ప్రియాంక పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దం..
posted on Jun 11, 2016 @ 12:54PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు, ఇందిరా గాంధీ మనమరాలు ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కంటే.. ప్రియాంకా గాంధీని బరిలోకి దించితేనే గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సోనియా గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆమె యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. 2019లో రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీనే యూపీ ఎన్నికల బరిలో దిగనున్నట్టు ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఈ ఎన్నికలపై బీజేపీ కూడా సాధ్యమైనన్ని సీట్లు సాధించడమే కాకుండా ఆ రాష్ట్ర అధికార పగ్గాలను కూడా చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలపైనే దృష్టిసారించినట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్న కారణంగా మళ్లీ పుంజుకునేందుకు.. ఈ ఎన్నికలనే అస్త్రంగా భావిస్తుంది. మరి ప్రియాంక గాంధీ ఎంతవరకూ.. వారి ఆశలను నిజం చేస్తారో చూడాలి.