టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆంధ్రా రుచులు..
posted on Apr 27, 2016 @ 10:56AM
తెలంగాణ రాష్ట్ర సమితి 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే ప్లీనరీకి ఖమ్మం నగరం సిద్ధమయ్యింది. మరి కొద్ది సేపట్లో గులాబీ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఖమ్మం చేరుకున్నారు. అయితే అంతమంది హాజరయ్యే టీఆర్ఎస్ ప్లీనరీలో ఎలాంటి వంటలు పసందు చేయనున్నాయి. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతినిధులను విందు భోజనం అలరించనుంది. అతిథులందరికి విభిన్నమైన వంటకాలు నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలతో పాటు ఆంధ్రా వంటకాలు అతిథులకు వడ్డించనున్నారు.
120 మందికి పైగా ఆంధ్రా, తెలంగాణ వంట నిపుణులు నిన్నటి నుంచే పనుల్లో మునిగిపోయారు. మొత్తం 10,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు అల్పాహారం అందించనున్నారు. ఇడ్లీ, పూర్ణం, వడ, ఉప్మా, పెసరట్టు, పొంగలి, కొబ్బరి చట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం భోజనంలోకి తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, కట్లెట్, గారె, కొత్తిమీర, టమాటా చట్నీ, వెజిటబుల్ బిర్యానీ, పన్నీరు కుర్మా, పెరుగు చట్నీ, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, ఉలవచారు, నాటుకోడి పులుసు, పుంటికూర మటన్, చింతచిగురు, రొయ్యలు, కొర్రమీను పులుసు, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడి తదితర 50 రకాల వంటకాలు వడ్డించనున్నారు. చెరుకూరి గార్డెన్‌లో భోజనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.