మేడెక్కి దూకుతా: ఎమ్మెల్యే వార్నింగ్
posted on Jul 8, 2014 @ 3:00PM
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, దారుణాలను అడ్డుకోలేకపోతున్నానన్న నిర్వేదం ఎవరిచేత ఎలాంటి పని అయినా చేయిస్తుంది. ప్రస్తుతం గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో అనేకమంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టుకున్న కట్టడాలను నేలమట్టం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిని తెలంగాణ, సీమాంధ్ర అనే తేడా లేకుండా ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అక్రమంగా అమ్మినవారిని వదిలేసి అమాయకంగా కొన్నవారిమీద ప్రతాపం చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకముందు గురుకుల్ ట్రస్ట్ భూముల బాధితులకు అండగా వుంటామని ప్రకటించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట తామే తప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతలకు గురైన భవనాలను సందర్శించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టిన కట్టడాల విషయంలో కేసీఆర్ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని, బడా బాబులు కట్టిన భవంతులను వదిలేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్ళను కూల్చివేస్తున్నారని విమర్శించారు. గురుకుల్ ట్రస్ట్ భూములు కొనుక్కున్న సమాన్యులకు న్యాయం జరిగేలా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రతినిధి బృందంతో వచ్చిన స్థానిక శేరిలింగంపల్లి తెలుగుదేశం శాసనసభ్యుడు అరకపూడి గాంధీ స్థానిక ప్రజల పక్షాన నిలిచారు. ఇక్కడి కట్టడాలను కూల్చడం దారుణమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఇక్కడి కట్టడాలను కూల్చడానికి ప్రయత్ని్స్తే తాను భవంతి మీదకి ఎక్కి కిందకి దూకేస్తానని హెచ్చరించారు.