జగన్‌తో ఢిల్లీ వెళ్లాల్సిన 8 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. 44 మంది ఎమ్మెల్యేలు విమానం ఎక్కగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసలు విమానమే ఎక్కలేదు. వీరిలో కిడారి సర్వేశ్వరరావు(అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి),  బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్‌నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), రామచంద్రారెడ్డి ( పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు.   వీరిలో అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో కనిపించలేదు.తాత మరణంతో నిన్న ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి తిరిగి రాత్రికల్లా ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే కిడారి, గొట్టిపాటి, బుడ్డా. పోతుల కనిపించని వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే నిన్న ఫ్లైట్ ఎక్కలేదని ప్రచారం జరుగుతోంది.   

మంత్రుల కార్యక్రమంలో జేబుదొంగల చేతివాటం..!

ఒకవైపు రాష్ట్ర మంత్రులు..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..పోలీస్ పహారా ఇలాంటి చోట దొంగతనం చేయడానికి ఎవరైనా ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేసినా బయటకు తిరిగివస్తారా? కాని ఇది జరిగింది. నల్గొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భూమిపూజ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమయంలో దొంగలు చేతివాటం చూపించారు. కార్యక్రమానికి హాజరైన వారి జేబులు కత్తిరించి రూ.18,700 వరకు కాజేశారు. బాధితుల్లో గ్రామ వీఆర్ఏ కూడా ఉన్నారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సరి-బేసి విధానం నుండి మాకు మినహాయింపు కావాలి.. ఎంపీలు

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నంగా సరి-బేసి విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల సామాన్య ప్రజల నుండి రాజకీయ నేతల వరకూ జరిమానాలు కట్టవలసి వస్తుంది. తాజాగా ఓ ఎంపీ గారు కావాలనే నిబంధన ఉల్లంఘించి రెండు వేల రూపాయలు జరిమానా కట్టారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి సంఖ్య విధానం నుంచి తమకు మినహాయింపు నివ్వాలంటూ ఎంపీలందరూ ఒక్కటై డిమాండు చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీలు ఈ రకమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. సరి-బేసి విధానం వల్ల పార్లమెంట్ కు ట్యాక్సీల్లో రావాలంటే కుదరదని.. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కూడా మాట్లాడుతూ.. విధానం కారణంగా సమావేశాలకు హాజరవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మరి ఎంపీలకు సరి-బేసి విధానం నుండి మినహా ఇస్తారో లేదో చూడాలి.

మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తా.. కన్నయ్యకు అవకాశం ఇచ్చారు

  శివసేనకు వివాదాస్పద  వ్యాఖ్యలు చేయడం కొత్తేమికాదు. అందునా మోడీ మీద... మోడీ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఏదో ఒక రకంగా కామెంట్లు విసురుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తనదైన శైలిలో విమర్శలు చేసే శివసేన మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తనపై విమానంలో దాడి చేశారన్న నేపథ్యంలో కన్నయ్య కుమార్ మోడీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించి.. జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ లాంటి చోటా నేతలకు కూడా విమర్శలు చేసే అవకాశం కల్పించారని అన్నారు.  విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, ఎన్నికలకు ముందు మోడీ చాలా హామీలే గుప్పించారు.. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు' అని బిజెపి మిత్రపక్షమైన శివసేన విమర్శించింది.

ఉగ్ర‌మూక‌ల‌కు ముచ్చెమ‌ట‌లు.. 800 మంది ఉగ్రవాదులు హతం

ఒకపక్క ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. మరోపక్క ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా యెమెన్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏడాది కాలంలో అరబ్‌ సంయుక్త దళాలతో క‌లిసి జరిపిన దాడుల్లో ఇప్పటికి 800 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్ర‌వాదుల అధీనంలో ఉన్న‌ ముక‌ల్లా న‌గ‌రాన్ని, షెహర్‌లోని మినా అల్‌-ధాబాలోని ఆయిల్‌ టెర్మినల్‌ను మిల‌ట‌రీ ద‌ళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడుల్లో కీల‌క ఉగ్ర‌వాద‌నేత‌లు కూడా మృత్యువాత ప‌డ్డార‌ని సంబంధిత అధికారులు చెప్పారు. దీంతో యెమెన్ ప్ర‌భుత్వం జ‌రుపుతున్న దాడులతో అల్‌ఖైదా ఉగ్ర‌మూక‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాక్-సిరయాల ఉగ్రవాదులపై కూడా అగ్రరాజ్యాలు కూడా పోరాటం చేస్తుండటంతో అక్కడ కూడా చాలావరకూ ఉగ్రవాదులు తగ్గిపోయారు.

నిదియా టాప్ లెస్ సెల్ఫీ... ఆఫర్ల మీద ఆఫర్లు..

  మెక్సికోలోని ఎస్కొబెడోకు చెందిన నిదియా గార్సియా అనే పోలీసు అధికారిణి టాప్ లెస్ సెల్ఫీ దిగి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దానికి గాను ఆమెపై సర్వత్రా విమర్శలు తలెత్తడమే.. ఇలా చేసినందుకు ఆమెను సస్పెండ్ చేసి విచరాణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఆ తరువాత నిదియా కూడా తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. అయితే విమర్శల సంగతేమో కానీ ఇప్పుడు ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయట. ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ..తాము నిర్వహించే ఫోటో షూట్‌లలో న్యూడ్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గా మాత్రమే ఉంటాయని ఆఫర్లు ఇస్తున్నాయట. మరి నిదియా వారి ఆఫర్లను అంగీకరిస్తుందో.. తిరస్కరిస్తుందో చూడాలి.

చంద్రబాబు నా సోదురుడు... ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నా.. ఉమాభారతి

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు నీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఉమా భారతి మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నా సోదురుడు లాంటివాడని ఆమె అన్నారు. అంతేకాదు చంద్రబాబు ఫాస్ట్‌ ట్రాక్‌ సీఎం.. ఆయన పని చేసే విధానం తనకెంతో ఇష్టమని.. తాను అనుకున్నది సాధిస్తారని.. తాను మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేరని, కానీ తాను ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నానని ఉమాభారతి తెలిపారు. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

టీఎంసీ కార్యకర్తపై చేయి చేసుకున్న రూపా గంగూలీ.. కేసు నమోదు

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బీజేపీ మహిళా నేత రూపా గంగూలీ.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై చేయిచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. రూపా గంగూలీ హౌరా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు ఎన్నికలు ప్రారంభమైన సందర్బంగా ఓటింగ్ సరళిని పరిశీలించేదుకు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు... తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన రూపా గంగూలీ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. అంతేకాదు.. సదరు వ్యక్తిని తోసేశారు. దీంతో అక్కడ కలకలం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగి పోలింగ్ బూత్ వద్ద ఘర్ణణకు కారణమై, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రూపాపై కేసు నమోదు చేశారు. కాగా ఉత్తర 24 పరగణాలు, బిధాన్‌నగర్‌, హౌరా జిల్లాల్లోని 49 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

తిరువరూర్ నుండి కరుణానిధి నామినేషన్.. ఆ కోరిక నెవరేరాలని..!

  త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగానే నామినేషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి కూడా తిరువరూర్ నియోజక వర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కరుణానిధి ఈసారి ఎన్నికల్లో కూడా తన పార్టీని విజయ తీరాలకు చేర్చి.... దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేతగా రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు. మరి ఈసారి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందో.. కరుణానిధి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే.. కార్యకర్తల ఒత్తిడి మేరకే

  వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.  అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సర్వేశ్వరరావు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సర్వేశ్వరరావు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు స్పందించి... తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం ఉందని.. కార్యకర్తల ఒత్తిడి మేరకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని తెలిపారు. ఈ నెల 28న టీడీపీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ సంక్షోభంపై పార్లమెంట్లో రచ్చ..

  పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభమయ్యాయో లేదో.. సభ రణరగంగా మారింది. ప్రతిపక్షాలు సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు నుండి ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చించాలన్న వ్యూహంతోనే సభలోకి అడుగుపెట్టాయి.  ఈనేపథ్యంలో.. సభ ప్రారంభంకాగనే ఉత్త‌రాఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభంపై చ‌ర్చకు పట్టుబట్టాయి. మరోవైపు అధికార పక్షం.. ఈ అంశం కోర్టులో ఉన్నందున దానిపై చర్చించడం సాధ్యం కాదని.. కోర్టులో ఉన్న అంశంపై చర్చించడం సబ్‌ జ్యుడిస్‌ అవుతుందంటూ చర్చను తిరస్కరించడంతో  ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ కూడా మొద‌టి రోజంతా ఉత్తరాఖండ్‌ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని డిమాండ్ చేశారు. ఆందోళనలమధ్యే  రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ హ‌మీద్ అన్సారీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు సభను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రావెల సుశీల్ కేసులో మహిళ ట్విస్ట్..సుశీల్ ఎవరో కూడా తెలియదు..

  మంత్రి రావెల్ కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్.. ఓ ముస్లిం మహిళను చెయ్యి పట్టుకొని కారలోకి లాగబోయాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ ను పోలీసు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు సుశీల్ పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. తనపై తప్పుడు అభియోగాలు మోపారని సుశీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై హైకోర్టు విచారించగా.. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ, కోర్టుకు వచ్చి రావెల కిశోర్ ఎవరో తనకు తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా సుశీల్ పై ఆరోపణలను తొలగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.

తెలంగాణ కాంగ్రెస్ నుండి మరో రెండు వికెట్లు డౌన్.. వివక్ష చూపుతున్నారు..

ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. అటు ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇక్కడ తెలంగాణలోకూడా ప్రతిపక్ష పార్టీనుండి అధికారపార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుండి పలువురు టీఆర్ఎస్ లోకి చేరగా మరో రెండు వికెట్లు పడనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆయనతోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్‌హుసేన్‌ కూడా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. అజయ్‌తో కలిపి కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం 13కు పడిపోనుంది.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తనపట్ల వివక్ష చూపారని, అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విమానంలో నన్ను పీకనులిమి చంపబోయాడు... కన్నయ్య

  ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న కన్నయ్య కుమార్ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. తనను విమానంలో తోటి ప్రయాణికుడు పీకనులిమి చంపబోయాడంటూ కన్నయ్య కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాదు నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు అని కూడా చెప్పాడు. కాగా దీనిపై విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం  దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.   అయితే దీనిపై మనస్ జ్యోతి మాత్రం.. పబ్లిసిటీ కోసం కన్హయ్య ఇదంతా చేస్తున్నాడని.. అసలు తనెవరో కాదు నాకు తెలియదు.. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుంది.. దానికే ఇంతటి నేరం మోపడం సబబు కాదని ఆరోపిస్తున్నాడు.

ఒబామా మూడు హెలికాప్టర్లు రద్దు..

  బరాక్ ఒబామా బ్రిటన్ పర్యటన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంలో బబామా సెక్యూరిటీగా ఆరు చాపర్లు ఉండగా వాటిలో కేవలం మూడింటికి మాత్రమే అనుమతిచ్చారంట బ్రిటన్ రాణి ఎలిజబెత్. 2011 లో ఒబామా ఎలిజబెత్ రాణిని కలవడానికి వచ్చినప్పుడు ఆరు హెలికాఫ్టర్లు ల్యాండ్ కాగా.. దానికి ఆ భవంతిలోని పూల మొక్కలు, గడ్డి నాశనమైయ్యాయట. అందకు గాను రాణిగారు ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఇప్పుడు ఒబామా ఆమె నివాసానికి హెలికాప్టర్ లో రానుండగా, 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంగణంలోకి మూడు హెలికాప్టర్లను మాత్రమే అనుమతించాలని ఆమె నిర్ణయించినట్టు 'డైలీ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. మరి రాణిగారి ఆజ్ఞను ఒబామా పాటిస్తారో లేదో చూడాలి..

మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం.. అందుకే లైట్ తీసుకుంటున్నాడా..?

  బ్యాంకులకు కోట్లాది రూపాయలు టోకరా వేసి విదేశాల్లో ఉన్న విజయమాల్యా పాస్ పోర్ట్ రద్దు చేస్తూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈడీ విచారణకు రావాలని.. లేదంటే పాస్ పోర్ట్ ను నాలుగు వారాలపాటు సస్పెండ్ చేస్తామని విదేశాంగ శాఖ హెచ్చరించినా మాల్యా మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుండటంతో.. చేసేది లేక మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. అయితే మాల్యా ఇలా వ్యవహరించడానికి గల కారణాలు వేరే ఉన్నాయి అంటున్నారు అధికారులు. ఆ దిశగా దర్యాప్తు చేయగా.. అతనికి బ్రిటన్ పౌరసత్వం ఉందన్న సంచలన విషయం బయటపడింది. 1992 నుండి మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం ఉండంటంతో.. ఇక్కడ పాస్ పోర్ట్ రద్దు వల్ల వచ్చే నష్టమేమీ లేదన్న కారణంగానే ఇలా వ్యవహరిస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇక బ్రిటన్ పౌరసత్వమున్న మాల్యాను ఇకపై దేశానికి రప్పించడం భారత అధికారులకు సాధ్యం కాకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.