మరో 25 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి.. టెన్షన్ లో వైసీపీ

  వైసీపీ నుండి ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే  చాంద్ బాషా కూడా టీడీపీలోకి చేరుతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల వైసీపీ విలవిల్లాడుతుండగా ఇప్పుడు టీడీపీ నేతలు మరో ప్రచారాస్త్రాన్ని విసిరారు. మరో 25 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని.. ఆ ఎమ్మెల్యేలతో చేసిన చర్చలు ఫలించాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది.   కాగా అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా మరికాసేపట్లో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయన మరికాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. వెనువెంటనే ఆయన టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

మొండికేస్తున్న కొద్ది మాల్యాకు బిగుస్తున్న ఉచ్చు...

  విజయ్ మాల్యాకు రోజు రోజు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్టు రద్దు చేయగా.. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేయడానికి ఆదేశాలిచ్చింది. ఈనేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. విజయ్ మాల్యాను దేశానికి రప్పించాలని కోరగా.. మంత్రి శాఖ ఇప్పుటికే న్యాయ నిపుణులతో చర్చలు ప్రారంభించింది. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఇంటర్ పోల్ కు సమాచారం ఇవ్వడమే తరువాయి. ఇంకా మాల్యాకు చెందిన ఇతర బినామీ ఆస్తులపైనా కూడా ఈడీ ఆరా తీస్తుంది. మొత్తానికి మొండికేస్తున్న కొద్ది విజయమాల్యాకు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అసలు మాల్యా మొదటే విచారణకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మాల్యా ఏం చేస్తాడో.. మరోసారి ఎలాంటి ఆఫర్ తో ముందుకొస్తాడో చూడాలి.

కేంద్రం నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యులు వీరే..!

  రాజ్యసభలో మొత్తం 12 నామినేటెడ్‌ సభ్యులకుగాను ఏడు స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలసిందే. దీనికి గాను  కేంద్ర ప్రభుత్వం ఆరుగురి పేర్లను నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన పేర్లు భాజపా నేతలు సుబ్రమణ్య స్వామి, నవజోత్‌సింగ్‌ సిద్ధూలతో పాటు ప్రముఖ మహిళా బాక్సర్‌ మేరీకోం,  నరేంద్ర జాదవ్ ‌(ఆర్థికవేత్త), సురేశ్‌ గోపి (మలయాళ నటుడు), స్వపన్‌ దాస్‌గుప్తా  (పాత్రికేయుడు). అయితే ఆరుగురు పేర్లు ఖరారు కాగా మరో స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానానికి ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌, పాత్రికేయుడు రజత్‌శర్మల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యులుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఆరుగురి పేర్లను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం ఆమోదించినట్లు హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

శక్తిమాన్ మృతికి నాకు సంబంధం లేదు.. నా కాళ్లు నరుక్కుంటా.. గణేష్ జోషి

  ఉత్తరాఖండ్లో భద్రతా దళానికి చెందిన శక్తిమాన్ అనే గుర్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అందరూ బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషిపై మండిపడుతున్నారు. అంతేకాదు శక్తిమాన్ మృతికి కారణమైన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని.. జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని అంటున్నారు. మరోవైపు గణేష్ జోషి మాత్రం శక్తిమాన్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇన్ఫెక్షన్ సోకడంతో గుర్రం మృతి చెందిందని అంటున్నారు. శక్తిమాన్ మృతికి తానే కారణమని నిరూపిస్తే తన కాళ్ళను తానే నరుక్కుంటానని సవాల్ కూడా చేస్తున్నారు.   కాగా.. మార్చి 14న జరిగిన ఆందోళనలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ కర్రతో శక్తిమాన్ కాళ్ళపై కొడుతున్నట్లు మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే. జోషి కొట్టడం వల్ల గుర్రం కాలికి గాయమై.. కాలును తొలగించారు. అనంతరం అమెరికా నుండి తెప్పించిన కృత్రిమ కాలును అమర్చారు. అయితే చిన్న చిన్నగా కోలుకుంటుదనుకుంటుండగానే మృతి చెందింది.

కుష్బూకు హ్యాండిచ్చిన కాంగ్రెస్..

సినీనటి కుష్బూకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది.  మైలాపూర్ స్ధానం నుంచి పోటీ చేయాలని కుష్బూ ఎంతగానో అశించారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత మైలాపూర్ నుంచి పోటీ చేస్తుండటంతో కుష్బూని పోటీ పెట్టనున్నారని మరికొందరు విశ్వసించారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న కుష్బూ కాంగ్రెస్ అధిష్టానం వద్ద పావులు కదిపారు. దానితో పాటు ప్రధాన మిత్రపక్షమైన డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు పొంది ఎలాగైనా సీటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన తుది జాబితాలో మైలాపూర్ నియోజకవర్గానికి కరాటే త్యాగరాజన్ పేరును ఖరారు చేసింది. ఊహించని ఈ పరిణామంతో కుష్బూ షాక్‌కి గురయ్యారు. 

అనంత వైసీపీలో మిగిలింది ఒక్క వైసీపీ ఎమ్మెల్యేనే..!

  వైసీపీ ఎమ్మెల్యేలు ఒకొకరిగా టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలోకి చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అనంత వైసీపీలో ఇక మిగిలింది ఒక్క ఎమ్మెల్యే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి రెండు నియోజకవర్గాలైన ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డితో పాటు కదిరిలో చాంద్ బాషా నుండి వైసీపీ విజయం సాధించింది. అయితే వీరిద్దరిలో చాంద్ బాషా ఇప్పుడు వైసీపీకి షాక్ ఇవ్వనున్నాడు. టీడీపీ ఆకర్ష్ కు తలొగ్గిన చాంద్ బాషా పార్టీ మారేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు. మరోవైపు చాంద్ బాషాను బుజ్జగించడానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. కాగా చాంద్ బాషా 2014 వరకూ టీడీపీలోనే కొనసాగారు. అనంతరం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి ఆ ఒక్క ఎమ్మెల్యే అయినా మిగులుతాడో లేదో చూడాలి.

బత్తాయి తోటను తగలబెట్టిన రైతులు..!

  మరాఠ్వాడా ప్రాంతంలో వచ్చిన నీటి ఎద్దడి తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలంటూ, అక్కడి రైతులు నాలుగు ఎకరాల బత్తాయి తోటను తగలబెట్టేశారు. ఔరంగాబాద్ లోని కోర్గావన్ ప్రాంతంలో నాలుగెకరాల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 500 బత్తాయి చెట్లు ఈ అగ్నికి ఆహుతైపోయాయి. దేశానికి వెన్నెముక రైతేనని, కానీ రైతును పట్టించుకోవడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఈ పని చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. షేట్కారీ అన్నదాత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైతులందరూ బత్తాయి తోటలో సమావేశమయ్యారు. ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జయాజీరావ్ సూర్యవంశీ మాట్లాడుతూ, 2012 నుంచీ మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు బాధిస్తోందని, వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. హార్టీకల్చర్ లోని రైతులు, బ్యాంకుల రుణాలు ఎలా తీర్చాలో, నీరు లేకుండా తోటను ఎలా కాపాడుకోవాలో తెలియక చాలా ఆవేదన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో హార్టీకల్చర్ రైతులకు స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిందని, ఇప్పుడు ఎన్టీయే కూడా అదే తరహాలో తమకు సాయం చేయాలని అందుకే ఇప్పుడు వేరే దారిలేక తోటల్ని అగ్నికి ఆహుతి చేస్తున్నామన్నారు. ప్రతీ ఏడాది కంటే, ఈ సారి మరాఠ్వాడా పరిస్థితి మరింతగా దిగజారింది. కరువు బాధిస్తుంటే, నీరు లేక ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక రైళ్లలో నీటిని పంపిస్తున్న సంగతి తెలిసిందే.

తెగిన లిఫ్ట్ వైర్ ..కేంద్రమంత్రికి తప్పిన ప్రమాదం

కేంద్రమంత్రి జేపీ నడ్డాకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ తెలంగాణ కార్యాలయానికి చేరుకున్నారు. నేతలతో చర్చలు ముగించుకుని ఫస్ట ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకునేందుకు వస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపోయింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో జేపీనడ్డా, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యేలు ఎన్వీయస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పరిమితికి మించి లిఫ్ట్ ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

తెలంగాణ మంత్రుల శాఖలు మారుతాయా?

తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు పరిశ్రమల శాఖ, జూపల్టి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పంచాయతీరాజ్, ఐటీతో పాటు మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్నారు.  రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలవడే అవకాశం ఉంది. సీఎం ఇంతకు ముందు కూడా మంత్రులకు శాఖలను మార్చారు. కడియం శ్రీహరికి విద్యాశాఖ కేటాయించి, అప్పటికే విద్యాశాఖను నిర్వర్తిస్తున్న జగదీశ్ రెడ్డికి విద్యుత్ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్యశాఖను కేటాయించారు.

హృతిక్, కంగనా వివాదంలో మరో ట్విస్ట్.. ఒక్క మెయిల్ కూడా వెళ్లలేదు..

  బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య గత కొంత కాలంగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. హృతిక్ ఈ మెయిల్ నుండి కంగనాకు వేల మెయిల్స్ వెళ్లాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందులో నిజం లేదని తెలిపారు ఫోర్సెనిక్ నిపుణులు. హృతిక్ రోషన్ ఈ మెయిల్ అకౌంట్ నుంచి కంగనాకు ఒక్క ఈ మెయిల్ కూడా వెళ్లలేదని.. అదే సమయంలో కంగనా రనౌత్ ఈ మెయిల్ అకౌంట్ నుంచి 6 నెలల వ్యవధిలో 3 వేల ఈ మెయిల్స్ వెళ్లాయని ఫోరెన్సిక్ నివేదిక తేటతెల్లం చేసింది. హెచ్ఆర్ రోషన్@జీమెయిల్.కామ్ అనే నకిలీ ఈ మెయిల్ అకౌంట్ తో కంగనా రనౌత్ ను ఎవరో బోల్తా కొట్టించారని ఫోరెన్సిక్ విభాగం అభిప్రాయపడింది. హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా పరిశీలించి పోలీసులు..ఏడేళ్లలో కేవలం నాలుగు సార్లే హృతిక్ ఆమెకు కాల్ చేశాడని చెప్పారు. కంగనాను కలిసేందుకు హృతిక్ పారిస్ వెళ్లలేదని ఆయన పాస్ పోర్టు కాపీలను బట్టి తెలుస్తోందని ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారని డీఎన్ఏ పత్రిక కథనం ప్రచురించింది. మరి దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో మలుపు.... హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

  ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చి.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఉత్తరాఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్ పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన హైకోర్టు, రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం అనవసరమని చెబుతూ రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది.

శ్రీశ్రీ రవిశంకర్‌కు ఐసిస్ సమాధానం.. తల నరికిన ఫొటో

తన ఉగ్రవాద చర్యలతో ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఐసిస్.. రోజు రోజుకూ తన క్రూరత్వాన్ని పెంచుకుంటుపోతూనే ఉంది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ వల్ల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు కూడా చేదు అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. త్రిపురలోని అగర్తలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఐసిస్ తో శాంతి చర్చలకు ప్రయత్నించానని.. అయితే దానికి వారు ఉగ్రవాదులు అత్యంత క్రూరమైన పద్ధతిలో తల నరికిన ఓ వ్యక్తి ఫొటోను పంపించారని చెప్పారు. దీంతో తాను ఉగ్రవాద సంస్థతో చర్చించే ప్రయత్నం మానుకున్నట్లు తెలిపారు.

రోజా సస్పెన్షన్ పై చంద్రబాబు, జగన్ కు సుప్రీం చురకలు..

  వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీ కోర్టులో గురవారం, శుక్రవారం వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రోజా సస్పెన్షన్ పై వాదనలు విన్న అనంతరం.. రోజా సారీ చెప్పాలని.. అసెంబ్లీదే తుది నిర్ణయమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే రోజా సస్పెన్షన్ పై అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర  విభజన జరిగి.. అర్ధిక లోటుతో ఉండి... కనీసం రాజధాని కూడా లేకుండా ఉన్న ఏపీ అభివృద్ధికి ప్రయత్నించకుండా ఇరు పార్టీల అధినేతలు పట్టుదలతో వ్యవహరించడం తగదని అన్నారు. ఇంకా ఎన్నో సమస్యలు రాష్టానికి ఉన్నాయి.. కేంద్రం నుంచి విభజన హామీలు కూడా చాలా అమలు కావాల్సి ఉంది.. వాటిని సాధించడానికి ప్రయత్నించాలని కానీ.. ఇలాంటి వాటికోసం సమయం వృధా చేసుకోవడం ఏంటని హితవు పలికింది.

టైమ్స్ అత్యంత ప్రభావశీలురు సానియా.. ప్రియాంక చోప్రా

  ప్రఖ్యాత టైమ్ మేగజైన్ '100 మంది ప్రపంచ అత్యంత ప్రభావశీలుర' జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చేసే ఈ సర్వేలే పలువురు భారతీయ ప్రముఖులకు చోటు దక్కడం విశేషం. వారిలో టెన్నిస్‌ తార సానియా మీర్జా, ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌లకు స్థానం దక్కింది. కాగా ఇటీవలే సానియా మీర్జాకి పద్మభూషణ్ రాగా.. ప్రియాంక చోప్రాకి పద్మశ్రీ అవార్డ్ దక్కింది.  ఇంకా, వీరితోపాటు సామాజిక ఉద్యమకారిణి సునీత నరైన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్‌, సచిన్‌ బన్సాల్‌లు ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతికి చెందిన నటుడు అజీజ్‌ అన్సారీ, లాస్ట్‌ మైల్‌ హెల్త్‌ సంస్థ సీఈవో రాజ్‌ పంజాబీ కూడా టైమ్‌ జాబితాలో ఉన్నారు.

తనతో విబేధాలు లేవు.. కోపంతో మాట్లాడా.. సుప్రీంకు రోజా

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. రోజా పిటషన్ పై విచారించిన సుప్రీం నిన్ననే విషయం తేల్చి చెప్పింది. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందకుగాను సారీ చెప్పాలని.. తుది నిర్ణయం అసెంబ్లీదేనని చెప్పింది. అయితే దీనిపై రోజా మళ్లీ సుప్రీంకు లేఖ రాసింది. తనకు టీడీపీ ఎమ్మెల్యే అనితతో ఎలాంటి విబేధాలు లేవు.. తనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. తనను కావాలనే రెచ్చగొట్టారని.. వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు.. అందువల్లే కోపంతో ఏదైనా మాట్లాడి ఉంటే.. ఆ మాటలని ఉపసంహరించుకుంటున్నానని.. తన లేఖను పరిగణలోకి తీసుకోవాలని, తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. అయితే దీనిని స్వీకరించిన సుప్రీం.. సభలోకి అనుమతి విషయంలో శాసన సభనే సుప్రీం అని చెప్పింది. సస్పెన్షన్ పైన తుది నిర్ణయం కూడా సభదేనని చెప్పింది. కావాలంటే మీరు మీ పిటిషన్ విత్ డ్రా చేసుకోవచ్చునని సూచించింది. అనుచిత వ్యాఖ్యలు మాత్రం సరికాదని సుప్రీం మరోసారి తెలిపింది. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. అసెంబ్లీలో దృష్ట సాంప్రదాయం ఏర్పడింది.. దానిపైనే నాపోరాటం అని అన్నారు. ఇంకా అసంబ్లీని కోర్టు గౌరవిస్తుంది.. కోర్టును కూడా అసెంబ్లీ గౌరవిస్తుందని భావిస్తున్నా.. ఇంకా వీటికి ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్దివైపు దృష్టిసారించాలని సూచించారు.

అరుణాచల్ ప్రదేశ్.. ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

  అరుణాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంత కొద్దిరోజులుగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో కొండచరియలు విరిగి... కింద ఉన్న మనుషుల మీద పడటంతో పదిహేను మంది అక్కడి కక్కడే మరణించారు. ఇంకా కొంత మంది కొండచరియలు కింద చిక్కుకొని ఉండగా.. వారిని కాపాడడం కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా వారంతా ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం అక్కడికి వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. అరుణా చల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికో పుల్, తవాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను జరిగిన ఘటనపై పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.