టీ-బిల్లుకి బేషరతు మద్దతు ఇస్తాము: బీజేపీ
posted on Jan 13, 2014 @ 1:43PM
రెండు రోజుల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణా బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని, అందువల్ల కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు. నిజానికి బిల్లుకి మద్దతు ఈయడం వలన కాంగ్రెస్ లాభపడుతుంది తప్ప బీజేపీ కాదు. తామే తెలంగాణా రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని తెలంగాణాలో ఓట్లు దండుకోవచ్చును. కానీ, బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోగా, సీమాంధ్రలో ఉన్న కొద్దిపాటి ఓట్లు కూడా పోవడం ఖాయం. మరి ఈ సంగతి తెలిసి కూడా బీజేపీ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని ప్రకటన చేయడం అనుమానంగానే ఉంది.
ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకపోయినట్లయితే, కాంగ్రెస్ ఆ పార్టీని తెలంగాణాలో దోషిగా నిలబెట్టడం ఖాయం. అయితే దానిని ఎదుర్కొనేందుకు బీజేపీ వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయి. మరయితే బీజేపీ ఎందుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దం అవుతోంది అని ఆలోచిస్తే, రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బిల్లుకి తను మద్దతు ఈయకపోతే, కాంగ్రెస్ పార్టీ తన పాత మిత్రులు డీయంకే, లాలూకి చెందిన ఆర్జేడీ, యస్పీ, బీయస్పీ, కొత్త మిత్రుడు నితీష్ కుమార్ (జేడీ-యూ) తదితరుల మద్దతు కూడగట్టి బిల్లును ఆమోదింపజేయగలదని భావించి ఉండవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీ చేత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింపజేసి, వోటింగ్ సమయంలో హ్యాండ్ ఇచ్చితప్పుకోవాలనే ఆలోచన అయిఉండవచ్చును. ఏమయినప్పటికీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత కానీ రెండు పార్టీలు అసలు రంగు బయటపడదు. అంతవరకు ఈ దోబూచులాట సాగుతూనే ఉంటుంది.