జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె... ముక్కులు మూసుకోవాలి..

  తమ వేతనాలు, సదుపాయాలు, రక్షణ చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)కార్మికులు బుధవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. ఈసమ్మెలో మలేరియా, రవాణా, పార్కుల విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మెతో నగరంలోని పలు విభాగాల్లో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ముక్కులు మూసుకుని నడవాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీ కార్మికులు తక్షణమే సమ్మెను విరమించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ హెచ్చరించారు.

అవును తెలంగాణకు అన్యాయం జరిగింది!

  కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఒక్క ఉద్యానవన యూనివర్సిటీని మంజూరు చేయడం తప్ప ఏమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణరాష్ట్రానికి కేంద్రం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అలాగే తెలంగాణ ప్రజల ఆశలను కేంద్ర బడ్జెట్‌ వమ్ము చేసిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ బహుళజాతి సంస్థలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా ఉందని విమర్శించారు. పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా పబ్లిక్‌ రంగ సంస్థలను ప్రైవేటు పరంచేసే ప్రయత్నాలు చేపట్టారని అన్నారు.

జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి

  కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరుచేయడం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో సంతోషం వ్యక్తమవుతోంది. ముందు ముందు దశలవారీగా విశాఖపట్నంలో గిరిజన, పెట్రో కెమికల్ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో ఎన్‌ఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఎన్‌ఐడీ (జాతీయ విపత్తు నివారణ సంస్థ), తిరుపతిలో ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్)లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రం త్వరలో ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు.

తాతయ్యని కాల్చి చంపిన మనవడు!

  అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. గన్ కల్చర్ విషయంలో అమెరికా సర్వనాశనమైపోయిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంత మొత్తుకున్నాబాలురు  తుపాకులు వాడటం మానలేదు. రెండు రోజుల క్రితం అమెరికాలో ఓ 11 సంవత్సరాల బాలుడు  తన తండ్రిని, తాతని తుపాకీతో కాల్చాడు. తాత అక్కడికక్కడే మరణించగా, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర కరోలినాలో ఈ సంఘటన జరిగింది.లాయిడ్ వుడ్లీఫ్ (84) అనే ముసలాయన తన కొడుకు లాయిడ్ పీటన్ వుడ్లీఫ్ (49) ఇంట్లో ఉంటున్నాడు. ఉన్నట్టుండి మనవడు తుపాకి పట్టుకొచ్చి మొదట తన తండ్రిని కాల్చాడు. తర్వాత తాతని కూడా కాల్చాడు. ఈ బాలుడు ఇప్పుడు పోలీసుల అదుపులో వున్నాడు. కాల్పులు జరిపింది చిన్నపిల్లాడు కావడంతో పోలీసులు అతని పేరు కూడా వెల్లడించడం లేదు.

బడ్జెట్: దేశ ప్రజలపై వరాల జల్లు-3

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల రూపంలో దేశ ప్రజల మీద కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు... తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు, ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి, 2022 నాటికి అందరికీ ఇళ్లు, గోదాముల కోసం రూ.5కోట్లు, తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు, గిరిజనుల కోసం వనబంధు పథకానికి రూ.100 కోట్లు, సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు, 2019 నాటికి పరిశుభ్ర భారత్, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు, గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు, మహిళల భద్రతకు రూ.150 కోట్లు, దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్, యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం, మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు, ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్లకు 500 కోట్లు, కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు, కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు, నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు, ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు, బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు, వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు, గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు, గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు, ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు, గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు, ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు, 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు.

బడ్జెట్: దేశ ప్రజలపై వరాల జల్లు-2

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల రూపంలో దేశ ప్రజల మీద కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు... జమ్మూ,కాశ్మీర్లో హస్తకళలకు రూ.50వేల కోట్లు, లక్నో, అహ్మదాబాద్‌లకు మెట్రో ప్రాజెక్టులు, రూ.11,635 కోట్లతో పోర్టుల అభివృద్ధి, బాలికల సాధికారిత కోసం రూ.100 కోట్లు, బెనారస్ సిల్క్ అభివృద్ధికి రూ.50 కోట్లు, తక్కువ వడ్డీకే రైతులకు స్వల్పకాలిక రుణాలు, వ్యవసాయ రుణాల కోసం రూ.8వేల కోట్లు, రక్షిత మంచినీటి పథకం కోసం రూ.6,500 కోట్లు, ద్రవ్యోల్బణం కట్టడికి ధరల స్థిరీకరణ నిధి, పీపీసీ పద్ధతిలో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, విస్తరణ, పట్టణాలలో రైతు మార్కెట్లు ఏర్పాటు, ఆహార సెక్టార్లో పీపీసీలకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.28వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు, 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి, ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో సంస్కరణలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్, భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి, కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు, ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ, సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు, వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు, నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం.

బడ్జెట్: దేశ ప్రజలపై వరాల జల్లు-1

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల రూపంలో దేశ ప్రజల మీద కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు... 1. గృహ రుణాల ఆదాయపన్ను పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు 2. 80 సీసీ పరిమితి రూ.1.5 లక్షలకు పెంపు 3. సర్ ఛార్జీల్లో మార్పులు లేవు, 4. పొదుపు పథకాల్లో లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు, 5. సీనియర్ సిటిజన్లకు పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు, 6. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ. 2 లక్షల నుంచి 2.5లక్షలకు పెంపు, 7. సెజ్ ల పునరుద్దరణకు సమగ్ర చర్యలు, 8. టూరిజం అభివృద్ధికి రూ.500 కోట్లు, 9. మహిళల రక్షణకు నిర్భయ ఫండ్, 10. అమరవీరుల స్మారకార్థం వార్ మ్యూజియంకు నిధులు, 11. మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల ఆధునీకరణకు 3000 కోట్లు, 12. గంగానది ప్రక్షాళనకు 2,037 కోట్లు, 13. రైతులకు మూడు శాతం వడ్డీతో పంట రుణాలు, 13. రక్షణ రంగానికి 2,29,000 కోట్లు కేటాయింపు, 14. పీపీఎఫ్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు, 15. గంగానదిలో జలరవాణా కోసం రూ.4వేల కోట్లు.....

ఆదాయ పన్ను పరిమితి... పర్లేదు!

  కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ఇప్పుడున్న 2 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచారు. అదే సీనియర్ సిటిజన్ల విషయంలో అయితే ఈ పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు కూడా మూడు లక్షల రూపాయల ఆదాయపు పన్ను పరిమితిని ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. అయితే అనుకున్న లక్ష్యం కంటే యాభై వేలు తక్కువగా ప్రకటించినందుకు ఉద్యోగులు కొంత నిరాశ చెందినా, పర్లేదులే అనుకుంటున్నారు. అలాగే ఆదాయ పన్ను మినహాయింపు వచ్చే పొదుపు మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి లక్షన్నరకు పెంచుతూ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కొంతవరకు ఊరట కల్పించే అంశమే అవుతుంది. గృహరుణాల వడ్డీ మీద పన్ను మినహాయింపును కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారు. దీనివల్ల గృహరుణాలు తీసుకుని, 80 సి లో కూడా పొదుపును పాటించే ఉద్యోగులకు సుమారు లక్షన్నర రూపాయల వరకు ఊరట లభిస్తుంది.

బడ్జెట్: పాపం.. తెలంగాణకు నిరాశే!

  బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యూనివవర్సిటీ ఏర్పాటు, ఐఐటీ ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. అయితే బడ్జెట్‌లో తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు. కంటితుడుపు చర్యగా కేవలం హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్‌లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రకటించారు. అయితే రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు మాత్రం దక్కలేదు.

ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీగా కృష్ణపట్నం: అరుణ్‌జైట్లీ

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు ఇప్పటి వరకు ప్రకటించిన వరాలు: 1.ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న ఎయిమ్స్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. 2.విశాఖ - చెన్నయ్‌ మధ్య పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు. 3. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 4. తెలంగాణ రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. 5. అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్‌ ఆబ్కారీ అండ్‌ కస్టమ్స్‌ అకాడమీ ఏర్పాటు. 6. ఇండస్ట్రీయల్‌ స్మార్ట్‌ సిటీగా కృష్ణపట్నం. 7. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హార్డ్‌వేర్‌ ఉత్పత్తి రంగం అభివృద్ధికి కృషి.

బడ్జెట్: పొగతాగితే జేబుకు చిల్లు పడున్!

  పొగ తాగని వాడు దున్నపోతై పుట్టే సంగతి తర్వాత, పొగ తాగితే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం. అదెలాగంటే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సిగరెట్ల రేట్లు పెంచేశారు. సిగరెట్ల మీద ప్రస్తుతమున్న 11 శాతం పన్నును ఒకేసారి 72 శాతానికి పెంచారు. పాన్ మసాలా, గుట్కాల మీద కూడా పన్ను విపరీతంగా పెంచారు. ఈ పన్నును 60 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మసాలాలు, గుట్కాల ధరలు భారీగా పెరగబోతున్నాయి. సిగరెట్ల మీద ధరలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకుముందే ఆర్థిక మంత్రిని కోరింది. అందుకే మంత్రి వీటి ధరలను పెంచారు. అలాగే పనిలోపనిగా కూల్ డ్రింకులు, సోడాల మీద కూడా పన్నును పెంచారు.