ప్రత్యేక హోదా ఇవ్వడం మోడీకి కూడా ఇష్టంలేదా..?
posted on May 21, 2016 @ 10:26AM
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ఏపీకి అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమైపోయింది. అయితే ఇప్పటి వరకూ బీజేపీ నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ విషయంపై నోరు విప్పింది లేదు. అయితే ఇప్పుడు మోడీకి కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదన్న విషయం అర్ధమవుతోంది. దీనికి ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్ధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనే స్వయంగా బీజేపీ నేతలతో ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. నిన్నఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ నేతలు ఏపీ ప్రత్యేక హోదా, ప్యాకేజీపై సిద్దార్ధ్ సింగ్ గట్టిగానే అడిగట్టు సమాచారం. ప్రత్యేక హోదానా, ప్యాకేజీ ఇస్తారా తేల్చాలని వారు సిద్ధార్థనాథ్ సింగ్‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. రెండేళ్లలో కేంద్రం చాలా ఇచ్చిందని ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు మంజూరు చేశారని వారు ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. ఇదే సమయంలో సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీకి హోదా ఇచ్చే అవకాశం లేదని, ప్రధాని మోడీ కూడా అందుకు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రధాని మోడీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ప్రధాని మోడీ తన మనసులోని మాటను ఎప్పుడు బయటపెడతారో చూడాలి.