జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ హ్యాక్..పేజీలో సన్నీ అసభ్యకర చిత్రం

ఎన్ని నివారణాచర్యలు చేపడుతున్నా హ్యాకర్లను ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తూనే ఉన్నారు. రైల్వే, ఐబీ. పోలీస్, రక్షణ ఇలా కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్లన్నింటిని జల్లెడ పట్టిన కేటుగాళ్లు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సైట్‌పై ఫోకస్ చేశారు. జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకలను గమనించే పేజీని ఓపెన్ చేయగా దానిలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నగ్న చిత్రం దర్శనమిచ్చింది. దీంతో సైట్ హ్యాకింగ్‌కు గురైందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.

సోలార్ పవర్ తో పసిఫిక్ ను దాటేసింది..!

  పూర్తి సౌరశక్తితో నడిచే విమానం సోలార్ ఇంపల్స్ సక్సెస్ ఫుల్ గా ప్రపంచాన్ని చుడుతోంది. ఈ క్రమంలో, 56 గంటలపాటు ఏకధాటిగా ప్రయాణించి, పసిఫిక్ సముద్రాన్ని దాటి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ను చేరుకుంది. ఈ విషయాన్ని పైలట్ బెర్టాండ్ పికార్డ్ ప్రకటించాడు. విమానాలకు వాడే ఇంధనం చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా అందుకోసం సహజ వనరులను ఖర్చు చేయక తప్పని పరిస్థితి. దీనికి పరిష్కారం కనుక్కునే దిశగా సైంటిస్టులు చేసిన ప్రయోగాల ఫలితమే సోలార్ ఇంపల్స్. ఈ విమానం సౌరశక్తితో నడుస్తూ ప్రపంచాన్ని చుడుతోంది. ఇప్పటికి ఇద్దరు మాత్రమే ప్రయాణించగల ఈ విమానాన్ని, భవిష్యత్తులో భారీ స్థాయి ప్రయాణ సాధనంగా మార్చడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విమానాన్ని శబ్ద, వాయి కాలుష్య రహితంగా తయారుచేయడం విశేషం. సోలార్ ఇంపల్స్ తన ప్రయాణాన్ని 2015లో అబుదాబీ నుంచి స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒమన్, భారత్, మయన్మార్, చైనా లాంటి దేశాల్లో ఆగుతూ వచ్చింది. దేశాల మీదగా ప్రయాణించడం గొప్ప కానప్పటికీ, ప్రపంచంలో అతి పెద్ద మహా సముద్రమైన పసిఫిక్ సముద్రాన్ని దాటడం సోలార్ ఇంపల్స్ ఘనతగా చెప్పచ్చు.

బీహార్లో భారీ అగ్ని ప్రమాదం..వెయ్యి ఇళ్లకు అంటుకున్న నిప్పు..!

  బీహార్లోని దర్భంగా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురి ప్రాణాలు అగ్నికి ఆహుతి కాగా, వేలాది ఇళ్లు అగ్గిపాలయ్యాయి. గ్రామాలకు గ్రామాలే అగ్ని వ్యాపించడంతో, ఈ పెను ప్రమాదం పెద్దదిగా మారిపోయింది. అగ్నిని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది చెమటోడుస్తున్నారు. బీహార్లో అగ్నిప్రమాదం జరగడం ఈ నెలలో ఇది మూడోసారి. వారం క్రితమే ఒక ఫంక్షన్లో అగ్నిప్రమాదం జరిగి 12 మంది మృత్యువుపాలయ్యారు. బీహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4లక్షలు పరిహారంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 న జరిగిన మరో అగ్ని ప్రమాదంలో పెట్రోల్ బంక్ పేలిపోయింది. దగ్గర్లో మనుషులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఇప్పుడు బీహార్ ప్రభుత్వం, అగ్నిప్రమాదాలు నివారించడానికి ఏం చేయలా అని ఆలోచనలో పడింది.  

సెంచరీ కొట్టి ఓడిపోయిన కోహ్లీ..!

  కోహ్లీ సూపర్ ఫాం కంటిన్యూ అవుతోంది. ఈరోజు గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 63 బంతుల్లోనే తన తొలి సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీకి టి20 ఫార్మాట్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్, కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. గేల్ లేకపోవడంతో, వాట్సన్ తో కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. వాట్సన్ త్వరగా అవుటైనా, కోహ్లీ మాత్రం అద్భుతమైన స్ట్రోక ప్లేతో అలరించాడు. వీలు చిక్కనప్పుడల్లా సింగిల్స్, డబుల్స్ తీస్తూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. కోహ్లీ మొదటి 50 పరుగులు చేయడానికి 40 బంతులు పడితే, తర్వాతి 50 చేయడానికి కేవలం 23 పరుగులే తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులతో తన తొలి ఐపిఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు డ్వేన్ స్మిత్ (32, 21 బంతుల్లో), బ్రెండన్ మెకల్లమ్ (42, 24 బంతుల్లో) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. దాంతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది గుజరాత్ లయన్స్. దినేష్ కార్తీక్ (50, 39 బంతుల్లో) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బ్యాటింగ్ అద్భుతంగా సాగడంతో, మూడు బంతులుండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది గుజరాత్ లయన్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి లభించింది.

మయన్మార్ లో వడగళ్ల వాన, 8 మంది మృతి..!

  గత కొన్ని రోజులుగా ఎండలతో మలమలా మాడిపోయిన మయన్మార్ కు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వడగళ్ల వాన, ఈదురుగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు ఎనిమిది మంది మృతి చెందారు. దాదాపు గోల్ఫ్ బంతి పరిమాణంలో వడగళ్లు పడుతుండటంలో ప్రజలు బయటికెళ్లడానికి కూడా భయభ్రాంతులౌతున్నారు. వడగళ్ల దెబ్బకు ఇళ్లన్నీ దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 7500 ఇళ్లకు వడదెబ్బ తాకిడి తగిలిందని అధికారుల అంచనా. గత మూడు నాలుగు రోజుల క్రితమే 40, 50 డిగ్రీల ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు ఇప్పుడు వడగళ్లు ప్రాణసంకటంగా మారాయి. ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

పుట్టిన రోజున పిల్లలతో క్రికెట్ ఆడిన సచిన్..!

  సచిన్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్లయినా, ఇంకా ఆడుతున్నాడు అనే భావనలోనే అతని ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మ్యాచ్ జరిగినా కూడా సచిన్ సచిన్ అనే నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. భారత క్రికెట్ అభిమానులకు సచిన్ అనే పేరుతో అంత అనుబంధం ఉంది. ఏప్రిల్ 24 సచిన్ పుట్టినరోజు. ఈరోజుతో 43వ ఏట అడుగుపెడుతున్న సచిన్ తన పుట్టిన రోజును పిల్లల మధ్య జరుపుకున్నాడు. ముంబైలోని ఎమ్ఐజీ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ లో మేక్ ఎ విష్ ఫౌండేషన్ కోరిక మేరకు, పిల్లలతో కలిసి చిన్న క్రికెట్ మ్యాచ్ ఆడించాడు సచిన్. తనతో పిల్లలు ఆడతున్న వీడియోను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు మాస్టర్. 2013 నవంబర్ న సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 200 టెస్టుల్లో 15921 పరుగులు, 463 వన్డేలాడి 18426 పరుగులు చేశాడు సచిన్. 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్ సచిన్ మాత్రమే.

విజయ్ మాల్యా పాస్ పోర్ట్ ను రద్దు చేసిన ప్రభుత్వం ..!

  విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే ప్రయత్నంలో మెల్లమెల్లగా ఉచ్చుబిగిస్తోంది భారత ప్రభుత్వం. దాదాపు 9 వేల కోట్లకు ఎగనామం పెట్టి మార్చిలో ఇండియాను వదిలేసి, యూకే చెక్కేసిన మాల్యాను వెనక్కి రప్పించాలని బ్యాంకులన్నీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా ముంబై కోర్టుకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు ఇచ్చింది. కానీ మాల్యా హాజరు కాకపోవడంతో, పిఎమ్ఎల్ఏ యాక్ట్, 2002 ప్రకారం ముంబై కోర్ట్ స్పెషల్ జడ్జ్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ దృష్ట్యా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతని పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. ఏప్రిల్ 15న మాల్యా పాస్ పోర్ట్ ను నాలుగువారాల పాటు సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆయన పాస్ పోర్టును ఎందుకు రద్దు చేయకూడదో వారంలో తెలపాలని మాల్యాను వివరణ కోరింది. మాల్యా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే రద్దు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరో వైపు మాల్యా మాత్రం వ్యక్తిగతంగా వచ్చి కలవడానికి మే వరకూ టైం ఇవ్వాలని కోర్టును కోరడం గమనార్హం.

పవన్ ప్రభంజనం ఆంధ్రాకు మాత్రమేనట..!

  తన సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి పవర్ స్టార్ పూర్తి స్థాయిలో పార్టీకే టైం కేటాయిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఏ రాష్ట్ర రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు..? రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తారా..లేక ఒకవైపునే ఉండిపోతారా..? ఆయన సన్నిహితులు రెండో ఆప్షన్ కు పవన్ మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయంగా ఎలాంటి అస్థిరత లేదు. పైగా ప్రజల జడ్జిమెంట్ కేసీఆర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. దీంతో ఇక్కడ పోటీ చేసినా లాభం లేదని, తన దృష్టిని ఆంధ్రా రాజకీయాలవైపు పెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారట. బస్సుయాత్రలు, పాదయాత్రలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఉనికిని ఘనంగా చాటానుకుంటున్నారట. అక్కడి ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపిలకు బలమైన పోటీ ఇవ్వాలనేది పవన్ ఆలోచన. ఈ ఏడాది సెప్టెంబర్ లో గానీ అక్టోబర్లో గానీ జనసేన ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో మొదలవుతుందని, మొదట అక్కడ బలమైన పాగా వేసిన తర్వాతే, పవన్ తెలంగాణా గురించి ఆలోచించాలనుకుంటున్నారని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. పవన్ కు రాజకీయాల్లో ఎంతవరకూ అనుకూల పవనాలు వీస్తాయో చూడాలి మరి.

పాలేరు ఉపఎన్నికపై చంద్రబాబు అసంతృప్తి... అదే కారణమా..?

  పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఉపఎన్నిక ఖాయమైంది. అయితే ఈ ఉపఎన్నిక బరిలోకి టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే తుమ్మల నాగేశ్వర్రావును దించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించేసింది. ఇక తుమ్మలకు పోటీగా టీడీపీ నుండి నామా నాగేశ్వర్రావును బరిలో దించాలని టీడీపీ కూడా చర్చలు జరుపుతోంది. అయితే అంతా బాగానే ఉన్న టీడీపీ నుండి పాలేరు ఉపఎన్నికకు పోటీచేయడానికి చంద్రబాబు మాత్రం ఆసక్తి చూపించడంలేదనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అర్థాంతరంగా కన్నుమూసిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఈ సీటును వదిలిపెట్టాలని ఆయన అన్నట్లు చెబుతున్నారు. అయితే, ఏకగ్రీవానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అంగీకరించలేదు. దీంతో పాలేరులో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నిర్ణయాన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటికే అప్పగించారు. ఈ విషయాన్ని టిడిపిఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.   మరోవైపు చంద్రబాబు ఆసక్తి చూపించకపోవడానికి గల కారణాలు కూడా వేరే ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చెప్పినట్టు.. నోటుకు ఓటు కేసుకు సంబంధించి కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన ఫైల్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బల్లపై ఉందని, కెసిఆర్ సంతకం చేస్తే ఎసిబి చంద్రబాబును ప్రాసిక్యూట్ చేస్తుందని అందుకే ఆయన అంతకా ఇంట్రెస్ట్ చూపించడంలేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు.. మరోసారి ట్రంప్

  అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం కామన్. అసలు దానివల్లే ఆయన ఎక్కువ ఫేమన్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. భారత్ సహా మిగిలిన దేశాలు అమెరికాలోని ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఉద్యోగాల పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శించారు. అమెరికాలోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ తమ దేశంలోని ఉద్యోగాలను ఇతర దేశస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు దీనికి సంబంధించి ఒక తన అనుభవాన్ని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఒక రోజు తాను క్రికెట్ కార్డు సమాచారం కోసం కష్టమర్ కేర్ కు కాల్ చేస్తే.. ఓ లేడీ తన కాల్ లిఫ్ట్ చేసిందని.. ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి మాట్లాతుందనే విషయం తెలుసుకోవాలని ఆమెను ఆడిగితే ..ఇండియా నుంచి అని సమధానం చెప్పిందని ట్రంప్ వెల్లడించారు. పెద్ద పెద్ద ఉద్యోగాల నుంచి చిరు ఉద్యోగాల వరకు ఈ స్థాయిలో మన ఉద్యోగాలు వేరే దేశాలు ముఖ్యంగా ఇండియా, చైనా, వియాత్నం, మెక్సికో్ దేశాలు విపరీతంగా దోచుకుంటున్నాయన్నారు.   అయితే తిట్టి ఆ తరువాత బుజ్జిగించే మాదిరి.. తాను ఆ దేశాలకు వ్యతిరేకం కాదు.. ఆ పరిస్థితులు కల్పించిన గత పాలకులను నింధిస్తున్నా అని చెప్పుకొచ్చారు. కాగా న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దారణం.. అందరూ చూస్తుండగానే ఆపీస్ నుండి లాకెళ్లి అత్యాచారం...

  ఇప్పటివరకూ మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు ఎన్నో విన్నాం. అయితే ఇప్పుడు పంజాబ్ జరిగిన ఘటన చూస్తుంటే.. సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఓ యువతిని బలవంతంగా లాకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్ లోని ముక్త్సర్ నగరంలో ఓ దళిత యువతి ఓ కంపూట్యర్ సెంటర్లో పనిచేస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ వక్తి తను పనిచేసే ఆఫీసు నుండి బలవంతంగా లాకెళ్లి.. కారులో ఫాంహౌస్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం.. ఒకరోజు తర్వాత విడిచిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మార్చి 25న చోటుచేసుకుంది. మహిళను కిడ్నాప్ చేయడం అక్కడి షాపు సీసీ టీవీలో రికార్డు అవ్వడంతో అసలు విషయం బయటపడింది. మరోవైపు జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది.

స్మార్ట్ ఫోన్ల వల్ల మెల్లకన్ను.. పిల్లలు జాగ్రత్త..

  స్మార్ట్ ఫోన్లో వల్ల కొన్ని పనులు చాలా సులభంగా అవ్వొచ్చు కానీ.. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయన్నది వాస్తవం.ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల చిన్నవయస్సులోనే మెదడులో చిన్న చిన్న కణితలు ఏర్పడే అవకాశాలున్నాయని గతంలో పరిశోధకులు హెచ్చిరించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల మరో సమస్య వస్తుందని చెపుతున్నారు నిపుణులు. అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్ల‌ల్లో మెల్లకన్ను వ‌చ్చే ప్ర‌మాదం ఉందని దక్షిణ కొరియాలోని చొన్నం నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనకు 7 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల పిల్లలపై పరిశోధన జరిపామని.. దాదాపు నాలుగు గంటలపాటు పిల్లలు స్మార్ట్ ఫోన్ ఉపయోగించేలా చేశాం.. ఆతరువాత వారిపై పరిశోధన చేశాం.. దీనివల్ల పిల్లల కళ్లల్లో వ్యత్యాసం క‌నిపించింద‌ని పేర్కొన్నారు.

అందుకే టీడీపీలో చేరా.. ఎమ్మెల్యే చాంద్ బాషా

వైసీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కదిరి నియోజక వర్గం అభివృద్ధికి చంద్రబాబు కృషిచేస్తానని హామి ఇచ్చారు.. కదిరి అభివృద్ది కోసమే టీడీపీలో చేరానని అన్నారు. అంతేకాదు ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని.. మైనారిటీల అభివృద్ధికి త‌న‌ వంతు కృషి చేస్తాన‌ని చాంద్‌బాషా చెప్పారు. కాగా ఇప్పటికి వైసీపీ నుండి టీడీపీలోకి 12 ఎమ్మెల్యేలు ఇప్పుడు చాంద్ బాషాతో ఈసంఖ్య 13కి చేరింది. ఇదిలా ఉండగా మరో 25 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారు అని టీడీపీ నేతలు ప్రకటించడంతో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది.

విరాట్ కోహ్లికి 13 లక్షల జరిమానా...పదేపదే మాట్లాడుతున్నందుకు

  క్రీజులో ఎక్కువ సేపు చర్చలతో టైమ్ గడుపుతున్నాడని చెప్పి విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. ఐపీఎల్ 9 సిరీస్లో  బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు విరాట్ కోహ్లి సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ వరకూ జట్టు ఓకే కానీ.. బౌలింగ్లో మాత్రం సరిగా రాణించలేకపోతున్నారు. దీంతో ఎంత భారీ స్కోర్ చేసినా ఫలితం లేకుండా పోతుంది. అందుకే క్రీజులో ఉన్నప్పుడు కోహ్లి ఎవరికి బౌలింగ్ ఇవ్వాలో తెలీక మాటిమాటికి జట్టులో సీనియర్లు డివిలియర్స్, వాట్సన్ తో చర్చలు జరుపుతున్నాడట. అది కూడా ఒకటి, రెండుసార్లు కాకుండా.. ప్రతి ఓవర్ కి అలా చేస్తుండటంతో అది గమనించిన రిఫరీ అతనికి జరిమానా విధించారు. ఈ జరిమానా ఐపీఎల్ లో మారిన నిబంధనల ప్రకారం విధించారు. ఆ లెక్కన కోహ్లీకి 13.3 లక్షల రూపాయల జరిమానా విధించారు.

పార్లమెంట్ బడ్జెట్ పై రెండో దశ సమావేశాలు... ఉత్తరాఖండ్ పై యుద్ధానికి పార్టీలు

సోమవారం (25/4)నుండి బడ్జెట్ పై రెండో దశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈసారి మాత్రం ఉత్తరాఖండ్ పై సభా సమావేశాలు వాడీ వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్త‌రాఖండ్ రాజ‌కీయ సంక్షోభంపై చ‌ర్చించ‌డానికి మొద‌టి రోజు చ‌ర్చకు నిర్దేశించిన ఇత‌ర అన్ని అంశాల‌ను వాయిదా వేయాల‌ని కాంగ్రెస్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏకిపారేయాలని కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతుండగా.. మరోవైపు ప్రతిపక్షాల అస్త్రాలను ఎలా తిప్పికొట్టాలా అనే దిశగా అధికార పక్షం వ్యూహాలు రచిస్తుంది. అంతేకాదు కరువు పరిస్థితిపై కూడా చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు. దీంతో సోమ‌వారం జరిగే పార్ల‌మెంట్ సమావేశాల్లో ర‌గ‌డ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మరి ఎన్డీఏ స‌ర్కారు ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లను ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.

నీటి సమస్యలో టీమిండియా కెప్టెన్ ధోని...

  టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మధ్య తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే తన వాహనానికి ట్యాక్స్ కట్టని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది అయిపోయిన వెంటనే మొన్నటిదాకా ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన అతడు సోషల్ మీడియా కారణంగా ఆ పదవి నుంచి తప్పుకుని పెద్ద ఆదాయాన్నే కోల్పోయాడు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. ధోని నివాసమైన రాంచిలో ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో  రాంచీలోని తన ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ కోసం ధోనీ రోజుకు 15 వేల లీటర్ల నీటిని వాడేస్తున్నాడట. ఈ మేరకు అతడి ఇరుగు పొరుగు నేటి ఉదయం తీవ్ర ఆరోపణలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.   మొత్తానికి ఈనెల ధోనికి ఏమాత్రం కలిసిరానట్టే కనిపిస్తోంది. ఐసీసీ టీ20  వరల్డ్ కప్ లో ఓటమి.. మళ్లీ రీసెంట్ గా ప్రారంభమైన ఐపీఎల్ లో అతని సారధ్యంలో పూణే జట్టు వరుస పరాజయాలను చూస్తోంది.