సీఎం బెదిరింపులకు దడవను: హరీష్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కిరణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ..బెదిరింపులకు ఎవరూ లొంగరు. ఆయన భయపెడితే భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. తెలంగాణ రైతులకు బోర్ల కొరకు 19 వేల కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ ఇచ్చానని ముఖ్యమంత్రి అసేంబ్లీలో చెబుతున్నాడు. కానీ ఆ బోర్లు వేసేందుకు, వాటి మోటార్లకు తెలంగాణ రైతులు 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు సూచించారు. సీమాంధ్రకు నీరు కాలువల ద్వారా వెళ్తుంటే ..తెలంగాణ రైతులు స్వంత డబ్బుతో బోర్లు తవ్వుకుంటున్నారు. దానికి ఉచిత విద్యుత్ పేరుతో రాత్రివేళ ..ఇష్టం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో తెలంగాణ రైతులు విద్యుత్ షాక్ లతో, పాము, తేలు కాట్లకు గురయి మరణిస్తున్నారు. సీమాంధ్రలో నీటి సరఫరా ఖర్చు ప్రభుత్వం భరిస్తే, తెలంగాణలో ఖర్చు రైతు భరిస్తున్నాడని హరీష్ రావు తెలిపారు.

అక్కినేని అంత్యక్రియలు పూర్తి

      నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముగిసాయి. అక్కినేని వారసులు వెంకట్, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్ తదితరులు ఈ అంత్యక్రియల క్యార్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకుముందు గురువారం ఉదయం నాగేశ్వరరావు భౌతికకాయాన్ని పలువురు సందర్శనార్థం ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఫిల్మ్‌చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు అక్కినేని అంతిమయాత్ర జరిగింది. ఫిలింఛాంబర్‌లో అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.

రాజగోపాల్ బావమరిది తెదేపాలోకి జంప్?

  హిందూపురం కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ అంబిక లక్ష్మినారాయణ, తెలుగుదేశం పార్టీలోకి జంపైపోవాలని ఉబలాట పడుతున్నారు. అయితే ఆయన ఓబులాపురం అక్రమ గనుల తవ్వకాల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్ కి బావమరిది కావడంతో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయనని పార్టీలో చేర్చుకోవడానికి అభ్యంతరం చెపుతున్నారు. కానీ, లక్ష్మినారాయణ మాత్రం తెదేపాలోకి మారేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆయన గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ మీద హిందూపురం నుండి పోటీ చేసారు, కానీ తెదేపా అభ్యర్ధి అబ్దుల్ ఘనీ చేతిలో ఓడిపోయారు. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగుండకపోవడంతో ఏకంగా తెదేపాలోకే జంపైపోవడం సేఫ్ అనుకొన్నారేమో, తెదేపా టికెట్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో కలిసి చంచల్ గూడా జైలులో చాలాకాలం సహవాసం చేసిన రాజగోపాల్ సైతం వచ్చే ఎన్నికలలో ఉరవకొండ శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నట్లు సమాచారం. కానీ, ఆయన మాత్రం వైకాపా టికెట్ పైనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బావ బావమరుదులిద్దరూ వచ్చే ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్దులవుతారేమో!

ఎమ్మెల్యేల చెవిలో పువ్వులు...హరీష్ కు కిరణ్ వార్నింగ్

      తెలంగాణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా విభజనను నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో వెల్లడిస్తున్న అంశాల మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అడుగడుగునా అభ్యంతరాలు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజల చెవ్విలో ముఖ్యమంత్రి పువ్వులు పెడుతున్నారని, అబద్దాలు చెబుతూ తెలంగాణ మీద విషం కక్కుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకున్న వారిని చూసి ముఖ్యమంత్రి చాలా అందంగా ఉన్నారని అన్నారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావును గురువారం శాసన సభలో హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో తన ప్రసంగంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయగా కిరణ్ ఘాటుగా స్పందించారు. హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.

బిజెపికి నో..కాంగ్రెస్ లోనే: పనబాక

      కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని..పార్టీని ఎప్పటికి వీడనని చెప్పారు. బాపట్ల నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి ఎస్సీ,ఎస్టీ నిధులు మంజూరుకావడం లేదని, నిధులు కోరితే ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులపై పనబాక అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనకు సహకరించడం లేదని, వారి సహకారం ఉంటే బాపట్ల నియోజవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని పనబాక లక్ష్మి అన్నారు.

విభజన బిల్లుపై చర్చకు మరోవారం?

      విభజన బిల్లుపై అభిప్రాయాలు తెలపటానికి శాసనసభకు ఇచ్చిన గడువును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోవారం రోజులు పొడగించవచ్సుననే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లుపై అభిప్రాయాలు తెలపటానికి అసెంబ్లీకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. బిల్లుపై సమగ్రాభిప్రాయం తెలుసుకునేందుకు 4 వారాలపాటు గడువును తప్పనిసరిగా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతికి లేఖలు రాశారు. దీంతో విభజన సందర్బాలలో అప్పటి రాష్ట్రపతులు పాటించిన సంప్రదాయాలను ప్రణబ్ మరోసారి పరీశీలిస్తున్నారు. చర్చకు మరింత సమయం ఇవ్వడంపై గురువారం రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.   మరోవైపు గడువు పొడిగింపు అంశం అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొడిగింపు వస్తుందా, రాదా, పొడిగించకపోతే ఎలా ఉంటుంది, పొడిగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అనేక రకాల కథనాలు, ప్రచారాలు జరిగాయి. రాష్ట్రాల విభజన సందర్భంగా ఆయా అసెంబ్లీలు చర్చకు గడువు పెంపు కోరినప్పుడు... రాష్ట్రపతి తిరస్కరించిన దాఖలాలు లేవని, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇదే జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కోరినట్లు నాలుగు వారాలు కాకుండా, కనీసం ఒక్కవారం పెంచే అవకాశాలున్నాయని తెలిపారు.

గిరిజనులకీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి: బాలరాజు

  గిరిజన సంక్షేమ శాఖామంత్రి బాలరాజు నిన్న శాసనసభలో మాట్లాడుతూ, తాను రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్దిస్తున్నానని అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అన్ని పార్టీలను సంప్రదించిన తరువాతనే విభజనకు పూనుకొందని, కానీ పార్టీలన్నీ మాట తప్పి కాంగ్రెస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు.   వెనుకబాటుతనం, ఆత్మగౌరవం పేరిట మొదలయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, ఇప్పుడు అధికారం కోసం ఆదిపత్య పోరులో మునిగి తేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా తన పాడేరు నియోజక వర్గంలో గిరిజనులు పడుతున్న అష్టకష్టాల గురించి వివరించి, రాష్ట్ర విభజన అనివార్యమయితే దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గిరిజనుల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. బాలరాజు ఏ కారణంగా తెలంగాణా ఉద్యమాలు మొదలయ్యాయో చెప్పి, వాటిని విమర్శించడమే గాక మళ్ళీ ఆయన అవే కారణాలతో గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం విచిత్రం.   గిరిజనుల కష్టాల గురించి, వారికి ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి సభలో ధాటిగా ప్రసంగించిన బాలరాజు, గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా వారికోసం ఏమి చేసారో తెలియదు కానీ, పాడేరు పాత ఐటిడిఎ కార్యాలయ స్థలాన్ని, చింతపల్లి ఎలక్ట్రిక్ బోర్డు స్థలాన్ని, గూడెంలోని కాఫీబోర్డు స్థలాన్నికబ్జా చేశారని, ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల భూములపై కన్నువేశారనే ఆరోపణలున్నాయి. ఆయన భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు పంపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించి తన సంక్షేమాన్ని మాత్రమే చూసుకుంటున్నారని దేముడు విమర్శిస్తున్నారు.   మంత్రి బాలరాజు భూకబ్జాలకు పాల్పడటమే కాకుండా అనేక అనైతిక పనులు కూడా చేస్తున్నారని, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దేముడు తన ఆరోపణలో పేర్కొన్నారు. తన ఆటలు సాగవనే ఉద్దేశ్యంతో పాడేరు ఐటిడిఎ కార్యాలయానికి ఐఎఎస్ అధికారిని నియమించకుండా బాలరాజు అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రాను అడ్డుతొలగించి ఆయన స్థానంలో తనకు అనుకూలమైన ఆర్డీవో స్థాయి అధికారిని నియమించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని దేముడు ఆరోపించారు.   బాలరాజు మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కొద్ది నెలలకే ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన ఇప్పుడు గిరిజన సంక్షేమం గురించి సభలో మాట్లాడటం విడ్డూరం. నిజానికి శాసనసభ్యులు, మంత్రులు, యంపీలు అందరూ తమ నియోజక వర్గాల అభివృద్ది పట్ల, తమ ప్రజల బాగోగుల పట్ల కనీసం 50 శాతం శ్రద్ధ చూపినా నేడు సభలో ఈ విభజన చర్చ జరిగే ఉండేదే కాదు. కానీ, ఎంతసేపు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం, పదవుల కోసమే తాపత్రయపడే నేతల వలననే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పక తప్పదు.

కంగారూ కోర్టు శిక్ష: యువతిపై 12 మందితో రేప్

      పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. పిటిఐ వార్తాకథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో గిరిజన యువతి మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందని ఆరోపణతో..గ్రామ కంగారూ కోర్టు ఆమెకి రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఆ డబ్బు మొత్తం చెల్లించలేమని ఆమె కుటుంబం చెప్పడంతో... ఆ యువతిపై 12 మందితో సామూహిక అత్యాచారం జరిపించారు. ఈ సంఘటనపై గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...గ్రామానికి చెందిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణలోనే అక్కినేని అంత్యక్రియలు

      తెలుగుసినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలోనే జరపనున్నట్లు తెలుస్తోంది. మొదట ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ...ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే జరుపాలని నిర్ణయిచారు. గురువారం ఉదయం 11.30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంచుతారు. 12 గంటలకు ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి అక్కినేని అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా తిరిగి అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు.

జనాలకి గ్యాస్ కొడితే ఓట్లు రాలుతాయా?

  రాహుల్ గాంధీ గత తొమ్మిదేళ్లుగా (కాంగ్రెస్ మార్క్) రాజకీయాలలో శిక్షణ పొందిన తరువాత ప్రధానమంత్రి పదవి చెప్పట్టేందుకు సిద్దపడ్డారు. కానీ ఆయన సమర్ధత గురించి ఆయన కంటే కాంగ్రెస్ కే బాగా తెలుసు గనుక, ఆయనను పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకుండా, కేవలం ఎన్నికలలో పార్టీకి సారధ్యం వహిస్తారని ప్రకటించుకొంది. కానీ, ఆ బాధ్యతలు కూడా పూర్తిగా ఆయనకే అప్పగించే సాహసం చేయకపోవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పార్టీ ఓడిపోతే ఆయనకు అప్రదిష్ట కలగకూడదనే ముందుచూపు కూడా ఉంది గనుక ఏదో ఒక కమిటీని ఆయనకు రక్షణ కవచంగా తొడిగి, వంది మాగధులను తోడిచ్చి ఎన్నికల యుద్ధానికి పంపవచ్చును.   అయితే, ఆయనకు దైర్యం కలగడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నిటానిక్కులు పట్టిస్తున్నా అవి అంతగా పనిచేయడం లేదనిపిస్తోంది. ఒంటిచేత్తో ఎన్నికల యుద్దంలో గెలిచేయడానికి తానేమి భీముడిని కానని ఆయన అన్నట్లు సమాచారం. ఆయన భీముడు కాకపోయినా, ప్రధాని పదవి చెప్పట్టేందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకొంటే సరిపోయేది. కానీ, ఆయన ఆ ప్రయత్నం చేయకుండా తను తొమ్మిదేళ్ళలో నేర్చుకొన్న కాంగ్రెస్ మార్క్ ఐడియాలనే జనాల మీద ప్రయోగిస్తున్నారు.   గుజరాత్ ఎన్నికలలో గెలిచేందుకు ఆరు సబ్సీడీ సిలెండర్లని తొమ్మిదికి పెంచినా ఫలం దక్కలేదు. అయినా ఏదో చిన్న ఆశతో ఆ తొమ్మిదిని వచ్చేఎన్నికల కోసం పన్నెండు చేయడానికి యువరాజావారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. సబ్సీడీ ఇచ్చుకొంటూ పోతే ఆయిలు కంపెనీలు మూసుకోవలసిందేనని గతంలో గట్టిగా వాదించిన ఆయిలు మంత్రి మొయిలీగారు ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయి, యువరాజవారి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అప్పుడే ప్రకటించేసారు.   ఎన్నికలలో గెలిస్తే అప్పుడు ఎలాగూ మళ్ళీ కోతపెట్టే అవకాశం ఉంటుంది. ఓడిపోతే ఆ భారం బీజేపీ నెత్తిన పడుతుందని యువరాజవారు ఆలోచన అయిఉండవచ్చును. అయితే, పార్టీని, ప్రభుత్వాన్ని, దేశాన్ని సమూలంగా మార్చిపడేస్తానని చెపుతున్న యువరాజవారు ముందుగా ఇటువంటి ఆలోచనలను, అలవాట్లను, ట్రిక్కులను వదిలించుకొని తన మాటలకు, చేతలకు కొంతలో కొంతయినా సంబంధం ఉండేట్లు చూసుకొంటే ఆయన ఎన్నికలలో గెలవడం, ప్రధాని కావడం గురించి ఆలోచించవచ్చును. కేవలం గ్యాస్ కొట్టినంత మాత్రాన్నఓట్లు జలజల రాలిపోవని గుజరాత్ ఎన్నికలు నిరూపించాయి గనుక యువరాజవారు ఆ భ్రమలో నుండి బయటపడితే మంచిదేమో!

అక్కినేనికి శాసనసభ సంతాపం

      ప్రముఖ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల శాసనసభ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ అక్కినేని మృతిపట్ల సంతాప తీర్మానం ప్రకటించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ విరాజిల్లడానికి అక్కినేని ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. చలనచిత్ర నటుడిగానే కాకుండా సంఘజీవిగా అక్కినేని పలు సేవలు అందించారని అన్నారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అక్కినేని మరణం వల్ల దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అన్నారు.

లగడపాటిని లాగేశాడు

      సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న సభకు తెలంగాణ విద్యార్థులు వచ్చారు. లగడపాటి రాజగోపాల్ ప్రసంగిస్తున్న సమయంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ విద్యార్థి సంఘం నేత బండి ప్రకాష్ లగడపాటిని స్టేజీ మీద నుండి కిందకు లాగేశాడు. దీంతో ఆయన కిందపడిపోయారు. సభను అడ్డుకుంటామని ప్రకటించిన విద్యార్థులు పోలీసుల కళ్లుగప్పి సభావేదిక వద్దకు చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు సభావేదిక మీదకు చెప్పులు విసిరారు. లగడపాటిని కిందకు లాగిన వెంటనే అప్రమత్తమయిన పోలీసులు విద్యార్థి నేత బండి ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో ఇందిరాపార్క్ పరిసరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెదేపా-బీజేపీ పొత్తులు సాధ్యాసాధ్యాలు

  రాష్ట్రంలో అన్ని పార్టీలకు వచ్చేఎన్నికలు జీవన్మరణ పోరాటంవంటివే. సీమాంధ్రలో తెదేపా, వైకాపా, కిరణ్ లేదా వేరొక కాంగ్రెస్ నేత పెట్టబోయే కొత్త పార్టీల మధ్య త్రిముఖపోటీ ఉంటే, తెలంగాణాలో తెరాస, తెదేపా, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చును. రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ నేరుగా పోటీ చేయబోతునప్పటికీ, అది తెలంగాణాలో తెరాసతో, సీమంధ్రలో వైకాపా, కొత్త పార్టీలతో లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది గనుక, కాంగ్రెస్ పార్టీని ప్రధానపోటీదారుగా భావించనవసరం లేదు. కానీ, కాంగ్రెస్ బలంగా ఉన్నచోట మాత్రం తన అభ్యర్ధులనే నిలబెడితే, వారిపై కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగిన పార్టీలు డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు పరోక్షంగా సహకరించవచ్చును. కాంగ్రెస్ కూడా ఆ పార్టీల అభ్యర్ధుల విషయంలో అదేవిధంగా వ్యవహరించవచ్చును. తద్వారా వేరువేరు జెండాలతో ప్రజల ముందుకు వస్తున్నకాంగ్రెస్ మరియు దాని అనుబంధ పార్టీలు అన్నీకలిసి ఓట్లను చీల్చి సీమాంధ్రలో తెదేపాను, తెలంగాణాలో బీజేపీని అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చును. బహుశః ఈ పరిణామాలను ముందుగా ఊహించబట్టే తెదేపా, బీజేపీలు పొత్తులకు సిద్దమవుతున్నాయేమో.   అవి రెండు పొత్తులు పెట్టుకొన్నట్లయితే, వాటిలో ఎక్కువ లాభపడేది బీజేపీ అనిచెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణాలో తెదేపా కొంత బలహీన పడినప్పటికీ, బీజేపీ కంటే తెదేపాకే బలమయిన క్యాడర్ ఉంది. కానీ, మొదటి నుండి బీజేపీ తెలంగాణాకు మద్దతుగా ఉద్యమిస్తుండటంతో బీజేపీ కూడా చాల బలపడింది. అయినప్పటికీ, అది ఒంటరిగా కాంగ్రెస్-తెరాస కూటమిని ఎదుర్కొని నిలవలేదు. అందువల్ల కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలకు తెదేపాతో పొత్తులు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా కాంగ్రెస్-తెరాస కూటమిని డ్డీకొనాలంటే తెలంగాణాలో కూడా తెదేపాతో పొత్తులకు అంగీకరించక తప్పదు. ఇక సీమాంధ్రలో చాలా బలహీనంగా ఉన్నబీజేపీ, తెదేపాతో పొత్తులు పెట్టుకొంటేనే లాభపడుతుంది. లేకుంటే, తెదేపా, వైకాపా, కొత్త పార్టీల మధ్య సాగే పోటీలో కనబడకుండా మాయమయిపోతుంది. ఒకవేళ తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపినట్లయితే, తెదేపా, బీజేపీల మధ్య పొత్తులు అనివార్యం అవుతాయి. అదేవిధంగా సీమంధ్రలో మాత్రం కాంగ్రెస్ మరియు వైకాపా, కొత్త పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహన దృష్ట్యా తెదేపా, బీజేపీలు పొత్తులు పెట్టుకోవచ్చును.

అక్కినేనికి రాజకీయ ప్రముఖుల సంతాపం

      అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరావుకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్, చంద్రబాబు, డిప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, చిరంజీవి, హరికృష్ణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, డీఎస్, స్పీకర్ నాదెండ్ల , నన్నపనేని రాజకుమారి, రామానాయుడు, ఎస్పీబాలు, వైఎస్ విజయలక్ష్మి తదితరులు నివాళులర్పించారు.   ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సంతాపం ప్రకటించారు.అక్కినేని అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. అక్కినేని మరణం సినీ పరిశ్రమతో పాటు సమాజానికి తీరని లోటన్నారు.అక్కినేని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు పార్థివదేహానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కినేని గొప్ప కళాకారుడే కాదు మానవత్వం మూర్తీభవించిన మహామనిషి అని కొనియాడారు. తెలుగు చలన చిత్ర వినీలాకాశంలో ఒక ధృవతార రాలిపోయిందని జేపీ అన్నారు. అక్కినేని సుదీర్ఘ నటనా ప్రస్థానం...ఆయన మరణంతో ఒక శకం ముగిసిందని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. అక్కనేని పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతికి కిరణ్ మరో లేఖ

      తెలంగాణ బిల్లుపై సమగ్రాభిప్రాయం తెలుసుకునేందుకు 4 వారాలపాటు గడువును తప్పనిసరిగా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరో లేఖ రాశారు. తాను మొదట రాసిన లేఖలో 5000 పైచిలుకు సవరణలు ప్రతిపాదించినట్లు గుర్తించామని, ముసాయిదా బిల్లుపై మొత్తం 9000 పైచిలుకు సవరణలను క్లాజుల వారీగా సభ్యులు ప్రతిపాదించారని రాష్ట్రపతికి రాసిన రెండో లేఖలో కిరణ్ వివరించారు. వీటన్నింటిపైనా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా నాలుగు వారాల గడువు అవసరమని మరోసారి విజ్ఞప్తి చేశారు.

అక్కినేని మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: బాబు

      అక్కినేని మృతి సినీ పరిశ్రమకు, తెలుగు ప్రజలకు తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న అక్కినేని పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అక్కినేని కళారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అక్కినేని మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకసంద్రలోకి వెళ్లిందని చంద్రబాబు అన్నారు. అత్యంత ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి అక్కినేని అని కొనియాడారు. అక్కినేనికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్కినేని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాని చంద్రబాబు అన్నారు.

అక్కినేని నాగేశ్వర రావు ఆకస్మిక మృతి

  ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వర రావు నిన్న రాత్రి నిద్రలోనే చనిపోయారు. రెండు నెలల క్రితం ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, కానీ అందుకు తాను ఎంత మాత్రం బయపడటం లేదని, పైగా ఈ వయసులో మరో పరీక్షలో నెగ్గేందుకు భగవంతుడు తనకొక మరొక గొప్ప అవకాశం ఇచ్చాడని తనదయిన శైలిలో వివరించారు. జీవితంలో అనేక పరీక్షలు దైర్యంగా ఎదుర్కొని గెలిచిన తాను, భగవంతుని, అభిమానుల ఆశీర్వాదంతో ఈ పరీక్షలో కూడా నెగ్గి నిండు నూరేళ్ళు బ్రతుకుతానని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే ఈ విషయం తెలిసిన తరువాత కూడా తన కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి ‘మనం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.   నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, నిన్న సాయంత్రం ఆయన మా అందరితో కులాసాగా కబుర్లు చెప్పారు. రాత్రి నిద్రలోనే ఆయన ప్రశాంతంగా పోయారు. ఆయన అభిమానుల సందర్శనార్ధం ఆయన దేహాన్నిఈరోజు అన్నపూర్ణా స్టూడియోలో ఉంచుతాము,” అని తెలిపారు.  

కొత్త పార్టీ దేనికో బొత్సకి తెలియదా

  గత కొద్ది రోజులుగా సమైక్యాంధ్ర పేరుతో సాగుతున్నప్రచారం గురించి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ తనదయిన శైలిలో బాష్యం చెప్పారు. సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర అంతటా జరుగుతున్నప్రచారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొనే కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అబిప్రాయపడ్డారు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంలో ఎవరయినా కొత్త పార్టీ స్థాపించితే పరవాలేదు కానీ, సమైక్యం పేరుతో ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడం కోసమే స్థాపిస్తే మాత్రం ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అన్నారు. తమ కాంగ్రెస్ పార్టీయే స్వయంగా రాష్ట్ర విభజన చేస్తున్నపుడు దానిని అడ్డుకోనేందుకే ఎవరయినా కొత్తపార్టీ స్థాపిస్తే పరవాలేదని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మళ్ళీ అదేనోటితో సమైక్య ముసుగులో పార్టీ స్థాపిస్తే మాత్రం భంగపాటు తప్పదని హెచ్చరించడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిత్యం కిరణ్ కుమార్ రెడ్డితో భుజాలు రాసుకు తిరిగే బొత్ససత్యనారాయణ, ఆయన ఎవరి ప్రోద్బలంతో, దేనికోసం కొత్త పార్టీ స్థాపించబోతున్నారో తెలుసుకోలేనంత రాజకీయ అజ్ఞాని కాదు. అందువల్ల ఆయన ఈ సమైక్య కాంగ్రెస్ డ్రామాలో రెండవ అంకం మొదలుపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లున్నారు. కానీ, నేడో రేపో వేరు కుంపటి పెట్టుకొని బయటకి పోయే కిరణ్ కుమార్ రెడ్డిని వెంటబెట్టుకొని, రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసేందుకు రేపు డిల్లీ వెళ్తామని బొత్స చెప్పడం కొస మెరుపు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయుడో మొన్న శాసనసభ సాక్షిగా నిరూపించుకొన్నారు. అందువల్ల బహుశః వారిరువురూ కొత్త పార్టీ గురించి చర్చించడానికే డిల్లీ వెళుతున్నారేమో ఎవరికి తెలుసు?

క్షమాభిక్ష పిటిషన్ పై సుప్రీం కీలకతీర్పు

      క్షమాభిక్ష పిటిషన్ పైన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌పైన నిర్ణయంలో జాప్యం జరిగితే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చేందుకు ప్రతిపాదన ఉన్నట్లేనని పేర్కొంది. ఏకాంత శిక్ష అనుభవిస్తున్న వారికి మానసిక అస్వస్థత ఉంటే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చునని సుప్రీం వెల్లడించింది. దీంతో నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితులు సహా మొత్తం పదిహేను మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే ఖైదీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.