పారిశ్రామికవేత్తలు నిర్మాణ, ప్రారంభ సమయాల్లో పెడచెవిన పెడుతున్నారు. ఓ రెండు, మూడేళ్లలో కోట్లాది రూపాయల టర్నోవర్‌తో కంపెనీ విస్తరించాక కానీ, కాలుష్యం పెరిగిందన్న ఫిర్యాదులు అథికారులకు చేరవు. అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలంటూ అథికారులు సీరియస్ అవుతుంటారు.
కానీ, మొదట్లో ఫైలు తమ వద్ద ఉన్నప్పుడు కాలుష్యం వెదజల్లే యూనిట్లను అనుమతించబోమని అథికారులు పారిశ్రామికవేత్తలకు ఎందుకు స్పష్టం చేయటం లేదు? ఆమ్యామ్యాల కోసమా? లేక నేతల రికమెండేషన్‌కు జడుస్తున్నారా? అప్పుడే కనుక, కాలుష్యం పెరిగితే కంపెనీ మూసివేయాల్సి వస్తుందని హెచ్చరిస్తే పారిశ్రామికవేత్తలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవారు. ఆ తరువాత కాలుష్యం పెరగటానికి కారణాలపై విశ్లేషించాల్సిన శ్రమ అథికారులకు తప్పుతుంది. విశాఖజిల్లాలోని ఫార్మాసిటీ కాలుష్యం అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్ నేరుగా ఈ సమస్య పరిష్కారంలో నిమగ్నమయ్యారు. మైలాన్, వేగ్నేశ, యాక్టస్, అకేషియా, విజయ ఫార్మాకంపెనీలకు ఆయన సీఆర్‌పీసీ 133 కింద నోటీసులు జారీ చేయనున్నారు. అలానే తాజాగా తెలంగాణాప్రాంతంలోని అదిలాబాద్ వద్ద ఫార్మాకంపెనీలపై కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. షామీర్‌పేట్ మండలంలోని గ్రామాలన్నీ ఆ కంపెనీల వల్ల కాలుష్యమయమవుతున్నాయి. సాయంత్రం ఏడుగంటల తరువాత కంపెనీలు కాలుష్యాన్ని వదులుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆ రహదారిలో వెళ్లే పాదాచారులు తాము భరించలేనంత దుర్గంధం వెలువడుతోందంటున్నారు.