దేవుడిని నమ్మనందుకు 800 కొరడా దెబ్బలు…
posted on Feb 3, 2016 @ 1:14PM
అష్రఫ్ ఫయాద్ ఒక కవి. అతనికి దేవుడంటే అంతగా నమ్మకం లేదు. అదే విషయాన్ని ఆయన తరచూ తన కవితలలో, వ్యాసాలలో రాసేవాడు. అదే అతను చేసిన నేరం! సౌదీ అరేబియాకు చెందిన అష్రఫ్‌కు ఆ దేశం మరణశిక్షను విధించింది. అఫ్రఫ్ నాస్తికుడు అని నిరూపించేందుకు ఆయన రాసిన ‘Instructions within’ అనే పుస్తకాన్ని కోర్టు సాక్ష్యంగా తీసుకుంది. అఫ్రఫ్‌కు మరణదండన విధించారని తెలియగానే ఆయన తండ్రి గుండెపోటుతో చనిపోయారు. కనీసం తన తండ్రి అంత్యక్రియలకు కూడా అఫ్రప్ హాజరయ్యే అవకాశం లభించలేదు.
అఫ్రఫ్‌కు విధించిన శిక్ష మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ‘జాలి’ తలచి ఆ శిక్షను ఇప్పుడు కాస్త కుదించింది. మరణశిక్షకు బదులుగా అష్రఫ్ ఎనిమిది ఏళ్ల కారాగార శిక్షనీ, 800 కొరడా దెబ్బలనీ భరించాల్సి ఉంటుంది. ఈ 800 కొరడా దెబ్బలనీ 16 దఫాలుగా విధిస్తారు. అఫ్రఫ్ తాను దైవద్రోహం చేసినట్లుగా బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయవలసి ఉంటుంది. ఇలాంటి శిక్షలు ప్రపంచానికి కొత్తేమో కానీ సౌదీ అరేబియాకు మాత్రం కాదు. చిన్నచిన్న నేరాలకి కూడా కఠినమైన శిక్షలను విధించడం అక్కడ పరిపాటే! పోయిన ఏడాది సౌదీ అరేబియా 153 మంది పౌరులకు మరణదండన విధించింది!