అరుణాచల్ ప్రదేశ్.. ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

  అరుణాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంత కొద్దిరోజులుగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో కొండచరియలు విరిగి... కింద ఉన్న మనుషుల మీద పడటంతో పదిహేను మంది అక్కడి కక్కడే మరణించారు. ఇంకా కొంత మంది కొండచరియలు కింద చిక్కుకొని ఉండగా.. వారిని కాపాడడం కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా వారంతా ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం అక్కడికి వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. అరుణా చల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికో పుల్, తవాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను జరిగిన ఘటనపై పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

బీజేపీ మహిళపై నోరు జారిన టీఎంసీ నేత... క్షమాపణ చెప్పిన నేత..

  ఈ మధ్య రాజకీయ నాయకులకు నోరు జారడం ఆ తరువాత కళ్లు తెరిచి సారీ చెప్పడం సాధారణమైపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రజాక్ మూలా బీజేపీ అభ్యర్థి, మాజీ నటి రూపాగంగూలీని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారసభలో సభలో పాల్గొన్నరజాక్‌మొల్లా మాట్లాడుతూ.. ఆమె రోజు ఎంత పొడవైన సిగరెట్లు తాగుతారో నాకు తెలుసు.. ఆమె నిజంగానే ద్రౌపది అని రూపాగంగూలీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా  విమర్శలు తలెత్తుతున్నాయి. స్త్రీలను గౌరవించే దేశంలో, ఒక స్త్రీ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ చీఫ్ గా ఉన్న రాష్ట్రంలో అదే పార్టీకి చెందిన వ్యక్తి మరొక స్త్రీని ఉద్దేశించి అవమానపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపట్టారు. దీంతో ఆయన తను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తప్పుగా మాట్లాడినందున క్షమించాలని కోరారు.

తుమ్మలకు పోటీగా నామా.. ఆయన అయితేనే గట్టి పోటీ..!

  కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో పాలేరు ఉపఎన్నిక ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక పోటీ చాలా రసవత్తరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుండి ఈ ఎన్నికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగుతుండగా.. టీడీపీ నుండి తెదేపా అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును బరిలోకి దింపాలని తెదేపా తెలంగాణ శాఖ గట్టిగా భావిస్తోంది. అంతేకాదు.. జిల్లా, రాష్ట్ర నేతలు, కార్యకర్తలంతా నామా నాగేశ్వరావు అయితేనే గట్టి పోటీ ఇస్తారని అధినేత చంద్రబాబుకు సూచిస్తున్నారట. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం గురువారం రాత్రి చంద్రబాబును కలసి ఈ ప్రతిపాదన చేశారట. కాగా బరిలోకి దిగడానికి నామా కూడా సుముఖంగా ఉన్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. మరి నామా కూడా బరిలో దిగితే ఉపఎన్నికపై పోటీ చాలా ఆసక్తికరంగా మారుతుంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఏపీలాగే ఇక్కడ కూడా..

  తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ స్పీకర్ కడియం శ్రీహరి ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాభైకి పైగా వెబ్ సైట్లలో ఫలితాలు ఉంచామని.. ప్రైవేటు కళాశాలల కన్నా, ప్రభుత్వ కళాశాలలే మంచి ఫలితాలని ఇచ్చాయన్నారు. ఇంటర్ ఫస్టియర్లో 53.32 శాతం పాసవ్వగా.. సెకండియర్లో 62.70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా ఏపీలాగే ఇక్కడ కూడా అమ్మాయిలదే హవా.. కాగా ఫలితాల కోసం  బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్ నుంచి 1100 నంబరుకు లేదా వేరే ఏదైనా ల్యాండ్‌ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వెబ్ సైట్లు.. tsbie.cgg.gov.in http://results.cgg.gov.in http://examresults.ts.nic.in

లోకేశ్ మంత్రి కావడం అప్రాధాన్య అంశం.. ఎవరైనా కావొచ్చు.. యనమల

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి పదవిపై ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలన్న చర్చలు నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసి అందరికి షాకిచ్చారు. కాకినాడలో నిన్న మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనను విలేకరులు ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే.. నారా లోకేశ్ మంత్రి అవుతారా?, సీఎం అవుతారా? అని. అంతేకాదు ఇంతవరకూ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న మీ పరిస్థితి ఏంటీ అని కూడా అడిగారట. అయితే ఈ ప్రశ్నకు యనమల సమాధానం చెబుతూ..  లోకేశ్ మంత్రి కావడం, ముఖ్యమంత్రి కావడమనేది అప్రస్తుత, అప్రాధాన్య అంశమని.. ‘‘సీఎం పదవికేముంది... లోకేశ్ కావచ్చు. బొడ్డు వెంకటరమణ(స్ధానిక మీడియా ప్రతినిధి) కావచ్చు’’ అని కూడా యనమల అన్నారట. అంతేకాదుఉపయోగపడే ప్రశ్నలు వేయండంటూ ఒకింత అసహనానికి గురయ్యారట. మరి యనమల ఇంత అసహనానికి గురవ్వడానికి చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల వల్ల కాదు కదా..!

బ్యాంకులకు మాల్యా మరో ఆఫర్.. పెడసరంగా సమాధానాలు..

విజయ్ మాల్యా బ్యాంకులకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు. బ్యాంకుల నుండి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న మాల్యా మొదట నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పాడు. ఆతరువాత ఈడీ మాల్యాపై సీరియస్ గా దర్యాప్తు చేయడం.. నోటీసులు జారీ చేయడం.. సుప్రీం కోర్టు కూడా అక్షింతలు వేయడంతో ఒక మెట్టు దిగి ఈసారి మరో రెండు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి 1,398 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు కొత్త ఆఫర్ ను ముందు పెట్టారు.   అంతేకాదు మాల్యాకు ఒక పక్క నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి.. రెడ్ కార్నార్ నోటీసు వచ్చే అవకాశాలు ఉన్నా ఇంకా దారికి రానట్టే కనిపిస్తుంది. విదేశాల్లో తనకున్న ఆస్తుల వివరాలు తెలియజేయాలంటూ బ్యాంకులు కోర్టు ద్వారా అడిగిన నేపథ్యంలో ఆయన తన లాయర్ల ద్వారా చాలా పెడసరంగా సమాధానాలు ఇచ్చారు. తన విదేశీ ఆస్తుల వివరాలు కోరే హక్కు, అధికారం బ్యాంకులకు లేదని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. రుణాలు ఇచ్చినప్పుడు బ్యాంకులు తన విదేశీ ఆస్తులను చూసి ఇవ్వలేదని, అలాంటప్పుడు ఇప్పుడెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జూన్ 26వ తేదీన సీల్డ్ కవర్ లో తన ఆస్తుల వివరాలు తెలియజేసేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు.

బయటపడుతున్న ఐసిస్ అరాచకాలు.. 250 మంది యువతుల తలలు నరికి చంపారు..

  ఉగ్రవాదులు చేసిన అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇరాక్, సిరియాలో పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ అక్కడి యువతులను దారుణంగా నరికి చంపిన వైనం తాజాగా వెలుగు చూసింది. ఇరాక్ నుండి వివిధ ప్రాంతాలనుండి పట్టుకొచ్చిన దాదాపు 250 మంది యువతులను నిలబెట్టి అత్యంత దారుణంగా నరికి చంపారు. దీనికి సంబంధించి తీవ్రవాద సంస్థ పెద్దలు ఓ ఫర్మానా విడుదల చేశారు. షర్మానా ప్రకారం.. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ తరపున పోరాడుతున్న తీవ్రవాదులను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని, సెక్స్ బానిసలుగా పని చేయాలని యువతలను కోరగా.. ప్రాణం పోయినా దానికి అంగీకరించమని చెప్పడంతో వారందరినీ వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే తలలు నరికి చంపారు. వారినే కాదు తమ పిల్లలను పంపించని తల్లిదండ్రులను కూడా ఇదే రకంగా హతమార్చినట్టు ఆయన వెల్లడించారు.

కళ్యాణలక్ష్మి పథకం బీసీ, ఈబీసీలకు కూడా.. టీ సర్కార్

  తెలంగాణ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం  బీసీ, ఈబీసీలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు కళ్యాణలక్ష్మీ పథకం ఉద్దేశం నిరుపేదలైన ఆడబిడ్డల వివాహాలకు రూ.51వేల మంజూరు చేయడమే. అయితే ఈ పథకాన్ని ఈబీసీలకు సైతం పథకం వర్తింప చేయాలంటూ వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో బీసీలకు, వెనుకబడిన ఈబీసీలకు కూడా పథకాన్ని అమలు చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి పథకం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.2లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.

త్రయంబకేశ్వరాలయం.. మహిళల మరో విజయం

  మహారాష్ట్రలోకి త్రయంబకేశ్వరాలయంలోకి పురుషులతో పాటు, మహిళలను కూడా అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకూ ఒక గంట గర్భగుడిలోకి ప్రవేశించే అనుమతిచ్చినా.. మహిళలు మాత్రం తడి దుస్తులతోనే గర్భగుడిలోకి రావాలని ఆలయ ట్రస్ట్ సభ్యులు షరతులు పెట్టారు. అయితే దీనికి మహిళల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భూమాత బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ సహా మరికొంతమంది ఉద్యమకారులు పోరాటానికి దిగారు. దీంతో దీనికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ సందర్బంగా తృప్తి మాట్లాడుతూ.. మహిళలు సాధికారత సాధించే  దిశలో  మరో  పెద్ద విజయమని ఆమె అన్నారు.

సారీ చెప్పాల్సిందే.. తుది నిర్ణయం అసెంబ్లీదే.. రోజాకు సుప్రీం అక్షింతలు

  వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రోజా సస్పెన్షన్ అయినప్పటినుండి ఈ విషయంలో ఎప్పటినుండో సస్పెన్సన్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు రోజా సస్పెన్షన్ పైన తుది నిర్ణయం తీసుకునే హక్కు అసెంబ్లీదేనని సుప్రీం కోర్టు తెలిపింది. అసెంబ్లీలో చేసిన పరుష వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని రోజాకు సుప్రీం సూచించింది. వాటిని పరిగణలోకి తీసుకోవాలని అసెంబ్లీకి కూడా సూచించింది.   కాగా రోజా హైకోర్టును ఆశ్రయించడం అక్కడ చుక్కెదురవ్వడం.. ఆతరువాత ఆమె మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం.. అక్కడ సుప్రీంకోర్టు.. రోజా సస్పెన్షన్ పై విచారణ జరపాలని ఆదేశించడం జరిగింది. దీంతో రోజా సస్పెన్షన్ పై విచారించిన హైకోర్టు రోజా సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ రోజాకు వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది. దీనిపై మళ్లీ రోజా సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఈరోజు రోజా సస్పెన్షన్ పై విచారించిన సుప్రీం సారీ చెప్పాలని సూచించింది. అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

మహిళపై అనుచితంగా ప్రవర్తించిన హోం మినిస్టర్.. అడ్డంగా బుక్కయ్యారు..

  మహిళలపై రాజకీయ నాయకులు అప్పుడప్పుడు వివదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అనుచితంగా ప్రవర్తించడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఓ హోమంత్రి గారు కావాలనే ఓ మహిళ పట్ల అనుచింతంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ ఆ మంత్రి గారు ఎవరంటే.. మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు, హోం మంత్రి బాబూలాల్ గౌర్. ఓ కార్యక్రమంలో ఆయ‌న అక్క‌డ ఏర్పాటు చేసిన ఓ బస్సులో ప‌లువురు ఎక్కుతున్న స‌మ‌యంలో ఒక మ‌హిళ‌ను ఉద్దేశ పూర్వ‌కంగా చేతుల‌తో తాకారు. చుట్టూ కార్య‌క‌ర్త‌లు ఉండ‌డంతో ఎవ‌రికీ క‌నిపించ‌బోద‌నే ఉద్దేశంతో ఓ మ‌హిళ బ‌స్సు ఎక్కుతుండ‌గా ఆమెను ట‌చ్ చేశారు. అక్కడే మంత్రిగారు పప్పులో కాలేశారు. కార్యకర్తలు చూడలేదు కాని అక్క‌డ ఏర్పాటు చేసిన ఓ కెమెరాలో స‌దరు మంత్రిగారి ఈ నీచ ప్ర‌వ‌ర్త‌న రికార్డయింది. మొత్తానికి కెమెరా పుణ్యమా మంత్రిగారు అడ్డంగా బుక్కయ్యారు. మరి దీనిపై ఎలా స్పందిస్తారో.

తెలంగాణలో టీడీపీకి మరో షాక్..కారెక్కిన మాజీ మంత్రి

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు పి.రాములు టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ఆయన కాసేపటికి టీడీపీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి సీఎం ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆయన తెలుగుదేశంలో కీలకనేతగా ఎదిగారు. అక్కడి నుంచి 1994, 1999, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపోందారు. చంద్రబాబు మంత్రివర్గంలో 2002 నుంచి 2004 వరకు క్రీడా శాఖ మంత్రిగా రాములు పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించడంతో ఆయన జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన చేరికతో మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ పెద్ద దిక్కును కోల్పోయింది.

న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్, హిల్లరీదే గెలుపు..

  అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్, డెమోక్ర టిక్ పార్టీ నుండి హిల్లరీ క్లింటన్ ఇద్దరూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే సూపర్ ట్యూస్ డే ఎన్నికల్లో ముందజలో ఉన్న వీరిద్దరూ.. తాజాగా జరిగిన న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ఇద్దరూ విజయం సాధించి.. ఆయా పార్టీల నామినేషన్‌కు చేరువగా నిలిచారు. స్వస్థలమైన న్యూయార్క్‌లో గెలుపుతో సుమారు 95 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. ఇప్పటికి 847 మంది డెలిగేట్ల మద్దతు సాధించారు. నామినేషన్‌కు అవసరమైన 1,237 మంది డెలిగేట్లను పొందే దిశగా సాగిపోతున్నారు. జూలైలో జరిగే పార్టీ సమావేశంలో పోటీ చేసే అవసరం లేకుండానే రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందే స్థితి సాధించారు.  హిల్లరీ క్లింటన్ డెలిగేట్ల సంఖ్య 1,990కి చేరింది.

సముద్రం అడుగున బుల్లెట్ రైలు.. దాదాపు లక్ష కోట్లతో

ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడానికి త్వరలో బుల్లెట్ రైలు వస్తున్న సంగతి తెలిసిందే. అరేబియా తీరం గుండా నడిచే ఈ రైలు సముద్రం కింద నుండి పరుగులు పెట్టనుండి. అంతేకాదు దీనికోసం భారీ సొరంగ మార్గాన్నే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ లక్ష కోట్లతో నిర్మించే ఈ రైలుకి.. 81 శాతం నిధులు జపాన్ నుంచి సమకూర్చుకునంటున్నట్టు అధికారులు వెల్లడించారు..  ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా, 15 ఏండ్ల మారటోరియంతో ఏడాదికి 0.1 శాతం వడ్డీని 50 ఏండ్లలో చెల్లించే విధంగా ఈ ఏడాది చివర్లో ఒప్పందం జరుగుతుందని, 2018 నుంచి ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

పవన కళ్యాణ్ కొత్త ఛానల్ పెట్టనున్నారా..?

  జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన కళ్యాణ్ ఇకపై సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్ట రాజకీయాలపై ఫోకస్ పెట్టి.. 2019 ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నట్టు ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అదేంటంటే.. పవన్ ఓ కొత్త ఛానల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా దిగుతారో.. లేక పొత్తుతో దిగుతారో తెలీదు. ఒకవేళ ఒంటరిగా దిగితే మాత్రం ఇప్పుడు పొగుడుతున్న వాళ్లే రేపు విమర్శించే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సొంత మీడియా ఉంటే బాగుండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.   మరోవైపు పార్టీ నడపడానికే డబ్బులు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ కొత్త ఛానల్ పెట్టే సీన్ ఉందా అని అనుకుంటున్నారు. అంతేకాదు మొదట యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆతరువాత కొత్త ఛానల్ పెడతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

వాట్సాప్ ను మించిన యాప్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్..

  తెలివైన వాళ్లే అప్పుడప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకుంటారు. ఇక్కడ ఓ తెలివైన యువకుడు కూడా తను అనుకున్నది జరగలేదని.. వైఫల్యం పొందాడని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వివరాల ప్రకారం.. హైదారాబాద్లో అశోక్ అగర్వాల్ కి ఇద్దరు కొడుకులు. వారు అమీర్ పేట్ లో ఉంటున్నారు. అయితే ఇద్దరి కొడుకుల్లో చిన్న కొడుకు అమెరికాలో ఉండగా, పెద్ద కొడుకు లక్కీ అగర్వాల్ మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. అయితే లక్కీ అగర్వాల్ చాలా తెలివైనవాడు. కొత్త సాఫ్ట్ వేర్లు తయారుచేయడం.. యాప్స్ తయారుచేయడం అతనికి అలవాటు. ఆ అలవాటుతోనే ఎలాగైనా వాట్సాప్ ను మించిన యాప్ తయారు చేయలనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నించాడు కూడా. అయితే అందులో సఫలం కాలేకపోయాడు. దీంతో డ్రిపెషన్లోకి వెళ్లిన లక్కీ దాదాపు నెల రోజులుగా తన గదిలోనే ఉండిపోయాడు. ఆ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నైట్రో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుని.. దానిని పాలిథిన్ కవర్ లోకి ఎక్కించుకొని దాన్ని ముఖానికి కట్టుకొని.. ఆక్సిజన్ అందక చనిపోయాడు. అంతేకాదు తాను చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. నొప్పి లేకుండా చనిపోవాలనే అలా చేసినట్టు లేఖలో పేర్కొన్నాడు.