రైల్వే బడ్జెటులో కొత్త రైల్వే జోన్ ప్రసక్తి లేదేమిటి?
posted on Jul 8, 2014 @ 3:43PM
రైల్వే బడ్జెటులో కొత్త రైల్వే జోన్ ప్రసక్తి లేదేమిటి? రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అందుకోసం వేసిన కమిటీ ఇంకా తన నివేదిక సమర్పించకపోవడంతో ఈరోజు ప్రకటించలేదు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు కోసం అనేక ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొనవలసి ఉంటుంది. అందుకే కమిటీ నివేదిక అందజేయడానికి మరికొంత సమయం పడుతుంది.
విశాఖ కేంద్రంగా ఈ కొత్త రైల్వేజోను ఏర్పాటు చేయాలని భావిస్తునందున, ముందుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రింద ఉన్న వాల్టేర్ (విశాఖ) డివిజన్ను దాని నుండి వేరు చేయవలసి ఉంటుంది. అయితే అందుకు ఒడిష ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర అభ్యంతరం పెడుతున్నారు. ఒకవేళ వాల్టర్ డివిజన్ను తీసుకోదలిస్తే, తమకు కొత్తగా మూడు రైల్వే డివిజన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క (విశాఖ) రైల్వే జోన్ ఏర్పాటు కోసమే అనేక ఏళ్లుగా పోరాటాలు చేయవలసి వస్తే, ఒడిష ప్రభుత్వం, వాల్టేర్ డివిజను వదులుకొనందుకు ఏకంగా మూడు కొత్త రైల్వే జోన్లు కావాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదం.
ఇక కొత్త రైల్వే జోను ఏర్పాటు కోసం భూముల సమీకరణ, దక్షిణ మధ్య రైల్వేతో సహా ఇతర రైల్వే జోన్లతో చేసుకోవలసిన సాంకేతిక ఏర్పాట్లు, సర్దుబాట్లు వగైరాలు చాలానే ఉన్నాయి. ఇంకా పైకి తెలియని అనేక అంశాలు, సమస్యలు అన్నిటికీ తగిన పరిష్కారం కనుగొన్న తరువాతనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలను సమస్యలలోకి నెట్టినట్లు కాకుండా, రైల్వే జోన్ ఏర్పాటుకు ముందే అన్ని సమస్యలు పరిష్కరించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు తెర వెనుక కమిటీ సభ్యులు, రైల్వే అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈరోజు బడ్జెట్ లో కొత్త రైల్వే జోన్ ప్రస్తావన లేకపోయినప్పటికీ కంగారు పడవలసిన అవసరం లేదు.