తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

  తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్లే వర్షాలు పడుతున్నాయని, తాజా వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న‌ 72 గంటల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల్లో వడగళ్లతో వాన ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌ని అధికారులు చెప్పారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

వరుస ఓటములు..అయినా ఆదాయంలో టాప్..!

సెరెనా విలియమ్స్..ఒకప్పుడు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన ఈ నల్లకలువకు ప్రజంట్ లక్ కలిసి రావడం లేదు. వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ ఫైనల్‌కు చేరినా టైటిల్ వేటలో చతికిలబడింది. 2015లో వరుసగా మూడు గ్రాండ్ స్లామ్‌లు గెలవగా..ఈ ఏడాదికొచ్చేసరికి రెండు టైటిల్స్‌కు అడుగుదూరంలో నిలిచిపోయి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అయితే ఆటలో వెనుకబాడినా..ఆదాయంలో మాత్రం సెరెనా అగ్రస్థానానికి ఎగబాకింది. తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన అత్యధిక క్రీడాకారిణుల లిస్ట్‌లో సెరెనా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రైజ్ మనీ, వాణిజ్య ప్రకటనల ద్వారా 28.9 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.192 కోట్లు)తో అగ్రస్థానాన్ని అక్రమించి అత్యథిక సంపాదన కలిగిన మహిళా అథ్లెట్‌గా నిలిచింది. దీంతో వరుసగా 11 సంవత్సరాల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్యన్ భామ మరియా షరపోవా కిందకు దిగజారింది. డోపింగ్ టెస్ట్‌లో అడ్డంగా బుక్కవ్వడంతో షరపోవా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.

మా అమ్మ ఎంతో దయాగుణం కల్గింది.. రేణుకా చౌదరి కూతురు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వారు ఓ రెస్టారెంట్ కు వెళ్లగా.. వాళ్ల పనమ్మాయిని పక్కనే నిలబెట్టి భోజనం చేశారని.. దానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో రాగా.. పలువురు విమర్శించారు. అయితే ఇప్పుడు దీనిపై రేణుకా చౌదరి కూతురు తేజశ్విని స్పందించి.. వాస్తవాలు తెలుసుకోకుండా, సగం ఫొటో చూసి విమర్శలు చేయడం తగదని పేర్కొంది. పనమ్మాయిని తన కోసమే నియమించారని, ఆ పనిమనిషి బాలిక కాదని, ఆమె వయస్సు 26 ఏళ్లని, ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు ఉన్నారని తేజశ్విని పేర్కొంది. తమతో పాటే ఆమె కూడా భోజనం చేసిందని చెప్పుకొచ్చింది. ఎంతో దయాగుణం కల్గిన తన అమ్మపై నిందలు వేయడం సబబు కాదని అన్నారు.

మరో కోణం..ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన కిరణ్‌బేడీ..!

దేశ తొలి మహిళా ఐపీఎస్‌గా అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు కిరణ్‌బేడీ. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ప్రశంసలు పొందిన ఈ ఉక్కుమహిళ తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చి రాగానే  కిరణ్ బేడీ తనదైన మార్క్ చూపిస్తున్నారు.   వీఐపీలు, రాజకీయ నేతల కార్లకు ఎలాంటి సైరన్లు ఉండరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రాజకీయ నేతలకు మినహాయింపు ఇవ్వొద్దని ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అక్కడి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పుదుచ్చేరి వీధులను శుభ్రం చేశారు. తాజాగా ఆమెను కలిసేందుకు పుదుచ్చేరి ఎమ్మెల్యేలు వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయవేణి..కిరణ్ బేడీకి సాలువా కప్పి పాదాభివందనం చేసింది. ఆమెను కాళ్లుపట్టుకోవద్దని లేవదీసి ఆత్మగౌరవంతో బతకాలని ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని ఉపదేశించారు. అక్కడితో ఆగకుండా సదరు ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది.

నైజీరియన్లపై గోవా మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

  గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ నైజీరియన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఢిల్లీలో నైజీరియన్లపై దాడి జరిగి వివాదం జరుగగా.. ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాలకు దారి తీసే విధంగా ఉన్నాయి. దేశంలోకి నైజీరియన్లను రానీయకుండా నిషేదించాలని.. నైజీరియ‌న్లను దేశంలోకే అనుమ‌తించవ‌ద్ద‌ని దేశంలోకి వారు ప్ర‌వేశిస్తుండ‌డంతో అనేక సమ‌స్య‌లు తలెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వారు డ్ర‌గ్స్ అమ్మేందుకు వ‌స్తున్నారా..? చ‌దువుకోవ‌డానికి వ‌స్తున్నారా..? అని రవి నాయక్ ప్ర‌శ్నించారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మరి దీనిపై ఎంత రగడ జరుగుతుందో చూడాలి.

కోదండరామ్‌కు కాంగ్రెస్ మద్ధతు

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రోఫెసర్ కోదండరామ్‌ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి చేస్తుండటంతో ఆయనకు మద్ధతుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఎందుకంత భయమని ఎద్దేవా చేశారు. కోదండరామ్ వ్యాఖ్యలను ప్రభుత్వం సలహాగా స్వీకరించాలి గానీ ప్రతి విమర్శలకు దిగకూడదన్నారు. ఈ విమర్శలను చూస్తుంటే రాష్ట్రంలో పౌరహక్కులు ఉన్నాయా లేవా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ నేతల వైఖరి చూస్తుంటే..కేసీఆర్‌కు అనుకూలంగా జేఏసీ నడవాలన్నట్టుందన్నారు.

ఫోటో వివాదంలో.. రేణుకకు కూతురు సపోర్ట్..!

కుటుంబసభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. ఈ వివాదంలో రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు ఆమె కుమార్తె తేజశ్విని. వాస్తవాలు తెలుసుకోకుండా తన తల్లిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫోటోలో పనమ్మాయిని పక్కనబెట్టి మిగిలిన వారంతా భోజనం చేస్తున్నట్టుగా ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. మానవత్వం లేకుండా పనమ్మాయిని పక్కనబెట్టి భోజనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   దీనిపై స్పందించిన తేజశ్విని..ఆ పనమ్మాయిని అమ్మ నాకోసమే నియమించింది. ఆమె బాలిక కాదు, ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు 9, 7 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. రెస్టారెంట్‌లో మాతో పాటే కలిసి భోజనం చేసింది. మా అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది. తన చుట్టూ ఉన్నవారి అవసరాలను స్వయంగా తెలుసుకుని తీరుస్తుంది. ఎంతో మంది మహిళలు, పిల్లలకు సాయం చేసింది. ఇప్పటికీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోంది. అమ్మ సహాయం పొందిన వారిలో చాలా మందికి ట్విట్టర్ ఖాతాలో లేవు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం. అసలేం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధపెట్టే కామెంట్స్ చేయవద్దని తేజశ్విని పేర్కొన్నారు.

ఏపీ వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్..

జూన్ 27 నాటికి హైదారాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏపీకి రావాలని ఒకపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే.. మరోవైపు ఉద్యోగులు మాత్రం ఏపీకి రావడానికి అస్సలు ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు దీనిపై ఎన్జీవో నాయకుడు అశోక్ బాబు కూడా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి వసతులు లేకుండా వెళ్లి ఏం చేయాలి అని అంటున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్ఏ పై ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు అక్కడ అద్దెలు ఎక్కువున్నాయి.. వసతులు లేవు అని వంకలు చెబుతున్న ఉద్యోగులు ఇప్పుడైనా ఏపీకి వెళతారో లేదో చూడాలి.

నేను మాత్రం వ్యాన్ దిగను... దింపితే ఊరుకోను.. ముద్రగడ

తుని కేసుకు సంబంధించి నిన్న పోలీసులు పది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి అరెస్ట్ నిమిత్తం కాపు నేత ముద్రగడ పద్మనాభం పోలీస్ స్టేషన్ నిరసనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు నిందితులను తరలించే వ్యానులో ఎక్కించుకొని ఆయన నివాసం వద్ద దించాలని చూసినా.. ముద్రగడ మాత్రం వారితో వాగ్వాదానికి దిగారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ.. వ్యాన్ దిగబోనని.. అరెస్ట్ చేసిన వారిని తక్షణ విడుదల చేయండి.. లేదంటే తనను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించండి అంటూ డిమాండ్ చేశారు. తనను బలవంతంగా వ్యాన్ దించాలని చూస్తే మాత్రం మరోసారి స్టేషన్ ను ముట్టడిస్తానని హెచ్చరించారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డారు. అంతేకాదు తానే పోలీసులకు ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. కేసులో నిందితులుగా ఉన్నవారి జాబితాను తనకిస్తే, తానే స్వయంగా వారిని స్టేషనులో అప్పగిస్తానని, అమాయకులను భయాందోళనలకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు.

మహిళా జర్నలిస్ట్ పై ఎమ్మెల్యే అసభ్య పదజాలం..

రాజకీయ నేతలు నోరు జారడం కొత్తేమి కాదు. అధికారంలో ఉన్నాం కదా అని.. నోరు జారుతుంటారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు సామాన్య ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఆ తరువాత క్షమాపణలు చెబుతుంటారు. ఇప్పుడు కర్ణాటకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఓ మహిళను ఇష్టమొచ్చినట్టు తిట్టేశాడు. వివరాల ప్రకారం.. కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కొంటున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా మహిళా ప్రతినిధి ఆ విషయంపై కర్ణాటక ఎమ్మెల్యే అశోక్ ఖేని ప్రశ్నించగా.. కోపం కట్టలు తెంచుకొని వచ్చిన ఎమ్మెల్యే గారు.. 'అరెస్ట్ కరో సాలీకో' (దీనిని అరెస్టు చేయండి) అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి పదజాలం ఉపయోగించడం సరికాదని.. అతను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడానికి అంగీకరించాడు కానీ.. ముందు రిపోర్టర్ క్షమాపణలు చెబితేనే కానీ తాను క్షమాపణలు చెబుతానని ఫిట్టింగ్ పెట్టాడు. మరి రిపోర్టర్ క్షమాపణలు చెబుతాడా.. లేక ఎమ్మెల్యేనే క్షమాపణలు చెబుతాడా.. చూడాలి.. ఏం జరుగుతుందో..

అంబులెన్సే కళ్యాణమండపమైంది..

  కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అబులెన్స్ లోనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నేత్రవతి అనే అమ్మాయి తాను ప్రేమించిన  గురుస్వామి అనే యువకుడితో కలిసి చిత్రదుర్గ కోటకు వెళ్లింది. అయితే అక్కడ అనుకోకుండా కాలుజారి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు ఆమె వెన్నుముక విరిగిపోయింది కూడా. ఆమెకు వారంరోజుల నుండి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు. అయితే నేత్రావతి అమావాస్య రోజున తలపెట్టిన సామూహిక విహహాల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇంతలో ఈ ప్రమాదం జరిగి ఆస్పత్రిలో ఉంది. దీంతో చివరికి అంబులెన్స్‌లోనే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అనుకున్న‌ట్లుగానే ఆమె అంబులెన్స్‌లో ఉండ‌గా గురుస్వామి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

మళ్లీ వచ్చేస్తున్న గొరిల్లా..

  అమెరికాలోని సిన్సినాటి అనే నగరంలో గతవారం ఓ బాలుడిని కాపాడటం కోసం గొరిల్లాను చంపేసిన సంగతి తెలిసిందే. జూ లోని  ఓ గొరిల్లా ఎన్ క్లోజర్లో బాలుడు పడిపోగా.. ఆబాలుడిని రక్షించే క్రమంలో పదిహేడేళ్ల గొరిల్లాను చంపేశారు. అనంతరం గొరిల్లాను చంపడంపై పలు విమర్శలు తలెత్తాయి. అయితే ఇప్పుడు ఆ గొరిల్లా ఉన్న చోటును మళ్లీ ప్రారంభిస్తున్నారు. అయితే ఈసారి ఆ ఎన్ క్లోజర్ కు భారీ భద్రతే ఏర్పాటు చేశారు.  పెద్ద మొత్తంలో కంచెను ఏర్పాటుచేశారు. చిన్నపిల్లలు సైతం ఎక్కేందుకు వీలుకానంత విధంగా గట్టి రక్షణ చర్యలు తీసుకున్నారు.   కాగా గొరిల్లాను చంపాల్సి వచ్చినందుకు బాలుడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని కొంతమంది జంతు ప్రియులు కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు నిరాకరించిన కోర్టు ఆ ఎన్ క్లోజర్ వద్ద గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది.

సీఐడీ కార్యాలయానికి ముద్రగడ తరలింపు...

  తుని కేసులో తనను కూడా అరెస్ట్ చేయాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన సంగతి తెలసిందే. అయితే ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆయనతో పాటు కాపు సంఘ నేతలు కూడా ఉన్నారు. దీంతో కాపు కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ముద్రగడను తరలిస్తున్న బస్సుకు అడ్డుగా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముద్రగడను తీసుకువెళుతున్న వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా తుని కేసులో భాగంగా 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఐసిస్ క్రూరత్వం.. 19 మంది అమ్మాయిలను సజీవ దహనం..

  ఉగ్రవాదుల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇటీవలే తమకు లైంగిక బానిసలుగా ఉండటానికి ఒప్పుకోనందుకు 200 మంది అమ్మాయిలను అత్యంత కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు ఇప్పుడు మరో దారుణమైన పనికి ఒడిగట్టారు. ఇప్పుడు మరో 19 మంది అమ్మాయిలను చంపేశారు. మోసుల్ పట్టణంలో తమకు లైంగిక బానిసలుగా ఉండటానికి ఒప్పుకోని 19 మంది యాజిడి వర్గానికి చెందిన అమ్మాయిలను అనేక మంది చూస్తుండగానే ఇనుప బోన్లలో పెట్టి సజీవదహనం చేశారు. ఈ విషయాన్ని ఐఎస్ఐఎస్ మీడియా సమన్వయకర్త అబ్దుల్లా అల్-మల్లా వెల్లడించాడు.   కాగా, ఆగస్టు 2014లో సింజార్ పట్టణంపై దాడి చేసిన ఉగ్రవాదులు 3 వేల మంది యాజిడి వర్గపు యువతులు, అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో వందల మంది ఇప్పటికే చనిపోగా, పదుల సంఖ్యలో తప్పించుకుని బయటకు రాగలిగారు. ఇంకా సుమారు 1800 మంది ఉగ్రవాదుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నా..ఐసిస్ పై చర్యలు తీసుకునే వాళ్లు మాత్రం కనిపించడంలేదు. ఇంకా ఎంతమంది ఈ ఉగ్రవాదుల చేతిలో బలవుతారో చూడాలి.

నేడు విజయవాడలో స్మృతి ఇరానీ పర్యటన..

  కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విజ‌య‌వాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని పాతబ‌స్తీలో నిర్వహిస్తోన్న గుజ‌రాతీ స‌మాజ్ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొంటున్నారు. గుజ‌రాతీ స్కూల్‌లో నూత‌న ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  దేశానికి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రానికి చంద్రబాబు దిశానిర్దేశకులని అన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా బాలికల విద్య పట్ల ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.   అనంతరం ఆమె విద్యార్ధులతో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నట్లు తెలుస్తోంది. కాగా ఆమెతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు కామినేని, ఎంపీ కంభంపాటి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈరోజు మ‌ధ్యాహ్నం సీఎం చంద్ర‌బాబుతో ఆమె భేటీ అవుతారు.

రికార్డ్ సృష్టించిన హిల్లరీ క్లింటన్..

  అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ రికార్డ్ సృష్టించారు. ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. దీంతో శాండర్స్ ను అధిగమించి అధ్యక్ష నామినేషన్ కోసం కావాల్సిన 2383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు. శాండర్స్ కు 1,5691 డెలిగేట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఖరారైంది. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ రేసులో ఓ మహిళ నిలవడం ఇదే ప్రథమం. ఇక తన గెలుపుపై హిల్లరీ కూడా ట్విట్టర్లో 'గాట్ ప్రైమరీస్ టూ విన్' అంటూ  షేర్ చేసుకున్నారు.   అయితే శాండర్స్ మాత్రం.. జూలై నెల వరకు ఎవరు డెమొక్రటిక్ అభ్యర్థిగా వెళతారు ఎదురు చూడాల్సిందే తప్ప.. ఇప్పుడే ఆఖరు అనుకోవద్దని వ్యాఖ్యనించడం గమనార్హం. మరి చూద్దాం.. ఎవరు డెమోక్రటిక్ అభ్యర్థిగా వెళతారో..