బ్రహ్మోత్సవంపై పగబట్టిన వరుణుడు..!
posted on May 20, 2016 @ 6:22PM
సూపర్‌స్టార్ మహేశ్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమా ఇప్పటికే డిజాస్టర్ కావడంతో తర్వాత పరిస్థితేంటా అని డైలమాలో పడిపోయింది ఆ చిత్ర యూనిట్. అసలే సినిమా ఫ్లాప్ ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా వరుణుడు కూడా బ్రహ్మోత్సవంపై పగ బట్టినట్లున్నాడు. ఇప్పటి వరకు ఏపీని వణికించిన రోన్ తుఫాన్ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌ను అల్లాడించింది. 100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పది నిమిషాల పాటు జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది.
భారీ ఈదురుగాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో హోర్డింగ్‌లు నేలకూలాయి. వాటిలో బ్రహ్మోత్సవం హోర్డింగ్స్ కూడా ఉన్నాయి. వరుణుడు ఫస్ట్ పబ్లిసిటి మీద దెబ్బ కొట్టగా...సరిగ్గా ఫస్ట్ షో చూడటం కోసం థియేటర్లకు వెళ్లేవారిని వెంటాడాడు వరుణుడు. వర్షం దెబ్బకి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రోడ్ల మీద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఒకవేళ చచ్చిచెడి సినిమాకు వెళ్లినా, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, కరెంటు తీగలు తెగిపోవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడి షో నిలిచిపోయింది. ఈ విధంగా వరుణుడు బ్రహ్మోత్సవాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు.