రేవంత్ జోరు.. కేసీఆర్ బేజారు!

కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ యాస, బాస పేర ప్రత్యర్థులపై ఉచితానుచితాలు పట్టించుకోకుండా విమర్శల పేరిట దూషణలతో విరుచుకు పడిపోయే వారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచీ కేసీఆర్ ది అదే శైలి. ఇక రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్న తరువాత నుంచి రేవంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.  కేసీఆర్ భాషలోనే విమర్శలు గుప్పించడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.  ఇప్పటి వరకూ ప్రత్యర్థులు నోరెత్తకుండా తనకే ప్రత్యేకమైన భాష, యాసలో విరుచుకుపడి ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ నే డిఫెన్స్ లో పడేసేంత స్థాయిలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు.  గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో  ఆ ఉద్యమ సారథిగా కేసీఆర్ తన ఫస్ట్ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం అన్న చంద్రబాబు మాటలను కాయిన్ చేసి రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తనదైన భాషలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నడూ రాజకీయ మర్యాదలకు తిలోదకాలిచ్చి మాట్లాడింది లేదు. ఆయన ఎప్పుడూ పరిధి దాటరు. తీవ్ర ఆగ్రహం వస్తే ఏం తమాషా చేస్తున్నారా అన్నది మాత్రమే ఆయన నోటి వెంట వచ్చే మాట. ఉద్యమ ఊపులో అప్పట్లో  కేసీఆర్ భాషకు, యాసకు తెలంగాణ జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు శైలి ప్రస్తుత రాజకీయాలకు సరిపడదనీ, ఆయనది ఔట్ డేటెడ్ స్టైల్ అనీ అప్పట్లో సొంత పార్టీ వారే అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ మార్చుకోలేదు. అదే ఆయన బలం అని ఆ తరువాత పలు సందర్భాలలో రుజువైంది అది వేరే సంగతి. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న కొణిజేటి రోశయ్య కానీ,  ఆ తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కేసీఆర్ వాగ్దాటి ముందు నిలువలేకపోయారు. సరే రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన పొన్నాల లక్ష్మయ్య, ఆయన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ విమర్శల జడిలో తడిసి ముద్దయ్యారు. దీటుగా బదులివ్వడంలో విఫలమయ్యారు. కానీ రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరవాత పరిస్థితి పూర్తిగా మారింది. కేసీఆర్ కు దీటుగా ఆయన భాషలోనే బదులివ్వడం ద్వారా రేవంత్ పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ నింపగలిగారు. సరే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు.  పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి ఆధారంగా కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ తన విమర్శలకు పదునుపెట్టడంతో కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు.  గతంలో తన ధోరణి,  ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగించిన భాష అన్ని కన్వీనియెంట్ గా మరచిపోయి.. కరీంనగర్ సభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాల్సిన భాషేనా అది అంటూ అమాయకంగా ప్రశ్నించారు. రేవంత్ కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నారనీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడైనా ఇటువంటి అనుచిత భాష ఏపయోగించానా అంటూ వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ అలర్ట్ అయి గతంలో కేసీఆర్ అనుచిత భాషా ప్రయోగంతో చేసిన ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి. దీంతో కేసీఆర్ అనివార్యంగా మౌనం వహించాల్సివచ్చింది. మొత్తం మీద కేసీఆర్ భాషనే ఆయనమీద ప్రయోగించి రేవంత్ పై చేయి సాధించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

సొమ్ములు పడకపోతేనేం.. బటన్ నొక్కేశారుగా?

జగన్ ప్రభుత్వం పని మాయసభను మించిపోయింది. మయసభలో లో లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కనిపించే కనికట్టు ఉన్నట్లుగానే.. జగన్ సర్కార్ కూడా చేసినది చేయనట్లు, చేయనిది చేసినట్లు మాటలతో మాయ చేసేస్తారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 99శాతం అమలు చేశామని ఘనంగా చెప్పుకుంటారు. ఇంతకీ అమలైనవి ఏమిటయ్యా అని చూస్తే.. ఒక శాతం కూడా ఉండవు. కానీ ప్రచారం మాత్రం ఆ ఒక్కశాతం కూడా అమలైపోయిందేమో పాపం ప్రభుత్వమే సరిగా చూసుకుని ఉండదు అనుకునే లెవెల్ లో ఉంటుంది.  కానీ వాస్తవంలో జగన్ ఇచ్చిన హామీలలో కనీసం 10శాతం కూడా ఈ ఐదేళ్లలో నెరవేర్చ లేదు.  నవరత్నాల పేరిట జగన్నాటకం ఆడారే కానీ మేనిఫెస్టోలో  పేర్కొన్న హామీలలో, అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వేల వేల హామీలలో ఇప్పటికి కనీసం పది శాతం కూడా నెరవేరలేదు.     రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చినా వాటిలో  ఒక్కటీ అమలు కాలేదు.  అలాగే  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో  ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో  రెండింటిని పూర్తిగా విస్మరించారు.  ఇలా మాటలకూ చేతలకూ పొంతన లేని జగన్ పాలన పూర్తిగా అవాస్తవాల పునాదులపై సాగుతోంది. క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నానంటూ ఘనంగా చాటుకుంటున్న ముఖ్యమంత్రి వాస్తవంగా బటన్ మాత్రమే నొక్కుతున్నారు. ఆ తరువాత ఎంత కాలానికి ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో పడతాయో మాత్రం చెప్పడం లేదు. తాజాగా అనకాపల్లిలో ఆర్భాటంగా బహిరంగ సభ  ఏర్పాటు చేసి మరీ చేయూత పథకం లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నానంటూ బటన్ నొక్కారు. అది జరిగా వారం రోజులు దాటిపోయినా ఇంత వరకూ ఒక్క లబ్ధిదారుడి ఖాతాలో కూడా చేయూత సొమ్ములు పడిన దాఖలాలు లేవు. ఇహనో, ఇప్పుడో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఇక ఆ పడని డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ బటన్ నోక్కాను, సొమ్ములు పంచాను అన్న ప్రచారం మాత్రం ఘనంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  అసలు బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని జగన్ ఎంత   ఫార్సుగా మార్చేశారంటే.. ఆయన ప్రభుత్వ కార్యక్రమం అంటూ ప్రజాధనంతో కోట్లు వెచ్చించి సభ ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సులలో బతిమలాడో, భయపెట్టో జనాలను తరలించేస్తారు. బలవంతంగా వచ్చిన వారు జగన్ ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోవడం వేరే సంగతి. కానీ చేయూత పథకం కింద లబ్ధిదారులకు సొమ్ములు పంచాలంటే అందుకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తూ విడుదల ఆర్డర్ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఉత్తుత్తి బటన్ నొక్కేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు. ప్రచారం మాత్రం వీర లెవల్ లో చేసేసుకున్నారు. ఉత్తుత్తి బటన్ నొక్కి, ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో మాత్రం విపక్షాల నాయకులను విమర్శించేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. సొమ్ములు రాలేదంటూ లబ్ధిదారులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవడం లేదు.  స్థానిక నాయకులను అడిగితే సొమ్ములు పడకపోతే మాత్రం ఏమయ్యింది.. జగన్ సార్ బటన్ నొక్కేశారుగా అంటూ జారుకుంటున్నారు. ఎలాగూ ఈ వారంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేస్తుంది కనుక ఇక సొమ్ములు ఎగ్గొట్టేయొచ్చు. అదీ సంగతి.

వార్ వన్ సైడే.. ముస్లిం ఓట్లపై వైసీపీ ఆశలు ఆవిరే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు వార్ వన్ సైడ్ గా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు మూడు పార్టీల పొత్తూ సజావుగా ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా పొడిచి.. సీట్ల సర్దుబాటు పూర్తై, అభ్యర్థుల ప్రకటనే తరువాయి అన్న పరిస్థితికి వచ్చేశాయి. అదే సమయంలో అధికారంలో ఉండి కూడా పోటీలు నిలబడే అభ్యర్థులు ఎవరన్నది తేల్చుకోలేక వైసీపీ నానా అగచాట్లూ పడుతోంది. సిట్టింగుల మార్పు అంటూ జగన్ మొదలెట్టిన ప్రయోగం వికటించిందని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఇప్పటికే పార్టీ వీడగా, మరి కొందరు అదే దారిలో ఉన్నారని వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పేస్తున్నాయి.  అయినా వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేయడం మేకపోతు గాంభీర్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలవడం వల్ల కూటమికి ముస్లిం ఓటర్లు దూరం అవుతారన్న దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ఉందని రాజకీయవర్గాల్లో చ ర్చ జరుగుతోంది.  ఆ ఆశ ఎందుకంటే.. ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లింమైనారిటీల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా రాయల సీమలోని కొన్ని నియోజకవర్గాలలో అయితే వారి ఓట్లే అభ్యర్థి విజయాన్ని నిర్థారిస్తాయి.   కర్నూలు, కడప, నంద్యాల, ఆదోని, హిందూపురం, పీలేరు, మదనపల్లి వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 50 వేల నుంచి 80 వేల వరకూ ఉంది. ఆయా నియోజకవర్గాలలో ముస్లిం మైనారిటీలు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే విజయం సాధిస్తుంది.  అలాగే విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఒంగోలు, చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాల వంటి నియోజవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య పాతిక నుంచి 35 వేల వరకూ ఉన్నాయి. అంటే ఈ నియోజకవర్గాలలో కూడా ముస్లిం మైనారిటీల ఓట్లే గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పుడు ఆ ముస్లిం మైనారిటీల ఓట్లపైనే వైసీపీ ఆశలన్నీ పెట్టుకుందని అంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఏపీలో మతం ప్రాతిపదికన ఓట్లు పడే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఒక వేళ అలాగే పడతాయని అనుకున్నా.. మోడీ సర్కార్ ట్రిబుల్ తలాక్ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పార్టీ పట్ల ముస్లిం మైనారిటీలలో గతంలోలా తీవ్ర వ్యతిరేకత   లేదని అంటున్నారు.  

వైసీపీ రాజకీయాలకు అమాయకురాలు బ‌లి

ఏపీలో ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే వైసీపీకి హ‌త్యారాజ‌కీయాల‌కు తెర‌లేప‌డం .. వాటిని ప్ర‌తిప‌క్ష పార్టీల‌పైకి నెట్ట‌డం అల‌వాటుగా మారింది.  2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ మంత్రి, వై సీపీ నేత వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగింది.. ఆ హ‌త్య చంద్ర‌బాబు నాయుడి కుట్రేనంటూ ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేసి ఆ ఎన్నికలలో లబ్ధి పొందింది.  చంద్ర‌బాబు వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి గొడ్డ‌లితో హ‌త్య‌చేశారు  అన్న‌ట్లుగా నారాసుడి ర‌క్త‌చ‌రిత్ర అంటూ కథనాలు వండి వార్చింది. అప్పట్లో ఆ ప్రచారం వైసీపీకి కలిసి వచ్చి అధికారం దక్కింది. సొంత బాబాయ్  హత్యతో ప్రజలలో జగన్ పై సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడింది.  జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన కొంత‌కాలానికి కానీ తెలియ‌లేదు.. వివేకానంద రెడ్డిని హ‌త్య‌ వెనుక ఉన్నది జ‌గ‌న్ కుటుంబీకులేన‌ని. స్వ‌యంగా వివేకా కూతురు సునీతారెడ్డే మా నాన్నను హ‌త్య చేసింది అవినాశ్ రెడ్డి అనీ, అందుకు  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హ‌కారం ఉంద‌ని సునీత అనుమానం వ్య‌క్తం చేశారు. అవినాష్ అరెస్టును జగన్ అడ్డుకోవడానికి కూడా కారణం అదేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.  దీంతో జ‌గ‌న్ బండారం బ‌య‌ట‌ప‌డి ప్ర‌జ‌లంతా చీద‌రించుకునే పరిస్థితి వచ్చింది.  ఇప్పుడు రానున్న ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా బుద్దిచెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చి మ‌ళ్లీ సానుభూతిని పొందాల‌ని జ‌గ‌న్ అండ్ కో కొత్త‌నాట‌కానికి తెర‌లేపింది. గీతాంజ‌లి  అనే వివాహిత మృతిని రాజ‌కీయంగా వాడుకొనేందుకు వైసీపీ అధిష్టానం నానాపాట్లు ప‌డుతోంది. ఏపీలో గ‌త మూడు రోజులుగా గీతాంజ‌లి మ‌ర‌ణంపైనే చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ అంశాన్ని రాజ‌కీయంగా వాడుకొని ల‌బ్ధిపొందేందుకు  వైసీపీ అధిష్టానం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నది.  తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చేసిన ట్రోలింగ్ కార‌ణంగానే గీతాంజ‌లి మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని వైసీపీ బుర‌ద జ‌ల్లుతోంది.  వైసీపీ విసిరిన బుర‌ద‌ను క‌డుక్కోలేక తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు నానా తంటాలు ప‌డుతున్న ప‌రిస్థితి. ఆ  స్థాయిలో వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నది.  అస‌లు గీతాంజ‌లి ఆత్మ‌హ‌త్య చేసుకుందా? ఎవ‌రైనా హ‌త్య చేశారా?  ప్ర‌మాద‌వ శాత్తూ ఆమె రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిందా అనే విష‌యాలు పూర్తిగా బ‌య‌ట‌కు రాక‌ముందే.. వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం ఆ నెపాన్ని తెలుగుదేశం, జ‌న‌సేన‌పై నెట్టేందుకు చేయ‌కూడ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రీ దుర్మార్గ‌మైన చ‌ర్య ఏమిటంటే.. గీతాంజ‌లి చ‌నిపోయి  పుట్టెడు దుఖంలో ఉన్న ఆమె ఇంటికి వ‌ద్ద‌కు వెళ్లిన వైసీపీ అనుకూల మీడియా  చేసిన హ‌డావుడి అంతాఇంతా కాదు.  ఆమె భ‌ర్త‌తోపాటు, ఆమె ఇద్ద‌రు చిన్న పిల్ల‌ల వ‌ద్ద‌సైతం మైకుపెట్టి  జ‌న‌సేన‌, తెలుగుదేశం ట్రోలింగ్ వ‌ల్లే మా అమ్మ చ‌నిపోయింద‌ని చెప్పించే ప్ర‌య‌త్నానికిసైతం దిగజారి ప్రయత్నించింది. అంటే.. ఈ ఘ‌ట‌నను  తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌పై నెట్టేందుకు వైసీపీ అధిష్టానం ఎంత వ్యూహాత్మంగా ముందుకెళ్తుందో  అర్థంచేసుకోవ‌చ్చు.   గీతాంజ‌లి ఈ నెల 7వ తేదీన రైలు ప్ర‌మాదానికి గురైంది.. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 11వ తేదీన మృతిచెందారు. ఆమె ప్ర‌మాదానికి గురైన‌నాటి నుంచి ప‌ట్టించుకోని వైసీపీ నేత‌లు.. ఆమె చ‌నిపోయింద‌ని తెలియ‌గానే త‌మ ప‌నిని ప్రారంభించారు. జ‌న‌సేన,  తెలుగుదేశం ట్రోలింగ్ వ‌ల్లే ఆమె మ‌ర‌ణించింద‌ని సోష‌ల్ మీడియాలో, త‌మ‌  అనుకూల మీడియా చాన‌ల్స్ లో మారుమోగించారు. ఇంత‌లోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గీతాంజ‌లి కుటుంబానికి రూ.20ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో శ‌వ రాజ‌కీయాలు చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్న వైసీపీ కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన తెలుగుదేశం  అల‌ర్ట్ అయింది. వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఆమె ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో వీడియోను టీడీపీ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో గీతాంజ‌లికి ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో గుమ్మిగూడిన ప్ర‌జ‌లు ఆమెను రైల్లో నుంచి ఎవ‌రో ఇద్ద‌రు నెట్టేశార‌ని మాట్లాడుకున్నారు. ఆమెను నెట్టింది ఎవ‌రు?  అనే విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టిన ప్ర‌భుత్వం.. తెలుగుదేశం, జ‌న‌సేన ట్రోలింగ్ వ‌ల్ల‌ మ‌న‌స్తాపానికి గురై గీతాంజ‌లి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు చిత్రీక‌రించేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది.  గీతాంజ‌లి మృతి ఘ‌ట‌న‌లో ముందుగా పోలీసులు ఎవ‌రినైనా విచారించాలంటే వైసీపీ సోష‌ల్ మీడియా విభాగాన్నే. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌కు అర‌కొర‌గా అందిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లో పాపుల‌ర్ చేసే ప్ర‌య‌త్నంలో ఎవ‌రికి ప‌డితే వారికి ట్రైనింగ్ ఇచ్చేసి వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా వీడియోల‌ను వ‌దులుతున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యం. ఈ స‌మ‌యంలో తెలుగుదేశం, జ‌న‌సేన ఒక‌ప‌క్క‌..  వైసీపీ మ‌రోప‌క్క సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు ట్రోల్ చేసుకోవ‌టం కామ‌న్‌.. ఇది ఏపీలో విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతున్నది. అంతెందుకు.. జ‌గ‌న్ పై విమర్శలు చేస్తున్న ఆమె సోదరిలు వైఎస్‌ ష‌ర్మిల‌, సునీతారెడ్డిలపై వైసీపీ సోష‌ల్ మీడియా ఎంత‌లా విషం క‌క్కిందో ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ష‌ర్మిల క‌న్నీరు సైతం పెట్టుకున్నారు. సునీత కేసుకూడా పెట్టారు. ఇలాంటి త‌రుణంలో అభంశుభం తెలియ‌ని వారితో జ‌గ‌న్ కు ప‌బ్లిసిటీ వ‌చ్చేలా మాట్లాడించి.. వారి వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ వారిని ఇబ్బందులు పాలుచేసి ల‌బ్ధిపొందాల‌ని వైసీపీ భావిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతూనే ఉంది. గీతాంజ‌లికి ఇద్ద‌రు పిల్ల‌లు. వారి వ‌య‌స్సు మూడునాలుగేళ్లు ఉంటుంది. అయితే.. మాకు అమ్మ ఒడి ఐదేళ్లుగా వ‌స్తుంద‌ని గీతాంజ‌లితో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం చెప్పించింది. ఒక‌ ప‌క్క పిల్ల‌లు చూస్తే మూడునాలుగేళ్ల వ‌య‌స్సు. మ‌రి గీతాంజ‌లికి ఐదేళ్లుగా అమ్మ ఒడి ఎలా అందుతున్నద‌ని తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నించి ఉండొచ్చు. తెలుగుదేశం విడుద‌ల చేసిన వీడియో ప్ర‌కారం.. ఎవ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు గీతాంజ‌లిని రైలు నుంచి నెట్టేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ విష‌యంపై విచార‌ణ‌చేసి.. అస‌లు ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు ఎవ‌రు? ఆమె చివ‌రిగా మాట్లాడింది ఎవ‌రితో ,  ఆమెకు తెల్ల‌వారుజామున ఫోన్లు వ‌చ్చాయ‌ని భ‌ర్త చెపుతున్నాడు.. ఆ స‌మ‌యంలో ఫోన్ చేసింది ఎవ‌రు అనే విష‌యాల‌పై నెగ్గుతేల్చితే అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ అది తేల్చ‌కుండా వైసీపీ ప్ర‌భుత్వం గీతాంజ‌లి మ‌ర‌ణాన్ని రాజ‌కీయంగా ఉప‌యోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌టం క‌న్నా సుగ్గుమాలిన చ‌ర్య మ‌రొక‌టి ఉండ‌ద‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

తెలుగుదేశం శ్రేణుల అనుమానాలూ, భయాలూ నిజమౌతున్నాయా?

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసిరావడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలూ కలగబోతున్నాయా? ముఖ్యంగా  బీజేపీ పొత్తులో భాగంగా తాను పోటీ చేయనున్న స్థానాలలో  నిలబెట్టే అభ్యర్థుల కారణంగా నష్టమే ఎక్కువ సంభవించనుందా? అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. తొలి నుంచీ సోము వీర్రాజును తాము బ్లాక్ లిస్ట్ లో పెట్టామని  చెబుతూ వచ్చిన బీజేపీ, ఇప్పుడు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందన్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. తనకు టికెట్ కోసం సోము వీర్రాజు పార్టీ హైకమాండ్ వద్ద చేసిన లాబీయింగ్ ఫలించిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు జగన్ కు, ఆయన పార్టీకీ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా అతి జాగ్రత్తకు పోయి బీజేపీ బలాన్ని మించిన స్థానాలను ఆ పార్టీకి పొత్తులో భాగంగా కేటాయించడం వల్ల తెలుగుదేశం నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ కోసం, రాష్ట్రం కోసం త్యాగాలకు తాము సిద్ధమే అయినా.. నిన్నటి వరకూ నిలువెల్లా తెలుగుదేశం వ్యతిరేకతను నింపుకుని, పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పించడమే కాకుండా, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారిని పొత్తులో భాగంగా అభ్యర్థిగా నిలబెడితే ఎలా అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.  2014 ఎన్నికలలో తాము గెలిచిన  తాడేపల్లి గూడెం సీటును పొత్తులో భాగంగా ఈ సారి తమకే కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోంది.  అయితే అందుకు జనసేన అంగీకరించడం లేదు. ఒక వేళ అంగీకరిస్తే ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును నిలపాలని యోచిస్తున్నది. అయితే తాడేపల్లిగూడెం నుంచి బరిలో నిలిచేందుకు  జనసేనకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు  బొల్లిశెట్టి శ్రీను రూపంలో బలమైన అభ్యర్థి ఉండటంతో ఆ సీటును వదులుకోవడానికి జనసేన ససేమిరా అంటున్నది. దీంతో బీజేపీ ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా  అనపర్తి  నియోజకవర్గంతమకు కేటాయించాలనీ, అక్కడ నుంచి నుంచి సోము వీర్రాజును పోటీకి దింపుతామని బీజేపీ కోరుతోంది. అయితే ఇందుకు తెలుగుదేశం అంగీకరించే పరిస్థితులు లేవు. ఏది ఏమైనా పొత్తులో భాగంగా తమ కోటాకు వచ్చే స్థానాలలో ఎక్కడో ఒక చోట నుంచి సోము వీర్రాజును పోటీలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం శ్రేణుల భయం ఏమిటంటే.. సోము వీర్రాజు ఏ స్థానం నుంచి పోటీ చేసినా అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయం. తెలుగుదేశం, జనసేన ఓట్లు ఆ నియోజకవర్గంలో బీజేపీకి ట్రాన్స్ ఫర్ కావడం అసాధ్యం. అయితే సోము వీర్రాజును కూటమి అభ్యర్థిగా అంగీకరించాల్సిన పరిస్థితి కచ్చితంగా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.   తెలుగుదేశం, జనసేనలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే పొత్తులో భాగంగా తమకు దక్కిన స్థానాలలో బీజేపీ నిలపాలన్న అవగాహనకు తూట్టు పొడిచే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవడంలో భాగంగానే జనసేన కొన్ని స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసిందనీ, తెలుగుదేశం కూడా సాధ్యమైనన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను తన రెండో జాబితాలో గురువారం (మార్చి 14) ప్రకటించనుందనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల చిన్నపాటి అసంతృప్తి, అసమ్మతి వ్యక్తమైనా మొత్తం మీద మూడు పార్టీల పొత్తు తరువాత ఓట్ ట్రాన్స్ ఫర్ విషయంలో ఉన్న అనుమానాలు చాలా వరకూ పటాపంచలైపోయాయని చెబుతున్నారు. 

మై హోమ్ పై రేవంత్ కొరడా 

మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యంపై రేవంత్ స‌ర్కార్ లాఠీ ఝుళిపించింది. గత పదేళ్లుగా మేళ్లచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని 150 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నోటీసులు జారీ చేశారు.   మేళ్లచెరువు రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో 160ఎకరాల భూదాన్ భూమి ఉన్నది.  ఇందులోని 113 ఎకరాల భూదాన్ భూమిని మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం, కీర్తి సిమెంట్ పరిశ్రమ 18.20ఎకరాలు, కీర్తి సిమెంట్స్ ఎండి జాస్త్రి త్రివేణి 21.20ఎకరాలు భూమిని ఆక్రమించారు. మరో ఇద్దరు రైతుల వద్ద 3.19ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూములపై గత పదేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా మైహోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. అనేక వివాదాలు తలెత్తాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో భూదాన్ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. భూదాన్ భూముల కబ్జా వెనుక మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హస్తం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ స‌ర్కార్ మేళ్లచెరువు గ్రామ రెవిన్యూ పరిధిని భూదాన్ భూముల ఆక్రమణ పై దృష్టి సారించింది. భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ్ దాన్ చట్టం సెక్షన్ 24A ద్వారా షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈనెల 16న సీసీఎల్ఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మై హోం రామేశ్వర్ రావు దోచుకున్న ప్రతి పైసాను తాను కక్కిస్తానంటోంది రేవంత్‌ స‌ర్కార్‌. మేళ్ల చెరువు కర్మాగారంలో అటవీ చట్టాన్ని పాటించకపోవడం, భూదాన్ భూములను ఆక్రమించుకోవడం, అన్ని చట్టాలను తుంగలో తొక్కి రామేశ్వర్ రావు అక్రమాలకు పాల్ప‌డ్డారు. మాజీ సిఎంతో క‌లిసి మై హోం రామేశ్వ‌ర్‌రావు 4 లక్షల కోట్ల దేశ సంప‌ద‌ను దోచుకున్నార‌ట‌.

బిఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ కిడ్నాప్ కలకలం 

వర్దన్న పేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కిడ్నాప్ కు గురయ్యాడా? స్వచ్చందంగానే హైదరాబాద్ నందినగర్ లో కేసీఆర్ నివాసానికి తీసుకురావడానికి బిఆర్ఎస్ నేతలు ప్రయత్నించారా? వంటి ప్రశ్నలు తెలంగాణాలో హాట్ టాపిక్ అయ్యింది. బిఆర్ఎస్ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్యలు అరూరి రమేష్ ను వరంగల్ లో ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు  ఎర్రబెల్లి, బసవరాజు సారయ్య ఎంట్రీ ఇచ్చారు ఆరూరి రమేష్ ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసారు. వరంగల్ ఎంపీ స్థానం కోసం ఆయన పోటీ పడుతున్నారని మరో బిఆర్ఎస్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి కూతురు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అరూరి రమేష్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఆరూరి రమేష్ పార్టీ మారకుండా కెసీఆర్ ఆదేశం మేరకు ఈ డ్రామా జరిగినట్టు పొలిటికల్ సర్కిల్స్ లోచర్చ జరుగుతుంది.  లీడర్లు పార్టీ మారకుండా ఆపడంలో బీఆర్ఎస్ కొత్త మార్గాన్ని అన్వేషించింది.  గత బిఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన కెసీఆర్  అరూరి రమేష్ ప్రెస్ మీట్ ను ఫెయిల్ చేసి తమ వెంట తీసుకెళ్లిపోయారు. హరీష్ రావు వచ్చే వరకూ పార్టీ మారే ప్రకటన చేయవద్దని ఆరూరి రమేష్‌పై ఒత్తిడి చేస్తున్నారు.  ఆరూరి రమేష్ బీజేపీ తరపున వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే రెడీ అయిపోయారు. ఆరూరి రమేష్‌ను కిడ్నాప్ చేశారంటూ మధ్యలో బీజేపీ కార్యకర్తలు వారి కారును అడ్డుకున్నారు. ఆయనను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కిషన్ రెడ్డి ఫోన్ చేయడంతో తనను ఎవరూ కిడ్నాప్ చేయడం లేదని .. మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు.  ఆరూరి రమేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారకుండా చేయాలని బీఆర్ఎస్.. తమ పార్టీ తరపున వరంగల్ నుంచి నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ హైడ్రామాను ఆరూరి రమేష్ తెరదించారు. తన పార్టీ కార్యకర్తలతో సమావేశం జరుగుతున్న సమయంలో దయాకర్ రావ్, బసవరాజు సారయ్య వచ్చినట్లు అంగీకరించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. బిఆర్ఎస్ లో కొనసాగుతానన్నారు. 

ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్?!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉంది. దానితో పాటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా నగారా మోగనుంది.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం(మార్చి 12) నాడు త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది,  ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ తెలంగాణ గడ్డపై నుంచి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన 24 గంటలలోగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రెడీ అయిపోయిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు దేశవ్యాప్త సుడిగాలి పర్యటనలు ఇంకా కొనసాగుతుండగానే.. ఉరుములేని పిడుగులా కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం (మార్చి 13)సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  దీంతో దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలూ అలర్ట్ అయ్యాయి. ఎన్నికల తేదీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం వార్త పెను తుపానునే సృష్టించింది. ఏపీలో ఎన్నికలు తొలి విడతలోనే జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో పార్టీలు ఎన్నికల తేదీలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.  అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో రూపకల్పనపై ఇంకా కసరత్తులలోనే ఉన్న పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ప్రకటనతో  ఒక్కసారి కంగుతిన్నాయి.  ఇప్పటికే రోహిణీకార్తె ఎండలను తలపిస్తున్న ఎన్నికల హీట్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేస్తే మరింత పెరగడం ఖాయం. మొత్తం మీద గత ఎన్నికలలో  అంటే 2019లో మార్చి 10వ తేదీన షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి మూడు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటిస్తున్నదని భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకా? లేక జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై నిర్ణయాన్ని ప్రకటించడానికా అన్నది మరి కొద్ది సేపటిలో తేలిపోనున్నది. 

పద్మనాభం.. ఉత్తరాల కుమారుడేనా?.. నవ్వుల పాలౌతున్న ముద్రగడ!

ముద్రగడ పద్మనాభం. రాజకీయాలతో కనీస పరిజ్ణానం ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆ పేరు చిరపరిచితమే. కాపు జాతి ఉద్ధరణకే జీవితాన్ని అంకితం చేశానని తనకు తాను ప్రకటించుకునే  ముద్రగడ విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత మాత్రం  తాను ఉద్ధరిస్తానని చెప్పుకునే కాపు జాతికి దూరం దాదాపుగా ఆయన అయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారమయ్యారు. ఔను కాపులకు రిజర్వేషన్ల విషయంలో జగన్ కుండబద్దలు కొట్టినట్లు అది సాధ్యమయ్యేపని కాదని తేల్చేసిన తరువాత కూడా పన్నెత్తు మాట అనక పోవడమే కాకుండా.. ఇంకా ఆయననే వెనకేసుకు వస్తూ.. చట్టపరమైన ఇబ్బందులు ఏవీ ఎదురుకాకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన చంద్రబాబును వ్యతిరేకించడమే కాదు, అదే కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు పవన్ కల్యాణ్ నేతగా ఎదుగుతుంటే ఓర్వలేని తనంతో లేఖలు గుప్పించారన్న అభిప్రాయం ఆ సామాజికవర్గ ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది. అసలు   కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మం అంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుకున్న ముద్రగడ తెలుగుదేశం హ‌యాంలో  ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నంత‌కాలం కాపు రిజ‌ర్వేష‌న్లు అంటూ తెగ హ‌డావుడి చేసిన ముద్ర‌గ‌డ, జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఆ ముచ్చటే ఎందుకు ఎత్తలేదని నిలదీస్తున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు రిజ‌ర్వేష‌న్లుకు తాను వ్యతిరేకం అని విస్పష్టంగా ప్రకటించిన జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని ముద్రగడ, ఆ ఎన్నికలలో  ఆయనను గెలిపించేందుకు తనవంతు కృషి చేసి.. కాపు రిజర్వేషన్లు అన్నది కేవలం తన సామాజికవర్గంలో పాపులారిటీని పెంచుకునేందుకే అని చెప్పకనే చెప్పేశారని అంటున్నారుప. అంతే కాకుండా జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తరువాత ఇంత కాలం, కాపు రిజ‌ర్వేష‌న్లు, కాపు ఉద్య‌మం ఊసే ఎత్తని ముద్రగడపై   కాపు సామాజిక వ‌ర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.    అదే సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదుగుతుండటం, అన్ని వర్గాలకూ న్యాయం అన్న ఉద్దేశంతో సాగుతుండటంతో కాపు సమాజికవర్గం యువత ఆయనవైపు మొగ్గు చూపుతున్నది. దీంతో సహజంగా ఇంత కాలం కాపు నేతగా చెలామణి అయిన ముద్రగడకు ఈ పరిణామం నచ్చలేదు. దీంతో ఇప్పటి వరకూ కప్పుకున్న ముసుగు తొలగించి కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని బాహాటంగా ప్రకటించిన జగన్ పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. తనకు కాపు సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందని భావించిన ముంద్రగడ.. తాను జగన్ పార్టీలో చేరుందుకు తాడేపళ్లికి భారీ ర్యాలీలో వెడతానని ప్రకటించి, కనీసం పది వేల మంది తమ సొంత వాహనాల్లో ఆ ర్యాలీలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాలు రాయడంలో దిట్ట అయిన ముద్రగడ ఆ విషయం కూడా ఒక బహిరంగ లేఖ రూపంలోనే ఇచ్చారు. అయితే ఆయన ఊహలు తల్లక్రిందులయ్యాయి. ఆయన వైసీపీలో చేరే సందర్భంగా ర్యాలీగా ఆయన వెంట రావడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ పిలుపు ఉపసంహరించుకోకుంటే అభాసుపాలు కావడం ఖాయమని గ్రహించిన ముద్రగడ.. ఆ పిలుపు ఉపసంహరణతో పాటు వైసీపీ చేరిక ముహూర్తాన్ని సైతం మార్చేసుకున్నారు.  భారీ సంఖ్యలో మద్దతుదారులతో వెళ్లడం ముఖ్యమంత్రి భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందన్న సమాచారంతో తాను ర్యాలీని విరమించుకున్నాననీ, తాను ఒక్కడినే, ఒంటరిగా తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాననీ ఓ  బహిరంగ లేఖ రాసేశారు. ర్యాలీకి మీ ఏర్పాట్లు మీరే చేసుకుని పెద్ద సంఖ్యలో తరలిరండి అంటే లేఖ రాసిన రోజుల వ్యవధిలోనే ఎవరూ రావద్దు ఒంటరిగానే వెడతానంటూ ముద్రగడ రాసిన లేఖ నవ్వు పుట్టించడమే కాకుండా ఆయనను నవ్వుల పాలు కూడా చేసేసింది. అంతా కాదు ఇంకా ఆయనను నమ్ముతున్న అతి కొద్ది మంది కాపు సామాజికవర్గానికి చెందిన వారికి ముద్రగడ వెనుక ఎవరూ లేరన్న విషయాన్నీ తేటతెల్లం చేసేసింది.  అన్నిటికీ మించి జనంలోకి రాకుండా కేవలం లేఖలద్వారా పాపులారిటీ కోల్పోకుండా చూసుకోవచ్చన్న ఆయన ఎత్తుగడ.. ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో నవ్వులు పూయిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత హ్యూమర్ ను పూర్వపక్షం చేసేసి మాంఛి కామెడీ పండిస్తోంది.  

హైదరాబాద్ లో బిఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యారావుపై దాడి.. ప్లెక్సీ వివాదమే కారణం 

హైదరాబాద్ నగరంలో  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు తీసుకురాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దూసుకుపోయినప్పటికీ రాజధానిలో కాంగ్రెస్ చతికిలపడిపోయింది. వెంగళరావ్ నగర్ జూబ్లిహహిల్స్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది.  సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గత ఎన్నికల్లో గెలుపొందారు. వెంగళ రావ్ నగర్ కార్పోరేటర్ కూడా బిఆర్ఎస్ అభ్యర్థి. మాజీ రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ వర్గీయులు ఆమెపై దాడి చేయడం సంచలనమైంది. ప్లెక్సీ వివాదం ఈ దాడికి దారి తీసింది. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై గతరాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను ఆమె ఆదేశించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేత మద్దతుదారులైన మహిళలు వెంగళరావునగర్ చేరుకుని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అప్రమత్తమైన దేదీప్యారావు మద్దతుదారులు అక్కడకు చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు భౌతికదాడికి దిగాయి. ఈ గొడవతో కారు నుంచి కిందకు దిగిన కార్పొరేటర్‌పైనా మహిళలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు తీర్పు

2018లో  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్ రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రెండు సార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.  తొలి సారి వచ్చిన ఫలితాలను వెలువరించకుండా రెండో సారి మళ్లీ మూల్యాకనం చేయించి తమకు కావలసిన వారిని ఎంపిక చేసి ఎపీపీఎస్సీ ఫలితాలను వెలువరించిందని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.  ఆ పిటిషన్ విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బుధవారం (మార్చి 13) తీర్పు వెలువరించింది. గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రెండు సార్లు మూల్యాకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. 

వివేకా వర్ధంతి రోజున సునీత రాజకీయ ప్రకటన?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురై ఎల్లుండికి ( మార్చి 15)  ఐదేళ్లు  పూర్తికానున్నాయి.  ఈ సందర్భంగా వివేకా ఐదో  వర్ధంతి కార్యక్రమాలు కడప కన్వెన్షన్ సెంటర్ లో  జరుగుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  వీటిలో పాల్గొంటున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి  కీలక వ్యాఖ్యలు చేయనున్నారు. తన రాజకీయ అరంగ్రేటం ప్రకటించనున్నారు.  ఏపీలో మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి ఐదేళ్ల  క్రితం అంటే 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్య ఎవరు చేశారనే దానిపై సీబీఐ ఐదేళ్లుగా  విచారణ జరుపుతున్నా ఇంకా అసలు హంతకులు తేలలేదు. మరోవైపు తన తండ్రి హంతకుల్ని తేల్చేందుకు ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర స్ధాయిలో న్యాయపోరాటం చేస్తున్నారు. అటు విపక్షాలు కూడా వివేకా హత్య కేసును ఎన్నికలకు ముందు చేధించే ప్రయత్నాలు  చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఆయన ఐదో  వర్ధంతి వచ్చింది.వివేకా వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి స్పందించే అవకాశం ఉంది. నాన్నను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సునీత పదే పదే చెబుతున్నారు. . ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని, కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. వివేకానంద్ రెడ్డి సోదరుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆమె పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం తన సోదరి సునీతకు సపోర్ట్ చేయడంతో  ఐదో వర్దంతి రోజు  అంటే వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఆమె ఏం బాంబు పేల్చుతుందో అని జగన్ పార్టీ హైరానా పడుతుంది.   

విడదల రజనీ కాదు.. వసూళ్ల రాణి!

తమ పార్టీ నేతల అక్రమాలు, అవినీతి బాగోతాలపై విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చే ప్రశక్తే లేదంటున్నారు వైసీపీ నాయకులు. మా పార్టీ నేతల అవినీతి బాగోతం గురించి తామే చెబుతాముంటూ ముందుకు వస్తున్నారు.  వైసీపీలో విభేదాలు వేరే లెవల్ కు చేరుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆ పార్టీలోని వర్గవిభేదాలు రచ్చకెక్కడం వెనుక పార్టీ అధినేత వైఎస్ జగన్  తీరే కారణమని పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎవరినీ నమ్మలేకపోవడం, తనపై తప్ప మరెవరిపై విశ్వాసం లేకపోవడం, అన్నిటికీ మించి వైసీపీ అభ్యర్థిగా ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడితే విజయం సాధించగలరు అన్న అంచనాలలో జగన్ వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అడ్డగోలుగా, హేతు రహితంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ మొదలు పెట్టిన ప్రయోగం మొదటికే మోసం తీసుకు వచ్చేలా ఉందని అంటున్నారు. సిట్టింగుల మార్పు విషయంలో కూడా ఒక విధానం, రీతి, తీరు లేకుండా ఆయన చేస్తున్న విన్యాసాలు అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ విజయావకాశాలను మరింత దిగజార్చేస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా  చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వ యకర్తే పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరువును నిండా గంగలో ముంచేశారు. పార్టీ హైకమాండ్ కే అల్టిమేటమ్ జారీ చేశారు. పనిలో పనిగా మంత్రి విడదల రజనీపై ఆరోపణలు విమర్శలూ గుప్పించేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జలనూ ముగ్గులోకి దించారు. మంత్రి రజనీ వసూళ్ల బాగోతం సజ్జలకు తెలుసునని బాంబు పేల్చారు.  విషయానికి వస్తే చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనీని చిలకలూరి పేట నుంచి మార్చి ఆమను గుంటూరు వెస్ట్ నుంచి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేష్ నాయుడిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే ఉద్దేశంతో ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త  బాధ్యతలను అప్పగించారు. తాజా సమాచారం ప్రకారం మల్లెల రాజేష్ నాయుడిని కూడా మార్చి మరో వ్యక్తిని అక్కడ నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మల్లేల రాజేష్ నాయుడు  తన నాయకత్వ మార్పు పై వచ్చే వార్తల పై పార్టీ కార్యకర్తలతో, తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి మంత్రి విడుదల రజని వసూళ్ల రాణి అంటూ విమర్శలు గుప్పించారు. తన వద్ద నుండి ఆరున్నర కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు  సజ్జల దగ్గర పంచాయితీ కూడా జరిగిందనీ, ఆ తరువాత ఆమె  3 కోట్లు వెనక్కి  ఇచ్చారనీ, మిగిలిన మొత్తం కూడా ఇచ్చే తీరాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా చిలకలూరి పేట నుంచి పోటీ చేస్తే విడదల రజనీ గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు కనుకనే జగన్ ఆమెను గుంటూరుకు పంపేశారన్నారు. దమ్ముంటే ఆమె చిలకలూరి పేటలో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఇక పార్టీ హైకమాండ్ తనకు కాకుండా మరొకరికి పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక కూడా జారీ చేశారు. తనను కాదని మర్రి రాజశేఖర్ ను చిలకలూరిపేట అభ్యర్థిగా నిలబెడితే సహకరిస్తాననీ, అయితే తమ ఇద్దరినీ కాకుండా మరో వ్యక్తిని తీసుకువస్తామంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.  పార్టీ అధినేత సిద్ధం అంటూ విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తుంటే..  సొంత పార్టీ నేతలు మాత్రం అంతర్గత పోరాటానికే తాము సిద్ధంగా ఉన్నామనీ, అది తేలిన తరువాతే ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతామని విస్ఫష్టంగా తేల్చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క చిలకలూరి పేటకు మాత్రమే పరిమితమై లేదనీ, జగన్ సిట్టింగుల మార్పు తంత్రంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజాపై సొంత పార్టీ నాయకులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  మాప్రభుత్వంలో అవినీతి లేదంటూ   ముఖ్యమంత్రి  చెబుతుంటే.. సొంత పార్టీ నేతలే వైసీపీ మంత్రుల అవినీతి బండారాన్ని బయటపెడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో సొంత పార్టీలోని సమస్యలను పరిష్కరించకుండా సిద్ధం అంటూ చొక్కా చేతులు మడతపెట్టినంత మాత్రాని ఎన్నికల రణరంగానికి రెడీ అయిపోయినట్లు కాదని వైసీపీ శ్రేణులే అంటున్నారు. 

బిఆర్ఎస్ కు షాక్ ... వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కమలం గూటికి? 

బిజెపి  బీ టీం బిఆర్ఎస్ అని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.  కానీ ఎన్నికల ఫలితాలు ఈ రెండు పార్టీలు తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోలేకపోయాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 100 రోజులు కావాల్సి వస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు కొందరు చూడటం లేదు. కాబట్టి వాళ్లు కమలం గూటికి చేరుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒకదాని తర్వాత ఒకటిగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల్లో కొందరు ‘కారు’దిగి ‘చేయి’ అందుకుంటుంటే, మరికొందరు ‘కమలం’ గూటికి చేరుతున్నారు. తాజాగా, మరోనేత బీజేపీలో చేరికకు రంగం సిద్దమైంది. వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించిన రమేశ్.. ఇటీవలి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గుచూపినా ఆ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపు అసాధ్యమని భావించి కారు దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 4,5 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన సమయంలోనే ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే, విషయం తెలిసి పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఒత్తిడి పెంచడంతోపాటు కడియం శ్రీహరి వంటి నేతలు బుజ్జగించడంతో చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు.  ఇప్పుడు మాత్రం పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. విషయం తెలిసి పార్టీ నేతలు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని తెలిసింది. నేటి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న ఆయన సాయంత్రం కేంద్రం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పార్టీ చేరికపై ఇప్పటికే అనుచరులు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలిసింది.  

ప్యాలెస్‌ జగన్నాథం..!

తాడేపల్లిలో ఓ ప్యాలెస్, హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో ఒక ప్యాలెస్, బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంలో యహలంకలో మరో ప్యాలెస్, కడప జిల్లా పులివెందులలో ఇంకో ప్యాలెస్, విశాఖ రిషికొండలో లేటేస్ట్‌గా ఓ ప్యాలెస్  ఇలా ప్యాలెస్ పేర్లు చెప్పగానే అందరికీ చటుక్కన గుర్తుకు వచ్చే పేరు  జగన్.  ఇలా జిల్లాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు చూడకుండా.. నిర్మించిన ప్యాలెస్‌లన్నీంటికి ఒకే ఒక్క యజమాని  వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  జగన్. ఎకరాలకు ఎకరాల్లో ఈ ప్యాలెస్‌లన్నీ కోట్లాది రూపాయిలు వెచ్చించి మరీ నిర్మించారు.   అయితే వీటిలో కొన్ని ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. నిర్మించిన ఫ్యాలెస్‌లు కొన్ని అయితే.. ఆయన గతించిన అనంతరం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా తాడేపల్లిలో ఓ ప్యాలెస్‌ నిర్మించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన.. రిషి కొండపై ఇంకో ప్యాలెస్ నిర్మించారు. ఆయన ఏ స్థానంలో ఉన్నా అంటే   ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నా,  ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన స్థాయి మాత్రం  ప్యాలెస్‌లో కింగ్ అన్నట్లుగానే ఉందనే ఓ బలమైన ముద్ర అయితే జనంలో పడిపోయింది.  రాజధాని అమరావతి ప్రాంతానికి కూత వేటు దూరంలో తాడేపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ప్యాలెస్ నిర్మించుకున్నారని... రాజధాని అమరావతికి మద్దతుగానే ఆయన ఇక్కడ నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నారనీ ఆ పార్టీలోని కీలక నేత ఆర్కే రోజాతోపాటు పలువురు నేతలు  అప్పట్లో  ప్రకటించారు.  అయితే జగన్ అధికారంలోకి రావడంతోనే.. మూడు రాజధానుల ప్రకటన చేసి, కార్య నిర్వాహక రాజధాని విశాఖపట్నం అంటూ.. సాగర తీర నగరంలోని రుషి కొండకు బొడి గుండు కొట్టించి మరీ ఆ కొండ మీద వందల కోట్ల రూపాయిల ప్రజా ధనంతో భారీ ప్యాలెస్   నిర్మించారు.  అయినా రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా?.. ప్రభువు తలుచుకుంటే ప్యాలెస్‌లకు కొదవా? అన్నట్లుగా  జగన్ వైఖరి ఉందని  జన బాహుళ్యంలో  ఒక అభిప్రాయం అయితే బలంగా వ్యక్తం అవుతోంది. వివిధ వేదికల మీద నుంచి ఆయన చేసే ప్రసంగాలు ఆయన వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్‌కు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంటాయని కూడా జనం నవ్వుకోవడం కద్దు.  ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో.. అంటూ ఆయన వివిధ సభల్లో  జగన్ తరచు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. పేదలు ఎవరు?.. పెత్తందార్లు ఎవరు? అనే అర్ధాన్ని ముందు ఆయన తెలుసుకొంటే మంచిదని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటారు కూడా. అయినా.. ఉండీ దరిద్రం లేకా దరిద్రం అంటే ఇదే నేమో , ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... నాలుగు కాదు.. ఏకంగా అయిదు ప్యాలెస్‌లు... అవి కూడా లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే ప్యాలెసులు.. ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా నిర్మితమై ఉన్నాయని.. అవి కూడా ముఖ్య నగరాల్లో ఉన్నాయి. ఒకరికి ఒక ఇల్లు ఉంటుంది. మరికొందరికీ రెండు ఇళ్లు ఉంటాయి.. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మాత్రం.. ఇలా అయిదు రాజ ప్రసాదాలు ఉన్నాయి. దేశ ప్రధమ మహిళ భారత రాష్ట్రపతికి దేశ రాజధాని హస్తినలో రాష్ట్రపతి భవన్ పేరుతో ఒక నివాసం ఉంటే.. భరత రాష్ట్రపతికి వేసవి విడిది కేంద్రాలు.. అటు హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఒకటి.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరోకటి ఉన్నాయి. అయితే అవి   ప్రభుత్వానివి. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మాత్రం ప్రాంతానికి ఒకటి .. రాష్ట్రానికి ఒకటి అన్నట్లుగా ప్యాలెస్‌లు ఉన్నాయి. ఆయన పేదరికం గురించి మాట్లాడటమేంటని జనం విస్తుపోతున్నారు. ఒక సామాన్య కుటుంబానికి ఒక ఇల్లు.. అంటే సింగిల్ బెడ్ రూమ్ లేదా డబుల్ బెడ్ రూమ్ ఉంటే.. ఆ ఇంటిని మేయింటేన్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని.. వైయస జగన్ మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు నిర్మిస్తూ.. వాటి  మెయింటినెన్స్‌కు చేస్తున్న ఖర్చులను ఓ సారి పరిశీలిస్తే.. కళ్లు బైర్లు కమ్మి.. సొమ్మసిల్లి పడిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు.     అయినా కష్టించి పని చేస్తేనే.. తిన్న ఆహారం రక్తంలోకి ఇంకుతోందనే విషయాన్ని జమానాలోనే జనం మరిచిపోయారని... అలాంటి వేళ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. ఊళ్లుకు ఊళ్లు కొట్టేస్తూ.... ఇళ్లుకు ఇళ్లు.. కట్టేస్తూ..  ప్యాలెస్‌లకు ప్యాలెస్‌లు నిర్మిస్తుంటే.. ప్రశ్నించేదెవరు? అడ్డగించేదెవరు?  అడ్డు పడేద్దెవరు,  అయినా జగన్ అధికారంలోకి రాగానే.. తన నివాసానికి సీసీ కెమెరాలు, మరమ్మతుల రూపేణా ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వెచ్చించిన సంగతి అందరికీ తెలిసిందేనని.. ప్రజల చే, ప్రజల కోరకు, ప్రజలే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఓ అమాయకుడిలా..  ప్రజా ధనాన్ని ఇలా.. ఇంత నిర్లజ్జగా.. వాడేస్తుంటే.. ఇది తప్పు అని ప్రశ్నించే వారే లేకపోవడంపై సర్వత్రా  అవేదన వ్యక్తమవుతోంది.

ఇక టీఎస్ కాదు టీజీయే!

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ లో ఇక నుంచి టీఎస్ కు బదులుగా టీజీ వాడుకలోకి రానుంది. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన  జరిగిన కేబినెట్ భేటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.   ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదానికి పంపింది. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ కాకుండా టీజీ అని ఉపయోగించేందుకు కేంద్రం సైతం ఆమెదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీకి మార్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఇక నుంచి తెలంగాణలో రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ కోడ్ ఉంటుంది. అయితే ఈ మార్పు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే వర్తిస్తుంది. ఇప్పటికే టీఎస్ కోడ్ తో రిజిస్టర్ అయి ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లలో ఎటువంటి మార్పూ ఉండది. అవి అలాగే కొనసాగుతాయి. తెలంగాణ ఆవిర్బావం నుంచీ కూడా ఈ డిమాండ్ ఉంది. అయితే ఇప్పటికి కేంద్రం నుంచి అనుమతి లభించింది. 

చంద్రబాబుకు ఇక తిరుగు లేదు!

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.  ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో   పార్టీలు ఓట‌ర్‌ల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల ముంగిట పార్టీలన్నీ ఫుల్ బిజీ అయిపోయాయి.  ప్రతిపక్ష తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌తో  షెడ్యూల్‌కు ముందే మ్యాజిక్ ఫిగ‌ర్ అందుకుని టీడీపీ కూట‌మి విజ‌యం వైపు ప‌రుగులు పెడుతోంది.   ఏపీ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం చూస్తే తెలుగుదేశం దూకుడు మామూలుగా లేదని తేటతెల్లమౌతోంది.  తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవ‌డ‌మే కాదు వ్యూహాత్మ‌కంగా వెళ్ళుతూ గెలుపు దిశ‌గా ప‌రుగులు పెడుతోంది.  గతానికి భిన్నంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు అందరినీ కలుపుకునిపోతున్నారు. జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా టీడీపీ కూట‌మి అడుగులు ధృఢంగా ప‌డ్డాయ‌ని చెప్ప‌వ‌చ్చు.      తెలుగుదేశం పార్టీ  144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నది.  భారతీయ జనతా పార్టీ  10 అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది.  జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో  రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. బిజెపి ప్ర‌భావం = (6 x 7) 42 + 10 = 52 జ‌న‌సేన ప్ర‌భావం (2 x 7) 14 + 21 = 35 = 87  మ్యాజిక్ ఫిగ‌ర్ 88 దాదాపుగా రీచ్ అయిన‌ట్లే... అంటే టీడీపీ గెలుపు అనేది ఇక్కడే  స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  అయితే ఎంత మెజార్టీ అనేదే తెలాల్సి వుంది. టీడీపీ కూట‌మి భారీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకోబోతోందనేది తేలిపోయింది.   గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం చేశారు.  అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల  బాధ్యతలు చేపట్టారు. వాస్త‌వానికి గ‌తంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు  వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్లింది.  అయితే  వైసీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ పార్టీ వైపునకు తెచ్చేందుకు  కాంగ్రెస్ వ్యూహలు రచిస్తున్నది.   కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగితే   వైసీపీకి భారీగా న‌ష్టం వాటిల్లుతుంది.  రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలున్నాయి.  గత ఎన్నికల్లో  టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది.  ఈసారి రాయలసీమలో జగన్ ను దెబ్బకొట్టి కనీసం ముప్పయి స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో  పనిచేస్తున్నారు.  గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురరంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి మాత్రమే టీడీపీ విజయం సాధించింది.  కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు.  అయితే ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచి జగన్ ను దెబ్బతీయాలన్న ప్లాన్ లో  తెలుగుదేశం ఉంది.  నాలుగు జిల్లాల్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈసారి  తెలుగుదేశం అధిక స్థానాలను సాధించేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు  అంచనా వేస్తున్నారు.  ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తెలుగుదేశంకు కంచుకోట. అక్కడ వైసీపీని సులువుగానే దెబ్బతీయవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటూ జనసేనతో పొత్తు ఉంది కాబట్టి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన పనిలేదు.  ఆ పనిని తన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ చూసుకుంటారు.  ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పది నుంచి పదిహేను స్థానాలకు పైగా సాధిస్తే అధికారం చేతుల్లోకి వచ్చి పడినట్లే. అందుకోసమే ఆయన గెలుపునకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అక్కడ ఎక్కువ నిధులను కుమ్మరించేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందంటున్నారు.  మొత్తం మీద చంద్రబాబు ఇటు కులాల వారీగా, ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగారు. 1999లో బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. సక్సెస్ అయ్యింది.  2004లో మాత్రం పొత్తు పెట్టుకుని ఓడిపోయింది.  2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. అప్పుడు కూడా ఓటమి ఎదురైంది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుంది. గెలుపు సాధించింది.  అయితే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే సమయంలో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగినప్పుడు మాత్రం ఆ పార్టీ గెలుపు బాట పట్టింది. లేనప్పుడు ఓటమి ఎదురైంది. 2009లో ఉమ్మడి ఏపీలో టిడిపి మహాకూటమితో కాంగ్రెస్ ను ఢీ కొట్టింది.  టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది.  కానీ ఓటు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అంటే ఓట్ల బదలాయింపు జరగలేదు. టిడిపి సీట్ల పరంగా మెరుగుపడినా..  భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్ల బదలాయింపు జరగక అధికారాన్ని అందుకోలేకపోయింది.  2004లో 47 స్థానాలతో ఉన్న టిడిపి  2009 నాటికి 92 స్థానాలకు చేరుకుంది.  కానీ 2004లో 37.59% ఉన్న టిడిపి ఓటు బ్యాంక్  2009 నాటికి 28.12 కు పడిపోయింది.  భాగస్వామ్య పక్షాల నుంచి ఓట్ల బదలాయింపు జరగకపోవడమే ఇందుకు కారణం.  నాడు ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగి ఉంటే టిడిపి ఆధ్వర్యంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చి ఉండేది. దీంతో గ‌త అనుభ‌వాల్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ల బదలాయింపు చంద్ర‌బాబు దృష్టి పెట్టారు.  2009 ఎన్నికల గుణపాఠంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా ప్రత్యర్థులకు విడిచిపెట్టడం లేదు.

ఏపీ ఎన్నికల్లోనూ బర్రెలక్కలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో ఆమె విజయం సాధించలేదు. అలాగని అధికార పార్టీ అభ్యర్థికి చెమట్లు పట్టించేంత పోటీ కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 15 వేల ఓట్లు వచ్చాయి. అయితే తన పోటీ ద్వారా ఆమె అధికార పార్టీ పునాదులను కదిలించింది. ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసినా, ఆమె పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులు, ఆమె లేవనెత్తిన అంశాల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిగింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ప్రభావితం చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం.. ఇప్పుడు ఏపీ ఎన్నికలలో  జగన్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలకు బాధితులై న నలుగురు అసెంబ్లీ పోరులో నిలబడుతున్నారు. పరిశీలకులు ఈ నలుగురూ కూడా ఏపీ ఎన్నికలపై తమదైన ప్రభావాన్ని చూపగలరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్క పోటీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అక్కడి అధికార పార్టీపై ప్రతికూలంగా పడిందో.. ఏపీ ఎన్నికలలో ఈ నలుగురి పోటీ అలాగే జగన్ సర్కార్ పై జనంలో ప్రతికూలత మరింత పెరిగేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇంతకీ తెలంగాణలో బర్రెలక్క చూపినట్లుగా ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ప్రొది కావడానికి దోహదపడే ఆ నలుగురూ ఎవరంటారా?.. ఆ విషయం చెప్పుకునేముందు గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల ప్రచారం.  ఇప్పుడు ఆ ముగ్గురూ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడనున్నారు. వీరితో పాటుగా గత ఎన్నికల ముందు హత్యకు గురైన వివేకా కుమార్తె సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు కడప పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఇక వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా జగన్ ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు.  ఈ నలుగురే తెలంగాణ ఎన్నికలలో బర్రెలక్క పోటీ  అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాగైతే ఓటమి బాటను చూపిందో.. వీరు జగన్ సర్కార్ కూడా అదే బాట పట్టడానికి దోహదపడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఔను కోడికత్తి శీను జై భీమ్ పార్టీలో చేరి కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పోటీలో నిలవనున్నారు. వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖరారైంది. అలాగే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ సర్కార్ ను చెరిగి పారేస్తున్నారు. ఆమె కూడా ఎన్నికల బరిలో నిలుచుంటారు. చివరిగా దస్తగిరి కూడా జైభీమ్ పార్టీలో చేరి పులివెందుల బరిలో దిగేందుకు రెడీ అయిపోయారు. వీరు నలుగురూ గెలిచినా, ఓడినా వీరి పోటీ ప్రభావం మాత్రం రాష్ట్రం మొత్తం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టీకానికి వీరు నలుగురూ కూడా బాధితులే కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు.