ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడికి కాంగ్రెస్ తీర్థం
posted on Mar 9, 2024 @ 10:48AM
రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుని అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మూడెనెలలు పూర్తయ్యింది. ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలను ఇప్పటివరకు అమలు చేసిన ఆ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరగుతోంది. బిఆర్ఎస్ నేతలు పెట్టా బేడా సర్దుకుని కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతూ... కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీరు ఈరోజు కలవనున్నారు. మరోవైపు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మార్నేని రవీందర్ రావు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.