విజయ్ మాల్యా కి గ్యారంటీగా రైతు మన్మోహన్ సింగ్..!
posted on May 21, 2016 @ 1:01PM
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా మాల్యా ఓ బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయకుండా.. తగిన భద్రత కల్పిస్తానని ప్రభుత్వం నుండి హామీ వస్తే తిరిగి ఇండియా వస్తానని.. రుణాలు చెల్లిస్తామని చెప్పాడు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తగిన హామీ ఇచ్చేందకు రెడీ అని చెప్పింది. అయితే ఇప్పుడు మాల్యా విషయంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. మాల్యాకు గ్యారంటీ ఇచ్చాడంటూ ఒక అమాయక రైతు ఖాతాను ఫ్రీజ్ చేశారు అధికారులు.
వివరాల ప్రకారం.. పిలిభిత్ సమీపంలోని ఖజూరియా నవిరామ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ అనే రైతు వ్యవసాయంపై ఆధాపడి జీవిస్తున్న వ్యక్తి. ఈయనకు బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఖాతా ఉంది. అయితే ఈయన మాల్యాకు గ్యారంటీగా ఉన్నాడంటూ.. తక్షణం ఖాతా సీజ్ చేయాలని ముంబై హెడ్డాఫీసు నుంచి ఆదేశాలు రాగా స్పందించిన బ్యాంకు అధికారులు ఆయన ఖాతాలను స్తంభింపజేశారు. దీంతో రైతు లబోదిబోమంటూ ఆరోపిస్తున్నాడు. అసలు మాల్యా ఎవరో తనకు తెలియదంటూ.. బ్యాంకు ఖాతా ఎందుకు నిలిపివేశారో తెలియదంటూ వాపోతున్నాడు. దీనివల్ల బ్యాంకుల నుండి వచ్చే స్కీములు నాకు చేరడం లేదు. ఇల్లు గడిచేందుకు డబ్బు అవసరమై నా పంటనంతా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెబుతున్నాడు. మరోవైపు బ్యాంకు అధికారులు చేసిన ఈ పనికి అందరూ విమర్శిస్తున్నారు. డబ్బున్న వారిపై ఎలాంటి ప్రతాపం చూపించలేని అధికారులు.. ఇలాంటి వారిపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.