అప్పుడు ఓవర్ యాక్షన్.. ఇప్పుడు కాళ్లబేరం!
posted on Mar 9, 2024 @ 11:31AM
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. కాలేజీలు పెట్టా.. సక్సెస్ అయినా. ఈ ఒక్క లైన్ వినగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గుర్తుకొస్తారు. బీఆర్ ఎస్ అధికారంలో కొనసాగినన్ని రోజులు మల్లారెడ్డి హవాయే వేరు. ఆయన ఏది మాట్లాడినా చెల్లుబాటయ్యేది.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. అంతేకాదు, కబ్జాలు, భూ దందాల ఆరోపణలు వచ్చినా మల్లారెడ్డిని టచ్ చేసేందుకు అధికారులు సైతం భయపడేవారు.. దీంతో అధికారం తలకెక్కించుకున్న మల్లారెడ్డి, ప్రతిపక్షంలోఉన్న రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రారా చూసుకుందాం అంటూ సవాళ్లు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు.. నా దగ్గర డబ్బుంది.. కాంగ్రెస్ పెద్దలను మేనేజ్ చేస్తా.. తెలంగాణలో ఎవరు సీఎంగాఉన్నా నన్నేమీ చేయలేరు అంటూ మల్లారెడ్డి ఓవరాక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడానికి పెద్ద సమయం పట్టదని మల్లారెడ్డి గుర్తించలేక పోయారు.
మాల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం.. నేటి రాజకీయ నేతలకు ఓ పాఠం అనికూడా చెప్పొచ్చు. అధికారంలో ఉన్నాం.. మనం ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని చాలా మంది రాజకీయ నేతలు ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ అధికారం పోయిన తరువాత వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రత్యర్థులు రెడీగా ఉంటారని అనుభవంలోకి వచ్చే దాకా గుర్తించరు. గత ఐదేళ్లుగా మల్లారెడ్డి చేసిన అతికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితిలో ఆయన పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మల్లారెడ్డి భూకబ్జాల వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి కాలేజీలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనాలు నిర్మాణం చేశారని గుర్తించిన అధికారులు ఆ భవనాలను కూల్చేశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అవి అక్రమ కట్టడాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకదు. అయితే ఇప్పుడు అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తే సీఎం కుర్చీలో కూర్చోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలో రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుకు దుమ్ముదులిపి ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన భవనాలను అధికారులు దగ్గరుండి కూల్చేశారు.
మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, మా భూములను లాక్కొన్నారనీ పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫిర్యాదులపై దృష్టిసారించింది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై ముప్పేట దాడిచేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారంలో ఉన్న సమయంలో అతిగా ప్రవర్తించానని తెలుసుకున్న మల్లారెడ్డి.. ప్రస్తుతం తన ఆస్తులను కాపాడుకునేందుకు కాళ్ల బేరానికి దిగినట్లు తెలిసింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తాడని మల్లారెడ్డి ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వచ్చారు.. బీఆర్ఎస్ అధిష్టానం సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా మల్లారెడ్డి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.. అంతేకాదు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి నా కొడుక్కు ఎంపీ టికెట్ వద్దు అంటూ మొరపెట్టుకున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పేట దాడి నుంచి తప్పించుకునేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డిలు కలిసి తమ బాధను వెళ్లబోసుకున్నారని తెలిసింది. మొత్తానికి మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓవరాక్షనే .. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. అంతే కాదు.. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆయనకు మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు.
మాజీ మంత్రి మల్లారెడ్డి తాజా వ్యవహారం మొత్తాన్ని ఓసారి గమనిస్తే.. తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుగా ఉందన్న వాదన తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అధికార మత్తును నెత్తికెక్కించుకుంటే ప్రతిపక్షంలోకి వచ్చాక ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎక్కువ దృష్టిసారించాలని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ప్రస్తుతం మల్లారెడ్డికి ఎదురైన అనుభవమే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా పద్దతిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ.. అక్రమ కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎటుచూసినా ప్రతిపక్షాలపై కక్షపూరిత వేధింపులే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోతే.. జగన్, అధికారం మత్తులో ఓవరాక్షన్ చేస్తున్న వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లోని జరుగుతోంది.