జర్నలిస్టుని అపహరించిన చైనా ప్రభుత్వం..
posted on Feb 4, 2016 @ 10:48AM
కొన్ని దేశాలలో ఎవరైనా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారి మీద కఠినమైన కేసులను మోపుతారు. కానీ చైనాలో అలా కాదు! చైనా గురించి అక్కడి పౌరులలో ఎవరన్నా మాట్లాడితే వారు కనిపించకుండా పోతారంటున్నారు విమర్శకులు. ఒకవేళ ఎవరన్నా చైనా ప్రభుత్వానికి భయపడి వేరే దేశానికి పారిపోయినా కూడా అక్కడికక్కడే మాయమైపోతుంటారు. అలాంటి మరో సంఘటన ఇప్పడు ప్రపంచ వార్తలలో నిలుస్తోంది. ‘లీ జిన్’ అనే ఒక వార్తా సంపాదకుడు చైనా ప్రభుత్వానికి భయపడి థాయ్‌లాండ్‌కు పారిపోయాడు. కానీ అక్కడికి చేరుకున్న కొద్ది రోజులలోనే మాయమైపోయాడు. తాను ప్రస్తుతం చైనాలో ఉన్నట్లు లీ జిన్ నుంచి అతని భార్యకు చివరి ఫోన్ వచ్చింది! లీ జిన్ గతంలో ఒక వార్తా పత్రికను నిర్వహించేవాడు. అతని విలేకరుల ద్వారా తమకు కావల్సిన రహస్యాలను అందించాలని చైనా ప్రభుత్వం లీ జిన్ మీద తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చిందట. ఈ పోరు భరించలేకే తాను దేశాన్ని విడిచిపెట్టి పోతున్నట్లు లీ జిన్ తన మిత్రులకు చెప్పాడు. ఆ తరువాత మాయమైపోయాడు! ఎప్పటిలాగానే చైనా ప్రభుత్వం దీని గురించి నోరు విప్పడం లేదు. లీ జిన్ వ్యవహారం తనది కదంటే తనది కాదనీ ప్రభుత్వ శాఖలన్నీ తప్పించుకుంటున్నాయి. మరి ఇంతకీ లీ జిన్ ఏమైనట్లో!!!