విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుపై 'సిట్'... నిగ్గుతేల్చేందుకే..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా కేసును  సీబీఐ.. ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఇంకా వేగవంతం చేయడానికి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ పలు కీలక సమాచారాలు సేకరించగా.. ఇప్పుడు సిట్ తో దర్యాప్తు ఇంకా తేలికవుతుందని భావిస్తున్నారు.     మరోవైపు కాంగ్రెస్ పార్టీని.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇరుకున పెట్టిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుపై దర్యాప్తును కూడా సిట్ కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ఈడీ విచారించింది. మరి సిట్ దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తున్న ముద్రగడ..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తుని కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ముద్రగడ ఆ అరెస్టులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ఉన్నాగానీ ఆయన ఆమరణ దీక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంత మంది చెప్పినా దీక్షను మాత్రం విరమించేది లేదని అంటున్నారు. అంతేకాదు చికిత్స అందించేందుకు వైద్యులు చేస్తున్న యత్నాలను కూడా ఆయన అడ్డుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

బాగ్దాద్‌లో జంట పేలుళ్లు.. 22 మంది మృతి

  బాగ్దాద్‌లో మరోసారి జంట పేలుళ్లు సంభంవించాయి. ఈ పేలుళ్లలో  22 మందికి పైగా మరణించగా.. 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. బాగ్దాద్‌లోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఒక పేలుడు సంభవించింది. ఇరాక్‌ భద్రతా దళాలు బాగ్దాద్‌కు పశ్చిమ దిశలో ఉన్న ఫల్లూజా ప్రాంతంనుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుడులో 15 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.   మరోవైపు తాజిలోని ప్రధాన ఆర్మీ చెక్‌ పాయింట్‌ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడితో కూడిన కారుబాంబు పేలుడులో ఏడుగురు జవాన్లు మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు.

రాష్ట్రంలో కొత్తగా 349 బ్యాంకులు.. చంద్రబాబు

  విజయవాడలో బ్యాంకర్ల సదస్సు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రూ. 83 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయిలు ఇవ్వాలని, విద్య కోసం 2150 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి 5536 కోట్ల రూపాయిల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కోళ్ల పరిశ్రమకు రూ.1299 కోట్లు, మత్స్య శాఖకు రూ.1713 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 349 బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు అన్నారు. ముద్రా బ్యాంకు రుణ లక్ష్యంగా రూ.25 వేల కోట్లు నిర్ణయించారు. రుణ ప్రణాళిక లక్ష్యం 1,65,538 కోట్ల రూపాయిలని, ప్రాధాన్య రంగాలకు 1,25,538 కోట్ల రూపాయిలు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు అన్నారు.

సన్నబడితేనే ఉద్యోగాలు.. లేదంటే తీసేస్తాం..

సాధారణంగా సినిమా హీరోయిన్లు నిరంతరం ఎక్సరసైజ్లు చేస్తూ తమ బాడీ మెయింటెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు సన్నగా నాజుగ్గా ఉంటేనే ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు ఈప్రభావం ఉద్యోగాలపై కూడా పడినట్టుంది. సన్నబడితేనే ఉద్యోగంలో ఉంచుతాం.. లేదంటే తీసేస్తాం అంటూ  వార్నింగ్ ఇచ్చింది ఓ సంస్థ. ఇంతకీ ఆ సంస్థ ఏదనుకుంటున్నారా.. ఎయిర్ ఇండియా.. వివరాల ప్రకారం.. ఎయిర్‌ఇండియా సిబ్బందిలోని 2,800 మందిలో దాదాపు 150 మంది వూబకాయులు ఉన్నట్లు ఏఐ గుర్తించి ఆర్నెళ్లు సమయం ఇచ్చి ఆలోపు సన్నబడితే ఉద్యోగాలు ఉంటాయని.. లేకపోతే తీసేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు.. ఏఐ సీనియర్‌ మేనేజర్‌ జారీ చేశారు. మహిళలు బీఎంఐ 25 నుంచి 27లోపు, పురుషులు 27 నుంచి 30లోపు ఉండాలని.. అంతకంటే ఎక్కువ ఉన్న వారు తగ్గకపోతే విమానాల్లోకి అనుమతించమని తేల్చి చెప్పింది. కాగా గతంలో కూడా ఎయిర్ ఇండియా ఇలానే చేసింది. కానీ సిబ్బంది కొరత కారణంగా 15రోజుల్లో మళ్లీ వారిని తీసుకున్నారు.

'సూసైడ్ స్కీం' పెట్టమన్న తహశీల్దాద్.. షోకాజ్ నోటీసులు

  సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు స్కీంలు పెడుతుంటాయి. ఆ స్కీంలా మాదిరిగానే 'సూసైడ్ స్కీం' లాంటిది పెడితే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా.. విచిత్రంగానూ ఉంది కదా. ఇలాంటి ప్రతిపాదనే చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాట్లం జిల్లా రావోటి మండలానికి చెందిన అమితా సింగ్ అనే వ్యక్తి తహశీల్దార్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన 'సూసైడ్ స్కీం' పెట్టాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి సలహా ఇస్తూ.. తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అంతే ఆ పోస్ట్ పై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న రాట్లం జిల్లా ఇన్ చార్జీ కలెక్టర్ హర్జీందర్ సింగ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.   మోడీ ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీకి పెద్ద ఎత్తున మద్దతు లభించగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఓ సూసైడ్ స్కీం ఏర్పాటు చేయాలని.. దానికి ‘రాజీవ్ గాంధీ ఆత్మహత్య యోజన’ అని పేరు పెట్టాలని... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుంటూ మాయగాళ్లుగా మారిన లౌకికవాదులకు ఈ స్కీంను వర్తింపజేయాలని కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం రేగింది.

మోడీని కారులో తిప్పిన మెక్సికో అధ్యక్షుడు..

  ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నిన్న మెక్సికో వెళ్లిన సంగతి తెలిసిందే. మెక్సికో వెళ్లిన ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఇద్దరూ భారత్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (ఎన్ఎస్జీ) గురించి చర్చించారు. ఈ సందర్భంగా మెక్సికో ఎన్ఎస్జీ లో చేరేందుకు మద్దతు తెలిపింది. అనంతరం.. మోదీకి మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో వద్ద అరుదైన గౌరవం దక్కింది. మోదీని తన కారెక్కించుకుని, సదరు కారును స్వయంగా డ్రైవ్ చేసిన ఎన్రిక్... మెక్సికో సిటీ వీధుల్లో తిప్పారు. ఆ తర్వాత అక్కడి ఓ వెజిటేరియన్ రెస్టారెంట్ ముందు కారు ఆపిన ఎన్రిక్... మోదీని అందులోకి తోడ్కుని వెళ్లారు. మోదీకి ఇష్టమైన ఆహార పదార్థాలను ఎన్రిక్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. మోదీకి లభించిన ఈ అరుదైన గౌరవాన్ని భాతర విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత 30ఏళ్లలో మెక్సికోను సందర్శించిన తొలి ప్రధాని మోదీ. గతంలో 1986లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మెక్సికోలో పర్యటించారు.

కిర్లంపూడిలో టెన్షన్.. సెక్షన్‌ 30 అమలు..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం తన నివాసం వద్ద నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. తుని ఘటనపై అరెస్టులను నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టారు. దీంతో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాపు నేతలు పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి తరలివస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సెక్షన్‌-30 అమలులో చేశారు. కిర్లంపూడి పరిసరాల్లో 3వేల మంది పోలీసులను మొహరించారు. కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు మినహా గ్రామంలోకి ప్రైవేటు వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. గ్రామానికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. దీంతో పోలీసులు విధించిన ఆంక్షలపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కాగా తుని ఘటనపై పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముద్రగడ తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రపంచం ఏమనుకుంటుందో మాకు అనవసరం.. క్రిస్ గేల్

  ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తాను ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ ‘సిక్స్ మెషీన్‌’ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రపంచం మొత్తం మా గురించి ఏమనుకుంటుందో మాకు అనవసరం’ అని అన్న గేల్.. త‌న‌ని తాను ప్రిసిద్ధ‌ ఫుట్‌బాల్ ఆట‌గాళ్లు బాల్‌లో రొనాల్డో , ఇబ్రమోవిచ్‌తో పోల్చుకున్నాడు. ఈ ఇరువురి ఆట‌గాళ్ల‌తో పాటు త‌న‌ని తాను ఛాంపియ‌న్‌ వ‌ర్గానికి చెందిన వాడిగా అభివ‌ర్ణించుకున్నాడు. త‌మ శైలి, ఆట‌తీరు గురించి ప్ర‌పంచం ఏమ‌నుకుంటుందో త‌మ‌కు అన‌వ‌స‌ర‌మ‌ని..  రికార్డుల కోసం ప‌రిత‌పించ‌డం త‌మ‌కు అల‌వాటు లేద‌ని ఆయ‌న తెలిపాడు. త‌మ మీద త‌మ‌కు ఉన్న‌ న‌మ్మ‌కంతోనే మైదానంలోకి దిగుతామ‌ని ఆయ‌న చెప్పాడు.

సెల్ఫీ తీసుకున్నాడు.. హంతకుడు దొరికిపోయాడు..

  సెల్ఫీ తీసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు పోయినవాళ్లను చూసుంటాం. కానీ చెన్నైలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకోని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా బుక్కాయ్యాడు ఓ హంతకుడు. వివరాల ప్రకారం.. చెన్నై వాసి అయినా మణి అనే వ్యక్తి.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తాను  2009లో తాను తన సొంతు ఊరు అయినా అరియ‌ళూరుకి వచ్చాడు. ఒకరోజు తన భార్య అయిన విజయలక్ష్మీతో గొడవ పడిన మణి ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. ఇక అప్పటినుండి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ లాభం లేకపోయింది.   అయితే ఈ మధ్య ఆ హంతకుడు తన స్నేహితులతో తీసుకున్న ఫొటో ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన విజయలక్ష్మీ బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. త‌న భార్య‌ను హ‌త్య‌చేసిన త‌రువాత నాలుగేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిపాడ‌ని, త‌రువాత మ‌ళ్లీ చెన్నైకి వెళ్లి అక్క‌డి ఓ హోట‌ల్‌లో ఉద్యోగం చేశాడ‌ని పోలీసులు మీడియాకి తెలిపారు.

ముద్రగడపై చంద్రబాబు సీరియస్.. మీడియా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిన చంద్రబాబు

కాపు నేత ముద్రగడ పద్మనాభం తుని ఘటనలో అరెస్టు చేసిన వారికి నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. ఇప్పటికే ముద్రగడ దీక్ష గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాపు రిజర్వేషన్లపై ఆలోచిస్తున్నామని.. ముద్రగడ డిమాండ్లపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతోందని చెపుతూ.. ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగ‌డం మంచిది కాద‌ని.. క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రంలో మ‌రిన్ని స‌మ‌స్య‌లు సృష్టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హామీలను నెర‌వేర్చే క్ర‌మంలోనే తాము కమిష‌న్ వేశామ‌ని రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌కు ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సమావేశం మధ్యలోనే చంద్రబాబు హడావుడిగా లేచి వెళ్లిపోయారు. ముద్రగడ చేతిలో పురుగుల మందు ఉందని అధికారులు ఆయనకు చెప్పడంతోనే చంద్రబాబు వెంటనే అక్కడి నుండి లేచి వెళ్లారని సమాచారం.

తుని అరెస్టులపై ముద్రగడ నిరాహార దీక్ష.. పురుగుల మందు పట్టుకొని

  కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుని ఘటనలో తననూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అరెస్టులను నిరసిస్తూ ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు పట్టుకొని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఆయన పక్కనే ఆయనసతీమణి, ఇతర కుటుంబ సభ్యులు కూర్చున్నారు. అమలాపురం పోలీసు స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై పోలీసులు ముద్రగడపై కేసు నమోదు చేశారు. కానీ ముద్రగడ మాత్రం తాను తుని ఘటనలో అయితేనే అరెస్టవుతానని ముద్రగడ మొండికేస్తున్నారు. తనపై ఉన్న కేసుల వివరాలు చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. తనను అరెస్టు చేస్తే జైల్లోనే దీక్ష చేస్తానని, తాను వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. అరెస్టు చేయాలని అడిగితే చేయకుండా దీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన అడిగారు.

కేసీఆర్ కు నేనెందుకు భయపడతాను..

  తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయమంటూ పలువరు పలు సందర్భాల్లో విమర్శించిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. నిన్న కడపజిల్లాలో జరిగిన మహా సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సహా, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పులాంటి మనిషినన్న చంద్రబాబు... ఏ ఒక్కరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినా అవినీతి కేసులున్న జగన్ భయపడాలి గాని తానెందుకు భయపడతానని వ్యాఖ్యానించారు. '43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ జగన్... నన్ను ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తాడా?' అని కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్..

  ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్.. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారిని పదవి నుండి తప్పించినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగిన నాథమ్ ఆర్ విశ్వనాథన్ దిండిగల్ పార్టీ కార్యదర్శి పదవిని కోల్పోయారు. ఇక పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉన్న మాజీ మంత్రులు పొన్నయన్, పళనియప్పన్, పర్నుతి రామచంద్రన్, మోహన్ లను ఆ పదవుల నుంచి జయ తప్పించారు. ఇక తన నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జయలలిత ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ను కూడా తేని జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మరి అమ్మ ఇంకా ముందు ముందు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ముస్లింలపై సాధ్వీ మరోసారి విమర్శలు..

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మతఘర్షణలు చెలరేగుతున్న ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సాధ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్త భారత్ మిషన్ పూర్తి కావచ్చిందని, ఇప్పుడు ముస్లిం ముక్త భారత్‌ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం విముక్త భారత్‌కు ఇదే సరైన సమయమని ఆమె సూచించారు. షారూఖ్, అమీర్‌ఖాన్‌లు పాక్ అనుకూలురంటూ మండిపడ్డారు. అమీర్ దంగల్‌ను హిందువులు చూడవద్దని పిలుపునిచ్చారు. వచ్చే ఏడు జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్యనాథ్‌ను ప్రకటిస్తే విజయం కమలానిదేనని ఆమె పేర్కొన్నారు.