పదేళ్ళ పిల్లనీ... వాడు పశువు!

  కామాతురాణం నభయం నలజ్జ అన్నట్టుగానే కామాంధులు తమ పశు వాంఛని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో అలాంటి పశువు ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. అన్నెం పున్నెం ఎరుగని పదేళ్ల బాలికపై పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కూలీ కుమార్తె అయిన బాధితురాలు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లి, తిరిగి ఒంటరిగా వస్తుండగా ఒక దుర్మార్గుడు అత్యాచారం చేశారు. తర్వాత ఆమెని పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను గ్రామస్థులు గమనించి, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేసిన పశువు కంటే హీనుడైన ఆ మనిషిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్ రైల్లో బాబోయ్ బాంబులు!

  బీహార్‌లో ఒక ప్రయాణికుల రైలులో భారీ బాంబులు దొరికాయి. వెస్ట్ బెంగాల్‌ వైపు వెళ్తున్న ఒక ట్రైన్‌ బీహార్‌లోని కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు జరిపిన సోదాల్లో ఎనిమిది శక్తివంతమైన బాంబులు రైల్లో దొరికాయి. కొంతమంది క్రిమినల్స్ ఈ రైలులో బాంబులతో ప్రయాణిస్తున్నారన్న సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ ఫోర్స్ తనిఖీలు జరిపడంతో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ బాంబులు దొరికాయి. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఒక సీటు కింద ఒక పాలథిన్ సంచిలో ఈ బాంబులు పెట్టి వున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. తీవ్రవాద కార్యకలాపాల కోసమే ఈ బాంబులను తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ గవర్నర్.. నారాయణ..నారాయణ!

  ఎన్.డి.ఎ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ఆపరేషన్ గవర్నర్’ స్కీమ్‌ని మొదలుపెట్టింది. యుపిఎ హయాంలో నియమితులైన గవర్నర్లని తొలగించే పనిలోపడింది. ఈ స్కీమ్‌లో భాగంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. నారాయణన్ శనివారం రాత్రి తన కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్ ఇచ్చిన తీరు చూసి అయ్యగారి పదవి వదిలేయబోతున్నారన్న అనుమానం కార్యాలయ సిబ్బందికి వచ్చింది. వారి అనుమానాలను నిజం చేస్తూ నారాయణన్ ఆదివారం తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపించారు. అగస్టా హెలికాఫ్టర్ స్కామ్‌లో నారాయణన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులను తిరగదోడుతామని ఎన్డీయే ప్రభుత్వం హెచ్చరించడంతో నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

విజయవాడలో ఎయిమ్స్!

  అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ విజయవాడ నగరమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి నడిబొడ్డున వున్న విజయవాడ నగరమే రాష్ట్ర రాజధానికి అన్నివిధాలా అనుకూలమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా వుండగా విజయవాడలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో వున్న ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రిని విజయవాడలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్ ఆస్పత్రి కోసం కేంద్ర బృందం రెండు, మూడు రోజుల్లో విజయవాడలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ కోసం కేంద్రం రూ.12 కోట్లు నిధులు కేటాయిస్తోందని, మెడికల్ హబ్ సిటీగా విజయవాడను తీర్చిదిద్దనున్నామని ఆయన తెలిపారు.

మెట్రో: చుక్ చుక్ రైలు ఆగింది!

  హైదరాబాద్ నగరంలో శరవేగంగా జరుగుతున్న మెట్రో రైలు నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్న మెట్రో రైలుకు అడుగడుగునా రెడ్ సిగ్నల్ పడుతోంది. మెట్రో రైలు ప్రయాణించే సుల్తాన్ బజార్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో భూగర్భ మెట్రోరైలు నిర్మాణం చేపట్టాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన షరతు ఇప్పటికే చాలా అయోమయాన్ని సృష్టించింది. ఇలా మెలికలు పెడితే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థ చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఎల్అండ్టీ మెట్రో రైల్ సంస్థకు, కాంట్రాక్టర్లకు మధ్య వివాదం చెలరేగడంతో మెట్రో పనులు ఆగిపోయాయి. ఎల్ అండ్ టి అధికారులు తమకు డబ్బులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఇక మెట్రో రైలు పనులు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో దేవుడా!

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ

  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్‌ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)తోపాటు ఇస్రో శాస్త్రవేత్తల మీద అభినందనల వర్షం కురుస్తోంది. రాకెట్ ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించిన భారత ప్రధాని నరేంద్రమోడీ శాస్త్రవేత్తలందర్నీ ఎంతో సంతోషంగా అభినందించారు. అలాగే రాకెట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు షార్ శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి కారణమైన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

మరో నీటిగండం: ఐదుగురు విద్యార్థుల మృతి

  ఇంజనీరింగ్ విద్యార్థుల మీద ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో బీస్ నది దగ్గర జరిగిన దుర్ఘటనలో 23 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మరణించిన విషయాన్ని ఇంకా మరువకముందే నల్లగొండ జిల్లాలోని దిండి ప్రాజెక్టు దగ్గర మరో విషాద సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరిలో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు వున్నారు. వీరు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్లంతా అన్నదమ్ముల బిడ్డలు. తమ తాతయ్య దశదిన కర్మల కార్యక్రమానికి వచ్చి, ఆ తర్వాత ఆరుగురు కలిసి దిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. ఐదుగురూ నీటిలో దిగిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ ఐదుగురు కొట్టుకుపోయారు. ఒక్కరు మాత్రం నీటి ప్రవాహం పెరగడాన్ని గమనించి ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హర్షవర్ధన్, ప్రణీత్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, దేవయాని, జ్యోత్స్నగా గుర్తించారు. మృతదేహాలు బయటపడ్డాయి.

తల్లి కాదు.. రాక్షసి!

  కన్నతల్లిని మించిన దైవం వుండదంటారు. అయితే కొంతమంది కన్నతల్లులు దైవంలా కాకుండా దయ్యంలా, రాక్షసిలా ప్రవర్తిస్తూ వుంటారు. అలాంటి తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకరు బయటపడింది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లిలో రక్తం పంచుకు పుట్టిన బిడ్డను తల్లే కర్కశంగా హతమార్చింది. ఆ రాక్షసి తల్లి పది రోజుల వయసున్న ఆడ శిశువును నీటితొట్టిలో వేసి చంపివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిని విచారిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణం వల్లే ఆ తల్లి చిన్నారి శిశువును చంపినట్టు భావిస్తున్నారు. ఈ తల్లికి మొదటి కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. చనిపోయిన పాప తల్లిదండ్రులు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు.

రోడ్డు ప్రమాదం: నన్నపనేని అల్లుడికి గాయాలు

  హైదరాబాద్ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి అల్లుడు లతీష్‌రెడ్డి గాయపడ్డారు. లతీష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నన్నపనేని సుధకు భర్త . లతీష్‌రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా హైదరాబాద్ శివార్లలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని పైనుంచి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన లతీష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సమీప ప్రయివేటు హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

రాకెట్ సూపర్ సక్సెస్ అయిందోచ్!

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో శాటిలైట్ లాంచ్ వెహికల్ (రాకెట్)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్‌ని భారత ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో సోమవారం ఉదయం 9.52 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించింది.. ఈ వాహననౌక పీఎస్‌ఎల్‌వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 27వది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్‌కు చేరుకొని స్వయంగా రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఉన్నారు. మరోసారి విజయం సాధించిన షార్ శాస్త్రవేత్తలను ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు అభినందించారు.

ప్రేమించుకున్నారని పబ్లిగ్గా తలలు నరికారు!

పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఒక జంట ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న పాపానికి ఆ జంటలోని అమ్మాయి బంధువులు అందరూ చూస్తుండగా పబ్లిగ్గా ఆ జంట తలలు నరికేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్.లో ఈ సంఘటన జరిగింది. లాహోర్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని దక్షా తెహ్సిల్ అనే గ్రామంలో నివసించే ముయాఫియా బీబీ (23) అనే యువతి పొరుగూరికి చెందిన సజ్జాద్ అహ్మద్ (27) అనే యువకుడిని ప్రేమించింది. ఈ జంట ప్రేమను ముయాఫియా బీబీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో వీరిద్దరూ పారిపోయి జూన్ 18న పెళ్ళి చేసుకున్నారు. పదిరోజులు గడిచిన తర్వాత ఈ జంటకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఒక సమాచారం అందింది. జరిగిందోదే జరిగిపోయింది. మేం మీ పెళ్ళిని ఆమోదిస్తున్నాం. మీరు ఇక ఇంటికి వచ్చేయొచ్చనేది ఆ సమాచారం సారాంశం. తమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించిందన్న ఆనందంతో ఆ కొత్త జంట ముయాఫియా బీబీ ఇంటికి ఆనందోత్సాహాలతో బయల్దేరింది. అయితే వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టగానే ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఊరి చౌరస్తాలో వారిమీద దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఆ కొత్త జంట తలలను అత్యంత కిరాతకంగా నరికేశారు. ఏ ఊరిలో అయితే తమ పరువు పోయిందో ఆ ఊరిలో అందరిముందు వారిద్దరినీ చంపడం ద్వారానే తమ పోయిన పరువు తిరిగి వస్తుందని ముయాఫియా బీబీ కుటుంబ సభ్యులు భావించారని ఆ తర్వాత పోలీసుల విచారణలో తేలింది.

నల్లారి @ నల్లధనం

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశం వుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం మీద రాజకీయ వర్గాల్లో పెద్దగా స్పందన ఏమీ కనిపించలేదు. ఆయన ఏ పార్టీలో వుంటే ఏంటంట అనే అభిప్రాయాలే వినిపించాయి. అయితే కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుంచి ఆయన పక్కలో బల్లెంలా వున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ అంశం మీద కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇలా అలా కాకుండా కిరణ్ కుమార్ డొక్కలో పొడిచేలా వుంది. పెద్ద అవినీతిపరుడైన కిరణ్ కుమార్ రెడ్డి తన దగ్గర వున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసమే బీజేపీలో చేరబోతున్నారని డొక్కా విమర్శించారు. టీడీపీ, బీజేపీ మధ్య వున్న సంబంధాలను చెడగొట్టే ఉద్దేశం కూడా నల్లారి వారికి వుందని డొక్కా వారు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీలో దారుణం: టాంజానియా మహిళల రేప్!

రేప్‌ల విషయంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంతో ఆ పక్కనే వున్న దేశ రాజధాని ఢిల్లీ కూడా పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో శనివారం నాడు టాంజానియా దేశానికి చెందిన ఇద్దరు యువతులు అత్యాచారానికి గురయ్యారు. కునాల్, సతీష్ అనే ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లో నివసించే ఇద్దరు యువకులు తమ మీద అత్యాచారం జరిపారని ఇద్దరు టాంజానియా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వారిద్దరూ కలసి ఇద్దరు టాంజానియా యువతులను మానభంగం చేశారని తేలింది. దాంతో వారిద్దరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.

మొదటి ప్రపంచయుద్ధానికి వందేళ్ళు!

  ప్రపంచ గమనాన్ని సమూలంగా మార్చివేసిన మొదటి ప్రపంచ యుద్ధం మొదలై నేటికి వందేళ్ళు పూర్తయింది. జూన్ 28, 1914న మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బోస్నియా రాజధాని సారజోవోలో ఆస్ట్రియా రాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీని గావ్రిలో ప్రిన్సప్ అనే అతివాది దారుణంగా కాల్చి చంపడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. రాజును, ఆయన భార్యను అతివాది కాల్చి చంపడంతో ఆస్ట్రియా బోస్నియాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఆ తర్వాత రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలన్నీ యుద్ధరంగంలోకి దిగాయి. లక్షలమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచ గతిని మార్చేసింది.

నైజీరియా మిలిటెంట్లకి ఓ కన్య హాట్ ఆఫర్

  నైజీరియాలో‌ ఇస్లామిక్ మిలిటెంట్లు ఈమధ్యకాలంలో 276 మంది స్కూళ్ళలో చదువుకునే అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. ముస్లిం అమ్మాయిలు చదువుకోకూడదన్నది ఇస్లామిక్ తీవ్రవాదుల సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా స్కూలుకు వెళ్తున్న అమ్మాయిలను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలను తీవ్రవాదుల చెర నుంచి విడిపించడానికి నైజీరియా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అమ్మాయిలను విడిచిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్ హాలీవుడ్ తారలతో కలసి విజ్ఞప్తి చేసినా తీవ్రవాదుల మనసు కరుగలేదు. ఈ నేపథ్యంలో నైజీరియా పాప్ గాయని అడోకియేను రంగంలోకి దిగింది. తీవ్రవాదులు స్కూలు అమ్మాయిలను విడుదల చేస్తే దానికి బదులుగా తన కన్యత్వాన్ని అర్పించడానికి సిద్ధంగా వున్నానని ప్రకటించి సంచలనం సృష్టించింది. తీవ్రవాదులు తమ దగ్గర బందీలుగా వున్న అమ్మాయిలందర్నీ విడిచిపెట్టి, వారికి బదులుగా తనను అదుపులోకి తీసుకోవచ్చని, తను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌కి తీవ్రవాదుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోయినప్పటికీ, ఆమె చేసిన ప్రతిపాదన మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.