అవి మట్టి బొమ్మలు మాత్రమే: కేటీఆర్

  ఈరోజు శాసనసభ సమావేశంలో ట్యాంక్ బండ్ పై విగ్రహాల కూల్చివేతపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. తెరాస నేత కె.తారక రామారావు సభలో ప్రసంగిస్తూ, వేయి మంది విద్యార్ధులు చనిపోతే కనీసం పరామార్శించని సీమాంధ్ర నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్ పై నాలుగు మట్టి బొమ్మలు పగిలితే ఏదో అపచారం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నారని అనడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.   కాంగ్రెస్, తెదేపా నేతలతో బాటు గండ్ర వెంకటరమణ వంటి కొందరు టీ-కాంగ్రెస్ నేతలు సైతం కేటీఆర్ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని,వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బలవంతంగా, కుట్రపూరితంగా కలపబడిందన్న కేటీఆర్ వ్యాక్యలను డొక్కా మాణిక్యవర ప్రసాద్ వంటి సీమాంధ్ర నేతలు తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం తను మాట్లాడిన మాటలలో ఎటువంటి తప్పులేదని, నూటికి నూరు శాతం అది నిజమని, దానికే తను కట్టుబడి ఉంటానని వాదించడంతో సభలో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సభ కొంతసేపు వాయిదాపడింది.   మళ్ళీ సమావేశమయినప్పుడు ఈసారి తెరాస నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు చివరికి ట్యాంక్ బండ్ పై ఒక్క తెలంగాణా నేత విగ్రహం కూడా పెట్టకపోవడం గమనిస్తే తెలంగాణా ఎంత వివక్షకు గురవుతోందో అర్ధమవుతుందని అన్నారు. తెదేపా నేత నరేంద్ర ఆయన మాటలకు జవాబు చెపుతూ, ట్యాంక్ బండ్ పై ఉన్న రాణీ రుద్రమదేవి, భక్త రామదాసు, మక్దూం మోయుద్దీన్ తదితరులు తెలంగాణా ప్రాంతానికి చెందివారు కాదా? అని ప్రశ్నించారు. ప్రముఖ కవి మరియు అచ్చమయిన తెలంగాణా వ్యక్తి సినారె విగ్రహాల స్థాపన కమిటికీ అధ్యక్షుడని, ఆ కమిటీలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఒక సభ్యుడని గుర్తుచేసి, మరి ఆయన ఏనాడు కూడా తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. మహనీయుల విగ్రహాలను మట్టి బొమ్మలనే తెరాస నేతలు ముందుగా సంస్కారం నేర్చుకోవాలని తెదేపా, కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.   మంచి మాటకారి అయిన కేటీఆర్, నేర్పుగా చర్చను పక్కదారి పట్టిస్తూ, బ్రతికి ఉన్న మనుషులకు సమాధులు కట్టే కాంగ్రెస్ వారి నుండి, స్వర్గీయ యన్టీఆర్ పై చెప్పులు విసిరించిన తెదేపా నేతల నుండి తాము సంస్కారం నేర్చుకోవలసిన అవసరం లేదని, ముందుగా వారే నేర్చుకొని సభకు క్షమాపణ చెపితే బాగుంటుందని జవాబీయడంతో, కాంగ్రెస్, సీమాంధ్ర సభ్యులు కేటీఆర్, తెరాసకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే కేటీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మంద బలమతో తమ గొంతు నోక్కేయలేరని అనడంతో సభలో గందరగోళం మొదలయింది.

ముఖ్యమంత్రిని కలవనున్న వల్లభనేని వంశీ

  తెదేపా నేత వల్లభనేని వంశీ ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఐజీ సీతారామాంజనేయులపై పిర్యాదు చేయబోతున్నారు. గతంలో కమీషనర్ ఆఫ్ పోలీసుగా చేసి పదోన్నతి పొంది ఐజీగా ఉన్న సీతారామాంజనేయులుతో వంశీకి చాలా కాలంగా విభేదాలున్నాయి. ఇప్పుడు తాజాగా అవి మరో మారు బయటపడ్డాయి. సీతారామాంజనేయులు తనను మాజీ నక్సల్స్ తో హత్య చేయించాలని చూస్తున్నారని, అందువల్ల తనకు ఐజీ సీతారామాంజనేయుల నుండి ప్రాణహాని ఉన్నందున తగిన భద్రత కల్పించాలని కోరుతూ వంశీ డీజీపీకి లికితపూర్వకంగా నిన్న పిర్యాదు చేసారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం ఈయనున్నారు.

పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే..

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆమాద్మీ పార్టీ నేతలు, నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయమని కోరుతూ మొదలుపెట్టిన పదిరోజుల దీక్ష మొదలుపెట్టారు. ఇంతకాలం డిల్లీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది గనుక, పోలీసు వ్యవస్థ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోఉన్నపటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడలేదు. కానీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన ఆమాద్మీప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే డ్డీకొనడంతో సమస్య మొదలయింది.   ఈ ఘర్షణ వెనుక ఆమాద్మీ పార్టీ ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ, పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేకపోయినట్లయితే ఏమవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై సర్వాధికారాలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని కేంద్రం చేసిన ప్రతిపాదన వల్ల కూడా మున్ముందు ఇటువంటి సమస్యలే తలెత్తవచ్చును. కాంగ్రెస్ వచ్చేఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాననే నమ్మకం లేకపోవడం వలననో లేక ఎన్నికలలోగా బిల్లుని ఆమోదింపజేసుకోవాలనే హడావుడి వలననో బిల్లులో ఇటువంటి అసంబద్దమయిన అనేక ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకొంది. వాటిపై తెలంగాణా నేతలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇంతవరకు వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులందరూ బిల్లుపై దాదాపు 5000 సవరణలను ప్రతిపాదించారంటే బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతోంది. ఇప్పుడు డిల్లీలో ఆమాద్మీ పార్టీ చేస్తున్న ధర్నాతో ఒక సమస్య బయటపడింది.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

      రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 7న పోలింగ్ జరుగనుంది. నేటి నుంచి ఈనెల 28 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మన రాష్ట్రంలో మొత్తం6 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. శాసనసభ బలాబలాలను చూస్తే.. రాష్ట్రంలో ఉన్న ఆరు ఖాళీలకు మూడు కాంగ్రెస్‌కు, రెండు టిడిపికి దక్కడం ఖాయం. మిగిలిన ఒక స్థానం కోసం వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనిపై రెండు పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

4 వారాల గడువొద్దు: హోంశాఖ

    తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు మరో నాలుగువారాలు గడువు కావాలని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతిని కోరింది. దీనిపై రాష్ట్రపతి హోంశాఖ అభిప్రాయం కోరగా...రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రాష్ట్రపతి నాలుగు వారాల గడువిస్తే మాత్రం పార్లమెంట్ సమావేశాలు వచ్చే 21తో ముగుస్తున్నందున తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నాలుగు వారాల అదనపు గడువిస్తే ఆ తర్వాత ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశముంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ సమావేశాలే చివరివి. ఈ ప్రభుత్వ హాయంలో మరోసారి పార్లమెంట్ సమావేశాలకు అవకాశం లేనందున ఇప్పుడే బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే గడువు పెంచరాదని, తెలంగాణ నేతలు పార్టీలకు అతీతంగా కోరుతున్నారు. కాంగ్రెస్ నేతలు, టిడిపి ఎమ్మెల్యేలు దీనిపై లేఖలు రాశారు.

బాబుకు మద్దుతుగా యువచైతన్య సదస్సు

  కాంగ్రెస్ అవినీతి పాలనతో రావణకాష్టంలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి రావాలని యువత కోరుకుంటుంది. ఆయనకు మద్దుతుగా ఐటీ మరియు ఇతరరంగాలకు చెందిన యువకుల కలిసి ఈనెల 25న కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యువచైతన్య సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సు కు ముఖ్య వాలంటీరుగా నారా లోకేష్ ను ఆహ్వానించనున్నారు.  ఇందుకోసం  www.bringbabuback.org ఒక వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా ''బాబును మళ్ళీ తెచ్చుకుందాం...రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుందాం'' అన్న నినాదంతో యువతను ముందుకు రావాలని కోరుతున్నారు. దీనికి కూడా మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది వేలమంది వెబ్ సైట్ ద్వారా ముందుకు వచ్చారు.                                           

మజ్లిస్ పార్టీకి ఊపిరిపోసిన సల్మాన్ ఖాన్

  కొద్ది రోజుల క్రితం బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి అహ్మదాబాద్ లో నిర్వహించిన పతంగుల పండుగలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోడీ మంచి సమర్దుడయిన పరిపాలకుడని, ఆయన ప్రధానమంత్రి అయినట్లయితే దేశం అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో దూసుకుపోతుందని మోడీని తెగ పొగిడేశారు. ముస్లిం మతస్తుడయిన సల్మాన్ ఖాన్ వంటి ఒక ప్రసిద్ద నటుడు నరేంద్ర మోడీకి ఆవిధంగా మద్దతు ప్రకటించడం చాలా మంది జీర్ణించుకోలేకపోయినప్పటికీ, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఖండించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, సల్మాన్ ఖాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ “నరేంద్ర మోడీకి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది గనుక 2002లో జరిగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆయన గుజరాత్ ప్రజలకు క్షమాపణ చెప్పనవసరం లేదు,” అన్నట్లు వచ్చిన వార్తలు మోడీ ప్రత్యర్ధులకు ఒక ఆయుధం అందించింది.   మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తమ పార్టీని రాష్ట్రమంతటా విస్తరించి, వచ్చే ఎన్నికలలో ముస్లిం ప్రజల ఓట్లను పొంది, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆశపడ్డారు. మర్రి నీడవంటి కాంగ్రెస్ క్రింద ఎంతకాలం ఉన్నా తమ పరిస్థితిలో మార్పు ఉండదని భావించిన ఓవైసీ సోదరులు కిరణ్ కుమార్ రెడ్డితో గిల్లికజ్జాలు పెట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడ్డారు, కానీ ఊహించనివిధంగా అనేక చిక్కులో పడ్డారు. నాటి నుండి నేటివరకు తగిన అవకాశం కొరకు వారు చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మోడీని వెనకేసుకురావడంతో దొరికిన అవకాశాన్ని అందుకొని, అసదుద్దీన్ ఓవైసీ వారిరువురిపై నిప్పులు చెరిగారు. “ఈ సినిమా హీరోలు తామే అసలయిన హీరోలని భావిస్తుంటారు. కానీ ముస్లిం ప్రజలకు అల్లా ఒక్కడే నిజమయిన హీరో. ఇటువంటి నీచులు వేలాది ముస్లిం ప్రజల మరణానికి కారకుడయిన మోడీ వెనుక, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తోక ఊపుకొంటూ తిరుగుతారు. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు ఎవరూ కూడా వారి వెనుక వెళ్లరు. నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వొచ్చుగాక, సల్మాన్ ఖాన్ వంటి ముస్లిం వ్యక్తులతో క్లీన్ చిట్ ఇప్పించుకోవచ్చుగాక. కానీ జరిగిన దారుణాన్ని ముస్లిం ప్రజలెన్నడూ మరిచిపోలేరు. మోడీని క్షమించలేరు,” అని అన్నారు.   నరేంద్ర మోడీని, బీజేపీని తీవ్రంగా ద్వేషించే అసదుద్దీన్ ఓవైసీ ఈవిధంగా విరుచుకుపడటం సహజమే కావచ్చు. కానీ, బీజేపీ ప్రధాని అభ్యర్ధి అయిన నరేంద్ర మోడీపై ఆయన ఈవిధంగా తీవ్ర విమర్శలు గుప్పించడం ద్వారా మోడీపై తన ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాటు, పనిలోపనిగా యావత్ ముస్లిం ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాను, తన పార్టీయే ముస్లిం ప్రజలకు అసలు సిసలయిన ప్రతినిధులమని, తాము మాత్రమే వారి కోసం ఎంతటి వారినయినా దైర్యంగా డ్డీకొని పోరాటం చేయగలమని ముస్లిం ప్రజలకు నమ్మకం కలిగించేందుకే అసదుద్దీన్ సల్మాన్ ఖాన్, మోడీలపై అంత తీవ్రంగా విరుచుకుపడ్డారని చెప్పవచ్చును.   సల్మాన్ ఖాన్ నరేంద్ర మోడీని వెనకేసుకు రావడం వలన మోడీకి, బీజేపీకి మేలు కలుగుతుందో లేదో, ముస్లిం ఓట్లు పడతాయో లేదో ఇప్పుడే చెప్పలేకపోయినా, ఆయన చేసిన వ్యాక్యల వల్ల మజ్లిస్ పార్టీకి మళ్ళీ ఊపిరి అందించినట్లయిందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బిజెపిలో ఎంతకాలం.. జీవితా రాజశేఖర్..‌!

      సినీ దంపతులు జీవిత, రాజశేఖర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే వీరి చేరికపై రాజకీయ, సినీ వర్గాలలో బిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు..టిడిపిలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కాని అవి ఫలించకపోవడంతో..ఈరోజు బిజెపిలో అధికారకంగా చేరినట్లు తెలుస్తోంది. మోదీ మేనియాతో చాలా మంది ప్రముఖులు బిజెపి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి..వైఎస్ జగన్ వెంటనడిచారు. కాని వారికి జగన్ ప్రాధాన్యత ఇవ్వపోవడంతో ఆయనకి కూడా దూరమయ్యారు. ఎట్టకేలకు ఈ రోజు బిజెపిలో చేరారు. కాకపోతె ఈ పార్టీలో ఎంతకాలం వుంటారో అన్న చర్చలు  మొదలయ్యాయి..! 

సోనియాను వెనుకేసుకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి

  నేడో రేపో వేరు కుంపటి పెట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడబోతున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు శాసనసభలో తెదేపా నేత పయ్యావుల కేశవ్ సోనియా గాంధీ విదేశీ పౌరసత్వం గురించి విమర్శిస్తున్నపుడు, ఆమె భజనలో తరిస్తున్న టీ-కాంగ్రెస్ నేతల కంటే ముందుగా లేచి ఆమెకు మద్దతుగా మాట్లాడటం విశేషం. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉందని సుప్రీం కోర్టే ద్రువీకరించిందని, అందువల్లే ఆమె యంపీగా, పార్టీ అధ్యక్షురాలిగా, యూపీయే చెయిర్ పర్సన్ గా కొనసాగుతున్నారని అన్నారు. ఆమె తనకు ప్రధానమంత్రి పదవి చెప్పట్టే అవకాశం ఉన్నపటికీ, ఆమె వద్దనుకొనడం వలననే పీవీ నరసింహరావు ప్రధాని కాగలిగారని అన్నారు.   రాష్ట్ర విభజన అంశంపై మొదటి నుండి ఆమెతో విభేదిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి, ఎన్నడూ కూడా నేరుగా ఆమె పేరు ఎత్తకుండానే అధిష్టానం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నఈ సమయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆమెపై అచంచల విశ్వాసం చూపడం విశేషమే. బహుశః అందుకే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అత్యంత విదేయుడయిన, క్రమశిక్షణ గల నేత అని దిగ్విజయ్ సింగ్ సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. అదే నిజమయితే, త్వరలో కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోతున్న కొత్త రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ కోసమే పుట్టబోతునట్లు అర్ధమవుతుంది.

జగన్ కు సబ్బం హరి వార్నింగ్

  కాంగ్రెస్ యంపీ సబ్బం హరి నిన్నమొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ, వచ్చే ఎన్నికలలో వైకాపా టికెట్ మీదనే పోటీ చేస్తానని చెపుతూ ఉండేవారు. కానీ, వైకాపా ఆయన మొహం మీదనే తలుపులు వేసేసిన తరువాత నుండి క్రమంగా ఆయన జగన్మోహన్ రెడ్డిపై కత్తులు దూస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైకాపాను పొగిడిన నోటితోనే, ఇప్పుడు జగన్ ఆర్ధిక నేరగాడని, అందుకే తాను తొందరపడి రాజీనామా చేయలేదని అన్నారు. అంతే గాక జగన్ చేతిలో పత్రిక ఉంది కదాని తనపై లేనిపోని రాతలు వ్రాస్తే జగన్ బండారం బయటపెడతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన ఉందనే సంగతిని కూడా ఆయన దృవీకరించారు. కానీ, దానిని జగన్ సమర్ధంగా దాచిపుచ్చలేకపోవడం వలననే ఆయనకు జనాదరణ తగ్గిపోయిందని అన్నారు. ఏమయినప్పటికీ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నపుడల్లా, సదరు పార్టీల గురించి, వాటి నేతల గురించీ సామాన్య ప్రజలకు తెలియని అనేక బ్రహ్మరహస్యాలు బయటపెడుతూ, వారి అసలు రంగు తెలుసుకొనే అవకాశం కల్పిస్తుంటారు. ఒకవేళ వైకాపా సబ్బం హరి మొహం మీద తలుపులు వేసి ఉండకపోయుంటే, ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఆయన ప్రత్యర్ధులను తిడుతూ ఉండేవారేమో! ప్రస్తుతం సబ్బం హరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సమైక్యాంధ్ర కోసం ఆయన చేస్తున్న కృషిని పొగుడుతున్నారు. గనుక, ఆయన కిరణ్ పెట్టబోయే కొత్తపార్టీలో చేరబోతున్నారనుకోవాల్సి ఉంటుంది.

విభజనతో నిజాంకేం సంబంధం: ఓవైసీ

      అసెంబ్లీ లో తెలంగాణ బిల్లుపై చర్చ సంధర్బంగా కొంతమంది నేతలు నిజాం పేరును ప్రస్తావించడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన వారిని వదిలేసి నిజాం పేరును ప్రస్తావించడం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర విభజనకు నిజాంకు సంబంధం లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. చైనాతో పోరాడేందుకు 120 కేజీల బంగారాన్ని నిజాం ఇచ్చారని, మానినగాయాలు మళ్లీ గుర్తు చేయవద్దని అక్బరుద్దీన్ అన్నారు. హైదరాబాదును జవహర్ లాల్ నెహ్రూ మినీ ఇండియా అన్నారని గుర్తు చేశారు. నిజాం గుడ్ లీడర్, గుడ్ రూలర్ అన్నారు.   తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా దీనిపై స్పందించారు. వరంగల్ లో బతుకమ్మ ఆడుతున్న తెలంగాణ పడుచులను బట్టలిప్పించి బతుకమ్మ ఆడించి నిజాంను పొగడటం అంటే తెలంగాణ ప్రజలను మోసగించడం, అవమానించడమే అన్నారు. నిజాం అనే వాడు కట్టిన విద్యుత్ ప్లాంటు ఆయన ప్యాలెస్ వెలుగుల కోసం, ఆయన కట్టిన నీటి ప్రాజెక్టు ఆయనకు నచ్చిన వ్యవసాయ క్షేత్రాల కోసం, ఆయన కట్టిన ఆర్ట్స్ కాలేజీ తెలంగాణలో ఉన్న భూస్వాముల కోసం, తనకు నచ్చిన వారికోసమని అన్నారు.

ఎర్రబెల్లి అంతర్యం ఏమిటి?

  ఈ రోజు తెదేపా నేత పయ్యావుల శాసనసభలో చేసిన ప్రసంగంలో తెరాసను తీవ్రంగా పట్టుబట్టారు గనుక తెరాస నేతలు ఆయనను వ్యతిరేఖించడం సహజమే. కానీ, తేదేపాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పయ్యావుల ప్రసంగాన్నితీవ్రంగా వ్యతిరేఖిస్తూ మాట్లాడటం విశేషం. తెదేపా నేతలు ప్రాంతాల వారిగా చీలిపోయినా, నేటికీ ఒకే పార్టీ గొడుగు క్రింద అందరూ కొనసాగుతున్నారు. అటువంటప్పుడు ఎర్రబెల్లి మీ సీమాంధ్ర పెత్తనం మాకవసరం లేదని నిర్ద్వందంగా చెప్పడమే కాకుండా ఏ కర్నూలుకో వెళ్ళి రాజధాని ఏర్పాటు చేసుకోమని పయ్యవులకు ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన పయ్యావులని ఉద్దేశ్యించి అన్నపటికీ, తెలంగాణాలో కూడా తెదేపాను నిలబెట్టుకొందామని ఆరాటపడుతున్నచంద్రబాబుకి కూడా ఆయన అదే మాట చెప్పదలచుకొన్నారా? అనే ప్రశ్నతలెత్తుతుంది. ఎర్రబెల్లి ఉద్దేశ్యం అదే అయినట్లయితే మరటువంటప్పుడు ఆయన ఇంకా తెదేపాలో కొనసాగడంలో ఔచిత్యమేమిటి? తెలంగాణపై సీమాంధ్రుల పెత్తనాన్ని ఖండిస్తున్నఎర్రబెల్లి మరి ఇంకా చంద్రబాబు క్రింద ఎందుకు పనిచేస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే వేరే గత్యంతరం లేకనే అని అనుకోవలసి వస్తుంది.   నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పార్టీని వీడి బయటకి వెళ్లి ఏవిధంగా అపసోపాలు పడ్డారో చూశారు. గతేడాది తెదేపాను వీడి తెరాసలో చేరిన కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటో కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇవన్నీ చూసిన తరువాత ఎర్రబెల్లి అంత సాహసం చేయలేకపోతున్నారు. అందువల్ల వేరే పార్టీలోకి వెళ్లేందుకు లేదా స్వయంగా పార్టీని స్థాపించేందుకో సాహసం చేయలేని ఎర్రబెల్లి సీమాంధ్ర పెత్తనాన్నిసహించబోమని చెపుతున్నపటికీ, తెదేపా అండదండలు లేకపోతే తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందనే సంగతి గ్రహించినందునే ఆయన ఇంకా తెదేపాను అంటిపెట్టుకొన్నారని భావించవచ్చును. అంతే గాక, ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణా ఏర్పడితే అక్కడ తెదేపాకు తానే నేతృత్వం వహించాలనే ఆశ కూడా ఉండి ఉండవచ్చును. కానీ ఒక అచ్చమయిన తెలంగాణావాదిగా అప్పుడప్పుడు ఈవిధంగా తన అక్కసు వ్రేళ్లగ్రక్కుతుంటారు.

శాసనసభలో పయ్యావుల ప్రసంగం

  ఈ రోజు శాసనసభలో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్ అనర్గళంగా ప్రసంగించారు. తెలంగాణా సాయుధ పోరాటం మొదలుకొని సమైక్యాంధ్ర కోసం జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, సాగునీరు, ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అనేక అంశాల గురించి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఏవిధంగా తెలంగాణా అభివృద్ధి జరిగిందో వివరించారు. అలనాడు పటేల్ పట్వారీ పెత్తందారులకు, దొరలకు వ్యతిరేఖంగా ప్రజలు పోరాటం చేసారని, ఆ తరువాత స్వర్గీయ యన్టీఆర్ హయాంలో ఆ వ్యవస్థలను రద్దు చేసారని, కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వంటి దొరలు పుట్టుకొచ్చారని ఆయన తెరాస నేతలకు చురకలు వేసారు. వారు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం చరిత్రను వక్రీకరించి, ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించి ఉద్యమాలు నడిపి, మళ్ళీ పెత్తందారీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. సోనియాగాంధీ కొడుకు కోసమో, విజయమ్మ కొడుకు కోసమో లేకపోతే కేసీఆర్ కొడుకు కోసమో రాష్ట్ర విభజన చేయడం సరికాదని ఆయన వాదించారు. చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేఖంగా పోరాటం చేసి జైలుకి కూడా వెళితే, కేసీఆర్ తెలంగాణా ప్రజల కోసం ఏమి చేసారో చెప్పాలని పయ్యావుల నిలదీశారు.   స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా తెలంగాణాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి చిత్తశుద్ధితో కృషి చేసినందునే నేడు ఇంత అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేసి, మరి అటువంటప్పుడు సీమాంధ్ర నేతలు, ప్రజలు తెలంగాణాను దోచుకుతింటున్నారని తెరాస నేతలు ఏవిధంగా ఆరోపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

వైకాపా, టీఆర్ఎస్ ల రాజకీయ మైత్రి

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రహస్య ఒప్పందాలు నడుస్తున్నాయని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారిద్దరి రాజకీయ మైత్రికి రాజ్యసభ ఎన్నిక వేదిక కానుంది. శాసనసభ బలాబలాలను చూస్తే.. రాష్ట్రంలో ఉన్న ఆరు ఖాళీలకు మూడు కాంగ్రెస్‌కు, రెండు టిడిపికి దక్కడం ఖాయం. మిగిలిన ఒక స్థానం కోసం వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనిపై రెండు పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయవర్గాలలో వినిపిస్తున్నా గుసగుసల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త ప్రభాకర్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దాని కోసం ఆయన భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం. ఇటీవల జగన్ తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ డీల్ కుదిరినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.  మొదట జగన్ ప్రభాకర్‌రెడ్డికి.. ఒంగోలు లేదా నెల్లూరు అసెంబ్లీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట..కాని ఈసారి రాజ్యసభ ఎన్నికల్లోనే అవకాశం ఇప్పించాలని ఆయన పట్టుపట్టారు. దానికి ఎంత ఖర్చయినా సిద్ధమేనన్నారట. టీఆర్‌ఎస్‌తో కూడా మాట్లాడి ఎలాగైనా తనకే సీటు వచ్చేలా ఒత్తిడి తెచ్చారట. దానితో రంగంలోకి దీగిన జగన్..టీఆర్‌ఎస్ అగ్రనేతతో రహస్య మంతనాలు జరిపి ఒప్పించినట్లు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితి ప్రకారం ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే..39 ఓట్లు కావాలి. వైకాపా, టీఆర్ఎస్ కలిస్తే అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చెలా ఉన్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ ‘దిక్కరించి, కాంగ్రెస్ అభ్యర్ధికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లు వేసినా వారిపై కేసీఆర్ ఎలాంటి చర్య తీసుకోని విషయం తెలిసిందే. ఇప్పడు అదే పద్దతిని ఇక్కడ కూడా ఫాలో అవ్వలని నిర్ణయించినట్లు సమాచారం!!    

భత్కల్‌ విడుదలకు కేజ్రీవాల్ కిడ్నాప్?

      ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను విడిపించుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కిడ్నాప్ చేయడానికి ఐఎం కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని కేజ్రీవాల్ దృష్టికి తీసుకొనివెళ్ళారు. 'జడ్' కేటగిరీ భద్రత కల్పించడానికి అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇతర నగరాలలో కూడా బాంబు పేలుళ్ళతో భయోత్పాతం సృష్టించాలని కూడా ఉగ్రవాదులు చూస్తున్నట్లు తెలిసింది.   కేంద్ర నిఘావర్గాలు హెచ్చరికతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యాసిన్ భత్కల్‌ను విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించిన నేపథ్యంలో ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయనే హెచ్చరికలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కేఎస్ఆర్‌పీ బలగాలతో పాటు విమానాశ్రయ ప్రత్యేక బృందాలు బందోబస్తులో పాల్గొన్నాయి.

కాంగ్రెస్ 60 ఏళ్లిచ్చారు..నాకు 60 నెలలు: మోదీ

      దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో నరేంద్రమోదీ కీలకోపన్యాసం చేశారు. కాంగ్రెస్ యువతనేత రాహుల్ గాంధీపైన, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ విధానాలపై విమర్శనాస్త్రాలను సంధించారు. ''60 ఏళ్లు ఆ నాయకులకిచ్చారు..60 నెలల ఈ సేవకుడికివ్వండి'' అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.   రాహుల్ పేరెత్తకుండానే ఆయనపైనా, గాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. కేవలం తమ ఇంటి పేరుతో గొప్పవాళ్లు (నామ్‌దార్)గా చలామణీ అయ్యేవాళ్లు తమ తమ పనుల ద్వారా ప్రఖ్యాతి గాంచిన కృషీవలుడి (కామ్‌దార్)తో పోటీ చేయడాన్ని అవమానంగా భావిస్తారని విమర్శించారు. " నా తల్లి ఇంటి పని చేసేది. నేను రైల్లో టీ అమ్ముకునే వాడిని. ఇలాంటి కిందిస్థాయి నుంచి వచ్చిన నాలాంటి వ్యక్తితో పోటీ చేయడం రాహుల్‌కు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అది తనకు అగౌరవంగా ఆయన భావించి ఉండొచ్చు'' అని ఎద్దేవా చేశారు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల పెరుగుదలను అరికడతానని చెప్పారు. అడ్డూ అదుపు లేకుండా ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానన్నారు. పేదరికాన్ని నియంత్రిస్తానని చెప్పారు. ఈ మూడింటి విషయంలోనూ తన ఆలోచనలను వివరించారు. మాజీ ప్రధాని వాజపేయి మానస పుత్రిక అయిన నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ కలల ప్రాజెక్టు అయిన విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని భారత్‌కు తీసుకు రావడమనే కలను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఆ డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగిస్తానని అన్నారు.

విభజన బిల్లుకి రాష్ట్రపతి గడువు పొడిగిస్తారా?

మరో మూడు రోజుల తరువాత రాష్ట్రవిభజన బిల్లుని రాష్ట్రపతికి త్రిప్పిపంపవలసి ఉంటుంది. కానీ, బిల్లుపై సమగ్రంగా చర్చ జరగనందున మరొక నెల రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు కొద్ది రోజుల క్రితం వ్రాసింది. హోంశాఖ ఆ లేఖను రాష్ట్రపతికి పంపింది, కానీ రాష్ట్రపతి ఇంకా దానిపై స్పందించలేదు. ఒకవేళ ఆయన కనీసం మరో పదిరోజులు గడువయినా పెంచవచ్చనునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే, బిల్లు కేంద్రానికి చేరేసరికి మరింత ఆలస్యమవుతుంది కనుక, ఫిబ్రవరి ఐదు నుండి మోదలయ్యే పార్లమెంటు సమావేశాలలో బిల్లుని ప్రవేశపెట్టకుండా ఆపవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సహచరులు భావిస్తున్నారు. కానీ, తెలంగాణా నేతలు బిల్లుపై అసలు చర్చే అవసరం లేదని, అందువల్ల గడువు పెంపు కూడా అనవసరమని, సీమాంధ్ర నేతలు బిల్లును అడ్డుకోవడానికే ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి ప్రభుత్వ అభ్యర్ధనను మన్నిస్తారా లేదా? అనే సంగతి నేడో రేపో తెలిపిపోవచ్చును. దానిని బట్టే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశ పెట్టగలుగుతుందా లేదా అనే సంగతి కూడా స్పష్టమయిపోవచ్చును.

బుద్ధి గడ్డితిని...

      ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు బుద్ధి గడ్డితిని ఈ పార్టీలో వున్నాం అని పశ్చాత్తాపపడుతున్నారు. వీలైనంత త్వరగా వైకాపా నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళలోనే కాదు.. ఈ మధ్యకాలంలో వైకాపాలో చేరిన నాయకులలో కూడా పశ్చాత్తాపం మొదలైందని తెలుస్తోంది. వాళ్ళు కూడా బుద్ధి గడ్డితిని వైకాపాలో చేరామని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.   ఉత్తరాంధ్రలో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి అయిన ఒక పెద్దమనిషి తాజాగా వైకాపాలో చేరాడు. తన రాజకీయ చతురత అంతా ఉపయోగించి పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలని, జగన్‌కి చేరువైపోవాలని కలలు కన్నాడు. అయితే ఆయనకి జగన్ ఊహించని షాకులు ఇవ్వడంతో ఆయన కూడా వైకాపాలోకి అనవసరంగా వచ్చానా అన్న ‘ధర్మ’ సందేహంలో పడిపోయాడట. సాధ్యమైనంత త్వరగా ఈ పార్టీ నుంచి బయటపడిపోయే ఆలోచనలో వున్నాడట. ఇంతకీ ఆ పెద్దమనిషికి ఎలాంటి షాకులు తగిలాయంటే, కొత్తగా వైకాపాలోకి వెళ్ళిన ఆయన చాలా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టాడట. ఉత్తరాంధ్రలో తన బలాన్ని జగన్‌కి ప్రత్యక్షంగా చూపించాలన్న ఉద్దేశంతో ఒక బహిరంగసభ ఏర్పాటు చేయాలని సంకల్పించాడట. రెండు లక్షల మందితో భారీ స్థాయిలో సభ నిర్వహించాలని భావించాడట. ఆ సభకు రావాలని జగన్‌ని ఆహ్వానించినప్పుడు జగన్ ప్రతిస్పందించిన తీరు చూసి సదరు సీనియర్ నాయకుడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందట. రెండు లక్షల మందితో సభ పెట్టబోతున్నా మీరు తప్పకుండా రావాలని ఆ నాయకుడు జగన్‌ని అడిగితే, ‘‘ఆ రెండు లక్షల మంది వచ్చేది నువ్వు సభ ఏర్పాటు చేశావని కాదు.. వాళ్ళు వచ్చేది నన్ను చూడటానికి. అంచేత ఎప్పుడు, ఎక్కడ సభ పెట్టాలో నేను డిసైడ్ చేస్తాను. మీరు ఫాలో అవ్వండి. అంతేతప్ప మీ అంతట మీరు ఉత్సాహంగా సభలు ఏర్పాటు చేయొద్దు’’ అని స్పష్టంగా చెప్పేశాడట. జగన్ అన్న మాటలు విని సదరు నాయకుడు నోరు తెరవడం మినహా  ఏమీ మాట్లాడలేకపోయాడట. రాజకీయాల్లో చాలా సీనియారిటీ వున్న తనను జగన్ పూచికపుల్లలా తీసిపారేయడాన్ని ఆయనగారు జీర్ణించుకోలేకపోతున్నాడట. అనవసరంగా వైకాపాలోకి వచ్చానని బాధపడిపోతూ, ఈసారి ఏ పార్టీలోకి వెళ్ళాలా అని వెతుక్కుంటున్నాడట.

చిదంబర హస్తం!

      తనకి ఎదురు తిరిగి తోకలు జాడించిన వాళ్ళ తోకలు కట్ చేసి సున్నం రాయడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాంటి కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా వ్యతిరేకించిన కొంతమంది విషయంలో మాత్రం తన ఒరిజినల్ పద్ధతిని ఫాలో అవడం లేదు. అలాంటి కొంతమందిలో మొదటి వరుసలో వుండే వ్యక్తి అందరూ ముద్దుగా ‘సర్వేపాటి’ అని పిలుచుకునే లగడపాటి! మొన్నటి వరకూ సమైక్యం అని గొంతు చించుకున్న లగడపాటి ఇప్పుడు గొంతు నొప్పి పుట్టకుండా సమైక్య రాగం కూనిరాగంలా ఆలాపిస్తున్నారు. ఆయన రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.   లగడపాటి కూల్‌గా కూనిరాగం ఆలపించడం, కాంగ్రెస్ అధిష్టానం ఆయన మీద ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం...  ఈ రెండిటి వెనుక ‘చిదంబర హస్తం’ వుందని అంటున్నారు. దీని వెనుక వున్న చిదంబర రహస్యమేమిటో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు ఈజీగా ముక్కలు చేసేయాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి లగడపాటి అవసరం వుంటుంది. అలాగే లగడపాటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ ఆశీస్సుల అవసరం వుంది. అందువల్ల ఈ ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక అండర్‌స్టాండింగ్ వచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. లగడపాటి రాష్ట్ర విభజనకు సహకరించాలి. కాంగ్రెస్ అధిష్టానం లగడపాటిని క్షమించేసి ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి. లగడపాటికి మిత్రుడైన కేంద్రమంత్రి చిదంబరం ఈ ఒప్పందం కుదరడానికి కృషి చేసినట్టు తెలుస్తోంది. లగడపాటికి చెందిన సంస్థలు చెల్లించాల్సిన అప్పుల చెల్లింపు విషయంలో గడువు పెంచడం, కొన్ని రుణాలను రీ షెడ్యూలు చేయించడం, కొత్త అప్పులు వచ్చేలా చేయడం లాంటి ఉపకారాలు ఆల్రెడీ జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ విషయంలో చిదంబరం కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ మీద వత్తిడి తెచ్చినట్టు సమాచారం. అప్పుల విషయంలో వత్తిడి తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకున్న లగడపాటి ప్రస్తుతం రాష్ట్ర విభజన కార్యక్రమం సజావుగా సాగిపోవడానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారని, విభజనకు వ్యతిరేకమని అంటూనే విభజనకు సహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘సొంతలాభం కొంత చూసుకుని తెలుగు వెన్నుకు పోటు పొడువోయ్’ అనే మాటకు నిఖార్సయిన నిదర్శనంగా లగడపాటి నిలుస్తాడని అంటున్నారు.