కమలంవైపు చంద్రుడి చూపు
posted on Apr 26, 2023 @ 11:17AM
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు కలిసే సాగుతాయా అన్న అనుమానాలకు చంద్రబాబు చాలా వరకూ తెరదించేశారు. గతంలో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రావడానికి మోడీ పాలనతో , మోడీ విధానాలతో విభేదించడం కారణం కాదని స్పష్టం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్న విషయం సెంటిమెంటుగా మారిందనీ, ఆ హోదా సాధన కోసమే ఎన్డీయే నుంచి బయటకు రావలసి వచ్చిందని విస్పష్టంగా చెప్పారు.
జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్: ద నీడ్ టు కీప్ ఫైటింగ్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబునాయుడు ఎన్డీయేతో కలిసి పని చేస్తామా అంటే ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ముక్తాయించారు. ప్రస్తుతం ఏపీలో జగన్ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాల్సి ఉందని, అందుకోసం ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పలు సందర్బాలలో చంద్రబాబు విస్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జనసేనాని అయితే వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని విస్పష్ట ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఏపీలో తెలుగుదేశంతో జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందన్న భావన అన్ని వర్గాలలో వ్యక్తమౌతోంది.
చంద్రబాబు తాజాగా ఒక జాతీయ స్థాయి చానల్ నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం బీజేపీతో పొత్తు ఉంటుందన్న పరిశీలకుల అంచనాకు తగ్గట్టుగానే ఉంది. అయితే చంద్రబాబు ఈ సదస్సులో దేశ ప్రగతి, టెక్నాలజీ, సంక్షేమం తదితర అంశాలలో తన విజన్ ను కూడా ఆవిష్కరించారు. మోడీ మోడల్ కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భారతీయ జనాభాలో 40% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. యువత ఎక్కువ కలిగిన దేశం మనది. ప్రభుత్వాలు వారి ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా, అందుకు అనుగుణంగా విధానాలు రూపిందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చన్నారు.
అలాగే టెక్నాలజీ పరంగా ఉన్నత దశలో ఉన్నాం. సాంకేతికత విప్లవాన్ని తెస్తుందని తాను మొదటి నుంచీ చెబుతున్నానని పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారుతుందన్నారు. . సాంకేతిక విప్లవానికి హైదరాబాద్ ప్రస్థానమే నిదర్శమన్న చంద్రబాబు నేడు తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతోందంటే తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వేసిన బీజాలే కారణమన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు తీసుకురావడానికి నాడు నేను మన బలాలు ఏంటో బిల్ గేట్స్ కు వివరించాను. భారతీయులు గణితంలో, ఇంగ్లీషులో ప్రావీణ్యం కలిగిన వారు అని వివరించాను. దీంతో బిల్ గేట్స్ అంగీకరించి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. నాడు తాను విజన్ గురించి మాట్లాడితే నన్ను విమర్శించారు. కానీ ఆ విజన్ 2020 హైదరాబాద్‌లో సాకారం అయ్యిందని వివరించారు. సమాజం కోసం ముందుచూపుతో పనిచేసే నాయకులు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారనీ, అలాగే తనూ విమర్శలను ఎదుర్కొన్నాననీ చంద్రబాబు చెప్పారు.
మొత్తంగా ఈ సదస్సులో దేవ ప్రగతి, సంక్షేమం, సంపద పెంపు సాంకేతిక విప్లవం వంటి ఎన్ని అంశాల గురించి మాట్లాడినా ఆయన మోడీ ప్రభుత్వం, మోడీ మోడల్ అభివృద్ధి, విజన్ లపై చేసిన వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి. ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణలు ఉంటాయని ఆయన తన మాటల ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనాని హస్తిన పర్యటన తరువాత ఏపీలోని అధికార వైసీపీతో బీజేపీ సంబంధాలు ఒకింత చెడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత ఈ సదస్సులో మోడీ మోడల్ కు మద్దతు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.