జయలలిత కోర్టు కేసుల బిల్లు జయకే
posted on Jun 5, 2015 @ 8:33PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు సుమారు గత రెండు దశాబ్దాలుగా కర్నాటక రాష్ర్టంలో సాగింది. తమిళనాడులో విచారణ జరిగితే కోర్టు తీర్పుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక పొరుగు రాష్ట్రమయిన కర్ణాటకలో జరపాలని జయలలిత అభ్యర్ధన మేరకే ఆమె కేసు అక్కడికి బదిలీ అయ్యింది. ఏళ్ల తరబడి ప్రత్యేకకోర్టులో ఆ తరువాత కర్నాటక హైకోర్టులో సాగిన కేసుల నుండి ఆమె చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో బయటపడి మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోయి చాలా కులాసాగా రాష్ట్రాన్ని తనదైన శైలిలో పరిపాలించుకొంటున్నారు. కానీ ఇన్నేళ్ళుగా ఆమె కేసు జరుగుతున్నప్పుడు తమ ప్రభుత్వం సుమారు రూ.5 కోట్లు పైనే ఖర్చు పెట్టిందని దానిని చెల్లించమని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది.
అయితే కర్నాటక హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించి కేసుల నుండి విముక్తి చేస్తే అందుకు సంతోషించవలసిన కర్నాటక ప్రభుత్వం, ఊరుకోకుండా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చేయబోతున్నప్పుడు అది పంపిన బిల్లును జయలలిత చెల్లిస్తారా? ఒకవేళ చెల్లిస్తే ఆమెకు సుప్రీంకోర్టుకి ఈడ్చినందుకు కూడా మున్ముందు బిల్లు చెల్లించమని అడుగుతుందేమో కూడా? ఒకవేళ ఆమె ఇప్పుడు చెల్లించకపోతే ఆమె నుండి ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి కర్నాటక ప్రభుత్వం మరొక కొత్త కేసు వేస్తుందేమో? దానికి కూడా జయలలితనే బిల్లు చెల్లించమని అడిగినా ఆశ్చర్యం లేదు.ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు కేసుల బిల్లును ఆయనకే పంపించాలేమో?