ఏపీలో కమలం పాత్రపై కన్ఫ్యూజన్.. వ్యూహాత్మకమేనా?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన కూటమి పొత్తు విషయంలో కమలనాథుల కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓ వైపు కూటమిలోని జనసేన తమ మిత్రపక్షమని గట్టిగా చెబుతూనే, పొత్తు విషయంలో ఎటూ తేల్చకుండా నాన్చడం ద్వారా ఏపీలో తన పాత్ర ఏమిటో?  ఎలా ఉండాలని భావిస్తోందో తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో బీజేపీ ఉంది.  జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ఏపీలో తెలుగుదేశంతో కలిసే తన ప్రయాణం అని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేయడమే కాకుండా, ఆ పార్టీతో కలిసి సీట్ల ప్రకటన కూడా చేసేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనుందని ప్రకటించడమే కాకుండా కొన్ని స్థానాలలో అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటన చేసేసింది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీకి తలుపులు తెరిచే ఉంచింది. మరో వైపు  బీజేపీ కీలక నేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా ఎన్డీయేలో పాత మిత్రులు కలుస్తున్నారంటూ ప్రకటించి, తెలుగుదేశం పార్టీ ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయన్న హింట్ ఇచ్చారు. ఇది జరిగి పది రోజులు దాటిపోయింది. అయినా ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. ఏపీ బీజేపీలో మెజారిటీ నేతలు మాత్రం తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసివెడితేనే మేలని భావిస్తున్నారు. ఆ కూటమితో కలిసి వెడితే ఏపీ అసెంబ్లీలో కొన్ని స్థానాలు, అలాగే ఏపీ నుంచి పార్లమెంటుకు ఒకటి రెండు స్థానాలు సాధించుకోవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికలలో ఏపీ అసెంబ్లీలో బీజేపీకి అసలు ప్రాతినిథ్యమే లేని సంగతి తెలసిందే. గత ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ప్రస్తుతం  ఒంటరిగా బరిలోకి దిగినా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనీ, పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే అవకాశాలు కూడా లేవనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే చివరి నిముషంలో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితోనే కలిసివేడుతుందని కూడా అంటున్నారు. ఆ కారణంగానే పొత్తు విషయంలో ఏపీ బీజేపీ నేతలెవరినీ నోరు మెదపవద్దని ఆ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయనీ చెబుతున్నారు.  ఎన్నికలకు సంబంధించి ఏపీలో బీజేపీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రిపరేషన్స్ చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని కూడా చెబుతున్నారు. పై స్థాయిలో తెలుగుదేశం, జనసేన కూటమితో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయనీ, ఇప్పటికే అవి ఒక కొలిక్కి వచ్చాయనీ  రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి? ఎన్ని లోక్ సభ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుంది అన్న విషయాలపై ఇప్పటికే మూడు పార్టీల నేతలకూ ఒక ఒప్పందం కుదిరిందని కూడా చెబుతున్నారు.  రానున్న రోజులలో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి సమష్టిగా జనంలోకి వెళ్లడంతో బీజేపీకి ఈ కూటమితో కలిసి వెళ్లడం వల్ల ప్రచార అజెండా, మేనిఫెస్టో వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందనీ, బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం వల్ల తమ ప్రచారం కూడా ఆ పార్టలే చేస్తాయనీ కమలం పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమి జగన్ పాలనలో గాడితప్పిన ఏపీని దారిలో పెట్టే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్ని ప్రజలకు విస్పష్ట హామీ ఇచ్చేశారు. సో స్థానిక అంశాలపై బీజేపీకి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక జాతీయ అంశాలు, ఏపీని కేంద్రం ఆదుకోవడం వంటి అంశాలపై స్థానిక బీజేపీ నేతలు మాట్లాడడానికి ఏమీ లేదు. ఆ విషయాలన్నీ మోడీ చూసుకుంటారు. సో ఏపీ ఎన్నికలలో రాష్ట్ర బీజేపీని మౌనంగా ఉంచే వ్యూహంతోనే పొత్తు ప్రకటనలో జాప్యం జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చిక్కుల్లో రోజా.. షాకిచ్చేందుకు సిద్ధ‌మైన జ‌గ‌న్!?

ఏపీ మంత్రి రోజా.. ఈ పేరు విన‌గానే మ‌హిళ‌ల నుంచి సైతం ఛీద‌రింపులు ఎదుర‌వుతాయి.. అభ్యంత‌ర‌క‌ర‌ భాష‌తో ప్ర‌తిపక్ష నేత‌ల‌పై విరుచుకుప‌డ‌టం ద్వారా జగన్ మొప్పు పొందాలన్న  ఆరాటం సామాన్య జనంలో  రోజా పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రోదికావడానికి కారణమైంది.  రాజ‌కీయ బిక్ష‌పెట్టిన పార్టీని, పార్టీ అధినేత‌ను, వారి కుటుంబంలోని స‌భ్యుల‌పై సైతం  రోజా అనుచిత వ్యాఖ్యలు,  విమర్శలు గుప్పించారు.   రోజా ప్రెస్‌మీట్  అంటేనే ప‌లువురు త‌మ ఇళ్ల‌లో టీవీలు బంద్‌ చేసుకొనే ప‌రిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. సినీ హీరోయిన్‌గా తెలుగు ప్ర‌జ‌ల్లోనే కాక ఇత‌ర రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా.. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ‌కీయ రంగప్ర‌వేశం చేశారు. ఆ పార్టీలో మ‌హిళా నేత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకోసం కృషిచేశారు. అయితే వైసీపీలో చేరిన త‌రువాత‌.. ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ పూర్తిగా మారిపోయింది. అనుచిత భాష‌  వాడుతూ ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. రోజా  భాష‌, ఆమె ప్ర‌తిప‌క్ష నేత‌ల ప‌ట్ల ప్ర‌వ‌ర్తించే తీరును ఏపీలోని మెజార్టీ మ‌హిళ‌లు ఛీద‌రించుకుంటున్న ప‌రిస్థితి ఏర్పడింది. వైసీపీ త‌ర‌పున రోజా సెల్వ‌మ‌ణి రెండు సార్లు వరుసగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. 2014లో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో కొన‌సాగ‌గా.. 2019 ఎన్నిక‌ల త‌రువాత అధికారంలోకి వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తొలి క్యాబినెట్ లో రోజాకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, జ‌గ‌న్ తొలి క్యాబినెట్‌లో ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల ప‌ట్ల అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో   ఆమెను కేబినెట్ లోని తీసుకుని ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. వైసీపీలో అభ్యంత‌ర‌క‌ర భాష‌ను వాడే లీడ‌ర్ల‌లో రోజా ముందువరుసలో ఉంటారన్న పేరు సొంతం చేసుకున్నారు. ఇక  రోజా రెండో ద‌ఫా విజ‌యం సాధించిన త‌రువాత న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో  ఆమె అవినీతి అక్ర‌మాల‌కు పెద్దెత్తున పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆమె సోద‌రులు భారీ స్థాయిలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే ఆగ్ర‌హంతో ఉన్నారు. రోజా తీరుపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తోపాటు, సొంత పార్టీ నేత‌లుసైతం బ‌హిరంగంగానే అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీంతో ఈద‌ఫా ఎన్నిక‌ల్లో రోజాకు టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే  వైసీపీ అధిష్టానం ఇప్ప‌టికే తొమ్మిది సార్లు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ల‌ను మార్చుతూ లిస్టుల‌ను విడుద‌ల చేసింది. ఈ తొమ్మిది జాబితాల్లో రోజా పేరు లేక‌పోవ‌టంతో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ  వైసీపీలోని రోజా వ్య‌తిరేకులు అధిష్టానం తీరుపై ఆగ్రహాన్ని వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రాబోయే   జాబితాల్లో రోజా సీటు చిరగ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేతులు పేర్కొంటున్నారు.    రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త‌రువాత నుంచి రోజా నియోజ‌క‌వ‌ర్గంలోని సొంత పార్టీ నేత‌ల‌ను విస్మ‌రిస్తూ వ‌చ్చారు. కేవలం త‌న సోద‌రుల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో దోపిడీకి పాల్ప‌డ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల నుంచే వెల్లువెత్తుతున్నాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని స‌గం మందికిపైగా వైసీపీ నేత‌లు మంత్రి పెద్దిరెడ్డి స‌హ‌కారంతో రోజాపై ప‌లు సార్లు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో వైసీపీలోని వ్య‌తిరేకుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల్సింది పోయి.. వారిని మ‌రింత దూరం చేసుకుంటున్నారు రోజా.. మ‌రో అడుగు ముందుకేసి రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణిసైతం రంగంలోకి దిగారు. రోజాపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేత‌ల‌పై సెల్వ‌మ‌ణి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. కుక్కల్లా మొరుగుతున్నారని ఆయన తమిళంలో తిట్టారు. దీంతో నగరిలోని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి రోజాపై పైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి.. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రోజాపై నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచేకాక సొంత పార్టీ నేత‌ల నుంచిసైతం తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో వైసీపీ అధిష్టానం నగరిపై దృష్టిసారించింది. ప‌లు ద‌ఫాలుగా రోజా విజ‌యావ‌కాశాల‌పై స‌ర్వేలు నిర్వ‌హించ‌గా.. ఆమె ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే   ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కాక‌మునుపే రోజాను కాద‌ని వేరేవారిని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా నియ‌మిస్తే రాష్ట్రం వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో త‌ప్పుడు సంకేతం వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే..  ప్ర‌తిప‌క్షాల‌పై అభ్యంత‌ర‌క‌ర భాష‌తో విరుచుకుప‌డే వారిలో కొడాలి, రోజా ప్ర‌ముఖులు. వీరిని జ‌గ‌న్ ద‌గ్గ‌రి వ్య‌క్తులుగా వైసీపీ శ్రేణులు భావిస్తాయి. అయితే  జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేల్లో వీరిద్ద‌రూ ఓడిపోతార‌ని తేలడంతో ముంద‌స్తుగా వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జిల‌ను నియ‌మిస్తే పార్టీకి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు అధిష్టానం భావిస్తోంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత, నామినేషన్ల దాఖలుకు గడువు సమీపించిన సమయంలో న‌గ‌రి, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాల్లో రోజా, కొడాలి నాని స్థానంలో కొత్త‌వారికి టికెట్ ఇవ్వాల‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోందని పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి రోజాకు ఈసారి వైసీపీ టికెట్ ద‌క్క‌డం దాదాపు అసాధ్య‌మ‌నేన‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. జ‌గ‌న్ టికెట్ నిరాక‌రిస్తే రోజా ఎలా రియాక్ట్ అవుతారనేది ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

నంద్యాల బరిలో శబరి!?

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో సారి అధికారాన్ని అందుకోవాలని  తహతహలాడుతున్న వైసీపీ అధినేత, సీఎం  జగన్ కు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులోభాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.  ఆ క్రమంలో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి బైరెడ్డి శబరిని బరిలో దింపనున్నారంటూ.. ఆ జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  దాంతో నంద్యాలలో సోమవారం రాత్రి శబరి అనుచరులు బాణ సంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే బైరెడ్డి శబరి.. ఎవరో కాదు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె. ఆమె ప్రస్తుతం నంద్యాల బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.  కానీ శబరితోపాటు ఆమె తండ్రిని సైకిల్ పార్టీలోకి తీసుకు వచ్చి.. వారిరువురికీ.. అంటే కుమార్తెకు ఎంపీ సీటు, తండ్రికి ఎమ్మెల్యే సీటు కేటాయించే విధంగా చంద్రబాబు స్కెచ్ వేశారన్న ప్రచారం నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది.  అదీకాక.. మరికొ ద్ది రోజుల్లో చంద్రబాబు అధ్యక్షతన నంద్యాలలో భారీ బహిరంగ సభ ఉందని... ఆ సభలో ఈ తండ్రి కూతుళ్లు పసుపు కండువా కప్పుకొని.. తెలుగుదేశం గూటికి చేరతారనే టాక్ వినిపిస్తోంది.  ఇక రాయలసీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వేళ వారు పార్టీలోకి వస్తే.. జిల్లాలో పార్టీకి మళ్లీ పూర్వ  వైభవం వస్తుందనే భావన కూడా  తెలుగుదేశం పార్టీ కేడర్‌లో వ్యక్తమౌతోందంటున్నారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ బైరెడ్డి రాజశేఖరరెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే బైరెడ్డి కుటుంబానికి  తెలుగుదేశం అగ్రనేతల నుంచి స్పష్టమైన హామీ అందిందనే ఓ ప్రచారం కూడా  నడుస్తోంది. రాయలసీమ హక్కుల కోసం.. నీటి వాటా కోసం భైరెడ్డి రాజశేఖరరెడ్డి ఉద్యమాలు చేస్తున్న విషయం విదితమే.   అయితే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  వైసీపీ అధినేత  జగన్  నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చడంతో పాటు.. బదిలీ చేస్తున్నారు. దీంతో పలువురు అసంతృప్త జీవులు.. వైసీపీకి  రాం రాం చెప్పి.. మరో పార్టీలోకి వెళ్లి పోతున్నారు. ఆ క్రమంలో వల్లభనేని బాలశౌరి, కొలుసు పార్థసారధి, వసంత కృష్ణ ప్రసాద్  ఇలా పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు, ఎంపీలు ఇప్పటికే వైసీపీని  వీడి  తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. రానున్న రోజులలో ఆ జాబితాలోకి మరింత మంది చేరు అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీంతో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ కూటమితో బీజేపీ సైతం కలిసి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఓ వేళ టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ వెళ్లితే... రానున్న ఎన్నికల్లో ఆ కూటమి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని.. ఇక బీజేపీలో నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేయనున్న బైరెడ్డి శబరియే కాదు.. ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి గెలుపు కూడా పక్కాగా ఖాయమనే ఓ వాదన అయితే జిల్లా పోటికల్ సర్కిల్లో హాట్ హాట్‌గా హీట్ హీట్‌గా నడుస్తోంది.

అమ్మ అండ కోసం తహతహ.. గెంటేసిన సంగతి మరిచావా జగన్!

గత ఎన్నికల్లో  వైసీపీ   151 అసెంబ్లీ స్థానాలు, 23 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించడం వెనుక   జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్, వైఎస్ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులతో పాటు ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగి మళ్లీ ఎన్నికలు సమీపించే సమయానికి  సీఎం జగన్ వెంట వీరెవరూ లేరు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే మేనత్త  విమలారెడ్డి మాత్రమే ఇప్పుడు జగన్ పక్కన నిలబడ్డారు. 2024 ఎన్నికలలో  2019 ఎన్నికలను మించిన విజయం సాధించి వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు సొంత వారెవరూ అండగా నిలబడకపోవడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తుండటం ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంది. సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసును.. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ చొరవ తీసుకొని.. ఈ కేసు ఛేదించాల్సింది పోయి, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న   వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిలను రక్షించడానికి తన అధికారాన్నంతా దుర్వినియోగం చేశారనీ, చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.   సొంత బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి.. దేశ రాజధాని ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి.. తన తండ్రి హత్య కేసు ఛేదించడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఈ ప్రభుత్వానికి ఓటు వేయవద్దంటూ ఆంధ్ర ఓటర్లకు  ఆమె విజ్జప్తి చేశారు. అలాగే తన తండ్రి హత్య ఛేదించడంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్బంగా గట్టగానే ఎండగట్టారు. ఇది చాలదన్నట్లు జగన్ సిట్టింగ్ ల మార్పు పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పలువురు సిట్టింగులు, ఎంపీలూ జగన్ పార్టీని వీడి తమదారి తాము చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం  జగన్ బయటకు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే లోలోపల ఓటమికి సిద్ధపడిపోయారన్న ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.  అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీ విజయం కోసం జగన్ చివరి ప్రయత్నంగా వైసీపీ మాజీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను మళ్లీ రంగంలోకి దింపాలన్న యోచన చేస్తున్నారని పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేయాల్సిందిగా ఆమెను కోరుతున్నారని అంటున్నారు.  అదీకాక వైయస్ జగన్‌కు మద్దతుగా వైయస్ విజయమ్మ రంగంలోకి దిగి మళ్లీ ప్రచారం చేసేందుకు ప్రజల మధ్యకు వస్తే.. ఆమెకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని,  జగన్ గద్దెనెక్కిన ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పలు విధాలుగా ఇబ్బందులు పడ్డారని... అలాంటి సమయంలో.. వైఎస్ విజయమ్మ అటు వైపు తొంగి చూసిన దాఖలాలు లేవనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి వేళ కుమారుడు వైఎస్ జగన్‌కు వరుసగా రెండో సారి అధికారం కట్టబెట్టడం కోసం  వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ప్రజల నుంచి  సానుకూల స్పందన వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. అదీ కాక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె చేత రాజీనామా చేయించి పక్కరాష్ట్రానికి తరిమేసిన సంగతిని ఇప్పుడు తన కన్వీనియెన్స్ కోసం జగన్ మరచిపోయినా, జనం మర్చిపోరనీ, మర్చిపోలేదనీ అంటున్నారు. ఆ విషయాన్ని మరచి కుమారుడి కోసం మళ్లీ ఏపీ రాజకీయాలలోకి విజయమ్మ అడుగుపెడతారా అన్నది కూడా అనుమానమే అంటున్నారు. 

కెసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ 

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బిఆర్ఎస్ కొత్త పొత్తులు పెట్టుకోవాలని యోచిస్తుంది. వామ పక్షాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న కెసీఆర్ కు కొత్తగా  స్నేహం కోసం అర్రులు చాస్తున్నట్టు కనబడుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని... నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కలయిక ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

ఈ నెల 15లోపు ఎన్నికల షెడ్యూల్: రఘురామ రాజు 

ఇప్పుడందరి దృష్టి ఎన్నికల మీద ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల , పోలింగ్ ఎప్పుడు అనే చర్చ సాగుతుంది. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ రాజు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అందరి దృష్టి ఎన్నికలపై ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.  ఎన్నికల ప్రకటన కోసం ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ నెల 15 లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఆ మేరకు సమాచారం ఉందని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 25-మే 5 మధ్య ఉండొచ్చని ఒక అంచనా అని వివరించారు. ఏపీలో ప్రాజెక్టుల కట్టే ప్రభుత్వం కావాలో, ప్యాలెస్ ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని రఘురామ పిలుపునిచ్చారు.  "పోలవరం ఆపేస్తావా? అమరావతిలో రోడ్లు తవ్వేస్తావా? నువ్వేమో రూ.500 కోట్లతో కొంప కట్టుకుంటావా? ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా! పోలవరం ఆగిపోయింది... ప్రాజెక్టు నిర్మాణాలు అక్కడక్కడా కూలిపోయాయి. అమరావతి మొత్తం ఆగిపోయింది... జగన్ మనసు దోచిన స్థానిక ప్రతినిధి ఒకడున్నాడు అక్కడ... వాడు రోడ్లు తవ్వుకుపోతాడు. కంకరకు కంకరగా, మట్టికి మట్టిగా, రాళ్లకు రాళ్లుగా... దేనికి అదే సపరేటుగా అమ్ముకుంటుంటాడు. ఈయన మాత్రం రూ.500 కోట్లతో కొంప కట్టుకుంటాడు. మనకు ప్రాజెక్టులు కట్టేవాడు కావాలా... లేక సొంతంగా ఉండడానికి ప్యాలెస్ లు కట్టుకునేవాడు కావాలా? ప్రజలారా ఆలోచించండి" అని రఘురామ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ లో ఐక్యత బీటలు వారుతోందా?

వర్గ విభేదాలకూ, గ్రూపు తగాదాలకు అలవాలమైన కాంగ్రెస్ లో అనూహ్యంగా  తెలంగాణలో గత నాలుగైదు నెలలుగా అచ్చెరువు గొల్పే విధంగా ఐక్యత కనిపిస్తోంది. నాయకుల మధ్య ఐకమత్యం, ఒకరికొకరు అండగా నిలుస్తున్న తీరు పరిశీలకులను సైతం విస్మయపరిచింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కు పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిన తరువాత ఒక్కసారిగా రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం రేగింది. సీనియర్లు అంటూ కొందరు పార్టీకి రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. అప్పట్లో గాంధీ భవన్ నిత్య కురుక్షేత్రంగా కనిపించేది. అయితే రేవంత్ రెడ్డి ఓపికగా, ఎక్కడా సహనం కోల్పోకుండా స్వయంగా సీనియర్లందరినీ కలిసి వారితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పి కలుపుగోలుతనంతో అందరి మద్దతూ పొందగలిగారు. ఈ క్రమంలో  పార్టీ హై కమాండ్ కూడా రేవంత్కు అన్ని విధాలుగా అండదండలు అందించింది అది వేరే సంగతి. ఇక  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే కాంగ్రెస్ లో ఐక్యతా రాగం ప్రత్యర్థి పార్టీలను సైతం విస్మయపరిచింది. నేతలంగా కలిసికట్టుగా వ్యవహరించారు. ప్రణాళికా బద్ధంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఫలితం ఎన్నికలలో కాంగ్రెస్ విజయం. పదేళ్ల పాటు కంటి సైగతా రాష్ట్రాన్ని శాసించగలనన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్ ఐక్యత బలమేమిటో గ్రహించిందా అన్నట్లుగా ప్రభుత్వ ఏర్పాటు తరువాత కూడా ఐక్యంగానే కదులుతూ వచ్చింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో మల్లు భట్టి విక్రమార్క్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమకూ స్టేక్ ఉందంటూ హస్తిన వరకూ వెళ్లి ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆదేశాల మేరకు వారు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారు. ఇక అక్కడ నుంచీ కేబినెట్ సమష్టి తత్వం అంటే ఇలా ఉండాలి అనేగా రేవంత్ సర్కార్ సాగింది. మంత్రులంతా ఒకే మాట మీద ఉంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీలో కేబినెట్ మంత్రులకు అండగా రేవంత్ గళం విప్పడం, రేవంత్ ప్రసంగానికి మంత్రలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ బల్లలు చరుస్తూ మద్దతు పలకడం వంటి దృశ్యాలు కాంగ్రెస్ లో మారిన పరిస్థితికి అద్దం పట్టాయి.  తాజాగా ప్రభుత్వం నుంచి విడుదలైన ఒక ప్రకటన కాంగ్రెస్ లో ఐక్యత మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోతున్నదా అన్న అనుమానాలకు కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున విడుదలైన ఆ అడ్వర్టైజ్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఆ యాడ్ ఏమిటి అన్న విషయానికి  వచ్చే ముందు రేవంత్ సర్కార్ కొలువుదీరిన తరువాత కాంగ్రెస్ లో కనిపించిన సమష్టి తత్వం ఎలా ఉందో చెప్పుకుందాం. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు జంటకవుల్లా కలిసే కనిపించారు.  హస్తిన పర్యటనకు వెళ్లినా, సమీక్షలకు వెళ్లినా ఇరువురూ కలిసే వెళ్లారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన యాడ్స్ లోనూ, పలు హోర్డింగ్ లపైనా కూడా రేవంత్, మల్లు భట్టి విక్రమార్కల ఫొటోలు తప్పనిసరిగా కనిపించేవి. అదో యూనిటీ సింబల్ గా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో ముద్రపడిపోయింది. కానీ తాజాగా  ప్రభుత్వం ఉద్యోగులకు నియామకపత్రాలను అందజేసిన కార్యక్రమానికి సంబంధించిన ప్రభుత్వ అడ్వర్టైజ్ మెంట్ లో  ముఖ్యమంత్రి రేవంత్ ఫొటో మాత్రమే కనిపించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోకు ఆ అడ్డర్టైజ్ మెంట్ లో చోటివ్వలేదు. ఔను మొత్తం 5, 192 పోస్టులకు సంబంధించి నియామకపత్రాలు అందజేసే కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో  సోమవారం (మార్చి 4) న జరిగింది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్ మెంట్ పత్రికలకు విడుదల చేసింది. ఆ అడ్వర్టైజ్ మెంట్ లో మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావనే లేదు. రేవంత్ ఫొటోను మాత్రమే ప్రముఖంగా కనిపించింది. దీంతో రేవంత్, మల్లు మధ్య విభేదాలు పొడసూపాయా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతున్నాయి.  కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ మల్లు ఫొటో లేకుండా యాడ్ రావడం వెనుక కారణమేమిటన్నది మాత్రం తెలియడం లేదు. ఐఆండ్ పీఆర్ వర్గాలేమో పార్టీ నుంచి వచ్చిన ఫార్మాట్ ప్రకారమే తాము యాడ్ విడుదల చేశామంటున్నారు. పార్టీ వర్గాలేమో అది ఐఅండ్ పీఆర్ ఇచ్చిన యాడ్ తమకు సంబంధం లేదని అంటున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ లో ఐక్యత బీటలు వారుతోందా అన్న అనుమానాన్ని మాత్రం ఈ అడ్వర్టైజ్ మెట్ కలిగించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ కి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా 

అధికార పక్షం వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా... తొలిసారి ఓ మంత్రి వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు.  వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం ఎట్టకేలకు  రాజీనామా చేశారు.  12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోసిన గుమ్మనూరు  రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి మంత్రి పదవి చేశారు.  ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానని రాజీనామా తర్వాత గుమ్మనూరు చెప్పారు.  చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానని గుమ్మనూరి ప్రకటించారు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నానని.. ఎంపీ పదవి వద్దన్నానని తెలిపారు. మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని గుమ్మనూరు అన్నారు. మా కులం ఎక్కువగా రెండు జిల్లాల్లోనే ఉందని తెలిపారు. గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సుముఖంగా ఉన్నానన్నారు. తన సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది.. కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానన్నారు. కర్ణాటకలో తన సోదరుడు మంత్రిగా ఉన్నారంతేనని.. తానేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో లేనని తెలిపారు. మంత్రి గుమ్మనూరు జయరాం నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలో జరిగే 'జయహో బీసీ' సభా వేదికపై టీడీపీలో చేరతానని వెల్లడించారు.  సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి ఏం చెబితే జగన్ కు అదే వేదం అని అన్నారు. 

సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన ముంబై హైకోర్టు

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను ముంబై హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ఈమేరకు మంగళవారం ఉదయం బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం దొరికిందని ఆరోపించారు. ఆయనను గడ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. 2017లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.  అనారోగ్యంతో వీల్ చెయిర్ కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేసింది. అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టుకు సూచించింది. దీంతో మళ్లీ విచారించిన బాంబే హైకోర్టు తాజాగా మంగళవారం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అతన్ని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించినట్లు పీటీఐ వార్తాసంస్థ నివేదించింది. ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జీఎన్ సాయిబాబాను 2014లో అరెస్టు చేశారు.

మంగళగిరిలో లోకేష్ కు ఎదురేలేదు!.. వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదు!

మంగళగిరి నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపైనే ఉంది. నిన్నటి వరకూ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఏమిటి? అన్నది పక్కన పెడితే మాత్రం ఇప్పుడు మాత్రం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం లోకేష్ కు కంచుకోట అన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకుని  తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1985 తరువాత మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచిన చరిత్రే లేదు. అటువంటి సేఫ్ నియోజకవర్గం కాని మంగళగిరి నుంచి లోకేష్ తొలి సారిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో లోకేష్ పరాజయం పాలైనా.. ఎటువంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న విషయాన్ని చాటారు. పరాజయం పాలైనా నియోజకవర్గాన్ని వదలకుండా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూస్తే అటువంటి నియోజకవర్గం నుంచి ఒకసారి ఓటమి పాలై మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే ఎంతో సాహసం కావాలి. అంతకు మించి ధీమా ఉండాలి. ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ చాటారు.   తగ్గేదేలే ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది లోకేష్ మొండితనమా.. ధీమానా అంటే ఖచ్చితంగా గెలుపు ధీమానే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరిలో లోకేష్ విజయం సాధించడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు. గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసారి మంగళగిరిలో విన్నింగ్ గ్యారంటీ అని వినిపిస్తుంది. లోకేష్ గెలుపు అవకాశాలను చూస్తే.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.  అటువంటి ఆర్కే మంగళగిరిలో విజయం సాధించడం అసాధ్యమన్న అంచనాకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఆయనను మార్చేసి   లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనితో అలిగిన ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరి.. మళ్లీ ఓ పది రోజుల్లోనే తిరిగి వెనక్కు వచ్చేశారు. అదంతా వేరే కథ. లోకేష్ ఓటమే లక్ష్యంగా జగన్ మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ గంజికి కూడా ఇక్కడ విజయం సాధించేంత సీన్ లేదని భావించి మరో అభ్యర్థిని రంగంలోకి దింపారు.    చివరకు ఆమెను కూడా మారుస్తారేమో తెలియదు. అధికారంలో ఉండి కూడా లోకేష్ కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడం విషయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నారంటేనే మంగళగిరిలో లోకేష్ సాధించిన పట్టు ఏమిటన్నది అవగతమౌతోంది. అలాంటి పట్టు సాధించడం కోసం లోకేష్ కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి  నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, పరిశీలకుల నుంచీ కూడా వ్యక్తమౌతోంది.   పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చడమే అంటున్నారు. ఎంతగా ప్రయత్నిస్తున్నా నియోజకవర్గ వైసీనీరెండు నెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి నుంచి వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గంలో భారీ స్పందన లభిస్తోంది. వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు కూడా పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు.  చేరుతున్నారు. జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన  వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసిపి కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు.   తాడేపల్లి పట్టణానికి చెందిన నాయకులు ఎస్.రామశంకర్, బి.రవికుమార్ తో సహా 20 మంది, ఉండవల్లి గ్రామానికి చెందిన శింగంశెట్టి తేజోధర్, ఉప్పు సుబ్బారావు(నాని)తో సహా 20 మంది, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం నుంచి అనంత్ నెమలికంటితో సహా నలుగురు నాయకులు, శ్రీకృష్ణ లెనిన్, గుమ్మడి గోపి, వలపర్ల రామారావు, కనపర్తి హరి , మల్లవరపు మాణిక్యాల రావు, ఆరుమల్ల సుబ్బారావు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు   15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. అలాగే కుంచనపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం గూటికి చేరారు. ఇలా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్న వారి సంఖ్య జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంగళగిరిలో పరిస్థితిని చూస్తే లోకేష్ అత్యధిక మెజారిటీ సాధించి విజయంలో చరిత్ర తిరగరాయడం ఖాయమని అంటున్నారు. 

క్రిష్ యాంటిసిపేటరీ  బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రాడిసన్ హోటల్ లో కొందరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పేరు రావడంలో అందరూ ఉలిక్కి పడ్డారు. క్రిష్ ను కూడా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌  కేసులో నిందితుడైన క్రిష్‌గా పేరుగాంచిన సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మార్చి 4వ తేదీలోగా తమ వైఖరిని తెలియజేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం పోలీసులకు తెలిపింది . సాక్ష్యాధారాలు లేని కారణంగా ట్రయల్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిన సహ నిందితుడు గజ్జల వివేకానంద్ వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు తనను నిందితులుగా చేశారని క్రిష్ వాదిస్తూ పిటిషన్ వేశారు. జస్టిస్ జి రాధా రాణి  దీన్ని విచారించారు.ఈ సందర్భంగా క్రిష్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. క్రిష్ కు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ గా తేలింది. దీంతో, బెయిల్ పిటిషన్ ను క్రిష్ వెనక్కి తీసుకున్నారు.

ప్రతి స్కీం ఓ స్కామ్.. సంక్షేమం పేరిటా అడ్డగోలు దోపిడీయే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలు తాడేపల్లి ప్యాలెస్ గడప దాటదు.. మాటలు మాత్రం లోకాన్ని చుట్టేస్తాయి. తాడేపల్లి ప్యాలెస్ గడప దాటాలంటే రోడ్లకిరువైపులా పరదాలు, రోడ్డు మార్గంలో కాకుండా కూతవేటు దూరానికి కూడా హెలికాప్టరే వాహనం. పొరపాటున రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తే దారిలో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లను నరికేయాల్సిందే. అయితే ఇదంతా ఆయనలో  జనాలకు కనిపించడానికి ఉన్న భయాన్నే చాటుతున్నది. పొరపాటున తాను జనం కంట పడితే.. నిలదీస్తారన్న భయం. వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తారన్న జంకు. ఇటీవల ఆయన పులివెందుల పర్యటనలో అదే జరిగింది. సొంత నియోజకవర్గమే కదా అనుకుంటే.. ఆయన కనిపించగానే జనం ఒక్క సారిగా సమస్యల చిట్టా విప్పారు. ఏం చేశారంటూ నిలదీశారు, వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో జగన్ తనకు అలవాటైన షిక్కటి షిరునవ్వును ముఖం మీద పులుముకుని నోరెత్తకుండా అక్కడ నుంచి జారుకున్నారు. బటన్ నొక్కుతున్నానంటూ ఈ ఐదేళ్లలో  అరకొరగా సంక్షేమం పేరిట నిధులు పందేరం చేసి జగన్ చేతులు దిలిపేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం పైగా అమలు చేసేశామని ఘనంగా చాటుకుంటున్నారు. కానీ జనం మాత్రం అమలు చేసిన వాగ్దానాలు వాస్తవంగా చూస్తే ఒక శాతం కూడా పూర్తిగా ఉండవని లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ విషయాలనే  ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రచ్చబండ వేదికగా జగన్ ను ఉతికి ఆరేశారు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంచుతున్నామన్న పేరుతో కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు.  ఇలా జగన్ అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ లబ్ధిదారులకు అందేది స్వల్పమేననీ, దొడ్డిదారిన నొక్కేసేదే అధికమని ఆయన ఆరోపించారు. చివరకు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ సొమ్మును సైతం స్వాహా చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. ఇలా నొక్కుసిన సొమ్మును ఆఫ్రికా దేశాలలో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని విదేశీ ప్రతినిథి బృందాల ద్వారా తనకు తెలిసిందన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ఒక స్కామేనని విమర్శించారు.  ఒకవైపు దేశ ప్రధానమంత్రి డిజిటలైజేషన్ దిశగా వెడుతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా నడుస్తున్నారన్నారు. వృద్ధులకు పింఛన్ నేరుగా అందించడం, మద్యం విక్రయాలలో నగదు లావాదేవీలకే పెద్ద పీట వేయడం వంటివి ఇందుకు ఉదాహరణగా ఆయన చూ పారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఏ ఒక్క పథకంలోనూ కూడా నగదు చెల్లింపులు లేవని గుర్తు చేసిన రఘురామకృష్ణం రాజు జగన్ మాత్రం నగదు చెల్లింపులకే మొగ్గు చూపడం వెనుక కారణం దోపిడీయేనని ఆరోపించారు.  అలా దోచిన సొమ్మును ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలవాలన్నది జగన్ వ్యూహం, ఎత్తుగడ అని ఆయన విమర్శించారు. అయితే లక్ష కోట్లు ఖర్చు పెట్టినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదనీ, ఈ విషయాన్ని తాను కాదు.. గత ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే చెప్పారని అన్నారు.  తెలుగుదేశం, జనసేన కూటమితో కలవవద్దని మొరపెట్టుకోవడానికే జగన్ హస్తిన వెళ్లాఅంటూ మోడీని ప్రాధేయపడడానికే హస్తినకు వెడుతున్నారనీ, అయితే అక్కడా ఆయనకు పరాభవం తప్పదని రఘురామ జోస్యం చెప్పారు. అసలు జగన్ కు మోడీ అప్పాయింట్ మెంట్ దొరికే అవకాశాలే లేవని అభిప్రాయపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేసిన జగన్ కు ఒక్క క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. సచివాలయం తాకట్టు విషయాన్ని తాను ప్రధాని మోడీకి లేఖ ద్వారా లెలియజేశానన్నారు.  అయితే సెక్రటేరియట్   తాకట్టుకు ముందే   విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, పార్కు, రైతు బజార్, డైరీ ఫార్మ్, వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను, ప్రభుత్వ స్థలాలను  జగన్ తాకట్టు పెట్టేశారని వివరించారు. ఆ తాకట్టు ద్వారా  25 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడానికి నేషనల్ బ్యాంకుల వద్దకు వెళితే ఛీ… పొమ్మన్నాయి కనుకే  ప్రైవేట్ బ్యాంకు లో తాకట్టు పెట్టారని చెప్పారు.  మొత్తంగా జగన్ సర్కార్ కు గెలుపుదారులన్నీ మూసుకుపోయాయని, అందుకే సొమ్ములు వెదజల్లి అయినా గెలవాలన్న నిర్ణయానికి వచ్చేశారనీ, తన మేనత్త విమలారెడ్డి ద్వారా పాస్టర్లను ప్రలోభ పెట్టి క్రిస్టియన్ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారనీ, అయితే సొమ్ముదండుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వైసీపీ వాళ్లు పోస్టర్లకు ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోవడంతో వారూ తిరగబడ్డారనీ, విమలారెడ్డి దొడ్డిదారిన పలాయనం కావడానికి అదే కారణమని అంటున్నారు. మొత్తంగా జగన్ కు ఇప్పుడు ఏదీ కలిసిరావడం లేదనీ, గతంలో చేసిన తప్పులే ఇప్పుడు ఆయనను అధికారానికి దూరం చేయనున్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తంగా జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులను సైతం వెతుక్కోవలసిన దయనీయ స్థితిలో ఉన్నారు.  టికెట్ ఇస్తామన్నా వద్దు మహప్రభో అంటూ దణ్ణం పెట్టి పారిపోతున్న వారి సంఖ్య వైసీపీలో రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తంగా పార్టీ అభ్యర్థులలోనే జగన్ ఫేస్ పెట్టుకుని వెడితో ఓటమి తథ్యమన్న భావన ఏర్పడింది.  

ఫెడరల్ స్ఫూర్తిని చాటిన రేవంత్!

గత కొన్నేళ్లుగా తెలంగాణలో  మోడీ పర్యటన వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. అదే విధంగా మోడీ తాజా పర్యటన కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే గతంలో మోడీ పర్యటన చుట్టూ వివాదాలు, వివాదాస్పద చర్చలూ ముసురుకుని ఉండేవి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాలే ప్రభుత్వాల మధ్యా కూడా ప్రతిఫలించేవి. రాజకీయ విభేదాలు పాలనలోనూ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలోనూ కనిపించకూడదన్న ఫెడరల్ స్ఫూర్తికి ఇసుమంతైనా విలువ ఉండేది కాదు. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రంలో అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భాలలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకాలన్న విషయాన్ని కేసీఆర్ పట్టించుకోకపోయేవారు. అలాగే అధికారిక కార్యక్రమాలలో ప్రధానితో వేదిక పంచుకోవాలన్న సంప్రదాయాన్ని కూడా ఆయన ఖాతరు చేసే వారు కాదు. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, విలువలకు పెద్ద పీట వేస్తూ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక సంబంధాలు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పడమే కాదు.. స్వయంగా ఆచరించి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ వల్ల ప్రజలకు నష్టమని విస్పష్టంగా చెప్పారు. రాజకీయాలనేవి ఎన్నికల సమయంలోనేననీ, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడుస్తామని విస్పష్టంగా చాటారు. హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మోడీని రేవంత్ కోరారు.    సోమవారం (మార్చి 4) రాష్ట్ర పర్యటనకు వచ్చిన  ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించిన సంగతిని గుర్తుచేస్తూ, తాము ప్రస్తావించిన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.  డిఫెన్స్ భూములను స్కై వేల నిర్మాణానికి ఇచ్చినందుకు మోడీకి ఈ సభ వేదికగా కృతజ్ణతలు చెప్పారు.  అంతే కాదు తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్దన్నలా సహకరించాలని కోరారు.      ఇప్పుడే కాదు రేవంత్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. సస్పెన్షన్లు లేవు, ఏకపక్ష ప్రసంగాలు లేవు. విపక్షానికి తగిన సమయం ఇవ్వడమే కాకుండా సభలో అరుపులు, గోలల సంస్కృతికి, సభాకార్యక్రమాలను స్తంభింప చేసే కార్యక్రమానికి చుక్కపడింది. సభ ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నదన్న భావన రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య జనంలోనూ కూడా కలిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఇప్పుడు మోడీతో సభా వేదికను పంచుకుని కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు ఆకాంక్షిస్తూ చేసిన ప్రసంగం ప్రజా స్వామ్య వాదుల మన్ననలు పొందింది. 

వైసీపీ ఒక దొంగల ముఠా..ఇదిగో నిదర్శనం!

వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వ్యవహారశైలిపై ఆ పార్టీలోనే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు.. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడిని డోర్ డెలివరీ చేసిన వ్యవహరంలో పార్టీ పరువు కాస్తా గోదాట్లో కలిసి పోయిందని.. తాజాగా మరో ఎమ్మెల్సీ భరత్..  తన వ్యవహార శైలితో.. పార్టీ పరువును కొండెక్కించేశారి వైసీపీలోని ఒక వర్గం మండిపడుతోంది.   ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో అబకలదొడ్డి పంచాయతీ పరిధిలోని కాకర్లవంకలో స్థానికులు కొందరు గంధపు స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని నిర్మించారు. వీరప్పన్ ఫోటోతో పాటు జెండా ఏర్పాటు చేశారు. తాజాగా ఆ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్ ఆ స్తూపాన్ని ఆవిష్కరించడమే కాకుండా.. నవ్వుతూ.. ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ చిత్ర రాజం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యవహరం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం... కారాలు మిరియాలు నూరుతోంది.  ఎందుకంటే.. ఇప్పటికే వైయస్ వివేకా హత్య కేసు.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి వేళ ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్   ప్రతిపక్ష పార్టీలకు ఓ ఆయుధంలా దొరికింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ భరత్.. గంధపు చక్కల స్మగర్ల వీరప్పున్‌ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించడం అంటే చేజేతులా పార్టీ జుట్టును విపక్షానికి అందజేయడమేనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అదీ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్పీ, అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబుకు ప్రత్యర్థిగా జగన్ నిర్ణయించిన అభ్యర్థి కూడా అయిన భరత్ హత్యలు, అరాచకాలతో నరరూపరాక్షసుడిగా ముద్రపడిన స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్ఫూపాన్ని ఆవిష్కరించి పార్టీ ప్రతిష్టను పాతాళానికి దిగజార్చేశారని వైసీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.   ఎమ్మెల్సీ భరత్‌ను రానున్న ఎన్నికల్లో కుప్పం ప్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు కుప్పంలో  నారా చంద్రబాబు నాయుడిని ఓడించి... భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకొని మంత్రి పదవి కట్టబెడతానంటూ జగన్ ప్రకటించారు. అలాంటిది అదే భరత్ ఇలా.. స్మగ్లర్ల వీరప్పన్ స్మారక చిహ్నం ఆవిష్కరించడం ద్వారా సమాజానికి ఏ  సందేశం ఇచ్చినట్లు అన్న ప్రశ్న వైసీపీ నుంచే ఎదురౌతోంది.     తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్ బరిలో దిగనున్న సంగతి అందరికీ తెలిసిందేనని.. అలాంటి ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న భరత్ ఇంత అడ్డగోలుగా, అరాచకంగా వ్యవహరిస్తే ఎలా అంటున్నారు.    ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పాలకుల తప్పులను ప్రజల మధ్యకు వెళ్లి ప్రశ్నించడమే ప్రతిపక్షాల ప్రధాన కర్తవ్యమనే విషయాన్ని సైతం మరచి.. పార్టీ ప్రజా ప్రతినిధులు ఇలా వ్యవహరించడం.. ఏ మాత్రం పద్దతిగా లేదని అంటున్నారు.   గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించాడని.. అలాగే అతడిని తొలి సారి అరెస్ట్ చేసిన వ్యక్తి పందిళ్లపల్లి శ్రీనివాస్ అని.. ఆయన రాజమండ్రి వాస్తవ్యుడని.. ఐఎఫ్ఎస్ అదికారిగా ఆయన కర్ణాటక కేడర్‌లో పని చేస్తుండే వారని..  అయితే తాను లొంగిపోతానని.. అయితే ఆయుధాలు లేకుండా అడవిలోకి రావాలంటూ.. శ్రీనివాస్‌కు స్మగ్లర్ వీరప్పున్ సమాచారం ఇవ్వడంతో   అది నిజమని నమ్మి... ఆయన ఓంటరిగా అడివిలోకి వెళ్లి.. వీరప్పన్ చేతిలో అత్యంత దారుణంగా హత్య కావింపబడ్డారని.. ఇక శ్రీనివాస్ ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. శ్రీనివాస్ మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి నీతి నీజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉన్నతాధికారి... అందునా తెలుగు వ్యక్తిని ఇంత అత్యంత పాశవికంగా స్మగ్లర్ వీరప్పన్ హత్య చేశారని.. అలాంటి నరహంతుకుడి స్మారక చిహ్నం ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ భరత్‌కు చేతులు ఎలా వచ్చాయని వైసీపీ నేతలే అంటున్నారు. ఏదీ ఏమైనా అవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అన్నట్లాగా వీరి వ్యవహారం ఉందని వైసీపీలోని ఒక వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.  

నాట్య మయూరీ నితా.. మిసెస్ ముఖేష్ అబానీపై ప్రశంసల వర్షం

ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి.. దేశం మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. ఆ కుటుంబం ఈ వేడుకలను నభూతో అన్నట్లుగా నిర్వహిస్తోంది. సంప్రదాయం, ఆధునికతల మేలు కలయికగా అంబానీల ఇంట పెళ్లి వేడుక అందరినీ ఆకర్షిస్తోంది. అలరిస్తోంది.  ఇక ఆ ఇంట పెళ్లి సందడి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ధరించిన పచ్చల హారంపై అయితే విస్తృత చర్చ ఎడతెగకుండా సాగుతూనే ఉంది. ఆ హారం విలువ రూ500 కోట్లకు పైమాటే అంటున్నారు. అదలా ఉంటే తన కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ షూట్ సందర్భంగా జామ్ నగర్ లో జరిగిన వేడుకలో నీతా అంబానీ చేసిన నాట్యం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.   ముఖేష్ భార్యగా..ముంబై ఐపిల్ క్రికెట్ టీం యజమానురాలిగా, ఒక మహిళా వ్యాపారావేత్తగా  మాత్రమే ఇప్పటి వరకూ అందరికీ పరిచితురాలైన నీతా అంబానీ అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ గా ఈ నాట్యంతో తనలోని మరో కళాకోణాన్ని ఆవిష్కరించారు.   సాంప్రదాయ దుస్తులు ధరించి లయబద్ధంగా ఆమె చేసిన క్లాసికల్ డాన్స్ ఆ కార్యక్రమానికి హాజరైన అతిధులనే కాకుండా, సామాజిక మాధ్యమంద్వారా ఈ నృత్యాన్ని తిలకించిన అందరినీ మంత్రముగ్ధులను చేశారు.  

ఆ ఆశ కూడా పాయె.. దొడ్దిదారిన‌ విమ‌లారెడ్డి ప‌రార్!

నూరు త‌ప్పులు చేసిన శిశుపాలుడి త‌ల‌ను సుద‌ర్శ‌న చ‌క్రంతో శ్రీ‌కృష్ణుడు ఎలా ఖండించాడో.. ఐదేళ్ల‌ పాల‌న‌లో వెయ్యికిపైగా త‌ప్పులు చేసిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓటు ద్వారా త‌రిమికొట్టేందుకు ఏపీ ప్ర‌జ‌లు అలాగే స‌న్న‌ద్ధమ‌వుతున్నారు. ఐదేళ్ల‌ కాలంలో జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. త‌ప్పు మీద త‌ప్పుచేస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పాలుచేయ‌డం రివాజుగా మారిపోయింది. ఆ తప్పుల ఫలితం ఎన్నికలలో అనుభవించక తప్పదని ఖరారైపోయింది. ఎన్నిక‌ల ముంగిట  జ‌గ‌న్ ప‌త‌నం   ప్రారంభ‌మైంది. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఏకం కావ‌డం, ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ పై పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ణికిపోతోంది. ప్ర‌జాక్షేత్రంలో వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్ల‌ తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేపారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప్ర‌జ‌ల‌కు తాయిళాలు అందించేందుకు జ‌గ‌న్ అండ్ కో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కులాలు, మ‌తాల వారిగా విభ‌జించి తాయిళాలు అందించేందుకు ఓ యాక్ష‌న్ ప్లాన్ ను జ‌గ‌న్ కోట‌రీ సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో విమ‌లారెడ్డి వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన భూమిక పోషించిన వారిలో క్రిస్టియన్లు కూడా ఉన్నారు. ఏపీలో దాదాపు అన్ని గ్రామాల్లో వీరి ఓటు బ్యాంకు ఉంది. స్వ‌త‌హాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కుటుంబం  క్రిస్టియన్లు కావ‌డంతో ఆ మ‌తానికి చెందిన ఓట్ల‌లో మెజార్టీ ఓట్లు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌దిలీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గంప‌గుత్త‌గా  క్రిస్టియన్లు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీనికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌. ఆయన ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించి క్రిస్టియ‌న్ల‌ను వైసీపీవైపు మ‌ళ్లించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. క్రిస్టియ‌న్లు అంటే కేవ‌లం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాలే కాదు.. బీసీలు, ఓసీల్లోని క‌మ్మ‌, కాపు, రెడ్డి కుల‌స్థులు కూడా అధికంగానే ఉన్నారు. కులంతో సంబంధం లేకుండా కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ అనేకార‌ణంతో మెజార్టీ శాతం క్రిస్టియ‌న్లు చంద్ర‌బాబును దూరంపెట్టి జ‌గ‌న్ వైపుకు వెళ్లిపోయారు. అయితే, ఇదంతా 2019 ఎన్నిక‌ల సంగతి. ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల్లో క్రిస్టియ‌న్లు గ‌తంలోలా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ప‌లికే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన క్రిస్టియ‌న్ల‌ను వారు ఆశించిన స్థాయిలో ద‌గ్గ‌ర‌కు తీయ‌లేద‌ని గుర్రుగా ఉన్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల, ఆమె భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ దూర‌మ‌య్యారు.  వైఎస్ కుటుంబంలో జ‌రిగిన అంత‌ర్గ‌త యుద్ధంలో భాగంగా వైఎస్‌ ష‌ర్మిల, ఆమె భ‌ర్త అనిల్ కుమార్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పూర్తిగా వ్య‌తిరేకించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికితోడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ త‌న ప‌రిధిలో క్రిస్టియ‌న్ల‌ను కాంగ్రెస్ వైపు మ‌ళ్లించి జ‌గ‌న్ ను దెబ్బ‌తీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. క్రిస్టియ‌న్ ఓట్లు వైసీపీకి దూర‌మైతే ఓట‌మి ఖాయ‌మ‌ని భావించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా త‌న అత్త విమ‌లారెడ్డిని రంగంలోకి దింపారు. విమ‌లారెడ్డి దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రి. జ‌గ‌న్ సూచ‌న‌తో వైసీపీ క్రిస్టియ‌న్ సెల్ ఆధ్వ‌ర్యంలో ఆమె బైబిల్ ప‌ట్టుకొని జిల్లాల్లో చ‌ర్చి ఫాద‌ర్ల మీటింగ్ ల‌లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో కాకినాడ ప‌ట్ట‌ణంలో ఓ ఫంక్ష‌న్ హాల్ లో సేవ‌కుల స‌ద‌స్సు పేరుతో కాకినాడ, చుట్టుప‌క్క‌ల   ప్రాంతాల్లో చ‌ర్చిల‌ ఫాద‌ర్లు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం పంపించారు. విమ‌లారెడ్డి అంటే వ‌చ్చేందుకు చాలామంది ఫాద‌ర్లు ఆస‌క్తి చూప‌క‌పోవ‌టంతో.. వారికి డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పి పిలిపించారు.  కాకినాడ‌లో నిర్వ‌హించిన సేవ‌కుల స‌ద‌స్సులో దాదాపు రెండువేల మంది ఫాద‌ర్లు పాల్గొన్నారు. హాల్‌లోకి వెళ్లేముందు వారికి ట్యాగ్ లు ఇచ్చి లోప‌లికి పంపించారు. స‌ద‌స్సు అయిన‌పోయిన త‌రువాత వెళ్లేట‌ప్పుడు ఆ ట్యాగ్ తీసుకొని రూ. వెయ్యి ఇచ్చేందుకు నిర్వాహ‌కులు ప్లాన్ చేశారు. అయితే, వైసీపీ క్రైస్త‌వ సెల్  విభాగం ఊహించినదానికంటే అధిక సంఖ్య‌లో ఫాస్ట‌ర్లు, క్రైస్త‌వుల్లో ప‌లు విభాగాల‌కు చెందిన వారు స‌ద‌స్సుకు వ‌చ్చారు. స‌ద‌స్సు పూర్త‌యిన త‌రువాత నిర్వాహ‌కులు ఇచ్చిన‌ ట్యాగ్ లు తీసుకొని అప్ప‌టికే క‌వ‌ర్ల‌లో సిద్ధంగా ఉంచిన న‌గ‌దును వారికి అంద‌జేశారు. ముందుగా వెయ్యి రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పి క‌వ‌ర్ లో కేవ‌లం రూ.500 మాత్ర‌మే ఇవ్వ‌డంతో ప‌లువురు ఫాద‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తింది. ఈ విష‌యం గ‌మ‌నించిన విమ‌లారెడ్డి ఫంక్ష‌న్ హాల్ వెనుక‌భాగంలో సిద్ధంగా ఉంచిన కారులో వెళ్లిపోయారు. దీంతో ప‌లువురు ఫాస్ట‌ర్లు ఆమె తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సేవ‌కుల స‌ద‌స్సు పేరుతో ప్రార్థ‌న‌లు చేసి మ‌ళ్లీ జ‌గ‌న్ పార్టీకే ఓటు వేయాల‌ని కొంద‌రిచేత విమ‌లారెడ్డి బైబిల్ పై ప్రమాణం సైతం చేయించుకున్న‌ట్లు ప‌లువురు పాద‌ర్లు పేర్కొన్నారు. కాకినాడ‌లో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారాన్ని ప‌లువురు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంలో అవి వెంటనే వైర‌ల్ అయ్యాయి. మొత్తానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వేస్తున్న ఒక్కో అడుగు విఫ‌లం అవుతుండ‌టంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం  కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు.