ఢిల్లీలో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్

      దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. నగరం నడిబొడ్డున రైల్వేస్టేషన్‌వద్ద ఆరుగురు దుండగులు డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదలక ఆమెవద్ద ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, వైద్య పరీక్షకు నిరాకరించి దర్యాప్తులో సహకరిస్తానని హామీ ఇచ్చి స్వదేశం వెళ్లిపోయారు.   వివరాలిలా ఉన్నాయి... ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో ఒక హోటల్‌లో బసచేసిన ఆమె, మంగళవారం కన్నాట్‌ప్లేస్‌లో మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత హోటల్‌కు దారి మరచిపోయి కొందరి సాయం కోరారు. ఇదే అదనుగా దుండగులు ఆమెను తప్పుదోవ పట్టించి నిర్మానుష్యంగా ఉండే డివిజనల్ రైల్వే ఆఫీసర్ల క్లబ్ పరిసరాలకు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించి నగదు, ఐపాడ్, ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. అంతటితో వదలక సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె తంటాలుపడి రాత్రి 7:30 గంటలకు హోటల్ చేరుకుని, సహ పర్యాటకులకు సంఘటన గురించి వివరించారు. అనంతరం హోటల్ మేనేజర్ పోలీసులను పిలిపించగా, వారు ఆమె ఫిర్యాదు స్వీకరించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షకు తీసుకెళ్తామని కోరగా ఆమె నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను డెన్మార్క్ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. అటుపైన బుధవారం మధ్యాహ్నం స్వదేశం వెళ్లిపోతూ తదుపరి దర్యాప్తులో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మిగిలినవారినీ అరెస్ట్ చేస్తామని అధికారులు చెప్పారు.  

బాలకృష్ణ రాజ్యసభకు పోటీ చేయబోతున్నారా?

  వచ్చేఎన్నికలలో కృష్ణాజిల్లా నుండి శాసనసభకు పోటీచేయలనుకొన్ననందమూరి బాలకృష్ణను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు బహుశః రాజ్యసభకు పంపేందుకు ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర విభజన ను వ్యతిరేఖిస్తూ ఆయన సోదరుడు హరికృష్ణ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో బాలకృష్ణ పేరును ప్రతిపాదించినట్లయితే పార్టీలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేరు. అంతే గాక, రాజ్యసభ సీటుకోసం పార్టీలో పోటీని కూడా నివారించవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ, రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్న బాలకృష్ణ మరి అందుకు అంగీకరిస్తారో త్వరలోనే తెలిసిపోతుంది.

ఎన్నికల తరువాత చిరంజీవి రాజకీయాలకు రామ్ రామ్?

  సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్నమెగాస్టార్ చిరంజీవి, తను పార్టీ పెట్టడమే తరువాయి నందమూరి వారిలా ఏడాది తిరక్కుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చుననే ఆశతో రాజకీయాలలో అడుగుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టి కేంద్రమంత్రి అవగలిగారు. అదేమీ దురదృష్టమో కానీ, కేంద్రమంత్రి పదవిలో ఉన్నమజాని పూర్తిగా అస్వాదించక మునుపే, రాష్ట్ర విభజన అంశం మెడకు చుట్టుకోవడంతో, కష్టపడి ముచ్చటపడి సంపాదించుకొన్న కేంద్రం మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు మాట్లాడినా, సీమాంధ్ర ప్రజల నమ్మకాన్నికోల్పోయారు. అదే కారణంతో తెలంగాణా ప్రజలకు కూడా దూరమయ్యారు.   ఇక ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలే పరిస్థితి లేకపోవడంతో, సీనియర్లే తలోపార్టీ వైపు పరుగులు తీస్తుంటే చిరంజీవి పరిస్థితి ఊహించవచ్చును. పోనీ త్వరలో ముఖ్యమంత్రో మరొకరో పెట్టబోయే కొత్త పార్టీలోకి మారుదామంటే, గతంలో సోనియాగాంధీతో మంచి టచ్చులో ఉన్నపుడు ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా చాలా పిర్యాదులు చేయడంతో, ఆయనతో సంభందాలు దెబ్బతినడం వలన ఆ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. పోనీ కాంగ్రెస్ అధిష్టానాన్నే నమ్ముకొందామన్నా,ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు మోడీ పుణ్యమాని కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేపరిస్థితులు కనబడటం లేదు.   ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా తనకు కలిసిరాని రాజకీయాలలో కొనసాగడం కంటే మళ్ళీ సినీ పరిశ్రమకు తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని తలచారో లేక ఎన్నికల తరువాత ఖాళీగా కూర్చొనే బదులు ఏవో నాలుగు సినిమాలు తీసుకొంటూ పోయిన చోటనే ఉంగరం(పరువు) వెతుకోవడం మేలని భావించారో తెలియదు కానీ, ఎన్నికల తరువాత తన 150వ సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నాని చిరంజీవి తాజా స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్నపేరు ప్రతిష్టలు, లక్షలాది అభిమానులను కేవలం మూడు సంవత్సరాలలో పోగొట్టుకొన్న మెగాజీవికి బహుశః అంతకంటే వేరే దారి ఉండబోదు కూడా!  

ఆమాద్మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా?

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్నమీడియాతో ఆసక్తికరమయిన వ్యాక్యలు చేసారు. వచ్చే ఎన్నికలలో పోటీ ప్రధానంగా ఆమాద్మీ, బీజేపీల మద్యే ఉంటుందని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణకు నోచుకోదని అన్నారు. అవినీతిపరుడయిన ఎడ్యురప్పను తిరిగి పార్టీలో చేర్చుకొన్న బీజేపీ అవినీతి గురించి ఏవిధంగా మాట్లాడగలదని ఆయన ప్రశ్నించారు. ఆయన పోటీ ప్రధానంగా ఆమాద్మీ, బీజేపీల మద్యే ఉంటుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం తమ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది గనుక, ఆయన కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వస్తూ బీజేపీతోనే పోటీ అంటున్నారా? లేకపోతే బీజేపీ విజయావకాశాలను గండి కొట్టేందుకే తాము కాంగ్రెస్ తెరవెనుక మద్దతుతో ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు సంకేతం ఇస్తున్నారా?ఒకవేళ ఎన్నికల తరువాత ఆయన కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతున్నారా?అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏమయినపట్టికీ, ఆయన కాంగ్రెస్, బీజేపీలతో సమానదూరం పాటించినంత వరకే ఆయనకు, ఆమాద్మీకి ప్రజాదరణ ఉంటుందనే సంగతి ఆయన గుర్తుంచుకోవలసి ఉంది.

నాలుగు రోజుల్లో 10లక్షల మంది ఆమాద్మీ సభ్యత్వం

  జనవరి 10నుండి 26వరకు దేశవ్యాప్తంగా300 జిల్లాలో “నేను కూడా సామాన్యుడినే” అనే నినాదంతో సాగుతున్నఆమాద్మీ పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియలో గత నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 10లక్షల మంది సభ్యులు పార్టీలో చేరారు. నిర్ణీత గడువులోగా కోటి మంది సభ్యులను చేర్చుకొని పార్టీని దేశ వ్యాప్తంగా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఈ సభ్యత్వ నమోది ప్రక్రియ అంతటినీ పర్యవేస్తున్న ఆమాద్మీపార్టీ నేత గోపాల్ రాయ్ మీడియాకు తెలియజేసారు.   తమ పార్టీకి మహారాష్ట్ర, హర్యాన, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రజలనుండి మంచి ప్రతిస్పందన వస్తోందని ఆయన తెలిపారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో తమ పార్టీకి విపరీతమయిన ఆదరణ దొరుకుతోందని ఆయన తెలిపారు. ఈ ఊపుతోనే దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని వ్యాపింపజేసే ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలిపారు.

చంద్రబాబు ప్రయత్నాలు అందుకేనా?

  చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరులో తన స్వగ్రామమయిన నారావారి పల్లెలో విడిది చేసి, ఒకప్పుడు తనతో కలిసి చదువుకొన్నబాల్య స్నేహితులందరినీ కలుస్తున్నారు. ఆయన ఇంతవరకు దాదాపు వందమంది స్నేహితులను కలిసారు. వారిలో ప్రతీ ఒక్కరు కూడా చంద్రబాబుతో తమకున్నసాన్నిహిత్యాని, ఆనాటి మధురానుభూతులు నెమరువేసుకొంటూ పులకరించిపోయారు.   చంద్రబాబు ఈవిధంగా అకస్మాత్తుగా తన బాల్యస్నేహితులను కలవడం కొంచెం ఆశ్చర్యం కలిగించినా, రాజకీయ కోణం నుండి చూసినట్లయితే ఆయన ఈవిధంగా తన రాజకీయ పునాదులు బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతుంది. మొదటి నుండి ఆయనకు అండగా నిలిచిన చిత్తూరు జిల్లాపై, ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంపై ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కన్నేసిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చేఎన్నికలలో ఎలాగయినా అక్కడ పాగావేసి చంద్రబాబుని, ఆయన ప్రతిష్టని, తెదేపాను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు చంద్రబాబు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోబోరు. బహుశః ఆ ప్రయత్నంలోనే ఆయన తన బాల్యస్నిహితులను కలుస్తూ వారి ద్వారా పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చును. ఆయన స్నేహితుల స్పందన చూస్తే ఆయన తన ప్రయత్నంలో సఫలం అయినట్లు అర్ధం అవుతోంది. ఆయన కేవలం వ్యక్తిగతంగానే కాక పార్టీ పరంగా కూడా ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు ఇప్పటి నుండే గట్టిగా కృషి చేసినట్లయితే ఆయన కంచుకోటలోకి ఈగ కూడా ప్రవేశించే దైర్యం చేయదు.

రాహుల్ పట్టాభిషేకానికి తరలి వెళ్లనున్నఅసమ్మత నేతలు

  కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశాన్ని భుజానికెత్తుకొన్నపటి నుండి ఆ పార్టీలో ఎవరినీ కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ‘సమైక్యం తమ నినాదం కాదని, అది తమ విధానమని’ నమ్మబలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదలు, రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ రాజీనామాలు, స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం, ఇందిరాపార్కువద్ద నిరాహార దీక్షల డ్రామాలు చేసిన కాంగ్రెస్ యంపీలవరకు ఎవరినీ కూడా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారందరూ కలిసి త్వరలో మరో కొత్త పార్టీ పెట్టుకొని సరికొత్త వేషాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకు రాబోతున్నారు. ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ అధిష్టానం అదేమీ తెలియనట్లు వారందరినీ ఈనెల 17న డిల్లీల్లో జరగనున్నఎఐసిసి సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపడం, అందుకు వారందరూ బయలుదేరుతుండటం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసి సీమాంధ్ర ప్రజలను ఎంతగా మభ్యపెడుతున్నారో అర్ధమవుతుంది. నిజానికి అధిష్టానాన్నిఇంతగా ధిక్కరించిన వారెవరూ ఇంతవరకు పార్టీలో కొనసాగిన దాఖలాలు లేవు. కానీ ఇంతజరిగిన తరువాత కూడా పార్టీలో ఎవరిపైనా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. సరికదా ఇప్పుడు వారందరినీ పార్టీ అత్యంత కీలకమయిన సమావేశానికి ఆహ్వానిస్తోంది. వారు తరలివెళ్ళబోతున్నారు. అందుకు ఎవరి సాకులు వారికి ఉన్నాయి. బహుశః తెలుగు ప్రజలను ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలవారిగా విడదీసి వారిని లొంగదీసుకోవచ్చుననే ధీమాతోనే వారిని చాలా తక్కువగా అంచనా వేసి కాంగ్రెస్ ఇంత దైర్యం చేయగలుగుతోందేమో.

కొత్త పార్టీకి సన్నాహాలు మొదలు?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన గట్టిగా ఖండించడం లేదు, అలాగని సమర్దించడం లేదు. అయితే ఆయన మరొక కాంగ్రెస్ నాయకుడు జనవరి 17న స్థాపించబోయే కొత్త పార్టీలో జనవరి 23 తరువాత చేరవచ్చని తెలుస్తోంది.   కానీ నేడో రేపో కొత్త పార్టీ ఆవిర్భావం తధ్యమనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దానిని బలపరుస్తున్నట్లు, ఈ మధ్య ముఖ్యమంత్రి నిత్యం పలుకుతున్న ‘సమైక్యం మా నినాదం కాదు, మా విధానం’ అనే వాక్యాలతో ఉన్న భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, గోడ మీద పెయింటింగ్స్ నిన్నరాత్రి విజయవాడలో పలుచోట్ల సాక్షాత్కరించాయి. అందులో ముఖ్యమంత్రి లేదా మరే రాజకీయనాయకుడి ఫోటో లేదు కానీ ఆంద్రప్రదేశ్ మ్యాప్ తో పాటు, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణరావు, తెలుగు తల్లి బొమ్మలున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా, మొదటి నుండి ఆయన సమైక్యవాదాన్ని బలంగా సమర్దిస్తున్న విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పడవచ్చనిపిస్తోంది. ఆయనే ఈ పోస్టర్స్, బ్యానర్స్ కట్టించి ఉండవచ్చును. అదేవిధంగా ఈ బ్యానర్లను తగిలించుకొని విజయవాడలో కొన్ని ప్రచార రధాలు కూడా తిరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇదేవిధమయిన ఫోటోలు, వ్యాక్యాలు కలిగిన టీ షర్టు కోసం ఒక ప్రముఖ బట్టల కంపెనీకి భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇదంతా చూస్తుంటే బహుశః జనవరి 17న కొత్త పార్టీకి సన్నాహాలుగా కనిపిస్తున్నాయి. బహుశః రేపు, ఎల్లుండిలోగా కొత్త పార్టీపై మరికొంత స్పష్టత రావచ్చును. ఒకవేళ కొత్త పార్టీ ఏర్పడితే, సీమాంధ్రలో మళ్ళీ రాజకీయ వలసలు పెద్ద ఎత్తున మొదలవవచ్చును.

దామోదర డిల్లీ పయనం దేనికో

  వచ్చేఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయడం తధ్యమని దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన మరునాడే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు డిల్లీకి రమ్మని ఆహ్వానం అందడంతో, మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన దామోదర, ఈరోజు సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. తెలంగాణా ఏర్పాటుకి ఇంకా చాలా సమయం ఉంది గనుక, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి గురించి చర్చ ఉండకపోవచ్చును. శాసనసభ మళ్ళీ17న సమావేశమయినప్పుడు టీ-బిల్లుపై ఇరు ప్రాంతాల శాసనసభ్యుల వ్యూహ ప్రతివ్యూహాల ఏవిధంగా ఉండబోతున్నాయనే విషయంపై చర్చించేందుకు లేదా తెరాసను కాంగ్రెస్ లో విలీనంపై ఆయన అభిప్రాయం తెలుసుకొనేందుకు పిలిపించి ఉండవచ్చును.

మోడీ సభలో బురకాల వివాదం

  మొన్న ఆదివారంనాడు నరేంద్ర మోడీ గోవాలో నిర్వహించిన సంకల్ప్ ర్యాలీకి దాదాపు రెండు రెండు లక్షల మంది హాజరయినపట్లు సమాచారం. వారిలో బురకాలు ధరించిన ముస్లిం మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. గోవా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోహర్ అసగావొంకర్ మీడియాతో మాట్లాడుతూ,” నరేంద్ర మోడీ సభలోఆర్.యస్.యస్. కార్యకర్తలే బురకాలు ధరించి హాజరయ్యారు. తద్వారా ముస్లిం ప్రజలు కూడా మోడీపట్ల ఆసక్తి చూపుతున్నట్లు లోకానికి చాటాలని ఎత్తు వేసారు. అందుకోసం బురకాలు ధరించిన ఆర్.యస్.యస్. కార్యకర్తలు మోడీ సభలో వేర్వేరు ప్రదేశాలలో గుంపులు గుంపులుగా కూర్చోన్నారు. వారి ఎత్తుగడ బాగానే ఉంది. కానీ, ఆ హడావుడిలో గోవాలో ముస్లిం మహిళలు బురకాలు ధరించరనే విషయాన్నిమరిచిపోవడంతో వారి బండారం బయటపడింది,” అని ఆరోపించారు.   ఆ ఆరోపణలతో కంగు తిన్న బీజేపీ వాటిని తనదయిన శైలిలో ఖండించింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విల్ ఫ్రెడ్ మేస్క్యుట మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు గోవాలో నిర్వహించిన ఏ సభకూ రెండు లక్షల మంది జనాలు రావడం ఎరుగదు. కానీ మోడీ సభకు అంత మంది తరలిరావడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడటం సహజమే. అందువలన అది ఎటువంటి నీచ ఆరోపణలయినా చేయగలదు. కానీ బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వమయిన ఆదరణ ఉందనే సంగతి మాత్రం కాంగ్రెస్ గుర్తించి నందుకు చాలా సంతోషం,” అని బదులిచ్చారు.

ఆమాద్మీ పార్టీలో చేరనున్నమేధా పాట్కర్

  గత అనేక సం.లుగా నర్మదా బచావ్ ఆందోళన చేస్తున్నమేధాపాట్కర్ త్వరలో ఆమాద్మీ పార్టీలో చేరవచ్చునని తెలుస్తోంది. ఆమె డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “మా గమ్యాలు వేరయినా మా ఆశయాలు ఒక్కటే. అందుకే నేను ఆమాద్మీ పార్టీ కి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఈనెల 16,17 తేదీలలో నా సహచరులతో, ఆమాద్మీ నేతలతో చర్చించిన తరువాత నేను ఆ పార్టీలో ఎటువంటి పాత్ర పోషించాలో నిర్ణయించుకొంటాను,” అని ఆమె తెలిపారు. జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ కమల్ మిత్ర చినాయ్ నిన్న ఆమాద్మీ పార్టీలో చేరారు. ఆమెతోబాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్ధులు కూడా ఆమాద్మీ పార్టీలో చేరబోతునట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అనేక మంది సామాజిక వేత్తలు ఆమాద్మీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం ఆ పార్టీకి కలిసిరావచ్చును.

ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా

  ఈనెల 17న డిల్లీలో జరగనున్న ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించవచ్చును. ఆ సమావేశంలో వచ్చేఎన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహం గురించి  కూడా చర్చించవచ్చును. ఇప్పటికే, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కొంత వరకు పూర్తయింది గనుక, జనవరి 21లోగా దేశంలో అన్నిరాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు అభ్యర్ధుల జాబితాలను సిద్దం చేసి సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసే కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ జాబితాలు అందగానే వారిలో నుండి టికెట్స్ ఖరారు చేయదలచుకొన్న అభ్యర్ధులతో జనవరి 22-26 తేదీల మధ్య నేరుగా మాట్లాడి, ఫిబ్రవరి 1 నుండి 7వరకు ఖరారు చేసిన అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది.   సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నామినేషన్స్ వేసే రోజువరకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటుంది. కానీ ఈసారి రాహుల్ గాంధీ దాదాపు ఆరేడు నెలల క్రిందటే గెలుపు గుర్రాలను అన్వేషించేందుకు అన్ని రాష్ట్రాలకు తన పరిశీలకులను పంపించి కొంత పని పూర్తిచేయడంతో ఈసారి ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల గడువు ఉండగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించేందుకు రంగం సిద్దమయింది. అయితే, ఈసారి ఆయన యువతకు పెద్దపీట వేయబోతున్నట్లు గ్రహించడంతో, సీనియర్లు తమ పుత్రరత్నాలను బరిలోకి దింపుతున్నారు.

మళ్ళీ పొగలు గ్రక్కిన వ్వోల్వో బస్సు

  రెండు నెలల క్రితం మెహబూబ్ నగర్ జిల్లా, పాలెం వద్ద జరిగిన వోల్వో అగ్ని ప్రమాదంలో 45మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి మరువక ముందే, మళ్ళీ మరో వోల్వో బస్సుమెహబూబ్ నగర్ జిల్లాలోనే పొగలు గ్రక్కింది. అయితే ప్రయాణికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం నుండి అందరూ సురక్షితంగా బయటపడారు. హైదరాబాద్ నుండి తిరుపతి వెళుతున్న యస్.వీ.ఆర్ సంస్థకు చెందిన వోల్వో బస్సు మెహబూబ్ నగర్, ఇటిక్యాలపాడు వద్దకు సుమారు రాత్రి రెండు గంటలకి చేరుకొన్నపుడు బస్సులో నుండి పొగలు రావడంతో అప్రమత్తమయిన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్, క్లీనర్ బస్సుని నిలిపివేసి పారిపోయారు. బస్సులో ఉన్న30మంది ప్రయాణికులు, బస్సులో కూర్చొనే దైర్యం చేయలేక నిన్నరాత్రి నుండి హైవే రోడ్డు మీద మంచులో పడిగాపులు కాస్తున్నారు. బస్సు యాజమాన్యం కూడా ఇంతవరకు వేరే ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంగతి తెలిసిన జిల్లా కలెక్టర్, పోలీసులు అక్కడికి చేరుకొని ప్రయాణికులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రియాంక బరేలి, అమేధీలకే పరిమితం: కాంగ్రెస్

  ఈనెల 17న జరగనున్న ఎఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తారనే వార్తల నేపధ్యంలో, ఆయన సోదరి ప్రియాంక వాద్రా కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చెప్పట్టనున్నారని మీడియాలో ప్రచారం మొదలయింది. కానీ, ఆమె కేవలం రాయ్ బరేలీ మరియు అమేధీ నియోజక వర్గాలలో మాత్రమే ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకన్ ఈ రోజు మీడియాకు తెలిపారు. కానీ ఆమె తన తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీల ప్రచార కార్యక్రమాలను తెరవెనుకే ఉంది పర్యవేక్షించవచ్చునని తెలుస్తోంది. అజయ్ మాకన్ ప్రకటన ప్రకారం చూస్తే ప్రియాంకా వాద్రా ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోవచ్చునని స్పష్టం అవుతోంది. రాహుల్, సోనియా గాంధీలిరువురూ కలిసి ఎంత ప్రచారం చేసినా ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఓటమి తప్పలేదు. అందువల్ల కీలకమయిన 2014 ఎన్నికలలో ప్రియాంకా వాద్రాను ముందుకు తీసుకు రావచ్చని అందరూ భావించారు. కానీ, ఎందువలననో ఆమె రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. బహుశః ఎన్నికలనాటికి ఆమె మనసు మార్చుకొంటారేమో!

టీ-బిల్లుకి బేషరతు మద్దతు ఇస్తాము: బీజేపీ

  రెండు రోజుల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణా బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని, అందువల్ల కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు. నిజానికి బిల్లుకి మద్దతు ఈయడం వలన కాంగ్రెస్ లాభపడుతుంది తప్ప బీజేపీ కాదు. తామే తెలంగాణా రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని తెలంగాణాలో ఓట్లు దండుకోవచ్చును. కానీ, బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోగా, సీమాంధ్రలో ఉన్న కొద్దిపాటి ఓట్లు కూడా పోవడం ఖాయం. మరి ఈ సంగతి తెలిసి కూడా బీజేపీ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని ప్రకటన చేయడం అనుమానంగానే ఉంది.   ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకపోయినట్లయితే, కాంగ్రెస్ ఆ పార్టీని తెలంగాణాలో దోషిగా నిలబెట్టడం ఖాయం. అయితే దానిని ఎదుర్కొనేందుకు బీజేపీ వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయి. మరయితే బీజేపీ ఎందుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దం అవుతోంది అని ఆలోచిస్తే, రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బిల్లుకి తను మద్దతు ఈయకపోతే, కాంగ్రెస్ పార్టీ తన పాత మిత్రులు డీయంకే, లాలూకి చెందిన ఆర్జేడీ, యస్పీ, బీయస్పీ, కొత్త మిత్రుడు నితీష్ కుమార్ (జేడీ-యూ) తదితరుల మద్దతు కూడగట్టి బిల్లును ఆమోదింపజేయగలదని భావించి ఉండవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీ చేత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింపజేసి, వోటింగ్ సమయంలో హ్యాండ్ ఇచ్చితప్పుకోవాలనే ఆలోచన అయిఉండవచ్చును. ఏమయినప్పటికీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత కానీ రెండు పార్టీలు అసలు రంగు బయటపడదు. అంతవరకు ఈ దోబూచులాట సాగుతూనే ఉంటుంది.

త్యాగమూర్తి శ్రీధర బాబు మంత్రిపదవికి ససేమిరా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందురోజు మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభా వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారిగా ఆ ఇరువురూ కూడా వార్తలకెక్కారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరొందిన శ్రీధర్ బాబుకి తెలంగాణాలో తగిన ప్రచారం కల్పించేందుకే ఆయన ఆవిధంగా చేసారనే వార్తలను శ్రీధర్ బాబు గట్టిగా ఖండించారు. ఆయన తనపై వచ్చిన ‘కిరణ్ కుమార్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను’ గట్టిగా ఖండించినప్పటికీ, ఆయన మాటలు, కార్యక్రమాలు అన్నీకూడా ఆ ఆరోపణలను దృవీకరిస్తున్నట్లే ఉన్నాయి.   ముఖ్యమంత్రి రేసులో ఉన్న శ్రీధర్ బాబు, ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రి చేతిలో తను ఏవిధంగా అన్యాయంగా బలయిపోయినది ప్రజలకి చెప్పుకొంటూ, తన రాజీనామా అంశాన్నిపదేపదే నొక్కి చెపుతూ తన నియోజక వర్గ ప్రజల సానుభూతిని, మెప్పు పొందే ప్రయత్నిస్తున్నారు. మొన్న ఆయన కరీంనగర్ వెళ్ళినప్పుడు, ఆయన అనుచరులు ఆయనకు చాలా భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తానిక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసే ప్రసక్తే లేదని, దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించమని కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సవాలు విసిరారు.   ఆయన తను మంత్రి పదవికి రాజీనామా చేయడమనేది తెలంగాణా కోసం చేసిన గొప్ప త్యాగంగా మాట్లాడటం కాంగ్రెస్ మార్క్ రాజకీయమే. అయితే ఇది ఆయనకు వచ్చే ఎన్నికలలో ఓట్లు రాల్చగలదేమో కానీ తెలంగాణాకు ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకంటే టీ-కాంగ్రెస్ లో ఆయన కంటే చాలా మంది సీనియర్లు ఆ కుర్చీకోసం క్యూలో ఉన్నారు. అలాగని శ్రీధర్ బాబు తన ప్రయత్నాలు మానుకోనవసరం లేదు. ఎవరి ప్రయత్నాలు వారివి.   కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి, సోనియాగాంధీని విమర్శిస్తూ ఏవిధంగా తమ పదవులలో కొనసాగుతున్నారో, శ్రీధర్ బాబు కూడా అదేవిధంగా ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ మంత్రిగా సకల రాజలాంచనాలు అనుభవిస్తూ ఈ మూడు నెలలూ లాగించేయవచ్చును.

ప్రయాణికులకు నరకం చూపిస్తున్నరవాణాశాఖ

  అమ్మ అన్నం పెట్టదు అడుక్కొని తిననివ్వదనట్లుంది మన ఆర్టీసీ, రవాణాశాఖవారి నిర్వాకం. పండుగ సందర్భంగా రద్దీ తట్టుకొనే శక్తి ఆర్టీసీకి లేదని తెలిసినప్పటికీ, రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను రోడ్ల మీద తిరగనీయకుండా అడ్డుపడుతూ పండుగకు స్వంత ఊర్లకు బయలుదేరుతున్నప్రజలకు నరకం చూపిస్తున్నారు. రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన జరిగిన తరువాత నుండి రవాణాశాఖ వారు ప్రైవేట్ బస్సులపై కొరడా జుళిపిస్తున్నారు బాగానే ఉంది. కానీ, ఇంతవరకు అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఉద్యమాల వలన తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ, ఇంత తక్కువ వ్యవధిలో అదనపు బస్సులను ఏర్పాటుచేసి ఈ లోటును భర్తీ చేయలేదని తెలిసికూడా రవాణాశాఖ ప్రైవేట్ బస్సులను రోడ్ల మీదకు రానీయకుండా కట్టడి చేస్తుండటంతో, దూరప్రాంతాల నుండి స్వంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రజలు రైళ్ళు, బస్సులు లేక నానా కష్టాలు పడుతున్నారు.   కానీ ఇదేమీ పట్టనట్లు రవాణాశాఖ అధికారులు ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని నిలిపివేస్తూ గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే విశాఖ, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 65 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖ అధికారులు పట్టుకొని నిలిపివేసినట్లు సమాచారం.   పాలెం బస్సు ప్రమాదం జరగక ముందు అవే ప్రైవేట్ బస్సులు నిబందనలు పాటించకుండా తిరుగుతున్నపుడు మరి రవాణాశాఖ వాటిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు సంజాయిషీ ఈయవలసి ఉంది. ప్రతీ ఉల్లంఘనకీ ఎంతో కొంత జరిమానా వేసి ఖజానా నింపుకొంటూ, పనిలోపనిగా తమ జేబులు కూడా నింపుకొనేందుకు అలవాటు పడిన నేతలు, అధికారుల వలననే, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలలో కూడా నిర్లక్ష్యం పెరిగి, ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. అందువల్ల ఈ ప్రమాదాలకు కేవలం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలే కాదు రవాణాశాఖ, ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది.   ఇంతకాలం నిబంధనలు గుర్తుకు రాని రవాణాశాఖ అధికారులకు పాలెం బస్సుప్రమాదంలో 45మంది ప్రయాణికులు మరణించిన తరువాతయినా అవి గుర్తుకు రావడం, వెంటనే రోడ్డునపడి ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని కేసులు వ్రాసేసి నిలిపివేయడం ఎవరూ తప్పు పట్టలేరు. నిబంధనలు అతిక్రమిస్తే తప్పకుండా శిక్షించవలసిందే. కానీ, అవే నిబందనలు ఆర్టీసీకి కూడా వర్తింపజేస్తే, నేడు రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరిగే అవకాశం ఉండదని వారికి తెలియదా? తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను నడుపుతుంటే పట్టించుకోని రవాణాశాఖ అధికారులు, ప్రైవేట్ బస్సులను మాత్రం పట్టుకోవడం ఏమిటి? అంటే, ఆర్టీసీ బస్సులు అటువంటి ప్రమాదాలకు అతీతమయినవనా లేక ఆర్టీసీకి అటువంటి నిబందనలు వర్తించవని వారి అభిప్రాయమా?   ఏమయినప్పటికీ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంత రద్దీ ఉంటుందో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులకు తెలియకపోలేదు. అయినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రైవేట్ బస్సులను కూడా పట్టుకొని నిలిపివేస్తూ ప్రయాణికులకు పండుగ ముందు నరకం చూపిస్తున్నారు. తాము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని వారు భావించవచ్చును. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈవిధంగా చేయడం బాధ్యతారాహిత్యమే.