చోటా షకీల్ లిస్ట్ లో స్వామి చక్రపాణి కూడా..

  మాఫియా డాన్  చోటా రాజన్ ను మట్టుబెట్టే కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇతనితో పాటు తాను రంగంలోకి దించిన నలుగురు కిల్లర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటపడింది. చోటా షకిల్ లిస్ట్ లో ఒక్క చోటా రాజన్ మాత్రమే లేడని.. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చక్రపాణి.. దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంలో ఆయన కారును కొనుగోలు చేసి దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టినందుకు గాను చక్రపాణిని కూడా చంపేయాలని చోటా షకీల్ ఆ కిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాడట. మరి ఇంకా ఎంతమంది చోటా షకిల్ లిస్టులో ఉన్నారో..

మాల్యాకి బిగుస్తున్న ఉచ్చు.. ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా

  విజయ్ మాల్యా కేసులో దర్యాప్తు వేగవంతం చేయడానికి.. కేసును సిట్ బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ మరో కీలక అడుగు వేసినట్టు తెలుస్తోంది. మాల్యాను ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా ప్రకటించాలని ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈడీ అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే... మాల్యా అరెస్ట్ కు అవకాశాలు మరింత మెరుగుపడతాయన్న వాదన వినిపిస్తోంది.   కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈయన పై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయించింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడానికి ప్రయత్నిస్తుంది.

అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం..

  ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 27 నాటికి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతికి రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఉద్యోగులకు అద్దెలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంగా.. వారికి హెచ్ఆర్ఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇంకా ఏపీ స్థానికతకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు.   దీంతో అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ఈరోజు నుండే ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు బదిలీలు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులంతా ఏపీకి తరలాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదేళ్లు ఒకేచోట పని చేసినవారంతా కదలాల్సిందేనని పేర్కొంది. అయితే, బదిలీకి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించింది. అయితే వ్యవసాయశాఖ ఉద్యోగులకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రుతుపవనాలు వచ్చేయడంతో వ్యవసాయ శాఖలో బదిలీలు ఉండవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

గాంధీతో పనిచేసిన స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత

జాతిపిత మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్‌ గంగూలీ మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు 99 ఏళ్లు. 1930లో తంగలుబెరియా పోలీస్‌ స్టేషన్‌ ముట్టడించినందుకు రెండేళ్లు, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మూడేళ్లు జైలు జీవితం గడిపారు. 1946లో కోల్‌కతా, నోవఖలిలో జరిగిన అల్లర్ల సమయంలో గాంధీజీతో కలిసి శాంతియుత ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గంగూలీ పశ్చిమ్‌బంగా స్వాతంత్ర్య యోధుల సలహాదారుల సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న విధులకు కూడా హాజరయ్యారు. కానీ ఈరోజు గుండెనొప్పితో మరణించారు

బెంచ్ పై నుంచున్న బీజేపీ ఎమ్మెల్యే.. వినూత్న నిరసన..

  సాధారణంగా అసెంబ్లీల్లో నిరసన తెలియజేయాలంటే.. సభ జరగకుండా అడ్డుకోవడమో.. లేక స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేయడమో చూస్తుంటాం. కానీ ఢిల్లీ అసెంబ్లీలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఎమ్మెల్యే తన నిరసనను తెలియజేయడానకి ఏకంగా బెచ్ ఎక్కేశాడు. ఢిల్లీ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ట్యాంకర్ల స్కాం గురించి తన నిరసనను వ్యక్తం చేసేందుకు అసెంబ్లీలో బెంచ్ ఎక్కారు. దీంతో విజేంద్ర గుప్తా చేసిన పనికి మిగతా ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. అయితే స్పీకర్ రామ్ నివాస్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ విధంగా నిరసన తెలిపిన వారిని చూడటం ఇదే మొదటిసారి అంటూ విజేంద్ర గుప్తా చేసిన పనికి మండిపడ్డారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్పీకర్ మందలించినప్పటికీ విజేంద్ర గుప్తా ఏమాత్రం తగ్గలేదు. ఆ సమయంలో సభలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఉండటం గమనార్హం.

ఆడ వేషంలో 11 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు.

  ఓ ఘనుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పురుషుడే స్త్రీవేషం వేసుకొని 11 మందిని పెళ్లిచేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలో మియావూ సొంగాటో అనే వ్యక్తి నిత్యం మహిళలా అందంగా ముస్తాబై ఆన్ లైన్ లో ఛాటింగ్ చేస్తూ.. ప్రోఫైల్ బాగున్న అబ్బాయిలను ఆడగొంతుతో మాయచేసేవాడు. కేవలం వెబ్ ఛాట్ ద్వారా వారిని పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఇలా ఏడాదిలో 11 మంది అబ్బాయిలను ఆడవేషంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత గిఫ్టులు, పెళ్లి వారింట్లో డబ్బులు పట్టుకుని మెల్లిగా చెక్కేసేవాడు. అయితే 11వ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సొంగాటో అసలు రంగు బయటపడింది. అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు, పెద్దఎత్తున స్త్రీలు ఉపయోగించే దుస్తులు, మేకప్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.

మా డబ్బు మాకు కట్టండి:హోటల్ ముందు బ్యాంక్ సిబ్బంది ఆందోళన

వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు టోపి పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా ఎఫెక్ట్‌తో దేశంలోని బ్యాంకులన్ని అలర్టయ్యాయి. పొగుబడుతున్న బకాయిలను వసూలు చేసుకోవడానికి పలు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. నగరంలోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ యాజమాన్యం హోటల్ నిర్మాణం, నిర్వాహణ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.118 కోట్లు అప్పుగా తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లించడం లేదు. బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా..స్పందించకపోవడంతో ఈ రోజు హోటల్ ముందు బ్యాంక్ సిబ్బంది ధర్నాకు దిగారు. ఎలాంటి నినాదాలు లేకుండా ఫ్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు ఘర్షణ..

అదేదో సినిమాలో ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించినట్లుగా..అచ్చం అలాగే ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. హైదరాబాద్ నాంపల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియదు. మరి ఎలా తెలిసిందో ఏమో గానీ నిజం ఇద్దరికి తెలిసిపోయింది. దీంతో అమ్మాయిని వదలకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వీరిద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు చోటుచేసుకునేవి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇదే విషయంపై మరోసారి గొడవపడ్డారు. అది తారాస్థాయికి చేరడంతో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

నాన్ వెజ్ తినేవాళ్లలో తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్..

  ఇటీవల ఒక్క రోజులో సమగ్ర సర్వే చేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి లిమ్కా అవార్డ్ దక్కింది. ఇప్పుడు మరో విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. మాంసాహారం తినే వాళ్లలో తెలంగాణ వాసులే ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. దేశంలోని నాన్ వెజ్ ఎక్కువగా తినే వారిమీద అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టేసి ముందు ప్లేస్ దక్కించుకుంది. ఈ అంశాన్ని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) పేర్కొంది. తెలంగాణ‌లో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం 98.7గా ఉంద‌ని.. ఆ తరువాతం 98.55 శాతంతో  పశ్చిమ బెంగాల్  రెండవ స్థానంలోఉందని ఎస్ఆర్ఎస్ తెలిపింది. ఇక ఒడిశా, కేర‌ళ రాష్ట్రాల్లో వ‌ర‌స‌గా 97.35, 97 శాతం మంది ప్ర‌జ‌లు మాంసాహారాన్ని తీసుకుంటున్నారని.. గుజ‌రాత్‌లో గతంలో క‌న్నా మాంసాన్ని తినే వారి సంఖ్య 40 శాతం పెరిగిందని తెలిపింది.

భారత్-పాక్ లపై సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే స్వామి ఇప్పుడు తాజాగా పాకిస్థాన్-భారత్ ల మధ్య సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా గతంలో సోవియట్ రష్యా వ్యవహరించిన తీరుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థపై సోవియెట్ రష్యాకు పూర్తి పట్టు ఉండేదని, ఇప్పడు అమెరికా తీరు అప్పటి సోవియెట్ యూనియన్ ను తలపిస్తున్నదని స్వామి పేర్కొన్నారు. అప్పట్లొ తాను భారత ఆర్థిక వ్యవస్థపై రష్యా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడానని పేర్కొన్నారు. అయితే మోడీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీనిపై ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

నిండు గర్భిణీ అయిన భార్యపై భర్త అమానుషం..కడుపులోనే

భార్యలపై భర్తల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మిగతా రోజుల్లో ఎలాఉన్నా నిండు చూలాలైన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఇడుపులపాడుకు చెందిన నాగలక్ష్మీకి, బల్లికురువ మండలం కొణిదెవకు చెందిన పల్లపు గోపితో నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లైంది. పని పాటా లేకుండా జల్సాలకు అలవాటు పడిన గోపి నాగలక్ష్మీని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. అడ్డుకోవాల్సిన ఆత్తమామలు కొడుక్కి సపోర్ట్‌గా నిలవడంతో ఆమె వేదన అరణ్య రోదనే అయ్యింది.   వీరికి ఇప్పటికే రెండేళ్ల పాప ఉంది. అయితే నాగలక్ష్మీ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ఈ క్రమంలో ఒకరోజు గోపి నాగలక్ష్మీతో గొడవపడ్డాడు. అంగన్‌వాడిలో పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బులను ఇవ్వాలని ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఎంతకి ఆమె సరే అనకపోవడంతో నిద్రిస్తున్న తన రెండేళ్ల పాపను గోడకేసి కొట్టబోయాడు..అడ్డుకోబోయిన నాగలక్ష్మీని కిందకు తోసి కాలుతో తన్నాడు. మద్యం మత్తులో ఉండటంతో ఆమె పొత్తికడుపుపై పదేపదే తన్నాడు. దీంతో నాగలక్ష్మీకి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు నాగలక్ష్మీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆపరేషన్ నిర్వహించి శిశువును బయటకు తీశారు. కానీ అప్పటికే శిశువు మరణించడంతో ఆ తల్లి  గుండెలు పగిలేలా రోదిస్తోంది. దీనికి కారణమైన భర్త గోపిని పోలీసులు గాలిస్తున్నారు.

ఇకనుండి ఫేస్‌బుక్‌లో 360 డిగ్రీ ఫొటోలు..

  సోషల్ మీడియా రంగంలోనే తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ.. అన్ని సామాజిక మాద్యమాలను అధిగమించి.. ఫేస్ బుక్ మొదటి స్థానంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్న ఫేస్ బుక్ ఇప్పుడు మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. 360 డిగ్రీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. 360 డిగ్రీ కెమెరాతో తీసిన ఫొటోలని అప్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మొబైల్ ఫోన్లో తీసిన ఫొటోలను సైతం 360 డిగ్రీ వ్యూలో మార్చుకోవచ్చని వెల్లడించింది. ఈ ఫొటోలు వర్చువల్‌ రియాల్టీ కంపాటబుల్‌ డివైజెస్‌లో కూడా చూడొచ్చని ఫేస్‌బుక్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్లు కూడా ఈ ఫీచర్‌తో వస్తాయని ఫేస్‌బుక్‌ తెలిపింది.

పాకిస్థాన్ కు అమెరికా వార్నింగ్..

  అగ్రరాజ్యమైన అమెరికా నుండి పాక్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. అంతేకాదు పఠాన్ కోట్ కు సంబంధించిన విచారణలో భారత్ కు సహకారం అందించాలని ఆదేశించింది. ఇప్పుడు మరోసారి అమెరికా పాక్ కు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన.. తమ దేశం పొరుగు గడ్డ మీద ఉగ్రవాదం పురుడుపోసుకుంటోందని అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగం చేశారు. దీంతో ‘మీ దేశ గడ్డ మీద నుంచి భారత్ పై జరుగుతున్న దాడులకు తక్షణమే చెక్ పెట్టాలని పాక్ కు అమెరికా నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న పాక్ కు అమెరికా నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. మరి పాక్ దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాబూల్ లో భారత మహిళ కిడ్నాప్..

  ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆప్ఘనిస్థాన్లో మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో నిన్న భారత సంసతికి చెందిన ఓ మహిళను ఉగ్రవాదులు అపహరించారు. వివరాల ప్రకారం.. కోల్ కతాకు చెందిన జుదిత్ డిసౌజా అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అగా ఖాన్ ఫౌండేషన్ లో పనిచేసేందుకు గాను కాబూల్ కు వెళ్లారు. అయితే అక్కడ కార్యాలయం నుండి తన సహోద్యోగులతో కలిసి బయటకు వస్తుండగా వారందరిని తాలిబన్లు అపహరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం అఫ్ఘన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. వీలయినంత త్వరలో డిసౌజాతో సహా కిడ్నాప్ నకు గురైన వారందరిని విడిపించేందుకు యత్నిస్తున్నట్లు అఫ్ఘన్ అధికారులు చెప్పారు.

చోటా రాజన్ హత్య.. నలుగురు కిల్లర్లు అరెస్ట్..

  మాఫియా డాన్ చోటా రాజన్ ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే నలుగురు కిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చోటా రాజన్ ను చంపడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు.. ఈనేపథ్యంలో అతని ప్రధాన అనుచరుడు చోటా షకిల్ ను ఏర్పాటు చేయగా.. ఆ ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆ తరువాత చోటా షకీల్ ఆదేశాలతో రాబిన్సన్, జునైద్, యూనస్, మనీష్ అనే నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రంగంలోకి దిగారు.  షకీల్ ఆదేశాలతో ఇప్పటికే ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చేరుకున్న ఈ నలుగురు కిల్లర్లు అదను కోసం మాటు వేశారు.  ప్లాన్లో భాగంగానే వారు ఫోన్ సంభాషణలు చేసుకునేవారు. ఈ ఫోన్ సంభాషణలను పట్టేసిన పోలీసులు నలుగురు కాంట్రాక్టు కిల్లర్లను అరెస్ట్ చేశారు. ఓ పిస్టల్, కాట్రిడ్జ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, వారిని చోటా రాజన్ ఉంటున్న తీహార్ జైలుకే తరలించారు.