మోడీ సభలో బురకాల వివాదం
posted on Jan 14, 2014 @ 10:09AM
మొన్న ఆదివారంనాడు నరేంద్ర మోడీ గోవాలో నిర్వహించిన సంకల్ప్ ర్యాలీకి దాదాపు రెండు రెండు లక్షల మంది హాజరయినపట్లు సమాచారం. వారిలో బురకాలు ధరించిన ముస్లిం మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. గోవా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోహర్ అసగావొంకర్ మీడియాతో మాట్లాడుతూ,” నరేంద్ర మోడీ సభలోఆర్.యస్.యస్. కార్యకర్తలే బురకాలు ధరించి హాజరయ్యారు. తద్వారా ముస్లిం ప్రజలు కూడా మోడీపట్ల ఆసక్తి చూపుతున్నట్లు లోకానికి చాటాలని ఎత్తు వేసారు. అందుకోసం బురకాలు ధరించిన ఆర్.యస్.యస్. కార్యకర్తలు మోడీ సభలో వేర్వేరు ప్రదేశాలలో గుంపులు గుంపులుగా కూర్చోన్నారు. వారి ఎత్తుగడ బాగానే ఉంది. కానీ, ఆ హడావుడిలో గోవాలో ముస్లిం మహిళలు బురకాలు ధరించరనే విషయాన్నిమరిచిపోవడంతో వారి బండారం బయటపడింది,” అని ఆరోపించారు.
ఆ ఆరోపణలతో కంగు తిన్న బీజేపీ వాటిని తనదయిన శైలిలో ఖండించింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విల్ ఫ్రెడ్ మేస్క్యుట మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు గోవాలో నిర్వహించిన ఏ సభకూ రెండు లక్షల మంది జనాలు రావడం ఎరుగదు. కానీ మోడీ సభకు అంత మంది తరలిరావడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడటం సహజమే. అందువలన అది ఎటువంటి నీచ ఆరోపణలయినా చేయగలదు. కానీ బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వమయిన ఆదరణ ఉందనే సంగతి మాత్రం కాంగ్రెస్ గుర్తించి నందుకు చాలా సంతోషం,” అని బదులిచ్చారు.