15న వైఎస్ వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటన?
posted on Mar 8, 2024 @ 10:54AM
వచ్చే ఎన్నికలలో డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం ఇప్పటికే ఖరారైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 15న వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి. ఆయన వర్ధంతి సందర్భంగా డాక్టర్ సునీత రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందు కోసం పులివెందులలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమె ప్రయత్నాలకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమం కోసం డాక్టర్ సునీత ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే దానిని వైసీపీ నేతలు క్యాన్సిల్ చేయించేశారని అంటున్నారు.
దీంతో పులివెందులలో ఆయితే తమను ఏదో విధంగా అడ్డుకుంటారన్న నిర్ణయానికి వచ్చేసిన ఆమె వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమాన్ని కడపకు మార్చారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన క్లియర్ కట్ మెసేజ్ ను ఇప్పటికే ఇచ్చేశారు. హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన అన్న జగన్ కు, ఆయన పార్టీకీ ఓటు వేయవద్దని విజ్ణప్తి చేశారు. తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం కూడా త్వరలో ప్రకటిస్తామని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆ ప్రకటనకు సమాయత్తమౌతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో కడపలో రాజకీయం ఆసక్తికరంగా మారనున్నది. వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబీకుల మధ్యే పోరు జరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్య కడప లోక్ సభ బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా, ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులకు శిక్షపడకుండా జగన్ తన అధికారాన్నంతా ఉపయోగించి అడ్డుకుంటున్నారని ఆమె ఎటువంటి మొహమాటాలూ, బేషజాలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ పాలనలో ఏపీలో రాక్షసరాజ్యం నడుస్తోందనీ, అందరికీ సమాన న్యాయం అన్న పరిస్థితి లేదనీ సునీత హస్తినలో మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా తన తండ్రి హత్య కేసులో దోషులను కాపాడటానికి జగన్ ప్రయత్నిస్తున్నారనీ, అధికారం ఉండటంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, న్యాయం కోసం తన న్యాయపోరాటం కొనసాగుతుందని చెబుతూనే, రాజకీయంగా కూడా జగన్ తో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ పోరాటంతో తనకు ప్రజా దీవెనలు, మద్దతు కావాలని విజ్ణప్తి చేశారు. ఇందు కోసం ప్రజలలోకి వెడతాననీ స్పష్టం చేశారు. దీంతో వైఎస్ వివేకా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి నిలబడటం ఖాయమైందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. ఇక పోటీ చేయడమంటూ వస్తే ఎక్కడ నుంచి ఎవరు అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. డాక్టర్ సునీత పోటీ చేస్తారా? లేక ఆమె తల్లి, దివంగత వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగుతారా అన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒక వైపు చేస్తున్నపోరాటానికి మద్దతుగా సునీత కాంగ్రెస్ గూటికి చేరి కడప లోక్ సభ బరిలో దిగే అవకాశాలున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది.
అదే విధంగా డాక్టర్ సునీత కాదు, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ బరిలో నిలబడే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఈ అభిప్రాయాలు ఇలా ఉండగా మరో కొత్త చర్చ ఇటీవల తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగితే జగన్ అండ్ కో దాష్టీకాల నుంచి రక్షణ ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఆ అభిప్రాయం ప్రకారం డాక్టర్ సునీత, సౌభాగ్యమ్మలు తెలుగుదేశం పార్టీలో చేరి ఇరువురిలో ఎవరో ఒకరు కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగుతారు. అదే కనుక జరిగితే అక్కడి సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల పోటీ ప్రభావం ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా బలంగా ఉంటుందని, దీంతో జగన్ కు సొంత జిల్లాలోనే గెలుపు ధీమా సడలిపోతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సారి ఎన్నికలలో కడప జిల్లాలో ఫలితం ఏకపక్షంగా ఉండే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు.