జగన్ ది అపరిచితుడు క్యారెక్టర్.. పుస్తకాలు రాసుకుంటా.. మైసూరా

వైసీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. జగన్ వ్యవహారం అపరిచితుడు క్యారెక్టర్ ను తలపిస్తోందని.. మానవీయ కోణంలోనే తాను వైసీపీలో చేరానన్న ఆయన... జగన్ కు మాత్రం మానవీయ కోణం లేదన్నారు. వ్యక్తిగతంగానే కాక కనీసం ఫోన్ లో కూడా జగన్ దొరకరని ఆయన వ్యాఖ్యానించారు.   మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన మైసూరా రెడ్డి బీజేపీ, టీడీపీలో ఏపార్టీలో చేరతారన్న సందేహాలు అప్పుడే వస్తున్నాయి. అయితే దీనికి మైసూరా రెడ్డి.. రాజకీయాల్లో తనకు ఓ అపవాదు ఉందని పార్టీలు మారుతుంటానని అయితే ఇప్పుడు మాత్రం ఏ పార్టీలో చేరనని పుస్తకాలు రాస్తానని అన్నారు.

అంత్రాక్స్ మళ్లీ బయటకొచ్చింది..అది కూడా ఏపీలో..!

2001లో ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన అంత్రాక్స్ మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్ ప్రబలి గతంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హుకుంపేట మండలం పనసకుట్టులో 16 మందికి అంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మండలంలోని తాడిపుట్టు, ఉర్రాడ, నిమ్మపాడు, బొడ్డాపుట్టు గ్రామాల్లోని కొందరు గత వారం రోజులుగా కాళ్లు, చేతులపై మచ్చలుతో బాధపడుతున్నారు. ఇవి అంత్రాక్స్ లక్షణాలను పోలి ఉండటంతో వైద్యులు వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఆయా గ్రామల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధికి సోకిన వారికి తీవ్ర జ్వరం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, శరీరంపై ఎర్రని మచ్చలు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి వస్తాయి.

సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి గండం..! రేసులో ఇద్దరు..

  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పదవికి గండం తప్పనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే. అందుకే ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రంస్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత కొద్దికాలంగా సిద్దరామయ్యపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు తన కొడుకుకి కాంట్రాక్టులు కట్టబెట్టడంపై కూడా అధిష్టానం చాలా సీరియస్ గా ఉందట.. దీనితోపాటు బీజేపీ విభాగం పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తిరిగి చేపట్టడం కూడా కాంగ్రెస్ లో గుబులు రేగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ ఎం కృష్ణతోపాటు, ప్రస్తుతం ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి.

50 కోట్లతో బీజేపీ నేతలు కొనడానికి ప్రయత్నించారు..

ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ, బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రూ. 50 కోట్లతో తమను కొనడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని.. అంతేకాదు తదుపరి ఎన్నికల్లో త‌మ‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామంటూ ప్ర‌లోభ పెట్టార‌ని తెలిపారు. దీనికి బీజేపీ నేతలు స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. త‌గిన ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ త‌మ‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంద‌ని పేర్కొంది.

టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆంధ్రా రుచులు..

తెలంగాణ రాష్ట్ర సమితి 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే ప్లీనరీకి ఖమ్మం నగరం సిద్ధమయ్యింది. మరి కొద్ది సేపట్లో గులాబీ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఖమ్మం చేరుకున్నారు. అయితే అంతమంది హాజరయ్యే టీఆర్ఎస్ ప్లీనరీలో ఎలాంటి వంటలు పసందు చేయనున్నాయి. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతినిధులను విందు భోజనం అలరించనుంది. అతిథులందరికి విభిన్నమైన వంటకాలు నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలతో పాటు ఆంధ్రా వంటకాలు అతిథులకు వడ్డించనున్నారు.   120 మందికి పైగా ఆంధ్రా, తెలంగాణ వంట నిపుణులు నిన్నటి నుంచే పనుల్లో మునిగిపోయారు. మొత్తం 10,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు అల్పాహారం అందించనున్నారు. ఇడ్లీ, పూర్ణం, వడ, ఉప్మా, పెసరట్టు, పొంగలి, కొబ్బరి చట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం భోజనంలోకి తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, కట్లెట్, గారె, కొత్తిమీర, టమాటా చట్నీ, వెజిటబుల్ బిర్యానీ, పన్నీరు కుర్మా, పెరుగు చట్నీ, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, ఉలవచారు, నాటుకోడి పులుసు, పుంటికూర మటన్, చింతచిగురు, రొయ్యలు, కొర్రమీను పులుసు, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడి తదితర 50 రకాల వంటకాలు వడ్డించనున్నారు. చెరుకూరి గార్డెన్‌లో భోజనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

ప్రత్యూష బెనర్జీ మాట్లాడిన చివరి మాటలు ఇవే..

బాలిక వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుని మరణించిన తరువాత రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తూనే ఉంది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో ఎన్నో ట్విస్టులు బయటపడగా ఇప్పుడు తాజాగా మరో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. అదే ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు ముందు లాస్ట్ ఫోన్ కాల్.. దాదాపు 201 సెకన్ల నిడివితో ఉన్న ఈ టెలిఫోనిక్ సంభాషణలో పలు కీలక విషయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రత్యూష తరపు లాయర్ కోర్టు తెలిపిన దాన్ని బట్టి.. "నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో.. చూడు అని ప్రత్యూష అనగా దానికి రాహుల్.. "ఏమైంది. నేను ఇంటికొచ్చాక నీతో మాట్లాడుతాను. నేను దారిలో ఉన్నాను. నేను ఇంటికొచ్చేవరకు ఏమీ చేయకు". అని అన్నాడు.   అంతేకాదు ఇంకా రాహుల్ తనకు 150 ఎకరాల భూమి ఉందని.. తన తల్లి ఒక ఎమ్మెల్యే అని అమ్మాయిలకి చెప్పి మోసం చేస్తుండేవాడని కోర్టుకు తెలిపారు. కానీ రాహుల్ లాయర్ మాత్రం చివరి ఫోన్ కాల్ ఆధారంగా జడ్జిమెంట్ ఇవ్వడం కుదరదు.. అసలు ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటో దర్యాప్తు చేయాలని సూచించారు. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు బయటపడతాయో లేదో చూడాలి.

ట్యాక్సీకి డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లిన క్రికెట్ గాడ్

క్రికెట్ లెజెండ్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోట్లాది మంది అభిమానులతో పాటు కోట్లాది రూపాయల ఆస్తికి అధినేత. అలాంటి సచిన్‌‌ డబ్బుల్లేక క్యాబ్ ఎక్కలేకపోయాడు. అయితే ఇది ఇప్పుడు కాదు తాను 12 ఏళ్ల వయసులో ఉండగా జరిగిన సంఘటన. ముంబైలో డీబీఎస్ బ్యాంక్ డిజీ బ్యాంక్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన మనసులో మాటను బయటపెట్టారు. ముంబై  అండర్-15 జట్టు తరపున పూణేలో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లాను. నాలుగో ఆటగాడిగా క్రీజులో దిగే అవకాశం లభించింది. కానీ రనవుట్ కావడంతో ఎంతో నిరాశతో డ్రెస్పింగ్ రూమ్‌కు వచ్చి ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆ తర్వాత ఈ టూర్‌లో మళ్లీ ఛాన్స్ రాలేదు. వర్షం పడుతుంటే ఆ రోజున బయటకు వెళ్లి సినిమా చూసి కడుపునిండా తిన్నాము. దాంతో జేబులో ఉన్నదంతా ఖర్చయిపోయింది. ముంబైకి రైలులో తిరిగి చేరుకున్న తర్వాత జేబులో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో చేతిలో ఉన్న రెండు పెద్ద బ్యాగులను దాదార్ స్టేషన్ వద్ద వదిలి ఇంటికి నడుచుకుంటూ వెళ్లాను అంటూ సచిన్ తెలిపారు. కానీ ఆ తర్వాత స్వయంకృషితో ఎదిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఎదిగాడు.

ఐపిఎల్ 2016 : సన్ రైజర్స్ స్కోర్ 118/8

వరుణుడి కారణంగా ఆలస్యంగా మొదలైన ఉప్పల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో లో స్కోర్ నమోదైంది. టాస్ గెలిచిన ధోనీ హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పగించాడు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ వార్నర్ అవుట్ కావడంతో సన్ రైజర్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకూ కేవలం వార్నర్ ఇన్నింగ్ప్ మీదే నెట్టుకొచ్చేసిన సన్ టీంకు, ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా మిడిల్ ఆర్డర్ కూడా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు శిఖర్ ధావన్ (56, 53 బంతుల్లో) కాస్త ఫామ్ లోకి వచ్చాడు. చివరిలో భువనేశ్వర్ కుమార్ (21,8 బంతుల్లో) బ్యాట్ ఝళిపించడంతో, సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. పుణే బౌలింగ్ లో థిండాకు 3 వికెట్లు, మార్ష్ కు 2 వికెట్లు, పెరీరా అశ్విన్ లకు చెరో వికెట్ లభించాయి.

హైదరాబాద్ ఐపిఎల్ మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి..!

  ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్, పుణే సూపర్ గెయింట్స్ మ్యాచ్ కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ గెలిచి హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు పుణే కెప్టెన్ ధోని. బ్యాట్స్ మెన్, ఫీల్డర్స్ గ్రౌండ్ లోకి వెళ్లగానే వర్షం మొదలైంది. దీంతో ప్లేయర్లందరూ వెనుదిరిగారు. పిచ్ ను గ్రౌండ్ స్టాఫ్ కవర్ చేశారు. తొమ్మిందింటిలోపు వర్షం తగ్గితే 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యపడుతుంది. లేని పక్షంలో ఓవర్ల కోత మొదలవుతుంది. హైదరాబాద్ టీం లో గత మ్యాచ్ గెలిచిన టీంలో బరీందర్ స్రాన్ ప్లేస్ లో ఆశిష్ నెహ్రా వచ్చాడు. పుణే టీం ఆల్బీ మోర్కెల్ స్థానంలో మిచెల్ మార్ష్, అంకిత్ శర్మ స్థానంలో అశోక్ ధిండా తీసుకుంది. హైదరాబాద్ లో ఇప్పటి వరకూ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్స్, 142, 142, 143 నమోదయ్యాయి. మూడింటిలోనూ ఛేజింగ్ చేసి సన్ రైజర్స్ గెలిచింది. ఈరోజు మొదట బ్యాటింగ్ చేస్తున్న కారణంగా, 160 లేదా 170 కి పైగా స్కోర్ నమోదు చేయాలని సన్ రైజర్ప్ భావిస్తోంది. సన్ ఆశలన్నీ డేవిడ్ వార్నర్, ముస్తాఫిజుర్ రెహమాన్ మీదే ఉన్నాయి. హైదరాబాద్ గత మూడు మ్యాచ్ లను గెలివగా, పుణే టీం మొదటి మ్యాచ్ తప్ప మళ్లీ గెలవలేదు. ఈ మ్యాచ్ ఓడిపోతే, పుణే కు సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

స్మృతి ఇరానీ తల పట్టుకున్న మాయవతి..!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిని అభిమానులు అపర కాళీకాదేవిగా మార్చారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మాయావతి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాళీమాత ముఖాన్ని తొలగించి అక్కడ మాయావతి చిత్రాన్ని పెట్టారు. కాలికింద రాక్షసుడి స్థానంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ని పెట్టారు. కాళీమాత మెడలో ఉండే పుర్రల స్థానంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి తలను పెట్టారు. కాళీ మాత మరో చేతిలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తలను నరికి పట్టుకున్నట్లుగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మరో పక్క నిల్చుని కాళీమాతను శరణు కోరుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. దాంతోపాటుగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు రద్దే చేయబోనని చెబుతున్నట్లు రాశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి పోస్టర్ల ద్వారా బీఎస్సీ మత కల్లోలాన్ని ప్రోత్పహిస్తోందన్నారు. ఆ పార్టీ గతంలో కూడా హిందూ దేవతల్ని ఎగతాళి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడి కోరి ఇబ్బందులు తెచ్చుకుంటోందని బీజేపీ వ్యాఖ్యానించింది.

హైదరాబాద్‌‌పై దయ చూపిన భానుడు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 36 డిగ్రీ‌లను దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. అలాంటి వాతారణంలో ప్రజలు అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు. అయితే మొన్న కురిసిన వర్షంతో వాతావరణం కాస్తంత చల్లబడినట్లే చల్లబడి..మళ్లీ వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మార్పు వచ్చింది. కొద్దిసేపటి క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దిల్‌‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చార్మినార్, నాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. దీంతో జనానికి ఎండవేడిమి నుంచి కాస్తంత ఉపశమనం లభించింది.

పవన్‌కు గుడ్ ‌న్యూస్..రాజకీయ పార్టీలకు బ్యాడ్ న్యూస్

పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్. ఆయన స్థాపించిన "జనసేన" కు రాజకీయపార్టీ హోదా దక్కింది. ఇప్పటికే తెలంగాణలో "జనసేన"కు రాజకీయపార్టీగా గుర్తింపు లభించగా, తాజాగా ఏపీలోనూ ఆ పార్టీకి పొలిటికల్ పార్టీ హోదా దక్కింది. ఈ మేరకు నిన్న ఏపీ ఎన్నికల సంఘం..జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ అధినేత పవన్‌కు గుర్తింపుకు సంబంధించిన పత్రాలు చేరాయి. ఆయనతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఈ పత్రాలను పంపింది. ఇకపై "జనసేన"ను రాజకీయ పార్టీగా పరిగణించాలని ఆ పత్రాల్లో సూచించింది. దీంతో పార్టీ రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తయినట్లే. అయితే రాజకీయ పార్టీగా గుర్తించినప్పటికి..ఇంకా పార్టీకి గుర్తును మాత్రం ఎన్నికల సంఘం కేటాయించలేదు. అయితే గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా..మిగతా పార్టీలు మాత్రం బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చిందని ఫీలవుతున్నారు.

ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ నేచురల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 1.45 ప్రాంతంలో పై అంతస్తులో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే భవనమంతా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 37 ఫైరింజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. నేచురల్ మ్యూజియమ్‌‌తో పాటు ఫిక్కి ఆడిటోరియం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపుచేస్తున్న క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముండటంతో చుట్టుప్రక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

మహిళతో రాజీ..రావెల సుశీల్ కేసు కొట్టివేత..

మహిళను చేయిపట్టుకుని బలవంతంగా లాగిన కేసులో మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు, రావెల సుశీల్‌పై నమోదైన కేసును తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. గత నెల 4వ తేదిన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.13లో మద్యం మత్తులో రోడ్డుపై నడిచి వెళుతున్న ఫాతిమా అనే మహిళను సుశీల్, కారు డ్రైవర్ అప్పారావు కారులోకి బలవంతంగా లాగే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు సుశీల్, అప్పారావును చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సుశీల్ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఫిర్యాదుదారు ఫాతిమా బేగంతో రాజీ కుదిరిందని సుశీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. పిటిషనర్లు, ఫిర్యాదు దారులు రాజీకి రావడంతో కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

జగన్‌తో ఢిల్లీ వెళ్లాల్సిన 8 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. 44 మంది ఎమ్మెల్యేలు విమానం ఎక్కగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసలు విమానమే ఎక్కలేదు. వీరిలో కిడారి సర్వేశ్వరరావు(అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి),  బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్‌నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), రామచంద్రారెడ్డి ( పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు.   వీరిలో అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో కనిపించలేదు.తాత మరణంతో నిన్న ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి తిరిగి రాత్రికల్లా ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే కిడారి, గొట్టిపాటి, బుడ్డా. పోతుల కనిపించని వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే నిన్న ఫ్లైట్ ఎక్కలేదని ప్రచారం జరుగుతోంది.