పోలవరం ఆర్డినెన్స్‌పై దద్దరిల్లిన లోకసభ

  కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పోలవరం ముంపు ఆర్డినెన్స్ ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సంధర్బంగా తెలంగాణ ఎంపీలు సభలో గందరగోళాన్ని సృష్టించారు. పోలవం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ, టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆర్డినెన్స్‌ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ సభ్యులు వారికి మద్ధతులు తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభాపతి సమావేశాన్ని మధ్యాహ్నం మూడు గంటలవరకూ వాయిదా వేశారు. తిరిగి మూడు గంటలకు ధరల పెరుగుదలపై చర్చను ఆరంబించగా, దానికి అడ్డు తగులుతూ టిఆర్ఎస్ ఎంపీలు ఆటంకం కలిగించారు. స్పీకర్ పోడియం వద్దకు వెల్లి నిరసన తెలిపారు.

రైల్వే బడ్జెటులో కొత్త రైల్వే జోన్ ప్రసక్తి లేదేమిటి?

  రైల్వే బడ్జెటులో కొత్త రైల్వే జోన్ ప్రసక్తి లేదేమిటి? రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అందుకోసం వేసిన కమిటీ ఇంకా తన నివేదిక సమర్పించకపోవడంతో ఈరోజు ప్రకటించలేదు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు కోసం అనేక ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొనవలసి ఉంటుంది. అందుకే కమిటీ నివేదిక అందజేయడానికి మరికొంత సమయం పడుతుంది.   విశాఖ కేంద్రంగా ఈ కొత్త రైల్వేజోను ఏర్పాటు చేయాలని భావిస్తునందున, ముందుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రింద ఉన్న వాల్టేర్ (విశాఖ) డివిజన్ను దాని నుండి వేరు చేయవలసి ఉంటుంది. అయితే అందుకు ఒడిష ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర అభ్యంతరం పెడుతున్నారు. ఒకవేళ వాల్టర్ డివిజన్ను తీసుకోదలిస్తే, తమకు కొత్తగా మూడు రైల్వే డివిజన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క (విశాఖ) రైల్వే జోన్ ఏర్పాటు కోసమే అనేక ఏళ్లుగా పోరాటాలు చేయవలసి వస్తే, ఒడిష ప్రభుత్వం, వాల్టేర్ డివిజను వదులుకొనందుకు ఏకంగా మూడు కొత్త రైల్వే జోన్లు కావాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదం.   ఇక కొత్త రైల్వే జోను ఏర్పాటు కోసం భూముల సమీకరణ, దక్షిణ మధ్య రైల్వేతో సహా ఇతర రైల్వే జోన్లతో చేసుకోవలసిన సాంకేతిక ఏర్పాట్లు, సర్దుబాట్లు వగైరాలు చాలానే ఉన్నాయి. ఇంకా పైకి తెలియని అనేక అంశాలు, సమస్యలు అన్నిటికీ తగిన పరిష్కారం కనుగొన్న తరువాతనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలను సమస్యలలోకి నెట్టినట్లు కాకుండా, రైల్వే జోన్ ఏర్పాటుకు ముందే అన్ని సమస్యలు పరిష్కరించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు తెర వెనుక కమిటీ సభ్యులు, రైల్వే అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈరోజు బడ్జెట్ లో కొత్త రైల్వే జోన్ ప్రస్తావన లేకపోయినప్పటికీ కంగారు పడవలసిన అవసరం లేదు.

రైల్వే బడ్జెట్: ఆంధ్ర-తెలంగాణకు ఇవే

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ్‌ తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రూ.20,680 కోట్లతో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.   ఆంధ్ర-తెలంగాణకు కేటాయించినవి:   1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం. 2. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం. 3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 4. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్. 5. చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు. 6. విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ప్రెస్ కొత్తరైలు. 7. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు. 8. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్. 9.పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్.

మేడెక్కి దూకుతా: ఎమ్మెల్యే వార్నింగ్

  ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, దారుణాలను అడ్డుకోలేకపోతున్నానన్న నిర్వేదం ఎవరిచేత ఎలాంటి పని అయినా చేయిస్తుంది. ప్రస్తుతం గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో అనేకమంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టుకున్న కట్టడాలను నేలమట్టం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిని తెలంగాణ, సీమాంధ్ర అనే తేడా లేకుండా ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అక్రమంగా అమ్మినవారిని వదిలేసి అమాయకంగా కొన్నవారిమీద ప్రతాపం చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకముందు గురుకుల్ ట్రస్ట్ భూముల బాధితులకు అండగా వుంటామని ప్రకటించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట తామే తప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతలకు గురైన భవనాలను సందర్శించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టిన కట్టడాల విషయంలో కేసీఆర్ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని, బడా బాబులు కట్టిన భవంతులను వదిలేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్ళను కూల్చివేస్తున్నారని విమర్శించారు. గురుకుల్ ట్రస్ట్ భూములు కొనుక్కున్న సమాన్యులకు న్యాయం జరిగేలా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రతినిధి బృందంతో వచ్చిన స్థానిక శేరిలింగంపల్లి తెలుగుదేశం శాసనసభ్యుడు అరకపూడి గాంధీ స్థానిక ప్రజల పక్షాన నిలిచారు. ఇక్కడి కట్టడాలను కూల్చడం దారుణమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఇక్కడి కట్టడాలను కూల్చడానికి ప్రయత్ని్స్తే తాను భవంతి మీదకి ఎక్కి కిందకి దూకేస్తానని హెచ్చరించారు.

రైల్వే బడ్జెట్ 2014-15 హైలైట్స్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. ఈ ఏడాది రూ. 602 కోట్లు మిగుల ఆదాయమే తమ లక్ష్యమని ప్రకటించారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు: 1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం. 2. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం. 3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 4. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్. 5. చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు. 6. కొత్తగా అయిదు జన సాధారణ్ రైళ్లు. 7. విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ప్రెస్ కొత్తరైలు. 8. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు. 9. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్. 10.పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్. 11. 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి. 12.11,794 కోట్ల లోన్ కోసం ప్రయత్నం. 13. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం. 14. రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది. 15. హైస్పీడ్ నెట్వర్క్ను నెలకొల్పుతాం. 16. గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి. 17. 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. 18. ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం. 19. ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం. 20.  12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం. 21. 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి. 22. పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు. 23.ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్. 24. నిమిషానికి 7200 టికెట్లు ఇచ్చేలా ఈ టికెటింగ్ వ్యవస్థ తీర్చిదిద్దుతాం. 25. 4వేల మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం. 26. ఎంపిక చేసిన 9 మార్గాల్లో రైళ్ల స్పీడ్ 160 కిలోమీటర్లు నుంచి 200 కిలోమీటర్లుకు పెంచుతాం. 27. త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు. 28. ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు. 29. ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయం లక్ష్యం. 30. రైల్వేకు కేంద్రం రూ.1100 కోట్లు సాయం. 31. విద్యార్థులకు ప్రత్యే రాయితీలు. 32. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. 33.ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు. 34. టికెట్ల అమ్మకం ద్వారా రూ. 44,645 కోట్లు ఆదాయం. 35. చార్థామ్, కేదారనాథ్,బద్రీనాథ్లకు రైల్వే కనెక్టివిటీ.

రైల్వే బడ్జెట్ 2014: చైనా, రష్యా తర్వాత మనమే

  రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. రోజుకు 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 12,500 రైళ్లల్లో సురక్షిత ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. 676 ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ. 1.82 లక్షల కోట్లు కావాలని చెప్పారు. పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కానీ ఒక్క లైను మాత్రమే పూర్తి చేశారని గుర్తు చేశారు. పది ఏళ్ల పాటు ప్రతిపాదిత లైన్లకు ఏడాదికి రూ. 5 లక్షల కోట్లు అవసరం అవుతుందన్నారు.

రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సదానందగౌడ

  కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. మంత్రి సదానందగౌడ తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెబుతూ ప్రారంభించారు. దేశ సంస్కృతికి రైల్వేలు ప్రతీక. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వేలు వెన్నెముక. సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తాం. 12,500 రైళ్లల్లో 23 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిన్నారు. రైల్వే వ్యవస్థ అభివృద్ధి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. రక్షణ, సరుకు రవాణాలో రైల్వేలది కీలక పాత్ర. ప్రజల సుఖమే రాజ్యసుఖం. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి.

కేసిఆర్ కు అనిల్ అంబానీ అభినందనలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు మొదట ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పవర్ ప్లాంట్ నెలకొల్పడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఆతరువాత ఆయన తెలంగాణ ముఖ్యమ౦త్రి కేసిఆర్ తో కూడా భేటి అయ్యారు. తెలంగాణ విద్యుత్, మీడియా, మౌలిక రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త పారిశ్రామిక విధానం పూర్తయిన తరువాత మరోసారి దీనిపై చర్చిద్దామని కేసిఆర్ అంబానీతో అన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్బంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు కేసిఆర్ ని అంబానీ అభినందించారు.

ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్న జగన్ పార్టీ!

  వైఎస్ జగన్‌కి, ఆయన పార్టీ వాళ్ళకి ఈమధ్య అన్నిటి మీదా పడి ఏడవటం ఎక్కువైపోయిందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వస్తుందని కలలు కని, చివరికి ఆ కలలన్నీ కల్లలు కావడంతోపాటు, జగన్ బాబుకి త్వరలో జైలు నుంచి ఆహ్వానం తప్పదన్న వార్తలు వస్తూ వుండటంతో ఆయన పార్టీయులు సహనం కోల్పోయి ఏదో ఒక హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ నాయకులు, జగన్ మీడియా ఒక అంశాన్ని టేకప్ చేసింది. ఆ అంశం మీద నానా రచ్చా చేస్తోంది. తెలుగుజాతి వున్నంతకాలం ఆయన పేరు వినిపిస్తూనే వుంటే మహా నటుడు, మహా నాయకుడు అయన నందమూరి తారక రామారావు పేరును కృష్ణ లేదా గుంటూరు జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ప్రభుత్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, జగన్ మీడియా రంగంలోకి దిగింది. ఎన్టీఆర్‌ పేరును ఒక జిల్లాకు పెట్టడం చాలా ఘోరం, నేరం అయినట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీ నాయకుడు జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కడప జిల్లాకు పెట్టడం కరెక్ట్ అయినప్పుడు, అటు సినిమా రంగం మీద, ఇటు రాజకీయ రంగం మీద తనదైన ముద్ర వేసి, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువాడి ఖ్యాతిని పెంచిన నందమూరి తారక రామారావు పేరును ఒక జిల్లాకు పెట్టడంలో ఎందుకు కరెక్ట్ కాదో వైసీపీ నాయకుల బుర్రలకి ఎంతమాత్రం తట్టడం లేదు. ప్రస్తుతం ఏ పనీ లేక ఖాళీగా వున్న వైసీపీ నాయకులు ఎన్టీఆర్ మీద పడి ఏడవటం కంటే జనానికి పనికొచ్చే పనులేవైనా చేస్తే మంచిదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

వైజాగులో డిసాలినేషణ్ ప్లాంటు

  వైజాగ్ ప్రజల చిరకాల డిమాండ్- డిసాలినేషణ్ ప్లాంటు (సముద్రపు నీటిని త్రాగు నీటిగా మార్చే కర్మాగారం) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతించారు. దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో పెట్టబోయే ఈ ప్లాంటు ద్వారా 100 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసి సరఫరా చేయవచ్చును. కానీ ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక ఇంతవరకు ఇది ఏర్పాటు కాలేదు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల సహాయపడేందుకు సిద్దంగా ఉంది గనుక ఈ ప్లాంటు ఏర్పాటుకి అవసరమయిన నిధులను కేంద్రం మంజూరు చేయవచ్చును.   ప్రస్తుతం నగరంలో రోజుకి 80 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా కేవలం 56-60 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి జలాలపై ఆశపెట్టుకొనే పరిస్థితులు లేవు గనుక, వైజాగులో నానాటికీ పెరుగుతున్న నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు డిసాలినేషణ్ ప్లాంటు ఏర్పాటుకి అనుమతిచ్చారు. నగర మున్సిపల్ మరియు నీటి సరఫరా అధికారులు దీని కోసం ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ప్లాంటు ఏర్పాటుకి తగిన్స స్థలం, నిధులు అన్నీ కుదరగానే (బహుశః మూడు నాలుగు నెలలలో) పనులు మొదలుకావచ్చును.

చంద్రబాబుతో అనీల్ అంబానీ సమావేశం

  ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో దేశంలోనే అగ్రగాములుగా వున్న పలు కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమలను విస్తరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో తన పరిశ్రమలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.ఈ సమావేశంలో అనీల్ అంబానీతో పాటు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో ప్రతినిధులు పాల్గొన్నారు.

విపక్షాల అందోళన.. లోక్ సభ వాయిదా

  లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. విపక్షాలు మాత్రం ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టాయి. స్పీకర్ వారి అందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించడంతో.. విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. సభ్యులు శాంతించాలని స్పీకర్ కోరిన వారు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. అంతకముందు సభ ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటన, తమిళనాడు చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతులకు సభ్యులు సంతాపం తెలిపారు.