వాయిదాల సభ

      శాసన సభ రేపటికి వాయిదా పడింది.  ఈ రోజుకి ముగిసింది.  కానీ రేపు కూడా ఇదే సన్నివేశం పునరావృతం కాదనే హామీ ఏమైనా ఉందా.  దీనికి పరిష్కారమేమిటి?  రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఆ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారు? రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ఇంకో రోజు.. వెరసి 10వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్టే. ఆ తర్వాత మళ్ళీ 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును

ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం

      కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ ముఖ్య నేతలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జనవరి 17న జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. సమావేశంలో కూడా ఈ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత మార్పులపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వారంటున్నారు.

చట్ట సభలను అపహాస్యం చేస్తున్న ప్రజా ప్రతినిధులు

  ఊహించినట్లుగానే అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు రాష్ట్ర విభజనపై బిల్లుపై సభలోఎటువంటి చర్చ జరగనీయకుండా అడ్డుపడుతూ సభను స్థంబింపజేస్తూ రోజులు దొర్లించేస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటే అది రాష్ట్ర విభజనను అంగీకరించినట్లే అవుతుందని తెదేపా, వైకాపాలు భావిస్తూ అడ్డుపడుతుంటే, చర్చజరిగితే అది కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని తెలంగాణా శాసనసభ్యులు అడ్డుపడుతున్నారు. కానీ, అందరూ కూడా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని, కానీ అందుకు ఎదుట పార్టీ వాళ్ళే అడ్డుతగులుతున్నారని వితండవాదం చేస్తూ, చట్టసభలలో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును. అందువల్ల బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకొంటానని చెప్పిన ముఖ్యమంత్రికి కానీ ఆయన అనుచరులకు గానీ ఇక ఆ శ్రమ ఉండకపోవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో బిల్లుపై చర్చ జరగాలని చెప్పడమే కానీ అందుకు గట్టిగా ఎటువంటి ప్రయత్నమూ చేయదంలేదు.   మొత్తం మీద శాసనసభ్యులు అందరూ కలిసి టీ-బిల్లుపై ఎటువంటి ప్రశ్న లేవనెత్తకుండా, ఎటువంటి సూచనలు,సవరణలు చేయకుండా దానిని యధాతధంగా తిప్పిపంపేందుకు సిద్దం అవుతున్నారు. తమ తమ ప్రాంతాల, ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఈవిధంగా వ్యవహరించడం కేవలం బాద్యతరాహిత్యమే. విజ్ఞత ప్రదర్శించి లోపభూయిష్టమయిన రాష్ట్ర విభజన బిల్లులో లోపాలను సవరించే ప్రయత్నాలు చేయకుండా, రాజకీయంగా తమకి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో దానిని యదా తధంగా త్రిప్పి పంపుతుండటం వలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు తీరని నష్టం కలగడం తధ్యం.

వైకాపాలో సామాజిక 'అ'న్యాయం..!!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందని చాలామంది నాయకులు విశ్వసించారు. అందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి బీసీలు ఇతర సామాజిక వర్గాల నాయకులు తోసుకుంటూ వలస వెళ్లారు. కానీ.. ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత! జగన్ సొంత జిల్లాలో తాజాగా ముగిసిన సహకార సంఘాల అధ్యక్ష పదవుల ఎంపిక వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విధమైన అనుమానాలు, సందేహాలకు బలం చేకూరుతోంది.   కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరగగా... వివిధ కారణాల వల్ల కడప జిల్లాలోని 20 ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 16 సొసైటీల్లో వైకాపా, 4 సొసైటీల్లో కాంగ్రెస్ వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే... వైకాపా తరపున 16 సొసైటీల్లో ఎన్నికైన అధ్యక్షులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం. కడపలో 16 సొసైటీల్లో ఆధిపత్యాన్ని సాధించిన వైకాపా.. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఇతర సామాజిక వర్గాలవారిపై చిన్నచూపు చూడడంతో..త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేస్తారన్న అభిప్రాయలు బలపడుతున్నాయి. దీంతో వైకాపాలో అంటే ఒక సామాజిక వర్గం పార్టీగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఈ పరిణామం కనిపిస్తోంది.

టిడిపిలోకి 'చిరు' ఎమ్మెల్యే

      పాపం కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ లోని తన వర్గ ఎమ్మెల్యేలతో ఎంత మొత్తుకున్నా వారు పార్టీని వీడే౦దుకే మొగ్గుచూపుతున్నారు. నెల్లూరు అర్భన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో నేత మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ చాన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా జనవరి 23 తర్వాత పార్టీ మారే విషయమై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీ పీఆర్పీ నేతలు త్వరలో టిడిపి లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.

బీఏసీ సమావేశాల్లో కుదరని ఏకాభిప్రాయం

      ఈ రోజు జరిగిన బీఏసీ రెండు సమావేశాల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మొదటి సారి ఉదయం ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు రెండుగంటలకుపైగా జరిగిప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి గంటలకు మరోసారి భేటీ అవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉన్నామని, తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టేవరకు సభ జరగనివ్వమని వైసీపీ స్పష్టం చేయగా, సమైక్య తీర్మానం అవసరం లేదని...టి.బిల్లుపై చర్చ జరుగుతుందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.   రెండో దఫా బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం అర్దాంతరంగా ముగిసింది. రెండో సారి సమావేశం ప్రారంభమైన వెంటనే టీడీపీ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బిల్లును తిరిగి పంపించేయాల్సిందే అంటూ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు కోరారు.

అశోక్ బాబు దెబ్బకు జగన్ మైండ్ బ్లాక్..!!

      అశోక్ బాబు దెబ్బకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యిందని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఏపీఎన్జీవో ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగిన బషీర్ ప్యానల్ అశోక్ బాబుకు కనీస పోటీని కూడా ఇవ్వలేక ఘోరంగా ఓడిపోయింది.   ఏపీఎన్జీవో ఎన్నికలకు..మెయిన్ స్ట్రీం రాజకీయలకు అసలు సంబంధం లేదు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఏపీఎన్జీవోలు  సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఎంతగా వచ్చారంటే రాజకీయ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో వారి సంఘం ఉంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని ఆనుకున్న జగన్... తమకు మద్దతు ఇవ్వాలని ఏపీఎన్జీవోలను కోరారని, ఆయన ప్రతిపాదనను ఏపీఎన్జీవోలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అశోక్‌బాబుపై తీవ్ర అసంతృప్తిని పెంచుకున్న జగన్.. ఏపీఎన్జీవో సంఘాల ఎన్నికల్లో వారిని ఓడించాలని కంకణం కట్టుకున్నారట. ఒక పక్క అశోక్ బాబు ఎవరో తెలియదంటూనే..అశోక్ బాబు ప్యానల్‌కు పోటీగా వారు బషీర్ ప్యానల్‌ను రంగంలోకి దించినట్లు కథనాలు వచ్చాయి . ఈ క్రమంలోనే పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. కడప సహా మరికొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు క్యాంపులను ఏర్పాటు చేయడం, మరికొన్ని జిల్లాల్లో డబ్బు పంపిణీ వంటి వ్యవహారాలు బయటకు పొక్కాయి. అయితే జగన్ వర్గీ౦ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా చివరికి అశోక్ బాబునే ఉద్యోగులు చక్రవర్తిని చేశారు.  ఏపీఎన్జీవో ఎన్నికలను గుప్పిట పట్టాలని భావించిన జగన్‌కు ఉద్యోగులిచ్చిన షాక్ కి మైండ్ బ్లాక్ కాదు..రెడ్..ఎల్లో కూడా అయిందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.    

అశోక్‌బాబు ఘనవిజయం

      ఏపీఎన్జీవో ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సహా పదిహేడు పదవులకు మొత్తం పదిహేడు పదవులను అశోక్‌బాబు వర్గీయులే గెలుచుకున్నారు. వైసీపీ అధినేత జగన్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగిన బషీర్ ప్యానల్ అశోక్ బాబుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఏపీఎన్జీవో సంఘంలో మొత్తం ఓట్లు 847 కాగా.. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 815 పోలయ్యాయి. అశోక్ బాబు ప్యానల్‌కు 630 ఓట్లు రాగా.. బషీర్ ప్యానల్‌కు 174 ఓట్లు మాత్రమే దక్కాయి. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన అశోక్‌బాబు 456 ఓట్ల ఆధిక్యంతోనూ.. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన చంద్రశేఖర రెడ్డి 425 ఓట్ల ఆధిక్యంతోనూ ఘన విజయం సాధించారు.  ప్రత్యర్థి వర్గమైన బషీర్ ప్యానల్‌లో ఏ ఒక్కరూ కూడా 180 ఓట్లను దాటలేకపోయారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల స్థానాలకు పోటీ చేసిన బషీర్, పీవీవీ సత్యనారాయణలకు 174.. 183 ఓట్లు మాత్రమే దక్కాయి. సమైక్య ఉద్యమంలో మరింత ఉధృతంగా పనిచేస్తాననీ, ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందనీ అశోక్‌బాబు చెప్పుకొచ్చారు. గెలుపోటముల్ని పక్కన పెట్టి, అన్ని సంఘాలతోనూ కలిసి సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తానన్నారాయన. రేపు అన్ని సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయి, సమైక్య ఉద్యమానికి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచిస్తామని అశోక్‌బాబు చెప్పారు.

చంద్రబాబు వైపు 'చిరు' వర్గం

      రాష్ట్రంలో గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాలు టిడిపి పార్టీకి లాభంచేకూర్చేవిధంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మొదట్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న 'కాపు సామాజికవర్గం' తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. అయితే తాము నమ్మినవారందరు తమని నట్టేట ముంచుతూ వస్తున్నారని భావించిన 'కాపు సామాజికవర్గం'...తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   రెండు రోజుల క్రితం చిరంజీవి తనవర్గ ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సంధర్బంగా వారందరూ తాము టిడిపి పార్టీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని చిరుతో తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే చిరంజీవి మాత్రం వారిని కాంగ్రెసునుంచి ఫిరాయించకుండా నిలువరించడంలో తన ప్రయత్నాలను ఇంకా ఆపలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉమ్మడిగా అందరితో కలిసి భేటీ అయిన చిరంజీవి, ఇప్పుడు ఒక్కరొక్కరుగా పిలిపించి మాట్లాడుతున్నారట. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తమకు పార్టీ మారడం తప్ప వేరే గత్యంతరం లేదని అన్నారట. తన వెంట కాంగ్రెసులోకి వచ్చిన వారు ఇప్పుడు వెళ్లిపోతే గనుక.. ఆ ప్రభావం తన కెరీర్‌ మీద పడుతుందని చిరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.   ఈ వార్తలకు నిదర్శనంగానే ప్రస్తుతం కాంగ్రెస్ లో వున్న కొంతమంది కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తూర్పుగొదావరికి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రామాచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులూ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి తెలుగు దేశంలో చేరనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని... కాపులకు మరింత దగ్గరయ్యేందుకు టిడిపి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

జీఎస్ఎల్‌వీ-ఢీ5 ప్రయోగం విజయవంత౦

      జీఎస్ఎల్‌వీ-డీ5 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు షార్‌లోని 2వ ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించారు. జీఎస్ఎల్‌వీ-డీ5 అన్ని దశలను దాటుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకరినొకరు అభినందించుకుంటూ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలియజేశారు. 20 ఏళ్ల ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించిందని ఆయన అన్నారు. శాస్త్రవేత్తలంతా అంకిత భావంతో పనిచేశారని అన్నారు. కీలకమైన క్రయోజనిక్ ఇంజన్‌పై పట్టు సాధించామని ఆయన పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీకి ఇది ముఖ్యమైన రోజని డాక్టర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఇండియన్ క్రయోజనిక్ ఇంజన్ విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేవారు.  ఈ ప్రయోగం ద్వారా భారత కమ్యూనికేషన్ రంగం మెరుగుపడి మరింత బలపదనుందని ఆయన అన్నారు.ఈ ప్రయోగాన్ని దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశామని, ఇస్రో చరిత్రలో ఇది 105వ ప్రయోగమని, దీని ఖర్చు విషయానికి వస్తే జీశాట్ -14 ఉపగ్రహం కోసం రూ. 45 కోట్లు ఖర్చుకాగా, మొత్తం ప్రయోగానికి అయిన ఖర్చు రూ. 205 కోట్లు అయినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

పొన్నం... పూటకో మాట!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ను పెల్చేస్తానని నోరుజారిన కరీంనగర్ ఎమ్.పి పొ్న్నం ప్రభాకర్... దానిపై వివరణ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని..తెలంగాణ ప్రజల ఆవేశాన్ని, బాధను వెల్లడించనని చెబుతున్నారు. అసెంబ్లీలో తెలంగాణ మంత్రులను కుట్రదారులుగా పేర్కొన్న ముఖ్యమంత్రిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తనపై కేసులు నమోదు చేయాలని సీమాంధ్ర టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్న నన్నపనేనిపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు బిల్లు రావడం ఖాయమని, తెలంగాణ ఏర్పాటే అంతిమ విజయమని పొన్నం పేర్కొన్నారు.

కెసిఆర్ కు బాబు న్యూయర్ ఆఫర్

      తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు కెసిఆర్ కి న్యూయర్ ఆఫర్ ఇచ్చారు. కెసిఆర్ ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే కోట్లు వస్తున్నాయి కాబట్టి రైతులందరి భూములు కెసిఆర్ తీసుకొని ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున రైతులకిచ్చి మిగితా 95 లక్షల రూపాయలు తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుపడతారని చెప్పారు.   తెలంగాణ ప్రాంతంలో రైతులంతా గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతుంటే..కెసిఆర్ మాత్రం లాభపడ్డానని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఇదంతా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో భాగమేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో చేస్తోంది వ్యవసాయం కాదని, అవినీతి సాగేనని ఆరోపించారు. మరోవైపు వ్యవసాయం అంత లాభసాటి అయితే రాష్ట్రంలో రైతులెందుకు ఆత్మహత్య చేసుకుంటారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ బిల్లుపై ఓటింగ్ తప్పనిసరి: కిరణ్

      తెలంగాణ బిల్లుపై సోమవారం నుంచి చర్చ మొదలవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం అంటే ఓటింగే అని స్పష్టం చేశారు.చ ర్చలో పాల్గొని బిల్లుపై అభిప్రాయం చెబితేనే రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటారని సీఎం వెల్లడించారు. అసెంబ్లీ అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, దేశంలో ఓటింగ్ లేకుండా ఏ రాష్ట్రం ఏర్పడలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో రాజకీయ భవిష్యత్ ఉండదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 23 తర్వాత రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమై ఏం చేయాలనేది చర్చిస్తామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ళకు రూ.38 వేల కోట్లు ఖర్చవుతున్నపుడు... చిత్తూరుకు ఆరువేల కోట్లు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు నష్టమే అని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఏటా రూ.60వేల కోట్లు కావాలని, విభజన జరిగితే సంక్షేమ పథకాలకు నిధులు ఉండవన్నారు. శ్రీధర్‌బాబు రాజీనామా లేఖ అందినట్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఆఇళ్ళు వద్దంటున్న కేజ్రీవాల్‌

      ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని ఆయన తిరస్కరించారు. తనకు కేటాయించిన కొత్త ఇంటిపై వివాదాలు చెలరేగడంతో, విపక్షాల ఆరోపణలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తనకు చిన్న ప్లాట్ ఇస్తే చాలని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇంటిని కేటాయించే వరకు గజియాబాద్‌లోని తన ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తానని అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. తనకు తన స్నేహితులు, మద్దతుదారుల నుంచి శుక్రవారం పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, అందులో వారు నూతనంగా కేటాయించిన ఐదు పడకల భవనంలోకి వెళ్లరాదని కోరినట్లు తెలిపారు. దీంతో తాను ఆ భవనానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు కేజ్రివాల్ చెప్పారు.