మీ పిల్లల్ని అదుపులో ఉంచండి… గుజరాత్ ముఖ్యమంత్రికి మోదీ హెచ్చరిక!
posted on Feb 3, 2016 @ 10:42AM
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న పనికి ఆహారభద్రత పథకం గుజరాత్‌లో సరిగా అమలు జరగడం లేదంటూ సుప్రీం కోర్టు ఆమెకు అక్షింతలు వేసింది. మరోవైపు తన వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్ధిక్ పటేల్ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా మోదీ కూడా ఆమె పిల్లల తీరు గురించి ఆనందిబెన్‌ను హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆనంది బెన్ కొడుకు సంజయ్, కూతురు అనార్‌లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి.
వారిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేస్తూ తమ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దానికి తగినట్లుగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ, రోడ్లు భవనాల శాఖ వంటి కీలక శాఖలన్నీ ఆనందిబెన్ చేతుల్లోనే ఉన్నాయి. అసలే ముఖ్యమంత్రి ఆపై ఆర్ధిక మంత్రి… ఇక ఆమె తల్చుకుంటే జరగంది ఏముంటుంది. ఆనందిబెన్ తీసుకునే కీలక నిర్ణయాలలో ఆమె పిల్లల పాత్ర ఉందన్న విషయం దిల్లీదాకా పాకడంతో మోదీ ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఆరోపణల్లో నిజం ఉన్నా లేకున్నా విపక్షాలకు అలాంటి విమర్శలు చేసే అవకాశం ఇవ్వవద్దని ఆమెకు మోదీ సూచించారట. మరి ఆమె వారసులు మోదీని చూసైనా వెనక్కి తగ్గుతారో లేదా!