చంద్రబాబును అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు... పరకాల
posted on Jun 8, 2015 @ 3:17PM
నోటుకు ఓటు కేసులో ఎలాగైనా సీఎం చంద్రబాబును ఇరికించాలని గట్టి ప్రయత్నమే చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న రాత్రి చంద్రబాబు సంభాషణల ఆడియో టేపును బయటపెట్టడం.. అది కూడా తన సొంత ఛానల్ అయిన టీ న్యూస్ లో ప్రసారం చేయడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ పనికి ఏపీ ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడెక్కడో మాటలన్నీ గుచ్చి చంద్రబాబు మాటలంటున్నారని.. అసలు ఆ ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నీచంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించినప్పుడు ఈ సంభాషణ ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేరని, ఆయనను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి మొదటి వారికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో కావాలనే ఈ టేపును విడుదలచేశారని అయినా తమ సభ జరుగుతుందని, తమ సంకల్పం బలపడుతుందని అన్నారు.