ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా
posted on Jan 14, 2014 8:43AM
ఈనెల 17న డిల్లీలో జరగనున్న ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించవచ్చును. ఆ సమావేశంలో వచ్చేఎన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహం గురించి కూడా చర్చించవచ్చును. ఇప్పటికే, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కొంత వరకు పూర్తయింది గనుక, జనవరి 21లోగా దేశంలో అన్నిరాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు అభ్యర్ధుల జాబితాలను సిద్దం చేసి సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసే కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ జాబితాలు అందగానే వారిలో నుండి టికెట్స్ ఖరారు చేయదలచుకొన్న అభ్యర్ధులతో జనవరి 22-26 తేదీల మధ్య నేరుగా మాట్లాడి, ఫిబ్రవరి 1 నుండి 7వరకు ఖరారు చేసిన అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నామినేషన్స్ వేసే రోజువరకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటుంది. కానీ ఈసారి రాహుల్ గాంధీ దాదాపు ఆరేడు నెలల క్రిందటే గెలుపు గుర్రాలను అన్వేషించేందుకు అన్ని రాష్ట్రాలకు తన పరిశీలకులను పంపించి కొంత పని పూర్తిచేయడంతో ఈసారి ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల గడువు ఉండగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించేందుకు రంగం సిద్దమయింది. అయితే, ఈసారి ఆయన యువతకు పెద్దపీట వేయబోతున్నట్లు గ్రహించడంతో, సీనియర్లు తమ పుత్రరత్నాలను బరిలోకి దింపుతున్నారు.