నిర్విగ్నంగా సాగుతున్న అమరావతి భూమిపూజ
posted on Jun 6, 2015 8:58AM
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూమి పూజా కార్యాక్రమాలు తుళ్ళూరు మండలంలో మండడం గ్రామంలో సర్వ్ నెంబర్స్:135,136లలో ఈరోజు తెల్లవారు జామున సుమారు 4.30గంటల నుండే ప్రారంభం అయ్యాయి. వైఖానస ఆగమనశాస్త్రంలో దిట్ట నల్లూరు విఖనస భట్టాచార్యులు, దాశరధి శ్రీనివాసా దీక్షితుల నేతృత్వంలో మొదట స్థల శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తరువాత వరుసగా విఘ్నేశ్వర పూజ, కలశ, ఆగారం, విష్వక్సేన, అష్ట దిక్పాల, నవగ్రహ, నాగేటి పూజలు, వాస్తు పురుష పూజ, గోపూజ, వృషభ పూజ నిర్వహిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి మరి కొద్ది సేపటిలో అంటే 8.49నిమిషాలకు భూమి పూజ చేసి అనంతరం హల పూజలో భాగంగా భూమి పూజ చేసిన అ ప్రాంతానికి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నేలను దున్ని పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చంద్రబాబు స్వయంగా అరకపట్టి నేలను దున్నుతుంటే ఆయన అర్ధాంగి భువనేశ్వరి స్వయంగా విత్తనాలు చల్లుతారు.
ఇదివరకు రాజులు తమ రాజ్యాలను స్థాపించే ముందు తమ రాజ్యంలో ప్రజలు అందరూ భోగ భాగ్యాలతో, పాడిపంటలతో కలకాలం సుఖంగా, సంతోషంగా ఉండేందుకుగాను ఈవిధంగానే ముందుగా అన్ని పూజలు నిర్వహించిన తరువాత భూమిని దున్ని విత్తనాలు చల్లేవారని చరిత్రలో పేర్కొనబడింది. అందుకే చంద్రబాబు నాయుడు దంపతులు కూడా వేదపండితులు సూచించిన విధంగా ఈ కార్యక్రమాలన్నీ అన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. హలపూజ తరువాత దంపతులిరువురూ వేద పండితులకు ఘనంగా సంభావన ఇచ్చి వారి ఆశీర్వచనం పొందుతారు.