బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కమలం గూటికి మాజీ ఎంపీ సీతారాం నాయక్!
posted on Mar 9, 2024 @ 10:48AM
బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తాను బీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు లేకుండా పోయిందనీ, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాననీ ఆయన ఆవేదన చేశారు. ఐదేళ్లుగా తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారనీ ఆయన బీఆర్ఎస్ అధినాయకత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు తనను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా తనను బీజేపీలోకి ఆశ్వానించారని సీతారామ్ నాయక్ చెప్పారు. ఇన్నాళ్లుగా అవమానాలు దిగమింగి బీఆర్ఎస్ కోసం పని చేశాననీ, ఇక తన వల్ల కాదనీ కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడిక తాను నిర్ణయం తీసేసుకున్నానని, కమలం పార్టీలో చేరుతాననీ ఆయన స్పష్టం చేశారు. అలాగే బీజేపీ నుంచి మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం (మార్చి 8) వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా హన్మకొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించారు. అప్పటికి అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన సీతారాం నాయక్ శనివారం (మార్చి 9)న మీడియా ప్రతినిథులకు తన నిర్ణయం చెప్పారు.