ఢిల్లీ నుంచి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్...కమలంతో పొత్తు ఖరారైందని వెల్లడి 

బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో పొత్తు ఖరారైందని పార్టీ నేతలకు చెప్పారు. కాసేపట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన వస్తుందని తెలిపారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు.  ఆదివారం విజయవాడలో చంద్రబాబు ఆయన సతీమణి పురందేశ్వరి, జనసేనాని పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.  బీజేపీతో  సీట్ల  పంపకంపై ఓ అవగాహనకు వచ్చామని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చంద్రబాబు వివరించారు. మూడు పార్టీల మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. వారిరువురు మరోసారి బీజేపీ అగ్రనేతలతో సమావేశమై సీట్ల పంపకంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ శనివారం నాడు చర్చలు జరిపారు. 50 నిమిషాల పాటు జరిపిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని ముగ్గురు నేతలు నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీలో నాని సీన్ అయిపోయిందా?.. బేలమాటలు అందుకేనా?!

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోడాలి నానికి భవిష్యత్తు దర్శనం బాగానే అయినట్లుంది. అందుకే.. ఇవే తన చివరి ఎన్నికలంటూ... ఆయన.. తన నియోజకవర్గ ప్రజలకు చాలా సాఫ్ట్‌గా.. కాదు కాదు బేలగా చెబుతున్నారు. ఎలాగోలా గెలిపించి పుణ్యం కట్టుకోండంటూ అన్యాపదేశంగా బతిమలాడుకుంటున్నారు.  నిన్న మొన్నటి వరకు అది అసెంబ్లీ అయినా, మీడియా సమావేశమైనా ఎక్కడైనా, ఎప్పుడైనా నాని నోరెత్తారంటే..  ఆడు చెప్పాడా?.. ఈడు చెప్పాడా? ఆ డమ్మా మొగుడు చెప్పాడా? అంటూ బండ బూతులతో చెలరేగిపోయేవారు. అలాంటి నాని నోట సాఫ్ట్ గా ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బేలగా ఇవే నా చివరి ఎన్నికలు వంటి మాటలు రావడం చూస్తుంటే ఆయనకు ఏదైనా బోధివృక్షం కనిపించిందా? దాని కింద కూర్చోవడంతో జ్ణానోదయం అయి తత్వం బోధపడి బొమ్మకనిపించిందా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నాయి.   రానున్న ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి మండల హనుమంతరావు పేరును పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే  గుడివాడ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.  ఇటీవల గుడివాడ పట్టణంలో... రాత్రికి రాత్రే నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మండల హనుమంతరావు అంటూ భారీ ఫ్లెక్సీలు   వెలిశాయి. ఈ హాఠాత్  పరిణామంతో కొడాలి నాని వర్గం ఒక రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అంతే కాదు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.   దాంతో ఈ అంశాన్ని నాని  తాడేపల్లి ప్యాలెస్‌  పెద్దలకు తెలియజేశారు. ఇక వారి నుంచి  వచ్చే సమాధానం కోసం ఆయన, ఆయనతో పాటు ఆయన వర్గం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే    కొడాలి నాని  నిర్వేదంలో కూరుకుపోయి.. ఇవే తన చివరి ఎన్నికలంటూ మాట్లాడారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇప్పటికే గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి.. 2014, 2019లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా  గెలుపోందారు.  2019లో  జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన కేటినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా కొడాలి నాని  ఎలా వ్యవహరించారో.. ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. దీంతో   పౌరసరఫరాల శాఖ మంత్రి కాదు.. బూతు సరఫరాల శాఖ మంత్రి అంటూ  కొడాలి నానిపై సోషల్ మీడియాలో  నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేశారు.   అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొడాలి నాని ఇప్పుడు ఇలా  చాలా సాఫ్ట్‌గా.. ఇంకా చెప్పాలంటే.. తనకు వయస్సైపోయిందనీ,  53 ఏళ్లతాను ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 58 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉంటానని.. ఆ తర్వాత అంటే.. 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా  తన కుమార్తెలు రాజకీయాల్లోకి రారని క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడు కొడాలి చిన్ని కుమారుడు వచ్చే అవకాశం ఉందంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం మీద కొడాలి నాని బేల మాటలు వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందన్న సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చ జోరందుకుంది.  అదీకాక కొడాలి నాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే ఓ ప్రచారం ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న దృశ్యాలు సైతం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆ క్రమంలోనే కొడాలి నాని ఇవి తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.    ఏదీ ఏమైనా మిర్చిలాగా ఎప్పుడు హాట్ హాట్‌ కామెంట్స్ చేసే కొడాలి నాని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇవే తనకు చివరి ఎన్నికలనీ.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ.. చాలా సాఫ్ట్‌గా మాట్లాడడం చూస్తుంటే.... ఎక్కడో ఏదో తేడా కొడుతుందని.. కానీ అది అంతగా అంతు బట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం గుడివాడ నియోజకవర్గంలో వైరల్ అవుతోంది. అదీకాక ఇప్పటికే ఇదే డైలాగ్ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వాడారని.. కృష్ణాజిల్లా వాసులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  మరోవైపు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన పాడి కౌశిక్ రెడ్డి.. కమలాపుర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ..  మీరు ఓటు వేసి దీవిస్తే.. 4వ తేదీన ఎమ్మెల్యేగా జైత్ర యాత్ర చేస్తా.. లేకుంటే శవయాత్ర చేసుకుంటాం... మా కుటుంబ సభ్యులం ముగ్గురు ఆత్మహత్య చేసుకంటామంటూ ఓ సెంట్‌మెంట్ ఆయుధాన్ని ఉపయోగించి.. ఎమ్మెల్యేగా ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారని... ఈ తరహా ట్రిక్స్‌ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఉపయోగించే అవకావం ఉందనే ఓ చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక కొడాలి నాని.. తన రాజకీయ వారసుడిని సైతం ఈ సందర్బంగా చెప్పకనే చెప్పారనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది.

రేవంత్ తో భేటీ అయిన  కాంగ్రెస్ అభ్యర్థులు బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి 

మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ శనివారం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధిష్ఠానం నిన్న నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు అవకాశం ఇచ్చింది. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన బలరాం... 2014, 2019 ఓడిపోయారు. వరుసగా రెండు పర్యాయాలు మహబూబాబాద్ లోకసభ స్థానంనుంచి ఓటమిని చవి చూసిన బలరాం నాయక్ కు తిరిగి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు పోటిచేసి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావుపై 68.957 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు.  మహబూబ్ నగర్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంశీచంద్ రెడ్డి 2014లో కాంగ్రెస్ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 2019 మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి ఇదే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తొలి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు అందరూ కలిసి మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి, సురేశ్ షేట్కార్ తదితరులు ఉన్నారు

ఏపీలోనూ కాంగ్రెస్ తురుఫుముక్క రేవంత్!?

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో సూపర్ స్టార్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. కర్నాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికే ఇటు ప్రజలలో, అటు పార్టీ అధిష్ఠానం దృష్టిలో కూడా మంచి మార్కులు పడ్డాయి.  తెలంగాణలో అసలు ఆశలే లేని స్థితి నుంచి రేవంత్ పార్టీని ఒక్కో అడుగూ విజయం దిశగా పార్టీని నడిపించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది.  అసలు ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అధిష్ఠానం అప్పగించిన తరువాత పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమని లేచింది. పార్టీ సీనియర్లంతా తమతమ విభేదాలను పక్కన పెట్టి మరీ ఐక్యంగా రేవంత్ ను వ్యతిరేకించారు. రాజీనామాల హెచ్చరికలకు కూడా వెనుకాడలేదు. అయితే నెమ్మది నెమ్మదిగా రేవంత్ తన కలుపుగోరు తీరుతో సీనియర్లందరినీ కలుపుకుని ముందుకు సాగారు. అదే సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పై విమర్శల దూకుడును మరో రేంజ్ కు తీసుకు వెళ్లారు. అప్పటి వరకూ ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ ఓటమి ఖాయం అన్నట్లుగా ఉండే పరిస్థితి మారింది. డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రేవంత్ పని తీరు చూసిన తరువాత పార్టీలో విజయంపై ఆశ మొలకెత్తింది. దీంతో పార్టీలో అసమ్మతి రాగాలు సద్దుమణిగాయి. ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడిగా కుదురుకున్న తరువాత రేవంత్  అప్పటి అధికార బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టడంపై దృష్టి పెట్టారు. అప్పటి వరకూ కేసీఆర్ వాగ్ధాటి ముందు కాంగ్రెస్ నేతలు తేలిపోతున్నారా అనిపించే పరిస్థితి మారింది. కేసీఆర్ కు దీటుగా రేవంత్ తన వాక్పటిమతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఒక సారి పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత సీనియర్ నేతలంతా తమ గొంతు సవరించుకుని రేవంత్ తో కలిసి నడిచారు. ఎవరినీ నొప్పించకుండా, అలాగని ఎక్కడా తగ్గకుండా టీపీసీసీ చీఫ్ గా రాష్ట్ర పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి, ఆ తరువాత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తనదైన ముద్ర వేశారు. మొహమాటాలకు తావివ్వకుండా కచ్చితంగా గెలుపు గుర్రం అయితేనే రంగంలోకి దింపాలన్న కండిషన్ తో అధిష్ఠానాన్ని కన్విన్స్ చేయగలిగారు. దీంతో విపక్షంలో ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా సమస్యలు లేకుండానే కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఇక ఆ తరువాతి నుంచి ఎన్నికల ప్రచార బాధ్యతలన్నీ దాదాపు ఒంటి చేత్తో రేవంత్ మోశారు. సీనియర్లంతా తమతమ నియోజకవర్గాల్లో గెలవడంపైనే దృష్టినంతా కేంద్రీకరించే పరిస్థితుల్లో ఉండే రేవంత్ ఒక్కడే సుడిగాలిలా రాష్ట్రమంతా చుట్టేశారు. సరే కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రెండు రోజుల పాటు హై డ్రామా నడిచినా, ఉత్తమ్, భట్టి మేం రేసులో బలంగా ఉన్నామంటూ ముందుకు వచ్చినా రేవంత్ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోకుండా నిబ్బరంగా ఉన్నారు. అధిష్ఠానం చివరకు రేవంత్ ను సీఎంగా ఎంపిక చేసింది. ఇక కేబినెట్ కూర్పు నుంచి ప్రతి విషయంలోనూ రేవంత్ సమష్టి బాధ్యతను విస్మరించలేదు. సీఎం పదవి కోసం తనతో పోటీ పడిన వారికి కీలక మంత్రిపదవులు కట్టబెట్టడం ద్వారా  టీం కాంగ్రెస్ స్ఫూర్తిని పార్టీ క్యాడర్ లోనూ, నాయకులలోనూ నింపడంలో సఫలీకృతులయ్యారు. అటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ తనదైన మార్క్ చూపి ప్రజలలోనూ మంచి మార్కులు కొట్టేశారు.  దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని తెలంగాణలో కాంగ్రెస్ నే రేవంత్ అధికారంలోకి తీసుకువచ్చిన తీరు ఆయన ప్రత్యర్థులను సైతం అచ్చెరువందేలా చేసింది. దీంతో సహజంగానే రేవంత్ నాయకత్వ సమర్ధతపై అధిష్ఠానం నమ్మకం పెరిగింది. దీంతో త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా రేవంత్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఏపీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరగనున్నాయి. అంటే ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్ సభ స్థానాలలో గెలుచుకునేలా పార్టీని నడిపిస్తూ, ప్రచార బాధ్యతలు మోస్తూ, అదే సమయంలో ఏపీలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన గురుతర బాధ్యతను పార్టీ హై కమాండ్ రేవంత్ భుజస్కంధాలపై పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డే అని అధిష్ఠానం చెప్పకనే చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక రేవంత్ స్పీడ్, అందరినీ కలుపుకుపోయే తత్వం, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వాగ్ధాటి కీలకం అని భావిస్తున్న అధిష్ఠానం ఇప్పుడు ఏపీలో పార్టీని ఎన్నికల యుద్ధంలో ముందుండి నడిపించాల్సిన బాధ్యతను కూడా రేవంత్ కు కట్టబెట్టింది. అధిష్ఠానం నిర్ణయంతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారిగా   మార్చి15 న ఏపీలో పర్యటించనున్నారు. ఆ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ నిర్వహించనున్న బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు.  

శబ్ద కాలుష్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ 

జనా వాసాల మధ్య ఫంక్షన్ హాల్స్ ఉంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. తెల్లవార్లు డిజె సౌండ్ లు చికాకు పుట్టించి నిద్దుర కరవౌతుంది. హైద్రాబాద్ కు చెందిన ఒక పౌరుడు తెలంగాణ హైకోర్టు కు రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శబ్ద కాలుష్యంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది.  హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌బ్ద ప‌రిమితుల‌పై జారీ చేసిన స‌ర్క్యుల‌ర్, దాని అమ‌లు తీరుపై వివ‌రాలు ఇవ్వాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు కోరింది. న‌గ‌రంలోని పంక్ష‌న్ హాల్స్‌లో సౌండ్ లిమిట్స్ ప‌రిమితుల‌కు లోబ‌డి ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం తెలిపింది. తాడ్‌బండ్ బోయిన‌ప‌ల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియ‌ల్ గార్డెన్స్ పంక్ష‌న్ హాల్స్ నుంచి భారీ శ‌బ్ద కాలుష్యం వెలువ‌డుతుంద‌ని పేర్కొంటూ మిలిట‌రీ అద‌న‌పు చీఫ్ ఇంజినీరు క‌ల్న‌ల్ స‌తీష్ భ‌ర‌ద్వాజ్ రాసిన లేఖ‌ను హైకోర్టు పిల్‌గా స్వీక‌రించింది. ఈ పీల్‌ను చీఫ్ జ‌స్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన డివిజ‌న్ బెంచ్ విచారించింది.  ఇక ప్ర‌భుత్వం త‌ర‌ఫున అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ మ‌హ‌మ్మ‌ద్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. శ‌బ్ద కాలుష్యం అంశంప‌పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని న్యాయ‌స్థానానికి తెలిపారు. దీని ప్ర‌కారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత డీజే సౌండ్స్ ఉండ‌కూడ‌ద‌ని వెల్ల‌డించారు. పిటిష‌న‌ర్ చెబుతున్న రెండు పంక్ష‌న్ హాల్స్ ప‌రిధిలో పెట్రోలింగ్ నిర్వ‌హించేలా పోలీసుల‌కు ఆదేశాలు ఇస్తామ‌ని తెలిపారు. దీనిపై రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం స్పందిస్తూ.. బోయిన‌ప‌ల్లిలో శ‌బ్ద కాలుష్యం వెలువ‌డే ఫంక్ష‌న్ హాల్స్‌పై చ‌ర్య‌లు తీసుకునే అధికారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉంద‌ని గుర్తు చేసింది. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బోర్డును ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తూ.. శ‌బ్ద కాల‌ష్య నిబంధ‌న‌ల‌పై జారీ చేసిన ఉత్త‌ర్వుల గురించి నివేదిక ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

అప్పుడు ఓవ‌ర్ యాక్ష‌న్‌.. ఇప్పుడు కాళ్ల‌బేరం!

పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. కాలేజీలు పెట్టా.. సక్సెస్ అయినా.  ఈ ఒక్క లైన్ విన‌గానే  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే చామ‌కూర‌ మ‌ల్లారెడ్డి గుర్తుకొస్తారు. బీఆర్ ఎస్ అధికారంలో కొన‌సాగిన‌న్ని రోజులు మ‌ల్లారెడ్డి హ‌వాయే వేరు.  ఆయ‌న ఏది మాట్లాడినా చెల్లుబాట‌య్యేది.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేది. అంతేకాదు, క‌బ్జాలు, భూ దందాల ఆరోప‌ణ‌లు వ‌చ్చినా మ‌ల్లారెడ్డిని ట‌చ్ చేసేందుకు అధికారులు సైతం భ‌య‌ప‌డేవారు.. దీంతో అధికారం త‌ల‌కెక్కించుకున్న మ‌ల్లారెడ్డి,  ప్ర‌తిపక్షంలోఉన్న రేవంత్ రెడ్డి  టార్గెట్ గా విమ‌ర్శ‌లు గుప్పించారు. రారా చూసుకుందాం అంటూ సవాళ్లు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చినా న‌న్ను ఎవ్వ‌రూ ఏం చెయ్య‌లేరు.. నా ద‌గ్గ‌ర డ‌బ్బుంది.. కాంగ్రెస్ పెద్ద‌ల‌ను మేనేజ్ చేస్తా.. తెలంగాణ‌లో ఎవ‌రు సీఎంగాఉన్నా న‌న్నేమీ చేయ‌లేరు అంటూ మ‌ల్లారెడ్డి  ఓవ‌రాక్ష‌న్‌ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. కానీ  రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు అవ్వ‌డానికి పెద్ద సమయం పట్టదని మ‌ల్లారెడ్డి గుర్తించ‌లేక పోయారు. మాల్లారెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం.. నేటి రాజ‌కీయ నేత‌ల‌కు ఓ పాఠం అనికూడా చెప్పొచ్చు. అధికారంలో ఉన్నాం.. మ‌నం ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుంద‌ని చాలా మంది రాజ‌కీయ నేత‌లు ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటారు. కానీ  అధికారం పోయిన త‌రువాత వ‌డ్డీతో స‌హా చెల్లించేందుకు   ప్ర‌త్య‌ర్థులు రెడీగా ఉంటార‌ని అనుభవంలోకి వచ్చే దాకా గుర్తించరు. గ‌త ఐదేళ్లుగా మ‌ల్లారెడ్డి చేసిన అతికి ఇప్పుడు  మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితిలో ఆయన పడ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే మ‌ల్లారెడ్డి భూక‌బ్జాల వ్య‌వ‌హారాల‌న్నీ ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా మ‌ల్లారెడ్డి అల్లుడు, మ‌ల్కాజిగిరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాలేజీలు ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి భవనాలు నిర్మాణం చేశారని గుర్తించిన అధికారులు  ఆ భ‌వ‌నాల‌ను కూల్చేశారు. గ‌తంలో మ‌ల్కాజిగిరి ఎంపీగా ఉన్న‌ప్పుడు ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి అవి అక్ర‌మ క‌ట్ట‌డాల‌ని అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో మ‌ల్లారెడ్డి మంత్రిగా ఉండ‌టంతో అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేకదు. అయితే ఇప్పుడు అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తే  సీఎం కుర్చీలో కూర్చోవ‌డంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. గ‌తంలో రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుకు దుమ్ముదులిపి ప్ర‌భుత్వ భూమిలో నిర్మాణం చేసిన భ‌వ‌నాల‌ను అధికారులు ద‌గ్గ‌రుండి కూల్చేశారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, మా భూములను లాక్కొన్నారనీ పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫిర్యాదులపై  దృష్టిసారించింది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై ముప్పేట దాడిచేసేందుకు అధికారులు  సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  దీంతో అధికారంలో ఉన్న సమయంలో అతిగా ప్రవర్తించానని తెలుసుకున్న మల్లారెడ్డి.. ప్రస్తుతం తన ఆస్తులను కాపాడుకునేందుకు కాళ్ల బేరానికి దిగినట్లు తెలిసింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తాడని మల్లారెడ్డి ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వచ్చారు.. బీఆర్ఎస్ అధిష్టానం సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా మల్లారెడ్డి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.. అంతేకాదు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి నా కొడుక్కు ఎంపీ టికెట్ వద్దు అంటూ మొరపెట్టుకున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పేట దాడి నుంచి తప్పించుకునేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి  చేరేందుకు సిద్ధమైనట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డిలు కలిసి తమ బాధను వెళ్లబోసుకున్నారని తెలిసింది. మొత్తానికి మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓవరాక్షనే .. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందన్న చర్చ  బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. అంతే కాదు.. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆయనకు మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి తాజా వ్యవహారం మొత్తాన్ని ఓసారి గమనిస్తే.. తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుగా ఉందన్న వాదన తెలంగాణ రాజకీయ వర్గాల్లో  వినిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అధికార మత్తును నెత్తికెక్కించుకుంటే ప్రతిపక్షంలోకి వచ్చాక ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎక్కువ దృష్టిసారించాలని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ప్రస్తుతం మల్లారెడ్డికి ఎదురైన అనుభవమే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా పద్దతిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ.. అక్రమ కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎటుచూసినా ప్రతిపక్షాలపై కక్షపూరిత  వేధింపులే కనిపిస్తున్నాయి.   వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోతే.. జగన్, అధికారం మత్తులో ఓవరాక్షన్ చేస్తున్న వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందన్న చర్చ  తెలుగు రాష్ట్రాల్లోని జరుగుతోంది.

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కమలం గూటికి మాజీ ఎంపీ సీతారాం నాయక్!

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తాను బీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు లేకుండా పోయిందనీ, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాననీ ఆయన ఆవేదన చేశారు. ఐదేళ్లుగా తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారనీ ఆయన బీఆర్ఎస్ అధినాయకత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు తనను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా తనను బీజేపీలోకి ఆశ్వానించారని సీతారామ్ నాయక్ చెప్పారు. ఇన్నాళ్లుగా అవమానాలు దిగమింగి బీఆర్ఎస్ కోసం పని చేశాననీ, ఇక తన వల్ల కాదనీ కుండబద్దలు కొట్టారు.  ఇప్పుడిక తాను నిర్ణయం తీసేసుకున్నానని, కమలం పార్టీలో చేరుతాననీ ఆయన స్పష్టం చేశారు.  అలాగే బీజేపీ నుంచి మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం (మార్చి 8) వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా  హన్మకొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే సీతారాం నాయక్ ను బీజేపీలోకి  ఆహ్వానించారు. అప్పటికి అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన సీతారాం నాయక్ శనివారం (మార్చి 9)న మీడియా ప్రతినిథులకు తన నిర్ణయం చెప్పారు.  

ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడికి  కాంగ్రెస్ తీర్థం 

రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుని అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో వెళ్లి కాంగ్రెస్ పార్టీ  అధికారంలో వచ్చి మూడెనెలలు పూర్తయ్యింది. ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలను  ఇప్పటివరకు అమలు చేసిన ఆ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరగుతోంది. బిఆర్ఎస్ నేతలు పెట్టా బేడా సర్దుకుని కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు.  తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతూ... కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీరు ఈరోజు కలవనున్నారు. మరోవైపు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మార్నేని రవీందర్ రావు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.

సీట్ల సర్దుబాటు ఖరారు..జగన్ శిబిరంలో కంగారు!

సార్వ్రతిక ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. దీంతో దేశం అంతా ఎన్నికల హీట్ పెరిగిపోయింది.  మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక్కడ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పీక్స్ లో ఉందన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం గత ఎన్నికల పరాజయం నుంచి కోలుకుని బలంగా పుంజుకుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించడంతో ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమిలో జోష్ కనిపిస్తోంది. రెండు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయి నుంచీ సమన్వయంతో కదులుతున్నాయి.  ఏపీలో అటువైపా, ఇటువైపా తేల్చుకునే విషయంలో ఇంత కాలం ఊగిసలాటలో ఉన్న బీజేపీ అధిష్ఠానం కూడా తెలుగుదేశం, జనసేన కూటమితోనే కలిసి నడవాలన్న నిర్ణయాన్ని ప్రకటించేసింది. ఆ కూటమితో సీట్ల సర్దుబాటుపై కూడా ఒక  ఒప్పందానికి వచ్చేసిందని హస్తినలో అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడే అవకాశాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంలో శుక్రవారమే కూటమి, బీజేపీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. అయితే సంఖ్య మాత్రమే కాదు, పోటీ చేసే స్థానాలు, పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో కూడా తమకు ఆమోదయోగ్యమైనట్లుగానే ఉండాలన్న తెలుగుదేశం, జనసేన కూటమి డిమాండ్ పట్ల కూడా బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో బీజేపీ ఓటు స్టేక్ కనీసం ఒక శాతం కూడా లేదు. ప్రజల మొగ్గు ఉన్న తెలుగుదేశం, జనసేనలతో కలిసి నడిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనానికి తోడు తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకునే ఎంపీ స్థానాలు కూడా బీజేపీకి కీలకమే. అందుకే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని గెలుపు గుర్రాలెవరన్న విషయాన్ని బేరీజు వేసుకుని పొత్తులో భాగంగా బీజేపీ పట్టు విడుపులు ప్రదర్శించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలు 30 అసెంబ్లీ, ఎనిమిది లోక్ సభ స్థానాలలో పోటీలో ఉంటాయనీ, మిగిలిన  140 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో నిలుస్తారన్న ఒప్పందం ఖరారైపోయిందని చెబుతున్నారు.  వీటిలో ఇప్పటికే 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందన్న విషయం తేటతెల్లమైపోవడంతో ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఆరు అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతుందన్న స్పష్టత వచ్చేసింది.  అసలు తొలుత బీజేపీ ఎక్కవ స్థానాలను కేటాయించాలంటూ డిమాండ్ చేసినప్పటికీ చర్చలలో పరిస్థితిని అవగాహన చేసుకుని మెట్టు దిగిందని, ఇది శుభపరిణామమని పరిశీలకులు అంటున్నారు.   ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి సాధించుకున్నా నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమైతే ప్రయోజనం ఉండదు. అమిత్ షా, నడ్డాలతో చర్చల్లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇదే విషయాన్ని గట్టిగా చెప్పి వారిని కన్విన్స్ చేశారని అంటున్నారు. అలాగే.. పోటీ చేసే స్థానాలలో బీజేపీ నిలబెట్టే అభ్యర్థుల విషయంలో కూడా తమ అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన మధ్య ఓటు ట్రాన్స్ ఫర్ లో ఎటువంటి ఇబ్బందులూ ఉండవనీ, చాలా కాలంగా ఇరు పార్టీలూ కూడా సమన్వయంతో పని చేస్తున్నాయనీ, క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ ప్రజాసమస్యలపై సమష్టి పోరాటాలతో ప్రజలలో ఉన్నాయనీ వివరించిన చంద్రబాబు, ఇంత కాలం బీజేపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వత్తాసుగా ఉందన్న అభిప్రాయం ప్రజలలో బలంగా ఉందనీ, అంతే కాకుండా ఇప్పటి వరకూ తెలుగుదేశంపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన రాష్ట్ర బీజేపీ నాయకులను పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపితే ఓటు బదలీ సమస్యగా మారుతుందని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా గళమెత్తిన రాష్ట్ర బీజేపీ నేతలనే కమలం పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న చంద్రబాబు సూచన పట్ల అమిత్ షా, నడ్డాలు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులూ, సమస్యలూ లేకుండా సీట్ల సర్దుబాటు జరిగిపోయిందని అంటున్నారు.  

కాంగ్రెస్ తో మజ్లిస్ చెట్టాపట్టాల్!

ఆల్ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్‌ (ఏఐఎమ్ఐఎమ్) అలియాస్ మజ్లిస్.  హైదరాబాద్ పాత బస్తీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఈ పార్టీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  బీజేపీ వ్యతిరేకతే ఈ పార్టీ విధానం అని చెప్పవచ్చు. అయితే బీజేపీ వ్యతిరేక విధానం కూడా రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడేననీ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.   మొత్తంగా పాతబస్తీలో ఆధిపత్యం కాపాడుకోవడమ అనే ఏకైక లక్ష్యంతోనే మజ్లిస్ పని చేస్తున్నదని చెప్పడానికి ఇసుమంతైనా  సందేహం అవసరం లేదని చెబుతుంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మజ్లిస్, బీఆర్ఎస్ లు అవిభక్త కవలలుగా కలిసిమెలిసి ఉన్నాయి. అప్రకటిత మిత్రపక్షాలుగా ఎన్నికలలో ఒకరికి ఒకరు తోడ్పడ్డాయి. అప్రకటిత అనడానికి ఏముంది.. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎలాంటి దాపరికం లేకుండా  మజ్లిస్, బీఆర్ఎస్ లు మిత్రులు అని బహిరంగంగానే ప్రకటించేశారు.  అయితే మజ్లిస్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆ పార్టీ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే  మిత్రత్వం నెరపింది.   రాష్ట్ర విభజన తరువాత  కూడా అదే విధానాన్ని కొనసాగించింది. తెలంగాణ‌లో  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతోనే చెట్టాపట్టాలేసుకు తిరిగింది.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎంఐఎం అధినేత ఒవైసీ ఆయనతో  భుజం భుజం కలిపి నడిచారు.   అధికారం మారిన తరువాత ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే మజ్లిస్ పార్టీ విధానం, లక్ష్యం కూడా  పాత‌బ‌స్తీలో త‌న పట్టు నిలుపుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ కు దూరం జరిగే  ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఓటమి పాలౌతుందన్న అంచనాలు, సర్వేలు వెలువడటం మొదలు పెట్టినప్పటి నుంచే బీఆర్ఎస్, మజ్లిస్ మధ్య మైత్రీ బంధం సడలిందని పరిశీలకులు ఉదాహరణలతో సహా  విశ్లేషణలు చేశారు. రేవంత్ సీఎం పగ్గాలు అందుకున్న తరువాత సందేహాలకు అతీతంగా బీఆర్ఎస్ కు మజ్లిస్ దూరం జరిగిందని తేలిపోయింది.   మేడిగడ్డ సందర్శనకు రేవంత్ సర్కార్ ఆహ్వానాన్ని మజ్లిస్  మన్నించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో పాటు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. బీఆర్ఎస్ ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లలేదు. అయినా లెక్క చేయకుండా మజ్లిస్ ఎమ్మెల్యేలు మాత్రం తాము కాంగ్రెస్ తోనే ఉన్నామని చాటేందుకు మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు.   వాస్తవానికి   ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లభించిన,   వెసులు బాట్లను  కాంగ్రెస్ ఉదాహరణలుగా చూపుతూ ఆ రెంటి రహస్య మైత్రినీ ఎండగడుతూ వచ్చింది.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అన్న ఆరోపణలను సైతం కాంగ్రెస్ గతంలోనే చేసింది. అయితే అప్పట్లో ఈ విషయాలను వేటినీ పట్టించుకోని మజ్లిస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ గద్దె దిగడంతోనే కాంగ్రెస్ ఆరోపణలు వాస్తవమేనంటూ గళం సవరించుకుంది.  అయితే  మజ్లిస్ బీఆర్ఎస్ కు దూరం జరగడం, కాంగ్రెస్ కు  దగ్గరవ్వడం అనూహ్య పరిణామం ఏమీ కాదు.  ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్రంలో  అధికారంలో  ఉన్న పార్టీతోనే నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే  పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. రేవంత్ రెడ్డి సర్కార్ కు అవసరమైన మెజారిటీ కంటే నాలుగైదు సీట్లు మాత్రమే అధికంగా ఉన్నాయి. పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లో ఇప్పుడు కనిపిస్తున్న ఐక్యత ఎంత కాలం ఉంటుందన్నది, ఆ పార్టీ గురించి తెలిసిన వారంతా అనుమానమే అంటున్నారు. అసంతృప్తి బీజాలు మొలకెత్తి, జంపింగుల భయం ఆ పార్టీని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ ను వెన్నాడుతూనే ఉంటుంది.  అందుకే రేవంత్ తన ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగించే ధీమా కోసం ఆయన మజ్లిస్ మైత్రిని మద్దతును సహజంగానే  కోరుకుంటారు.  అందుకే పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో భాగమే మజ్లిస్, కాంగ్రెస్ దోస్తానా అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కమలం గూటికి పటేల్ రమేష్ రెడ్డి? నల్గొండ నుంచి జానా తనయుడి ప్రత్యర్థిగా రంగంలోకి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికలలో నల్గొండ టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో బలమైన నేతల్లో ఒకరైన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారాలన్న నిర్ణయం ఆ జిల్లాలో కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బంది కలిగించే విషయమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో ఓ విధమైన జోష్ కొనసాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ రోజు రోజుకూ బలహీనపడటం, అదే సమయంలో పొరపొచ్చాలు లేకుండా కాంగ్రెస్ టీమ్ తెలంగాణలా పని చేయడంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తుందన్న అంచనాలు కూడా పెరిగాయి. పలు సర్వేలు కూడా అదే విషయాన్ని వెల్లడించాయి. అయితే పంటి కింద రాయిలా నల్గొండ లోక్ సభ స్థానం కోసం పోటీలో ఉన్న నేతల సంఖ్య ఎక్కువ కావడం, అలాగే ఆ టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా బలమైన నేతలే కావడం కాంగ్రెస్ కు చిక్కుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ దక్కలేదు. అయితే అప్పట్లో  పార్టీ హై కమాండ్ ఆయనను లోక్ సభ ఎన్నికలలో నల్గొండ నుంచి దింపుతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే తీరా లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం మళ్లీ పటేల్ రమేష్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది. నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో పటేల్ రమేష్ రెడ్డి ఇక కాంగ్రెస్ తో లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డి బీజేపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. బీజేపీ కూడా పటేల్ రమేష్ రెడ్డి వంటి కీలక నేత పార్టీలో చేరితే నల్గొండలో పార్టీ బలోపేతమౌతుందని భావిస్తోందని అంటున్నారు. అందుకే ఆయన చేరికనున బీజేపీ స్వాగతిస్తున్నదని చెబుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డి పార్టీలో చేరితే ఆయనను నల్గొండ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు  బీజేపీ రెడీగా ఉందని అంటున్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి కూడా తన అనుచరులతో ఈ విషయమై జోరుగా చర్చిస్తున్నారనీ, నేడో రేపో ఆయన కమలం గూటికి చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

ఇంతకీ ఆ వీడియో ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసుపై ఇటీవల పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బిటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యను నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పంపారన్న సమాచారం ఉందని   ఆరోపించారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని... అందుకు నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సైతం తాను సిద్దమని స్పష్టం చేశారు. అయితే వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని.. కడప ఎంపీ   అవినాష్ రెడ్డి నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమేనా అంటూ సూటిగా సవాల్ విసిరారు.  ఇక ఈ కేసును సీబీఐ తీసుకుంటే వైయస్ అవినాష్ రెడ్డి .. బీజేపీలోకి వెళ్తాడంటూ సీఎం వైఎస్ జగన్ తన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డికి స్పష్టం చేయడం వాస్తవం కాదా? అని బిటెక్ రవి   ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపారన్న విషయం.. హత్య జరిగిన రోజునే వైఎస్ జగన్‌కు ఎలా తెలిసిందని బిటెక్ రవి సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్ ప్రమేయం ఉందని.. ఆ విషయం త్వరలోనే బహిర్గతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై బీటెక్ రవి చేసిన తాజా వ్యాఖ్యలపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తుండడంతోపాటు పలు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.    బీ.టెక్ రవి చెబుతున్నట్లు  వైయస్ వివేకా హత్య తతంగాన్ని వీడియో తీస్తే సదరు వీడియోను నిందితులు ఎవరెవరికీ పంపారని.. అది కూడా ఎంత మందికి వెళ్లిందనే ప్రశ్నలు   ఉత్పన్నమవుతున్నాయి. అదీకాక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ ఎపిసోడ్‌లో లైవ్ వీడియో కాల్ ఘటన తరహా ఏమైనా వీడియో కాల్స్ సైతం వెళ్లాయా అనే అనుమానాలు సైతం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.   ఇక వివేకా హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు ఈ కేసు బుల్లి తెరలో ప్రసారమయ్యే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్‌ను తలపిస్తోందనే   ప్రచారం  ఇప్పటికే జరుగుతోందని వారు వివరిస్తున్నారు. మరోవైపు  వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సీబీఐ విచారణలోఈ వీడియో అంశాన్ని తెలియజేశారా? లేదా? అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. అదీకాక ఈ హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్న వేళ.. ఈ వీడియో అంశాన్ని  తెలుగుదేశం నాయకుడు బిటెక్ రవి తెరపైకి తీసుకు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ వీడియో కోసం సీబీఐ అన్వేషణ మొదలుపెట్టిందా? లేదా?   ఆ వీడియో సీబీఐ స్వాధీనం చేసుకున్నందునే వాళ్లకు బెదిరింపులు ఎదురయ్యాయా? .. అందులో భాగంగానే తొలి నాటి నుంచి దస్తగిరి ఈ వీడియో వ్యవహారంపై సైలెంట్‌గా ఉన్నారా?  అయితే 2019, మార్చి 14 అర్థరాత్రి లేదా 15వ తేదీ తెల్లవారుజామున పులివెందుల నుంచి లోటస్ పాండ్‌కు పోన్ కాల్‌ వెళ్లిందంటూ ఇప్పటికే మీడియాలో కథనాలు బాగా వైరల్ అయినాయని..  ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత ప్లస్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌తో పాటు వైయస్ భారతి పీఏను సీబీఐ అధికారులు కడప పిలుపించుకొని..  విచారించారని.. మరి ఆ సమయంలో సీబీఐ అదికారులు సైతం సెల్ పోన్‌లో సందేశాలు, వీడియోలపై దృష్టి కేంద్రీకరించ లేదా? అనే సందేహాలు సైతం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం. వివేకా హత్య కేసు వాయిదాలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో న్యాయస్థానానికి దస్తగిరి హాజరయ్యారని... ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమీపిస్తున్నాయని.. అలాంటి వేళ వివేక హత్య కేసు వల్ల ఫ్యాన్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా సాక్ష్యం  చెప్పాలంటూ... దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు వైద్యుడి ముసుగులో జైలుకు వచ్చారని.. అందుకు గతేడాది ఆక్టోబర్ 30, 31వ తేదీల్లో జైల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. విచారణ జరపాలంటూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టు జడ్జిల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ వరుసగా దస్తగిరి లేఖలు రాశారని.. ఇక సరిగ్గా అదే సమయంలో ఇదే దస్తగిరి వివేకా హత్య కేసులో ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ హస్తం కూడా ఉందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో... ప్రజల్లో ఓ విధమైన కన్ప్యూజన్ అయితే నెలకొందన్నది మాత్రం పక్కా వాస్తవమని జిల్లా వాసులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.  ఇక ఈ అయిదేళ్లలో ఎక్కాడా? ఎప్పుడు? కూడా వివేకా హత్యను వీడియో తీసినట్లు ఓ వార్త కూడా బయటకు రాకపోవడం.. తాజాగా ఈ అంశంపై ఆరోపణలు రావడంతో.. ఓ వేళ వివేకా హత్యను వీడియో చిత్రీకరణ చేస్తే... అది ఎవరు తీశారు. ఎవరికి పంపారు?  ఓ వేళ.. సెల్ పోన్ నుంచి సదరు వీడియోలు డిలీట్ చేసినా.. పోలీసులు తలుచుకుంటే... ఆ వీడియోలు కనుక్కోవడం... నిమిషాల్లో పని.. అదే సీబీఐ తలుచుకుంటే మాత్రం సెకన్లలో పని అని.. మరి ఆ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థ అడుగులు వేస్తే మాత్రం.. వివేకా హత్య కేసులో పాత్రదారులు సూత్రదారులే కాదు.. ఆ వెనుక దాగి ఉన్న తాటికాయంత పెద్ద తలకాయలు సైతం ఎవరన్నది సాక్ష్యాదారాలతో సహా నిరూపిత మవుతుందని  జిల్లా వాసులు ఈ సందర్బంగా బల్లగుద్ది మరి చెబుతున్నారు.

జోగిపేటలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు!

వాటిని కాపాడుకోవాలి పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి  ఆందోలు పెద్ద చెరువు ఒడ్డున గల నాగుల కట్టపైనున్న శిల్పాలు వెయ్యేళ్లనాటివని పురావస్తు పరిశోధకుడు  ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ దామోదరం రాజనర్సింహ సూచన మేరకు శుక్రవారం (మార్చి8) ఆయన ఆ శిల్పాలను పరిశీలించారు. రంగనాథ స్వామి గోపురం ముందు రాష్ట్ర కూటుల, కళ్యాణి చాళుక్యుల కాలం  (క్రీ.శ. 9-10 శతాబ్దాలు), నాటి మహిషాసురమర్ధిని శిల్పాలు, నాగులకట్ట పైనున్న కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలంనాటి (క్రీ.శ. 11-13 శతాబ్దాల నాటి) చెన్నకేశవ, జనార్ధన, నాగదేవతల శిల్పాలు, అలనాటి అద్భుత శిల్పకళా కౌశలానికి అద్దం పడుతున్నాయన్నారు. కేశవ విగ్రహం చుట్టూ గల మకరతోరణం, శ్రీదేవి, భూదేవి, దశావతార శిల్పాలు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయని, పట్టణంలో ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేసి ప్రదర్శిస్తే, ఆందోలు పర్యాటక కేంద్రం అవుతుందని శివనాగిరెడ్డి అన్నారు.

కవిత అడుగులు ఎటు.. పార్టీకి దూరంగా.. జనాలకు దగ్గరగా.. వ్యూహం ఏంటి?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, ఎమ్మెల్సీ కవిత తన దారి తాను చూసుకుంటున్నారా? రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు అండగా నిలిచే పరిస్థితిలో లేదని భావిస్తున్నారా?  ఒక వేళ ఈ కేసులో తాను అరెస్టయ్యే పరిస్థితి ఏర్పడితే కనీసం రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగే ధైర్యం కూడా చేయలేదని భావిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు. పెద్దగా అనేమీ కాదు అసలు పార్టీ వ్యవహారాలలో ఆమె కలగజేసుకోవడం లేదు. పార్టీ పరంగా ఇచ్చిన కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అలాగని ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అంటే లేదు. ఎన్నికల ఫలితాల తరువాత ఒక రకంగా చెప్పాలంటే ఆమె యాక్టివ్ అయ్యారు. అయితే ఆమె యాక్టివిటీ అంతా పార్టీతో సంబంధం లేకుండా జరుగుతోంది.  తాను బీఆర్ఎస్ కూ దూరం అవుతున్నానన్న సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నట్లుగా పార్టీ మారుతున్నాన్న సంకేతాలు కాదు, ఆమె తన కంటే ప్రత్యేక గుర్తింపును కోరుకుంటూ.. ఆ దారిలో బిజీ అవుతున్నారని తెలిసేలా కవిత వ్యవహారశైలి ఉంది. మహిళారిజర్వేషన్లపై జీవో నంబర్ 3పై ఆమె శుక్రవారం (మార్చి 8 ) ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో జాగృతి పేర ఆమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదే జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అంతే కాదు.. తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత ఆమె పార్టీకి దూరంగా ఉన్నా రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వంపై విమర్శల విషయంలో మాత్రం  వెనక్కు తగ్గలేదు.   అయితే బీఆర్ఎస్ కార్యక్రమాలలో ఆమె ఏ మాత్రం భాగం కాకుండా దూరంగా ఉండటమే పరిశీలకులను సైతం విస్మయ పరుస్తోంది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శల నేపథ్యంలో  బీఆర్ఎస్ పిలుపు మేరకు జరిగిన చలో మేడిగడ్డ కార్యక్రమానికీ, అలాగే  ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 6(బుధవారం) బీఆర్ఎస్ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలోనూ కవిత పాల్గొనలేదు. అయితే ఆమె చినజీయర్ స్వామితో భేటీ కావడంతో ఆమె అడుగులు ఎటువైపు అన్న అనుమానాలకు తావిచ్చాయి.  ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితపై ఆరోపణలు బయటకు వచ్చిన నాటి నుంచీ కూడా బీఆర్ఎస్ లో ఆమె స్థానం, బీఆర్ఎస్ తో ఆమె ప్రయాణం గతంలోలా లేదని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సారి కవితకు మద్యం కుంభకోణంలో ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందిన సమయంలో ఆమెను బీఆర్ఎస్ మాత్రమే కాదు కల్వకుంట్ల ఫ్యామిలీ సైతం పక్కన పెట్టేసిందా అనేలా అప్పటి పరిణామాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి నంతవరకు కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా జాగ్రత్త వహించారా అన్న అనుమానాలు అప్పట్లో పరిశీలకుల నుంచి వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో ఆమె  తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు.   ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు అప్పట్లో  ప్రముఖంగా వినిపించినా, కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇక పార్టీ పరంగా  కూడా మొదట్లో పెద్దగా ఆమెకు మద్దతు లభించలేదు.  అయితే ఇలా ఆమెను దూరం చేయడం ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇస్తుందని భావించిన ముఖ్యమంత్రి  పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి  చర్చించారు. ఆ తరువాత కవితకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావులు ఆమెతో పాటు హస్తినకు వెళ్లారు. పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కవితకు మద్దతుగా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.  బీఆర్ఎస్ భయానికే మోడీ  కేసీఆర్ ను కట్టిడి చేసేందుకు  కవితను టార్గెట్ చేశారని విమర్శలూ గుప్పించారు.   పార్టీలో , కుటుంబంలో తొలత మద్యం కుంభకోణంలో తనకు మద్దతు లేని పరిస్థితులు ఉన్న సమయంలో కవిత పూర్తిగా తెలంగాణ జాగృతినే నమ్ముకున్నారు. ప్రెస్ మీట్లలో కూడా అదే విషయాన్ని పదే పదే చెప్పేవారు.  ఆ తరువాత పరిస్థితి మారిందనుకోండి అది వేరే సంగతి. అప్పట్లో పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కవితను వద్దనుకుంటే.. ఇప్పుడు కవిత బీఆర్ఎస్, కల్వకుంట్ల అండ తనకు అవసరం లేదని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తనపై ఆరోపణలు, కేసుల విషయంలో పార్టీ, కల్వకుంట్ల కుటుంబం అండ అవసరం లేకుండానే ఎదుర్కొని, పోరాడాలని కవిత భావిస్తున్నారా? లేక రాజకీయంగా ఆమె అడుగులు మరో దారికి మళ్లాయా అన్న అనుమానాలు సైతం  వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కవిత వ్యవహార శైలి మాత్రం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. 

15న వైఎస్ వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటన?

వచ్చే ఎన్నికలలో డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం ఇప్పటికే ఖరారైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 15న వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి. ఆయన వర్ధంతి సందర్భంగా డాక్టర్ సునీత రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందు కోసం పులివెందులలో  పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమె ప్రయత్నాలకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమం కోసం డాక్టర్ సునీత ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే దానిని వైసీపీ నేతలు క్యాన్సిల్ చేయించేశారని అంటున్నారు. దీంతో పులివెందులలో ఆయితే తమను ఏదో విధంగా అడ్డుకుంటారన్న నిర్ణయానికి వచ్చేసిన ఆమె వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమాన్ని కడపకు మార్చారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన క్లియర్ కట్ మెసేజ్ ను ఇప్పటికే ఇచ్చేశారు. హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన అన్న జగన్ కు, ఆయన పార్టీకీ ఓటు వేయవద్దని విజ్ణప్తి చేశారు. తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం కూడా త్వరలో ప్రకటిస్తామని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆ ప్రకటనకు సమాయత్తమౌతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో కడపలో రాజకీయం ఆసక్తికరంగా మారనున్నది. వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబీకుల మధ్యే పోరు జరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్య కడప లోక్ సభ బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా, ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులకు శిక్షపడకుండా జగన్ తన అధికారాన్నంతా ఉపయోగించి అడ్డుకుంటున్నారని ఆమె ఎటువంటి మొహమాటాలూ, బేషజాలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ పాలనలో ఏపీలో రాక్షసరాజ్యం నడుస్తోందనీ, అందరికీ సమాన న్యాయం అన్న పరిస్థితి లేదనీ సునీత హస్తినలో మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా తన తండ్రి హత్య కేసులో దోషులను కాపాడటానికి జగన్ ప్రయత్నిస్తున్నారనీ, అధికారం ఉండటంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, న్యాయం కోసం తన న్యాయపోరాటం కొనసాగుతుందని చెబుతూనే, రాజకీయంగా కూడా జగన్ తో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్పారు. ఈ పోరాటంతో తనకు ప్రజా దీవెనలు, మద్దతు కావాలని విజ్ణప్తి చేశారు. ఇందు కోసం ప్రజలలోకి వెడతాననీ స్పష్టం చేశారు. దీంతో వైఎస్ వివేకా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి నిలబడటం ఖాయమైందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. ఇక పోటీ చేయడమంటూ వస్తే ఎక్కడ నుంచి ఎవరు అన్న విషయంలో  ఇంకా క్లారిటీ రాలేదు. డాక్టర్ సునీత పోటీ చేస్తారా? లేక ఆమె తల్లి, దివంగత వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగుతారా అన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒక వైపు చేస్తున్నపోరాటానికి మద్దతుగా సునీత కాంగ్రెస్ గూటికి చేరి కడప లోక్ సభ బరిలో దిగే అవకాశాలున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది. అదే విధంగా డాక్టర్ సునీత కాదు, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ బరిలో నిలబడే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఈ అభిప్రాయాలు ఇలా ఉండగా మరో కొత్త చర్చ ఇటీవల తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగితే జగన్ అండ్ కో దాష్టీకాల నుంచి రక్షణ ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఆ అభిప్రాయం ప్రకారం డాక్టర్ సునీత,  సౌభాగ్యమ్మలు తెలుగుదేశం పార్టీలో చేరి ఇరువురిలో ఎవరో ఒకరు కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగుతారు. అదే కనుక జరిగితే అక్కడి సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల పోటీ ప్రభావం ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా బలంగా ఉంటుందని, దీంతో జగన్ కు సొంత జిల్లాలోనే గెలుపు ధీమా సడలిపోతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సారి ఎన్నికలలో కడప జిల్లాలో ఫలితం ఏకపక్షంగా ఉండే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు.  

తెలుగుదేశం, జనసేన కూటమితోనే కమలం.. బాబు, పవన్ ఆమోదించిన వారికే బీజేపీ టికెట్లు!

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్  అమిత్‌షాతో , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. వీరి భేటీతో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరిక ఖరారైంది. సీట్ల సర్దుబాటు కూడా ఖరారైందని అంటున్నారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు  బీజేపీకి 5ఎంపీ, 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. అయితే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని, లేకపోతే వైసీపీ లబ్ధి పొందుతుందన్న బాబు సూచనతో అమిత్ షా, నడ్డాలు ఏకీభవించినట్లు చెబుతున్నారు.  అలాగే తెలుగుదేశం, జనసేన ఓటు బదిలీ అయ్యే అభ్యర్ధులనే  బీజేపీ బరిలోకి దింపే విధంగా కూడా అమిత్ షా, నడ్డాలు బాబుకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.  మొదటి నుంచీ తెలుగుదేశంను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు సీట్లు ఇచ్చినా, అక్కడ ఓటు బదిలీ కాకపోతే ఉభయులకూ నష్టమని, అలా నష్టం చేకూర్చే విధంగా తమ అభ్యర్థుల ఎంపిక ఉండదనీ అమిత్ షా, నడ్డాలు విస్పష్టంగా చెప్పినట్లు బీజేపీ వర్గాల నుంచే తెలుస్తోంది. దంతో పొత్తులో బాగంగా బీజేపీకి  సీట్లు దక్కినా,  అది ఏ విధంగానూ ప్రత్యక్షంగానైనా,  పరోక్షంగానైనా  వైసీపీకి ప్రయోజనం చేకూరేలా ఉండకుండా క్షేత్రస్థాయి పరిస్థితులుపై అభ్యర్థుల ఎంపిక ఉండాలన్న విషయంలో తెలుగుదేశం, జనసేన కూటమి షరతును షా, నడ్డా అంగీకరించినట్లు చెబుతున్నారు.  ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు పొత్తులో భాగంగా బీజేపీ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, అరకు, హిందూపురం, తిరుపతి పార్లమెంటు స్థానాలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే  పురందేశ్వరి, సత్యకుమార్, సుజనాచౌదరి, రఘురామకృష్ణంరాజు, గీత   పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు హిందూపురం కాకపోతే, రాజంపేట, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి   విజయవాడ లేదా ఏలూరు, పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అలాగే అరకు ఎంపీగా   గీత పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు  బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు.  ఇక అసెంబ్లీలో 9 చోట్లా కూడా బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేన  అధినేతలు బీజేపీ అగ్రనేతలకు విస్పష్టంగా చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

ముద్ర‌గ‌డకు పవన్ ఫోబియా.. అందుకే వైసీపీలోకి?

కాపు నేత‌గా చ‌లామ‌ణి అవుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు భ‌యం ప‌ట్టుకుందా?  ప‌వ‌న్ బ‌లోపేతం అయితే త‌న నాయ‌క‌త్వానికి ఎసరు వస్తుందన్న ఆందోళ‌న‌లో ఉన్నారా? అందుకే వైసీపీలో చేరి  ఉనికి కాపాడుకోవాలని తాపత్రేయపడుతున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఏపీలో మెజార్టీ కాపులు ముద్ర‌గ‌డ‌ను త‌మ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా భావించేవారు. ఆయ‌న నిర్ణ‌యాల‌ను గుడ్డిగా ఫాలోఅయ్యేవారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది కాపు యువకులపై కేసులు కూడా న‌మోద‌య్యాయి.  అనేక మంది  జైళ్ల‌కు  వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. అయితే అలాంటి గుడ్డి నమ్మకం ఎల్లకాలం ఉండదని ఇటీవలి పరిణామాలు రుజువు చేశాయి. పోనీ ఇంత కాలం కాపు పెద్దగా చెలామణీ అవుతూ వచ్చిన ముద్రగడ  కాపు సామాజిక‌వ‌ర్గానికి  చేసిన మేలు ఏమైనా ఉందా అంటూ లేద‌నే  కాపు యువత ఇప్పుడు గట్టిగా చెబుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్లు, కాపు నేత‌ను సీఎంగా చూడాల‌న్న ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు అందుకోసం కంకణం కట్టుకున్నానని చెప్పుకున్న ముద్రగడ వంటి వారిని నమ్మారు. అందుకే వారు ఏం చెబితే అది గుడ్డిగా చేశారు. అయినా వారి ఆశ‌లు మాత్రం నెర‌వేర‌  లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ముద్ర‌గ‌డ లాంటివారేన‌న్న అభిప్రాయం ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి ఇప్పుడు బలంగా వ్య‌క్త‌మ‌వుతోంది. మేమే సామాజిక వ‌ర్గానికి పెద్ద‌లుగా ఉండాలి.  ఎన్నిక‌ల స‌మ‌యంలో మేం ఏ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిస్తే కాపులంద‌రూ ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కే ఓట్లు వేయాల‌నే భావ‌న కార‌ణంగా ఏపీలో కాపులు ఇంకా కాపుకాసే వారిగానే మిగిలిపోతున్నార‌న్న చ‌ర్చ‌సైతం ఆ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల్లో జరుగుతోంది. పాము త‌న పిల్ల‌ల‌ను తానే తింటుంద‌న్న సామెత ముద్ర‌గ‌డ వ్య‌వ‌హారంలో నిరూపిత‌మ‌వుతోంద‌ని రాజకీయ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో కాపు నేతను సీఎంగా చూడాల‌న్న‌ది ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల కోరిక‌. గ‌తంలో చిరంజీవి ఆ ప్ర‌య‌త్నంలో ఓట‌మి పాలయ్యారు. ఆ స‌మ‌యంలో కాపు సామాజిక వర్గంలోని కొంద‌రు నేత‌లే  ఆయ‌న ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న ప్ర‌చారం  జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంచెలంచెలుగా రాజ‌కీయాల్లో ఎదుగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీచేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ .. పార్టీని న‌డుపుతూ ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా కొన‌సాగుతున్నారు. రాబోయే కాలంలో జ‌న‌సేన పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతంచేయాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌. ఆ దిశగా ఆయ‌న అడుగులు పడుతున్నాయి. గ్రామ‌ స్థాయిలో పార్టీకి పునాదులు లేకుండా సీఎం కుర్చీ కావాలంటే అది అత్యాశే అవుతుంది. ఈ విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాగా తెలుసు. అందుకే ఆయ‌న ఒక్కో అడుగు ముందుకువేస్తూ పార్టీ బ‌లాన్ని పెంచుకుంటున్నారు.   తాజాగా టీడీపీతో పొత్తుతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 20మందికి త‌గ్గ‌కుండా జ‌న‌సేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. దీనికితోడు.. ఏపీలో అభివృద్ధి మ‌రిచి, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ‌ద్దెదించేందుకు ప‌వ‌న్  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు  ప‌వ‌న్ దూకుడుకు కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే అడ్డుక‌ట్ట వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా కాపు సామాజిక వ‌ర్గం పెద్ద‌గా పేరున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అడుగులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటికి వైసీపీ ఎంపీ, ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ మిథున్ రెడ్డి  వెళ్లి ఆయ‌న్ను వైసీపీలోకి ఆహ్వానించారు. ముద్ర‌గ‌డ సైతం వైసీపీలోకి చేరేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు స‌మాచారం. దీంతో ముద్ర‌గ‌డ‌కు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ టాస్క్ సిద్ధం చేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ర‌పున‌ ప్ర‌చారం చేయాల‌ని జగన్ ముద్రగడను ఆదేశించినట్లు చెబుతున్నారు.   అందుకు ముద్ర‌గ‌డ‌ ఓకే అన్నారని కూడా చెబుతున్నారు.  దీంతో..  కాపు సామాజిక వ‌ర్గానికి పెద్ద‌గా తనను తాను ప్రకటించుకున్న ముద్ర‌గ‌డ‌తోనే కాపు సామాజిక వ‌ర్గంలో బలమైన నేతగా ఎదుగుతున్న  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెక్ పెట్టేలా జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. వ‌చ్చేఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన  పొత్తులో భాగంగా జ‌న‌సేన పార్టీ 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, మూడు పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణ‌యించింది. ముద్ర‌గ‌డ‌, హ‌రిరామ జోగ‌య్య లాంటివారు కాపు సామాజిక‌వ‌ర్గం పెద్ద‌లు మాట్లాడుతూ.. కేవ‌లం 24 సీట్లేనా? 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలి.. 24 స్థానాల కోసమే అయితే తెలుగుదేశంతో  పొత్తు ఎందుకు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైసీపీ నేత‌ల‌తో క‌లిసి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ముద్ర‌గ‌డ లాంటి నేత‌లు వైసీపీ కోవ‌ర్టులుగా ప‌నిచేస్తున్నార‌ని గుర్తించిన ప‌వ‌న్.  బ‌హిరంగ స‌భ వేదిక‌పైనే వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో ముద్ర‌గ‌డ వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైసీపీలో చేరి కాపులంద‌రినీ వైసీపీ వైపుకు మ‌ళ్లించి ప‌వ‌న్ తో పాటు జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడించ‌డ‌మే ముద్ర‌గ‌డ టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తోపాటు జ‌న‌సేన అభ్య‌ర్థులు అత్య‌ధిక  స్థానాల్లో ఓడిపోతే.. కాపు ఉద్య‌మ నేత‌గా, కాపు సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌గా త‌న మున‌గ‌డ‌కు ఎలాంటి ప్ర‌మాదం  ఉండ‌ద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం భావిస్తున్నార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతుంది.  అయితే, ముద్ర‌గ‌డ ఎత్తుగ‌డ‌ను కాపుల్లోని మెజార్టీ ప్ర‌జ‌లు గుర్తించార‌ని, ఈసారి ముద్ర‌గ‌డ‌కు గుణ‌పాఠం చెప్పి.. ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు కాపు సామాజిక వ‌ర్గం  నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి కాపు సామాజిక వ‌ర్గం పెద్దగా.. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఓడించే ప్ర‌య‌త్నంలో ముద్ర‌గ‌డ ఘోరంగా విఫలం అవుతారని అందులో అనుమానమే లేదనీ అంటున్నారు. 

రాయ‌ల‌సీమ అభివృద్ధి ముద్ర చంద్ర‌బాబుదే.. జ‌గ‌న్‌కు ఈ సారి షాక్ షూర్!

రాయ‌ల‌సీమ‌.. ఈ ప్రాంతానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం నుంచి గొప్ప‌గొప్ప రాజ‌కీయ నాయ‌కులు ఉద్భ‌వించారు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన నేత‌. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఈ ప్రాంతానికి చెందిన నేతే. రాష్ట్రం విడిపోయిన త‌రువాత తొలి ఐదేళ్లు చంద్ర‌బాబు సీఎంగా కొన‌సాగ‌గా.. 2019 నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా కొన‌సాగుతున్నారు. మ‌రికొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేయ‌నుంది. ఇప్ప‌టికే ఏపీలో ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి ఎవ‌రి హ‌యాంలో మేలు జ‌రిగింద‌న్న చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. అయితే, చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న స‌మ‌యంలో రాయ‌ల‌సీమ ప్రాంతం అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిసారించార‌ని ఆ ప్రాంత‌వాసులు  చెబుతున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌డ‌ప బిడ్డ‌ను అని చెప్పుకోవ‌టం త‌ప్ప రాయ‌ల‌సీమ ప్రాంతానికి చేసిన మేలు లేదని అంటున్నారు. సీమకు జగన్  చేసిన అభివృద్ధి పెద్ద‌గా ఏమీలేద‌ని, ఆయన సీమ ద్రోహి అంటూ ఆ ప్రాంతంలోని మెజార్టీ ప్ర‌జ‌లు గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై జ‌గ‌న్‌ చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం సీమ పాలిట పెనుశాపంగా పరిణమించిందని   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  విడిపోయిన త‌రువాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాయ‌ల‌సీమ ప్రాంతంలో మొత్తం 52 సీట్ల‌కుగాను 22 స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించింది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే తెలుగుదేశం గెలిచింది.  ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఉంది. 2014 నుంచి 2019 మ‌ధ్య కాలంలో రాయ‌ల‌సీమ ప్రాంతం అభివృద్ధికి చంద్ర‌బాబు ఎంతో కృషి చేశారు. కానీ, ఆ ప్రాంతం ప్ర‌జ‌లు అవేమీ చూడ‌లేదు.. కేవ‌లం మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య ఉదంతాన్నే ప‌రిగ‌ణిలోకి తీసుకున్నారు. జ‌గ‌న్ కుటుంబీకులే ఈ హ‌త్య‌లో  నిందితులుగా ఉన్నట్లు ఆ తరువాత దర్యాప్తులో తేలుతున్నప్పటికీ  2019 ఎన్నికల   స‌మ‌యంలో  వివేకా హత్య వెనుక చంద్రబాబు ప్రమేయం అన్న ఆరోపణలను జగన్ అండ్ కో బలంగా చేయడంతో  రాయ‌ల‌సీమ ప్రాంతం ప్ర‌జ‌లు వైసీపీ వైపు మొగ్గారు. కొద్దికాలంగా వివేకా హ‌త్య‌ కేసులో అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో పాటు, ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ క‌క్ష‌పూరిత పాల‌న‌ను చూసి రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు ఇప్పుడు జగన్ ను చీద‌రించుకుంటున్నారు.  2019లో వైసీపీకి ఓటువేసి త‌ప్పుచేశాం.. చంద్ర‌బాబు హ‌యాంలోనే మా ప్రాంతానికి ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని గుర్తు చేసుకుంటున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీకి  ప‌ట్టంక‌ట్టేందుకు సిద్ధమ‌వుతున్నారు.  2014 - 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు హ‌యాంలో రాయ‌ల‌సీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి జ‌రిగింది.  జల ప్రాజెక్టుల విష‌యానికి వ‌స్తే.. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే,  వైసీపీ ప్ర‌భుత్వం కేవలం రూ.2011 కోట్లే ఖ‌ర్చు చేసింది.  దీనికి తోడు రాయ‌ల‌సీమ ప్రాంతానికి చంద్ర‌బాబు హ‌యాంలో సెల్కాన్, కియా వంటి పరిశ్రమలు వ‌చ్చాయి. బాబు హయాంలో కేంద్ర సంస్థలు రాష్ట్రానికి పది వస్తే అందులో నాలుగు రాయలసీమకు కేటాయించారు. అందులో ఐఐటీ తిరుపతి (చిత్తూరు జిల్లా), ఐఐఎస్ఈఆర్ తిరుపతి (చిత్తూరు జిల్లా), సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ (అనంత‌పురం జిల్లా), ఐఐఐటీ (కర్నూలు జిల్లా) ఉన్నాయి. అంతేకాక అనంత‌పురం, తిరుప‌తిలో రెండు మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌రోవైపు రాయ‌ల‌సీమ అంటే క‌రువు ప్రాంతంగా గుర్తుకొస్తుంది. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో రాయలసీమలో నీటి సమస్యను అధిగ‌మించేందుకు  డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతుల‌కు అధిక ప్రోత్సాహం అందించారు. అంతేకాదు.. రెయిన్‌గన్‌తో పంటకు నీరు అందించే టెక్నాలజీని తీసుకొచ్చి రైతుల‌కు మేలుజ‌రిగే విధంగా చంద్ర‌బాబు కృషి చేశారు. మ‌రోవైపు రాయలసీమలో ముఖ్యమైన కడప-  కర్నూలు, కడప - విజయవాడ రైలు మార్గం చుట్టు తిరిగి  అంటే డోన్ మీదుగా వెళ్ళే పరిస్థితిని తొల‌గించి.. బనగానపల్లె మీదుగా కర్నూలు - నంద్యాల - గిద్దలూరు మీదుగా విజయవాడ మార్గం నిర్మించి దూరం తగ్గించారు.  జగన్మోహన్‌రెడ్డి ప్ర‌స్తుత ఐదేళ్ల పాలనలో సీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. అత్యంత ప్రాధాన్య రంగ మైన సాగునీటి రంగం చతికిలబడింది. తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని 3,600 క్యూసెక్కులకు విస్త రించాలని, నిర్మాణ పనులకోసం రూ.1050 కోట్లు కేటాయించి, రూ.288కోట్లు ఖర్చుచేశారు. 35శాతం పైగా పనులు పూర్తయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  జరిగిన పనుల్ని జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపేశారు. మాయ మాటలతో ఇప్పటివరకు సీమ వాసుల్ని మోసగిస్తూనే ఉన్నారు. అనంతపురం జిల్లాలో 50 వేల ఎకరాలకు బిందుసేద్యం కింద సాగునీరు అందించే ఉరవకొండ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, రూ.960 కోట్లతో చేపట్టిన కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు నీళ్లిచ్చే జీడిపల్లి-భైరవాని తిప్ప ప్రాజెక్ట్‌,  రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన జీడిపల్లి-పేరూరు ప్రాజెక్ట్‌, మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పనులు, ఇలా  తెలుగుదేశం హయాంలో  జరిగిన పనులు తప్ప,  వైసీపీ ప్ర‌భుత్వం వచ్చాకా సీమలో ఎక్కడా ఒక్క ప్రాజెక్టులో ఒక్క శాతం పనికూడా జర గలేదు. ఒక‌వేళ జ‌రిగి ఉంటే శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చూశాడు త‌ప్ప‌.. ఎలాంటి అభివృద్ధి చేయ‌లేదు. దీనికితోడు చంద్ర‌బాబు హ‌యాంలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి తీసుకొచ్చిన కంపెనీల‌ను సైతం అక్క‌డి నుంచి త‌రిమేసిన ఘ‌న‌త జగ‌న్ రెడ్డిది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో  తెలుగుదేశంకు మ‌ద్ద‌తుగా నిలిచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఓటు ద్వారా త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.