భూవివాదంలో ప్రియాంక గాంధీకి నోటీసులు...

  ఇప్పటికే నేషన్ హెరల్డ్ కేసులో.. ఇప్పుడు తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో సోనియాగాంధీ ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా మరో వివాదంలో ఇరుకున్నారు. ఓ భూవివాదంలో ప్రియాంక గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. అసలు సంగతేంటంటే.. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఓ భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కోర్టుకు తెలియజేయాలని.. అసలు ఎందుకు తెలియజేరాదో కూడా చెప్పాలని చెపుతూ.. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.   కాగా సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి భూమికి సంబంధించిన వివరాలు అదంజేయాలని ధరఖాస్తు చేశారు. అయితే దీనిని సవాల్ చేస్తూ ప్రియాంక గాంధీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు దీనిపై విచారించిన హైకోర్టు పైవిధంగా తెలిపింది. ప్రస్తుతం గాంధీ కుటుంబానికి ఇది గడ్డుకాలంలా ఉన్నట్టుంది.

అగస్టా వెస్ట్ ల్యాండ్..మరో విషయం బయటపెట్టిన సుబ్రహ్మణ్యస్వామి

  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్లో కుంభకోణం ఆందోళనలతో ఇప్పటికే పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది. ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి రోజుకో కొత్త విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో విషయాన్ని బయటపెట్టారు. అగస్టా నుంచి తీసుకున్న ముడుపులను సోనియా గాంధీ... జెనీవాలోని ‘సరసిన్ బ్యాంక్’లో దాచుకున్నారని.. ఇందులో కొంత మొత్తాన్ని అక్కడి నుంచి తరలించిన సోనియా గాంధీ... ‘పిక్ టెట్ బ్యాంకు’లో డిపాజిట్ చేశారన్నారు. ఈ రెండు బ్యాంకుల ఖాతాలను పరిశీలించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీపై కేసులు నమోదు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. మరి దీనిపై ప్రతిపక్షం ఎలా స్పదింస్తుందో చూడాలి.

పాలేరు ఉపఎన్నికకు తుమ్మల నామినేషన్.. అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి

  ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో భాగంగా నామినేషన్ల పర్వం సాగుతోంది. దీనిలో భాగంగానే.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక తుమ్మలకు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న సుచరితారెడ్డి కూడా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

నా పాస్ పోర్ట్ రద్దు చేసి, అరెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా..? మాల్యా వితండవాదం

  విజయ్ మాల్యాను దేశానికి రప్పించాడనికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తున సంగతి తెలిసిందే. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే ఇంతా చేసినా కూడా మాల్యా మాత్రం ఏ మాత్రం దారికి రానట్టే కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న తన ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించాలి అని వితండవాదన చేసిన మాల్యా ఇప్పుడు తాజాగా మరోసారి భారత ప్రభుత్వంపై వాదానికి దిగారు. తప్పనిసరి పరిస్థిల్లోనే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని..  రుణం మొత్తాన్ని చెల్లించడం మాత్రం తనతో అయ్యే పనికాదని తేల్చేశారు. అలాగని రుణాన్ని ఎగ్గొట్టనని, తీసుకున్న రుణంలో తన శక్తి మేర చెల్లిస్తానని కూడా ఆయన బ్యాంకులకు బంపర్ ఆఫరిచ్చారు. అంతేకాదు తన పాస్ పోర్టు రద్దు చేయడం ద్వారానే కాక, తనను అరెస్ట్ చేస్తే డబ్బెలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా తన నుంచి సింగిల్ పైసా కూడా వసూలు కాదని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీలోకి గాదె వెంకటరెడ్డి.. కాంగ్రెస్ నేతలూ క్యూ కడతారా..?

వైసీపీ నేతలు వరుసపెట్టి టీడీపీ పార్టీలోకి చేరతున్న నేపథ్యంలో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి నేతలు చేరడం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నేడు టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై గాదె ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ఆయన కూడా టీడీపీలోకి చేరుతారేమో అన్న సందేహాలు వచ్చాయి. అయితే అలా అనుకున్నారో లేదో అప్పుడే ఆయన టీడీపీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. ఇంకా చంద్రబాబు కూడా గాదెకు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవడంతో నేడు ఆయన టీడీపీలో చేరనున్నారు. తన అనుచరవర్గంతో కలిసి నేటి సాయంత్రం టీడీపీలో చేరనున్నట్లు నిన్న గుంటూరులో గాదె ప్రకటించారు. మరి గాదె తరువాత కాంగ్రెస్ నేతలు కూడా క్యూ కడతారో లేదో చూడాలి.

కలిసిపోయిన భూమా, శిల్పా సోదరులు..!

  ఎట్టకేలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కలిసిపోయినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అఖరికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉండేవారు. అలాంటి ఇద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిన్న టీడీపీలో చేరిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు భూమా, శిల్పా కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాటా మాటా కలిపారు. అంతేకాదు పార్టీ పరిస్థితులపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. దీంతో వారిద్దరూ కలవడంతో పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఎంతకాలం కలిసుంటారో చూడాలి.

కోల్ కతా నైట్ రైడర్స్ స్కోర్ 174/5, ముంబై విజయ లక్ష్యం 175

  ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ముంబై కోల్ కతా మ్యాచ్ లో టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించింది ముంబై. బరిలోకి దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఊతప్ప (36, 20 బంతుల్లో), గంభీర్ (59, 45 బంతుల్లో) రాణించారు. చివర్లో వచ్చిన యూసుఫ్ పఠాన్ (19, 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ముంబై ఆటగాడు టిమ్ సౌథీ వరసగా రెండు సార్లు క్యాచ్ లను జారవిడవడం కోల్ కతా కు కలిసొచ్చింది. బౌలింగ్ లో సౌథీ కి రెండు వికెట్లు, మెక్ గ్లెనాగన్, హర్భజన్, హార్థిక్ పాండ్యాలకు తలో వికెట్ లభించాయి. ముంబై విజయ లక్ష్యం 175 పరుగులు. వాంఖడే స్టేడియంలో 200 పరుగుల లక్ష్యం వరకూ ఛేదించే అవకాశం ఉంది. టోర్నీలోనే అత్యంత పొదుపైన కోల్ కతా బౌలింగ్ లో ముంబై ఎంత వరకూ ఛేజింగ్ చేయగలదనేది ఆసక్తికరం.

మాల్యాను వెనక్కి పంపిచండి.. భారత విదేశాంగ శాఖ లేఖ

  బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటికి ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి.. ఇంటర్ పోల్ కు సమాచారం అందించడమే తరువాయి భాగం. అయితే ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మరో అడుగు ముందుకేసింది. విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు పంపించాలని బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మరి దీనిపై బ్రిటన్ హై కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కేబినెట్ పదవి పై క్లారిటీ ఇచ్చిన లోకేశ్...

  టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేబినెట్ పదవిపై ఎప్పటినుండో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లోకేశ్ కోసం ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేస్తామంటూ త్యాగాలు చేసేస్తున్నారు. అయితే దీనిపై లోకశ్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇప్పుడప్పుడే కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం లేదని.. 2019లో జరిగే ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టేందుకు రెడీ అవుతానని చెప్పారు. దీంతో లోకేశ్ కేబినేట్ పదవిపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.   కాగా చంద్రబాబు నాయుడు లోకేశ్ కు ఇప్పుడప్పుడే కేబినెట్ పదవి కట్టబెట్టడానికి సముఖత చూపించనట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి లోకేశ్ కోసం త్యాగం చేద్దామనుకున్న వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. 

సీఎం గా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు..

  రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం తేజ్ ప్రతాప్ యాదవ్ సీఎం అయ్యారు.  బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈయన సీఎం ఎప్పుడయ్యారనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈయన సీఎం అయింది రియల్  లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అసలు సంగతేంటంటే.. బీహార్ లో లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిలు సీఎంలుగా కొనసాగిన కాలంలో ఆ రాష్ట్రంలో జరిగిన వరుస కిడ్నాప్ లను ఆధారం చేసుకుని భోజ్ పురిలో ‘అపహరన్ ఉద్యోగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రతాప్ యాదవ్ సీఎంగా నటించనున్నారంట. అయితే తన పాత్ర చాలా చిన్నదైన.. చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. మొత్తానికి తన సీఎం కోరికను ఈ రకంగా తీర్చుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్.

కొత్తగా పెళ్లయిన భారత ఆర్మీ జవాన్లకు గుడ్ న్యూస్...

  భారత ఆర్మీలో పనిచేసే జవాన్లకు ఓ గుడ్ న్యూస్. ఇక నుండి పెళ్లయిన వెంటనే విధులు నిర్వహించడానికి వెళ్లకుండా.. ఒక ఏడాది పాటు కుటుంబం, భార్యతోనే ఉండే అవకాశం ఇచ్చారు. భారత సరిహద్ద దళం (బీఎస్ఎఫ్ ) ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అనేక మంది జవాన్లు తమ జీవిత భాగస్వామితో గడపలేక పోయామన్న బాధతో కాలం వెళ్లదీస్తున్నారని.. పెళ్లయిన వెంటనే తన భాగస్వామి నుండి దూరం కావడం వల్ల వారి పని తీరుపై ప్రభావాన్ని చూపుతుందని  ఇలాంటివారికి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చిందని బీఎస్‌ఎఫ్‌ డీజీ కె.కె.శర్మ తెలిపారు.

దర్గాలోకి వస్తే ఇంక్ పడుద్ది.. తృప్తి దేశాయ్ కు హెచ్చరిక

  మహారాష్టలోని శనిసింగనాపూర్ ఆలయంలోకి, నాసిక్ త్రయంబకేశ్వరాలయంలోకి ప్రవేశించడానికి పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించిన భూమాతా బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ మరో పోరాటానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ముంబైలోని హలీ అజీ దర్గాలోకి ప్రవేశిస్తామని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై శివసేన ఇప్పటికే ఆమె దర్గాలోకి ప్రవేశిస్తే.. చెప్పులతో కొడతాం అంటూ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆమె కనుక బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మాత్రం ఆమెపై నల్లరంగు సిరా చల్లుతాం అంటూ మహారాష్ట్రం ఎంఐఎం పార్టీ నేత హజీ రఫత్ హెచ్చరించారు.   మరోవైపు తృప్తి మాత్రం దర్గాలోకి మహిళలను ప్రవేశింపజేయాలని.. వారికి కూడా ప్రార్ధనల్లో సమాన హక్కులు కల్పించాలని.. ఈ నేపథ్యంలోనే దర్గా జంక్షన వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

1500 ఏళ్ల నాటి శవానికి అడిడాస్ షూస్..

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 ఏళ్ల నాటి శవం షూస్ ధరించడం.. అందునా అడిడాస్ బ్రాండ్ షూస్ ధరించిన ఘటన మంగోలియాలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మంగోలియాలోని  పురావస్తు శాఖవారికి అల్తాయ్ పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఒక శవం కనిపించింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ శవానికి తెల్లని చారలు ఉన్న షూస్ ఉన్నట్టు వారు గుర్తించారు. ఈ సందర్భంగా ఖోవ్‌ద్ మ్యూజియం ఎక్స్ పర్ట్ సుఖ్‌బాతర్ మాట్లాడుతూ..మమ్మీ వెలుగు చూసిన ప్రాంతం టర్కీకి చెందిన సమాధి స్థలంలా ఉందని ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్లే డెడ్ బాడీ పాడవలేదని.. షూస్‌ పై తెల్లటి చారలు, స్పోర్ట్స్ బ్రాండ్‌ను సూచించే ఎంబ్లమ్ కూడా ఉందని అంటున్నారు.

లోకేశ్ నోట మీడియా మాట..

  తన తండ్రికి కనీసం మనమడితో ఆడుకునేంత తీరిక కూడా లేదని.. రాష్ట్ర అభివృద్దికోసం రోజులు 18 గంటలు మీటింగులతోనే బిజీగా.. ఒక కుర్రాడిలా కష్టపడుతున్నారని.. నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 65 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.. ఈ విషయంలో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. మీడియా గురించి ప్రస్తావించారు. మన పార్టీకి ఎలాంటి ఛానెళ్లు లేవు.. పత్రికలూ లేవూ.. కార్యకర్తలే మన పార్టీ బలం అని అన్నారు. అందుకే ప్రజా వ్యతిరేక వార్తలు రాసే కొన్ని మీడియా సంస్థల విషయంలో గందరగోళం చెందవద్దు. పార్టీ కార్యకర్తలు అసలు విషయాలను వారికి వివరించాలి” అని లోకేష్ సూచించారు. కాగా గతంలో నారా లోకేశ్ ఓ టీవి ఛానల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చంద్రబాబుకు హైకోర్టులో "చుక్కె"దురు...

  ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీలో ఏపీ సర్కార్ ఎంచుకున్న కొత్త మార్గాన్ని హైకోర్టు నిలిపేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. గతంలో మద్యం పాలసీ ప్రకారం ఎవరు ఎక్కువ ధర ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి అవకాశం దక్కేది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగానే వచ్చేది. అయితే ఈ పద్దతిని మార్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఫస్ట్ కం... ఫస్ట్ సర్వ్’ పేరిట... ఎవరు ముందుగా వస్తే వారికే బార్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసి జీవో నెం:19ను జారీ చేసింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. నేడు విచారించిన హైకోర్టు జీవోను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-33.. లైవ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీర్తి కిరిటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-33 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్‌కు సంబంధించి ఇదే చివరి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతలం, ఆకాశం, సముద్రాల్లో నేవిగేషన్ సేవలను అందించనుంది. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సొంతంగా నేవిగేషన్ వ్యవస్థ ఉన్న అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు.  

చంద్రబాబుపై జేసీ.. మీరు పొగడ్త అనుకుంటే నేనేం చేయలేను..

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా తనకు తానే సాటి. ఒక్క జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే ధోరణి. అయితే ఈసారి జేసీ దివాకర్ రెడ్డి విదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీ చేరిన సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ పాలనలో నిమగ్నమైన చంద్రబాబు... తన మనవడితో కూడా సరదాగా గడపలేకపోతున్నారని.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసుకుపోతున్న చంద్రబాబు కర్మయోగిలా మారారని అన్నారు. అంతేకాదు మనవడు, మనవరాలితో గడిపే క్షణాలు ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రత్యేకమైనవేనని..  అసలు మీ మనవడితో ఎంతసేపు ఆడుకున్నారో చెప్పాలంటూ ఆయన చంద్రబాబును నిలదీశారు.   అయితే ఇంతా మాట్లాడిన జేసీ.. ఇది నా మనసులోని మాట.. దానిని మీరు పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను అని ట్విస్ట్ ఇచ్చారు. అయితే జేసీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు చంద్రబాబుకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా కూర్చున్నారు.

నాకు అంత అవసరం లేదు.. చంద్రబాబు

  ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీ లోకి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు జంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకోగా.. ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.  దీంతో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీలోని ఎమ్మెల్యేలను డబ్బులకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తనకు లేదని, అయినా తనకు ఏ బలహీనతలు లేవని కూడా చంద్రబాబు తేల్చిచెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు అని చంద్రబాబు అన్నారు.   ఇదిలా ఉండగా నిన్ననే వైసీపీ నుంది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి చేరగా.. ఈరోజు బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.