కేసీఆర్ కు నేనెందుకు భయపడతాను..

  తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయమంటూ పలువరు పలు సందర్భాల్లో విమర్శించిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. నిన్న కడపజిల్లాలో జరిగిన మహా సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సహా, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పులాంటి మనిషినన్న చంద్రబాబు... ఏ ఒక్కరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినా అవినీతి కేసులున్న జగన్ భయపడాలి గాని తానెందుకు భయపడతానని వ్యాఖ్యానించారు. '43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ జగన్... నన్ను ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తాడా?' అని కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్..

  ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్.. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారిని పదవి నుండి తప్పించినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగిన నాథమ్ ఆర్ విశ్వనాథన్ దిండిగల్ పార్టీ కార్యదర్శి పదవిని కోల్పోయారు. ఇక పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉన్న మాజీ మంత్రులు పొన్నయన్, పళనియప్పన్, పర్నుతి రామచంద్రన్, మోహన్ లను ఆ పదవుల నుంచి జయ తప్పించారు. ఇక తన నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జయలలిత ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ను కూడా తేని జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మరి అమ్మ ఇంకా ముందు ముందు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ముస్లింలపై సాధ్వీ మరోసారి విమర్శలు..

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మతఘర్షణలు చెలరేగుతున్న ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సాధ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్త భారత్ మిషన్ పూర్తి కావచ్చిందని, ఇప్పుడు ముస్లిం ముక్త భారత్‌ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం విముక్త భారత్‌కు ఇదే సరైన సమయమని ఆమె సూచించారు. షారూఖ్, అమీర్‌ఖాన్‌లు పాక్ అనుకూలురంటూ మండిపడ్డారు. అమీర్ దంగల్‌ను హిందువులు చూడవద్దని పిలుపునిచ్చారు. వచ్చే ఏడు జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్యనాథ్‌ను ప్రకటిస్తే విజయం కమలానిదేనని ఆమె పేర్కొన్నారు.

ప్రజల కళ్లలో ఆనందం చూడాలి-చంద్రబాబు

రాష్ట్ర ప్రజల కళ్లలో ఆనందం చూసేవరకు తాను విశ్రమించబోనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మహా సంకల్ప యాత్ర సందర్భంగా కడపలో జరిగిన మహా సంకల్ప సభకు సీఎం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అనంతరం అక్కడకు వచ్చిన ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు..ఈరోజు చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండి పోవాలని ఆయన కోరారు.   రాష్ట్ర విభజనతో మనం చాలా నష్టపోయామని..ప్రస్తుతం అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నా ఒక్కొ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. విద్యుత్ కొరతను చాలా వరకు అధిగమించినట్టు తెలిపారు. రాజధాని అమరావతి కోసం తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఏకంగా 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందన్నారు. దీనికి రగిలిన ఏపీ ప్రజలు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని..ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోదన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

చిన్నారి లేఖకు స్పందించిన మోడీ

తనకు వైద్యం చేయించాలని ఒక చిన్నారి సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసింది. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన ఆరేళ్ల చిన్నారి వైశాలి యాదవ్‌కు గుండెలో రంధ్రం ఉండి..అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు..కాని అంత స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో విషయాన్ని ప్రధానమంత్రికి తెలియజేస్తానని వైశాలి తన తండ్రిని అడిగింది.   దీనికి ఆయన ఒప్పుకోవడంతో అప్పటికప్పుడే నోట్‌బుక్‌లో నుంచి ఒక పేజీ చించి తన అనారోగ్యం, పేదరికం గురించి ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఖచ్చితమైన అడ్రస్ లేకపోవడంతో తన స్కూల్ ఐడీ కార్డును జత చేసింది. అయిదంటే ఐదు రోజుల్లో స్పందించిన మోడీ చిన్నారికి ఆపరేషన్ చేయించాలని జిల్లా కలెక్ట్రర్‌ను ఆదేశించారు. అలాగే పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌‌కు నేరుగా పీఎంవో నుంచి లేఖ వచ్చింది. అటు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, ఆసుపత్రి ప్రతినిధులు బాలిక వద్దకు చేరుకోవడానికి ఎలాంటి సదుపాయం రావడంతో పాఠశాలలో ఎంక్వైరీ చేసి బాలికను కలుసుకున్నారు. ఈ వారమే విజయవంతంగా ఆపరేషన్ కూడా నిర్వహించారు. తన లేఖకు సాక్షాత్తూ దేశ ప్రధాని స్పందించడంతో ఆ చిన్నారి ఆనందం వ్యక్తం చేసింది.

భళా ఫ్లిప్‌కార్ట్..స్మార్ట్‌ఫోను బదులు నిర్మా సబ్బు పంపారు..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై ముంబైలో కేసు నమోదైంది. వాల్కేశ్వర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫోన్ ఆర్డర్ చేస్తే మే 30న డెలివరీ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ప్రకారం రూ.29,000 చెల్లించి ఎంతో ఆనందంగా బాక్స్ ఓపెన్ చేసిన ఆనంద్ అవాక్కయ్యాడు. అందులో ఫోన్‌కు బదులు నిర్మా సోప్, అండ్రాయిడ్ ఫోన్ చార్జర్ ఉన్నాయి.వెంటనే డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసి పిలవగా, అతడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పాడు. కానీ కస్టమర్ కేర్ వాళ్లు దాన్ని తప్పుడు ఫిర్యాదుగా కొట్టేయడంతో ఆనంద్ మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు ఫోన్ ఇవ్వాలి లేదా తన డబ్బు వాపస్ ఇవ్వాలని చాలా సార్లు వాళ్లకు ఫోన్ చేశానని, వాళ్లు ఏ మాత్రం వినిపించుకోకపోవడంతో ఇక ఫిర్యాదు చేయక తప్పలేదని ఆనంద్ మీడియాతో చెప్పారు.

దేశం మొత్తం పవర్ కట్‌..నేరం కోతిపైకి..!

సాధారణంగా మనం తప్పు చేసి దొరక్కుండా ఉండటానికి అవతలి వాళ్ల మీదకు నెడుతూ ఉంటాం. అచ్చం కెన్యాలో ఓ ఎలక్ట్రిక్ కంపెనీ తప్పు చేసింది. అయితే నేరం వేరే వాళ్ల మీద తోయడానికి దానికి ఎవరూ కనిపించలేదు. దీంతో తప్పు కోతి పైకి నెట్టేసింది సదరు కంపెనీ. ఆఫ్రికా దేశం కెన్యా మొత్తం ఒక్కసారిగా కారు చీకట్లలోకి వెళ్లిపోయింది. దీంతో మూడు గంటల పాటు చీకటి రాజ్యమేలింది. దీనిపై ప్రభుత్వం ఎలక్ట్రిక్ కంపెనీ వివరణ కోరింది. దానికి ఆ కంపెనీ ఒక కోతి తమ కంపెనీ గిటార్ పవర్ స్టేషన్ పైకప్పు మీదకు ఎక్కిందని, అక్కడి నుంచి ట్రాన్స్ ఫార్మర్ మీద పడటంతో పవర్ ట్రిప్ అయ్యిందని, ఈ కారణంతో అన్ని మెషిన్లు పనిచేయకపోవడంతో 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పింది. అయితే ఆ కోతి బతికే ఉందా..చనిపోయిందా ..? ఆ కోతిని ఎవరైనా చూశారా అన్న క్వశ్చన్స్‌కి మాత్రం కంపెనీ అన్సర్ ఇవ్వలేదు.

అంపైర్ ను తిట్టిన క్రికెటర్.. ఏడేళ్లు నిషేదం..

  సాధారణంగా క్రికెటర్లు గ్రౌండ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేసి జరిమానాలు కడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువ క్రికెటర్ మాత్రం ఓ అంపైర్ ను తిట్టి ఏకంగా ఏడేళ్లపాటు నిషేదానికి గురయ్యాడు. ఈ ఘటన బెర్ముడాలో జరిగింది. వెస్ట్ ఇండీస్ ఆల్‌రౌండర్ కెవన్ ఫబ్లర్‌ సీ బ్రీజ్ ఓవల్‌ మైదానంలో బెయిలీస్‌ బే జట్టుపై విల్లో కట్స్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అయితే తాను ఔటైనప్పుడు అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు వికెట్లను బ్యాటుతో కొట్టి, అంపైర్ పై బాలు విసిరి.. అతనిని తిట్టాడు. దీంతో అతను క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించినందుకు.. బెర్ముడా క్రికెట్ బోర్డు ఏడేళ్ల నిషేధం విధించింది. అయితే ఫబ్లర్ పై చిన్న శిక్షనే విధించేవారు కానీ.. అంపైర్ తిట్టడంతో సీరియస్ గా తీసుకున్న క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఫబ్లర్ గతంలో కూడా  సెలెక్టర్ మొల్లీ సిమన్స్‌ను తిట్టినందుకు నిషేధానికి గురయ్యాడు. మరో వైపు ఇలా ఆవేశంతో పదే పదే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తన క్రికెట్ భవిష్యత్ కే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

బాలింతలకు ఉపయోగ పడే 'జనని సేవ’ పథకం ప్రారంభం..

  రైళ్లలో ప్రయాణించే బాలింతలు, శిశువులకు ఉపయోగపడే విధంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు రైళ్లలో ‘జనని సేవ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బాలింతలు, శిశువులకు ఉపయోగపడే వేడిపాలు, వేడి నీళ్లు సహా ఇతర వస్తువులను 25 స్టేషన్లలో రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశువుకు పాలు దొరకలేదంటూ ఓ బాలింత చేసిన ట్వీట్‌ తనను చలించేలా చేసిందని.. శిశువుకు వెంటనే పాలు అందేలా ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని.. ఆ ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొనే అందరికీ ఉపయోగపడేలా జననీ సేవ పథకాన్ని ప్రారంభించానని తెలిపారు.

తెలంగాణ.. 13 కొత్త జిల్లాలు ఇవే..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త జిల్లాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనంలో కలెక్టర్లతో సమావేశమై కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించి కొత్తంగా ఏర్పాటయ్యే 13 జిల్లాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 459తో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 23 జిల్లాల వివరాలు 1. ఆచార్య జయశంకర్‌ జిల్లా 2. ఆదిలాబాద్‌ 3. భద్రాద్రి 4. యాదాద్రి 5. హైదరాబాద్‌ 6. జగిత్యాల 7. కామారెడ్డి 8. కరీంనగర్‌ 9. ఖమ్మం 10. కొమరంభీమ్‌ 11. మహబూబాబాద్‌ 12. మహబూబ్‌నగర్‌ 13. మెదక్‌ 14. నాగర్‌ కర్నూలు 15. నల్గొండ 16. నిజామాబాద్‌ 17. రంగారెడ్డి 18. సంగారెడ్డి 19. సికింద్రాబాద్‌ 20. సిద్ధిపేట 21. సూర్యాపేట 22. వనపర్తి 23. వరంగల్‌

ఇకనుండి వాట్సప్ లో పోలీస్ కంప్లైట్స్..

  రోజు రోజుకి వాట్సాప్ వాడకం బాగా పెరిపోతున్న సంగతి తెలిసిందే. ఏ సమాచారం కావాలన్నా.. ఏదైనా వాట్సప్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వాట్సాప్ సౌకర్యాన్ని విశాఖ వాసులు కూడా వాడుకోవాలని నిర్ణయించున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకనుండి పోలీస్ స్టేషన్లకు వెళ్లి కాగితం పై రాసి ఫిర్యాదులు చేసే అవసరం లేకుండా.. వాట్స‌ప్ ద్వారా కూడా పోలీసుల‌కి ఫిర్యాదులు పంపే సౌకర్యం అందుబాటులో తెచ్చారు.  డీఐజీ శ్రీకాంత్ విశాఖలో పోలీసులకు సంబంధించిన యాప్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ‌గా త‌మ సేవ‌ల‌ను అందించేందుకు వాట్స‌ప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు ఏ స‌మ‌యంలోనైనా వాట్సప్‌ నెంబర్‌- 8142003339కి త‌మ ఫిర్యాదులు పంప‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు.

అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం... !

ఏపీ రాజధాని అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోంది.. అగ్రరాజ్యమైన అమెరికాపై ప్రయోగించడానికి హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రికి కూడా తెలియని ఈ విషయాలు.. ఎవరికి తెలుసనుకుంటున్నారా.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. పాక్ మీడియా.  ఓ టీవి ఛానల్ లో చర్చ సందర్భంగా.. ఆ దేశానికి సంబంధించి ఓ వ్యక్తి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇక దీనికి వంతంగా పాక్ ప్రభుత్వం కూడా న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తాని పాక్ చేసిన ఈ వ్యాఖ్యలు వింటే చంద్రబాబు కూడా ఆశ్చర్యపోతారేమో..

మథుర అల్లర్లు.. బయటపడిన మరో కొత్త విషయం..

  మథుర అల్లర్లలో రోజుకో సరికొత్త విషయం బయటపడుతోంది. 'స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రాహి' అనే సంస్థ మథురలోని 280 ఎకరాల భూమిని  ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే బయటకి అది ఆశ్రమంలా కనపడినా.. అక్కడ  ఆయుధాల తయారీతో పాటు తన కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తుందన్న విషయం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు మరో విషయం బయటపడింది. జవహర్ బాగ్ లో సోదాలు చేస్తున్న బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ కు అమెరికాలో తయారైన ఓ రాకెట్ లాంచర్ దొరికింది. ఈ అత్యాధునిక యుద్ధ పరికరాన్ని ఈ సంస్థకు ఎవరు సరఫరా చేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ విచారణలో మరింత సంచలనం రేకెత్తించే అంశాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు అభ్రిపాయపడుతున్నారు.   కాగా మథుర అల్లర్లలో ఎస్పీ సహా 24 మంది పోలీసులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

తెలుగు విద్యార్ధులకు అమెరికా షాక్.. వెనక్కి వెళ్లిపోండి..

  అమెరికాలో తెలుగు విద్యార్దులకు కష్టలు తప్పేట్లు కనిపించడంలేదు. ఇప్పటికే అక్కడ చదువుకోవడానికి వెళ్లిన విద్యార్ధులను ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన సమాచారం అందించడంలేదంటూ పదుల సంఖ్యలో వారిని వెనక్కి పంపించేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది విద్యార్ధులకు అదే పరిస్థితి ఏర్పడింది. అయితే వీరు ఒక సెమిస్టర్ పూర్తి చేసిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అమెరికాలోని  వెస్టర్న్ కెంటరీ వర్సిటీలో.. ఇంటర్నేషనల్ రిక్రూటర్లతో కంప్యూటర్ సైన్స్ లో విద్యనభ్యసించేందుకు వెస్టర్న్ కెంటరీ వర్సిటీ 60 మంది తెలుగు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. వర్సిటీ ప్రవేశాలు లభించడంతో తెలుగు విద్యార్థులంతా హుషారుగా అక్కడికి వెళ్లిపోయారు. ఇప్పటికే ఓ సెమిస్టర్ కూడా పూర్తైంది. అయితే ఏమైందో తెలియదు కానీ.. సరైన పత్రాలు లేవు.. తక్షణమే వర్శిటీని వదిలి వెళ్లాలని నోటీసులు జారీ అవ్వడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు. అంతేకాదు ఇప్పటి వరకూ బానే ఉన్న పత్రాలు.. ఇప్పుడు ఎందుకు సరిగా లేవని ప్రశ్నిస్తున్నారు.

పాక్ కు బాంబు పేల్చిన అమెరికా.. వారిని శిక్షించాల్సిందే..

ఈ మధ్య పాక్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ దేశానికి మద్దతుగా ఉన్న చైనా పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి కారణం పాకిస్థానీయులే అని తేల్చి చెప్పగా.. ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా పాక్ పై ఓ బాంబు పేల్చింది. పఠాన్ కోట్ పై జరిగిన దాడి సూత్రధారులను శిక్షించాల్సిందే అని ఓ ప్రకటన చేసింది. అంతేకాదు పాక్ భూభాగం మీద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డీ కంపెనీ’ పేరును కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారులతో పాటు 2008 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించిన నిందితులను కూడా పాక్ శిక్షించాల్సిందేనని ఆ ప్రకటన డిమాండ్ చేసింది.   కాగా భారత ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ, ఒబామాతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

విరాట్‌ను ఆకాశానికెత్తిన ముత్తయ్య..

ప్రజంట్ సూపర్‌ఫాంలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ దిగ్గజాలంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి శ్రీలంక దిగ్గజం, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ చేరాడు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రూపొందించిన విజన్ 2020 కార్యక్రమానికి హాజరైన మురళీ ఈ సందర్భంగా విరాట్‌కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. గత రెండు సంవత్సరాలుగా అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న విరాట్ చాలాకాలం పాటు ఇదే ఊపును కొనసాగించే అవకాశం ఉందన్నాడు . తనదైన ముద్రతో దూసుకుపోతున్న విరాట్‌ను నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ప్రస్తుతం విరాట్ తన కలను సాకారం చేసుకునే క్రమంలో మధ్యలో మాత్రమే ఉన్నాడని, ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించి మరిన్ని రికార్డులు నెలకొల్పుతాడని ఆశిస్తున్నట్టు మురళీ తెలిపాడు.