జగన్ సర్కార్ పై స్వరూపానంద ఫైర్!

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద   ఏపీ ప్రభుత్వ రాజగురువుగా గుర్తింపు పాందారు. ముఖ్యమంత్రి జగన్ తన మత విశ్వాసాలకు భిన్నంగా అయిన దానికీ కానీ దానికీ విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు పొందుతూ వచ్చారు. ఇందుకు జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న చెలిమి కారణమని కూడా చెబుతారు. కేసీఆర్ ను ప్రసన్న చేసుకునేందుకు ఏపీ సర్కార్ తరఫున శారదా పీఠానికీ, స్వరూపాదనం కూ జగన్ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చారు. అయితే ఇప్పుడు అందంతా గతం. స్వరూపానంద ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.  అప్పన్న చందనోత్సవ సమయంలో ఆయన చేసిన విమర్శలు జగన్ సర్కార్ ను నడిరోడ్డుపై నిలబెట్టేసినట్లుగా ఉన్నాయి.  ఇంత కాలం దేవాలయయాలలో జరిగిన అపచారాలు, రధం దగ్ధం ఘటనలు, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న విపరీత నిర్ణయాలూ వేటినీ ప్రశ్నించని, పై పెచ్చు సమర్ధించిన స్వరూపానంద.. తాజాగా సింహాద్రి అప్పన్న చందనోత్సవ సమయంలో భక్తులకు కలిగిన అసౌకర్యానికి, ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఆయన ఫైర్ అయిపోయారు. ఈవో ను నియమించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. టికెట్లను ఇష్టారీతిగా అమ్ముకున్నారనీ, అధికారులు వీవీఐపీలను, సంపన్నులను తప్ప సామాన్యులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. అసలు దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత కాలం జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలిచిన స్వరూపానంద..ఇప్పుడిలా యూ టర్న్ తీసుకోవడానికి చందనోత్సవ వేళ భక్తులకు కలిగిన అసౌకర్యాలపై, అస్తవ్యస్త ఏర్పాట్లపై ఇంతలా ఫైర్ అయిపోయారేంటి? అని జనం ఆశ్చర్యపోతున్నారు. తిరుమలలో కాటేజీల రెంట్లు విపరీతంగా పెంచేసినప్పుడు కానీ, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తులకు కలిగిన ఇక్కట్ల గురించి కానీ నోరెత్తని స్వరూపానంద ఇప్పుడెందుకు జగన్ పేరెత్తకుండానే.. ఆయన పాలనా వైఫల్యమే అప్పన్న చందనోత్సవ కార్యక్రమం రసాబాసగా మారడానికి కారణమంటూ విమర్శలు గుప్పించారు? ఇటీవల స్వరూపానంద వారసుడు స్మాత్యేంద్రానంద… తాము ఏ పార్టీకి అనుబంధం కాదని ప్రకటించిన విషయాన్నీ ఈ సందర్భంగా జనం గుర్తు చేస్తున్నారు. అప్పన్న చందనోత్సవం కార్యక్రమం భక్తుల ను పక్కన పెట్టేసి పూర్తిగా  వీఐపీల కోసం అన్నట్లుగా సాగిందని విమర్శలు గుప్పించిన స్వరూపానంద తాను స్వయంగా వీఐపీ దర్శనమే చేసుకున్నారు. భక్తుల ఆగ్రహావేశాలు, జగన్ సర్కార్ పట్ల జనంలో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను గమనించే స్వరూపానంద తన పీఠం గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే ఇలా విమర్శలు గుప్పించారని అంటున్నారు. ఇంకా జగన్ ప్రాపకం కోసం పాటుపడితే.. తన పరువు, పీఠం పరువు గంగలో కలుస్తుందన్న భయంతోనే ఆయన సెల్ఫ్ ప్రొటక్షన్ కోసం ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. ఆ తరువాత మాట మార్చి.. తాను ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపలేదనీ, చందనోత్సవ వేళ భక్తుల ఇక్కట్లకు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని మాత్రమే విమర్శించాననీ చెప్పుకున్నా అది పెద్దగా జనంలోకి వెళ్ల లేదు. ప్రభుత్వ వైఫల్యం, అసమర్థతలపై స్వరూపానంద ఫైర్ అయ్యారన్నదే జనంలోకి బాగా వెళ్లింది.

రేవంత్ వర్సెస్ భట్టి.. కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  ఇటీవల కొంత సర్దుమణిగినట్లు కనిపించిన లేదా అనిపించించిన అంతర్గత కుమ్ములాటల వ్యవహారం మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది.  రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్ నేతలు, ఆయన వ్యవహార తీరు పట్ల గుర్రుగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం అంటే అవమానంగా భావిస్తూ వచ్చారు. అందుకే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చారు. మరోవంక అందుకు తగ్గట్టుగానే, రేవంత్ రెడ్డి ఆయన అనుచర వర్గం అధిష్టానం అండదండలతో సీనియర్లతో డోంట్ కేర్  అన్న ధోరణిలో కయ్యానికి కాలుదువ్వుతూ, సీనియర్ నాయకులను చులకన చేస్తూ వచ్చారు.  మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు గానీ, స్వయంగా రేవంత్ రెడ్డి చేసిన ఐపీస్.. హోం గార్డ్ వ్యాఖ్యలే కానీ, రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన విపక్ష్లాల ఉమ్మడి అభ్యర్హ్ది యశ్వంత్ సిన్హా’ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను ‘బండకేసి కొడతా’నంటూ చేసిన  వ్యాఖ్యలు.. ఇలా అనేక సందర్భాలలో స్వయంగా రేవంత్ రెడ్డి, అయన వర్గానికి చెందిన ఇతర నాయకులు సీనియర్లకు పొమ్మన కుండా పొగపెట్టి బయటకు పంపే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశీస్సులు, అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయనను పార్టీ నుంచి  సాగనంపేందుకు సీనియర్లు చేసిన, చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.   చివరకు,మరో మార్గం లేక సీనియర్ నాయకులు, జాతీయ స్థాయిలో జీ 23 తరహాలో జీ 11 పేరుతో తిరుబాటు జెండా ఎగరేసారు. రేవంత్ రెడ్డి చేతిలో రాష్ట్ర వ్యవహారల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కీలుబొమ్మలా మారారని, ఆ ఇద్దరి వ్యావహార శైలి కారణంగా పార్టీలో సమస్యలు తలెత్తుతున్నాయని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే, అధిష్టానం రేవంత్ రెడ్డిని కదల్చకుండా మాణిక్కం ఠాగూర్  పక్కకు తప్పించింది. అయన స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. మాణిక్‌రావు ఠాక్రే నియామకం తర్వాత పార్టీలో అంతర్గత తగాదాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల  పంచాయతీ కొంత సర్డుమణిగినట్లు కనిపించింది. అయితే ఇప్పడు మళ్ళీ తెరపైకి మరో పంచాయతీ వచ్చింది. ఓ వంక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఇటు నుంచి రేవంత్ అటు నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎక్కడిక్కడ తమ తమ పరిధిలో ఇతర ముఖ్య నాయకులు సాగిస్తున్న  హత్ సే హాత్ జోడో యాత్రలు, మరో వైపు టీపీసీసీ పేపర్ లీకేజీకి వ్యతిరకంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు కొత్త వివాదానికి తెర తీశాయి.  ముఖ్యంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ వేదికగా రేవంత్ వర్సెస్ సీనియర్ల విభేదాలు మరో మారు భగ్గుమన్నాయి. విశేషం ఏమంటే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే,  కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత కొప్పుల రాజు, రాష్ట్ర  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే సమక్షంలో సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి పట్ల తమకున్న వ్యతిరేకతను మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించారు. మల్లికార్జున ఖర్గేతో కలిసి వేదిక మీదికి వచ్చిన రేవంత్రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు.  కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,   మధుయాష్కీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు భట్టి విక్రమార్క చేతులు పట్టుకొని వేదికపై నుంచి సభికులకు అభివాదం చేశారు. రేవంత్ రెడ్డి ప్రేక్షకుడిగా మిగిలి పోయారు. అంతేకాదు, వేదిక నుంచి మాట్లాడిన రాష్ట్ర నాయకులు విక్రమార్కను పొగడ్తల్లో ముంచెత్తారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ఆయనను దివంగత వైఎస్ఆర్ తో  పోల్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అనుచరులు  సీఎం భట్టి... సీఎం భట్టి అంటూ పెద్దపెట్టున నినదించారు. ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు సైతం విక్రమార్కను పొగుడుతూ మాట్లాడారు.   అదంతా ఒకెత్తు అయితే, చివరగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే అయినా, కార్యకర్తలతోపాటుగా వేదిక పై ఉన్న కొందరు నాయకులు   సీఎం భట్టి  అంటూ చేసిన నినాదాలను  ఖండిస్తారని రేవంత్ వర్గం ఆశించింది. అయితే  ఖర్గే  అసలు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో, రేవంత్ రెడ్డి అసహనంగా కనిపించడమే కాకుండా, జిల్లాకు చెందిన ఆయన అనుచర వర్గం, రేవంత్ రెడ్డికి జరిగిన  అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భట్టికి వ్యతిరేకంగా జిల్లా స్థయిలో తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సన్నహాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఇంతవరకు రేవంత్ వర్సెస్ సేనియర్లు అన్నట్లుగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు ఇప్పడు రేవంత్ రెడ్డి  వర్సెస్ భట్టి విక్రమార్కగా కొత్త రూపం తీసుకుంది. ముఖ్యమంత్రి కుర్చీ తగవుగా మారింది. మరో వంక టీఎస్పీఎస్సీ   లీకేజీ నిరసనల విషయంలోనూ రేవంత్ రెడ్డి  దూకుడుకు సీనియర్లు బ్రేకులు వేశారు. నల్గొండలో ఏప్రిల్ 21న జరగవలసిన నిరుద్యోగ నిరసన దీక్షకు సంబంధించి తనకు  సమాచారమివ్వకుండా, తనతో చర్చించకుండా, తన జిల్లాలో నిరసన దీక్ష పెట్టడమేంటని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రభావంతో నల్గొండ నిరసన దీక్ష రద్దయింది. అలాగే 24న ఖమ్మంలో. 26న అదిలాబాద్ లో జరగవలసిన దీక్షల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భట్టి వర్సెస్ రేణుక చౌదరి మధ్య కొత్త పంచాయతీ ఒకటి తెరపైకొచ్చింది.  నిజానికి ఈ పరిణామాలను గమనిస్తే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ కుమ్ములాటలకు... ముగింపు ఉంటుందా...? అంటే ... పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు.మరో వంక సీనియర్ నాయకులు ఒకరొకరుగా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు, ఇప్పటికే రేవంత్ వ్యతిరేక వర్గానికి చెందిన మర్రి శశిధర్ రెడ్డి, మహేశ్వర్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే దాసోజు శ్రవణ్ వయా బీజేపీ ..బీఆర్ఎస్ లో చేరారు. అదే విధంగా, ఉత్తమ కుమార్ రెడ్డి సహా ఇతర సేనియర్ నాయకులు ఎన్నికల సమయానికి ఎవరి దారిన వారు పార్టీ మారినా ఆశ్చర్య పోనవసరం  లేదని అంటున్నారు. అదే జరిగితే ఈసారి  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశలు పెంచుకున్న సామాన్య కార్యకర్తలకు నిరాశ తప్పక పోవచ్చని అంటున్నారు.

చేవెళ్ల సభలో చేరికలు అనుమానమే!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివాకం (ఏప్రిల్ 23) హైదరాబాద్ వస్తున్నారు. అయితే, ఆయన కేంద్ర హోం మంత్రిగా మాత్రమే హైదరాబాద్  రావడం లేదు.  . దేశ వ్యాప్తంగా ఇంతవరకు బీజేపీ ఒక్కసారి కూడా గెలవని 160 లోక్ సభ నియోజక వర్గాలలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ ప్రవాస్  యోజన కార్యక్రమంలో భాగంగా   ఆదివారం  (ఏప్రిల్ 23) చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. అందుకే అమిత్ షా పర్యటన  రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే  రాష్ట్ర బీజేపీ నాయకులు అమిత్ షా పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చేవెళ్ల సభను సక్సెస్ చేసేందుకు ఉన్న ఏ చిన్న అవకాశం చేజారకుండా శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక విధంగా చేవెళ్ల సభను మరో ఆరేడు నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విజయ సంకల్ప సభగా భావిస్తున్నారు. అందుకే బీజేపీ నాయకులు బాధ్యతలు పంచుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.  ముఖ్యంగా, లక్ష మందితో సభ నిర్వహిస్తామని, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర ముఖ్యనేతలు పదే పదే ప్రకటించిన నేపధ్యంలో పార్టీ నేతలు జన సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే చేవెళ్ళ సభ  సక్సెస్ ను నిర్ణయించేది కేవలం జనం  హాజరు మాత్రమే కాదని  పార్టీలో చేరేందుకు వెనక ముందవుతున్నఇతర పార్టీల నాయకులను మేరకు ఆకట్టుకుంటారు అనేది కీలకమని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా రేపటి ఎన్నికలల్లో బీఆర్ఎస్ ను ఓడించేదుకు బీజేపీ ఎంత సిద్దంగా ఉంది. కమల నాధుల చిత్తశుద్ధి ఎంత అనే విషయంలో వ్యక్తమవుతున్న అనుమానాలను అమిత్ షా ఏ మేరకు నివృత్తి చేస్తారు అనేది కూడా కీలకమని విశ్లేషకుకులు భావిస్తున్నారు.  అలాగే, అమిత్ షా సమక్షంలో కాషాయం కట్టేదెవరు అనే విషయంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు అవసరం అయితే  బొంత పురుగును ముద్దు పెట్టుకునేదుకు సిద్దమంటున్న బీఆర్ఎస్ బహిష్కృత నేతలు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు చేవెళ్ల సభలో  అమిత్ షా సమక్షంలో  పార్టీలో చేరతారా? అనే విషయంపై  రాజకీయ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరురుగుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చేవెళ్ల సభలో పెద్దగా చేరికలు ఉండవని  తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఇద్దరు చేరే అవకాశాలు అసలేమాత్రం లేవని అంటున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి మరి కొద్దిమంది ఇతర నేతలు వారి అనుచరులు మాత్రమే చేవెళ్ల సభలో  కమలం గూటికి చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.   ఇది చేరికల సభ కాదు, చేరిక సన్నాహక సభ  అని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలుగు వన్ కు చెప్పారు.  అయినా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పై బీజేపీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే, నేతల ఆశలను అమిత్ షా ఏ మేరకు నెరవేరుస్తారు అనేది చూడాల్సి ఉంది. కాగా  చేవేళ్ల బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. పార్టీ నేతలు సభా దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

సత్యాపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు

జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. 2019లో జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన దారుణ ఘటనకు కేంద్రం, ప్రధాని మోడీ నిర్లక్ష్యం, నిర్లిప్తత, బాధ్యతారాహిత్యం కారణమంటూ అప్పటికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసందే. సీఆర్పీఎఫ్ జవాన్లు ఏ మాత్రం భద్రత లేని రోడ్డు మార్గంలో ప్రయాణించడం   సేఫ్ కాదని..వారిని ఆకాశమార్గంలో తరలించేందుకు ఎయిర్ క్రాఫ్టులు అడిగితే కేంద్రం నిరాకరించిదని సత్యపాల్ మాలిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పుల్వామా ఘటన జరిగిన తరువాత తనను నోరెత్తవద్దంటూ స్వయంగా  మోడీ, ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పోన్ చేసి మరీ చెప్పారని సత్యపాల్  మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఆరోపణలు జాతీయ స్థాయిలో సంచలనం రేపాయి.  ఆయన ఆ ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది.   ఇలా కేంద్రంపై విమర్శలు చేయగానే అలా సీబీఐ నోటీసులు జారీ చేయడంతో కేంద్రం కనుసన్నలలో సీబీఐ పని చేస్తోందన్న తమ ఆరోపణలు వాస్తవమేనని మరో జారి రుజువైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.   తనకు సీబీఐ నోటీసులు ఇవ్వటంపై స్పందించిన సత్యపాల్ మాలిక్ తాను రైతుబిడ్డను అని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.   సత్యపాల్ మాలిక్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు.  2019 పుల్వామా దాడిపై మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ తుఫాను సృష్టించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సత్యపాల్ మాలిక్ కు  సీబీఐ సమన్లు జారీ చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  

అతిక్ అహ్మద్ మామూలోడు కాదు

అతిక్ అహ్మద్ ఈ లోకాన్ని వదిలి పోయి వారం రోజుల పైనే అయింది. అంత్యక్రియలు కూడా జరిగి పోయాయి. అయినా, అయన పేరు వింటే ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యంగా అతగాడు ఆడుతూ పాడుతూ హత్యలు, అత్యాచారాలు , కబ్జాలు చేసిన ప్రయాగ్‌రాజ్‌లో ప్రజలు భయంతో వణికి పోతున్నారు.  ఆవును కొద్ది రోజుల క్రితం సినిమా ఫక్కీలో మర్డరై  పోయిన యూపీ  గ్యాంగ్‌స్టర్, సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ మర్డర్ కు ముందు అయన ఎవరో  ఉత్తర ప్రదేశ్ బయట పెద్దగా తెలియక పోవచ్చును కానీ, ఆయన కొడుకు ఎన్ కౌంటర్ లో చనిప్యిన రెండు రోజులకే పోలీసులు, మీడియా కెమెరాల సాక్షిగా ‘లైవ్’లో హత్యకు గురైన తర్వాత ప్రపంచానికి ఆయన పరిచయం అవసరం లేకుండా పోయింది. నిజానికి, అతిక్ అహ్మద్ హత్య మనకు కొత్త కావచ్చును కానీ, ఇలాంటి హత్యలు చూడడమే కాదు చేసిన అనుభవం కూడా ఆయనకు ఉందని యూపీ మీడియా కోడై కూస్తోంది. ఒక్క హత్యలు, అత్యాచారాలే కాదు అతిక్ అహ్మద్ యూపీ లొ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.సమాజ్‌వాదీ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను నిర్వహించిన అతిక్ ఇష్టారాజ్యంగా కబ్జాలు సాగించారు. చిత్రం ఏమిటంటే ఆయన బాధితులలో మాములోళ్లు కాదు, మహా నాయకులు, వారి బంధువులు కూడా ఉన్నారు. అది కూడా ఇంకెవరో కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిలా నాయకురాలిగా కితాబు అందుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బంధువులు కుడా ఉన్నారు.  రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుతం అధికారంలో ఉన్న రోజుల్లోనే,అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బంధువు భూమిపై కూడా అతని కన్ను పడినట్లు తెలుస్తోంది. అయితే సోనియా తక్షణమే జోక్యం చేసుకోవడంతో అతిక్ పప్పులు ఉడకలేదు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండటంతో అతిక్ ఆటలు సాగలేదు.  జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోనియా మామ గారైన ఫిరోజ్ గాంధీ కుటుంబానికి చెందిన వీర గాంధీకి ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో  స్థలం ఉంది. ఆ స్థలాన్ని అతిక్ కబ్జా చేసి, తన మనుషులను అక్కడ పెట్టాడు.ఫిరోజ్ తోడల్లుడి సమీప బంధువైన వీర గాంధీ సోనియా గాంధీ సహాయాన్ని కోరారు. సోనియా జోక్యం చేసుకుని, అప్పటి ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషీతో మాట్లాడారు. రీటా జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. దీంతో అతిక్ వెనుకంజ వేసి, ఆ భూమిని తిరిగి వీర గాంధీకి అప్పగించాడు.  వీర గాంధీకి సహాయపడటానికి స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముందుకు రాలేదని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే అతిక్ హత్య తర్వాత వీర గాంధీని మీడియా సంప్రదించింది. కానీ అతిక్ గురించి తానేమీ మాట్లాడబోనని వీర చెప్పారు. అయితే రీటా మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీర గాంధీ భూమి విషయంలో తనతో సోనియా గాంధీ మాట్లాడారని, తాను జిల్లా యంత్రాంగంతో మాట్లాడానని, ఫలితంగా అతిక్ వెనుకంజ వేసి, భూమిని వదిలేశాడని చెప్పారు. దీని బట్టి చూస్తే, సోనియా గాంధీ బంధువు వీర గాంధీ అంతటి వాడు కూడా అతిక్ అహ్మద్ చనిపోయి వారం  రోజులకు పైగానే అయినా ఇంకా, అతని పేరు ఎత్తెందుకు కూడా భయపడుతున్నారు, అంటే,అతిక్  ఎంత భయంకరుడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అతిక్ అహ్మద్  మామూలు గ్యాంగ్‌స్టర్ కాదు, అరివీర భయంకర  గ్యాంగ్‌స్టర్. అతిక్ అహ్మద్‌పై 100కుపైగా కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు వంటి కేసులు ఉన్నాయి. అతిక్ ఆస్తుల విలువ అనేక వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రూ.1,169 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వీటిలో రూ.750 కోట్ల విలువైన ఆస్తులను ధ్వంసం చేయగా, రూ.417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అతను సంపాదించిన ఆస్తుల్లో ఇది సముద్రంలో నీటి బొట్టు వంటిదని అధికారులు చెప్తున్నారు.అందుకే  అతగాడిని అంత అమానుషంగా హత్య చేసినా  రాజకీయ నాయకులు తప్పించి సామాన్య ప్రజలు కనీసం, అయ్యో ..అనైనా అనలేదు. అవును అతిక్ మామూలోడు కాదు. మామూలు   గ్యాంగ్‌స్టర్ కాదు.

గంగా పుష్కర మహోత్సవం!

గంగాస్నానం పరమపవిత్రం. శివుడి జటాజూటం నుంచి భువికి చేరిన గంగమ్మ పరమపావన నది. అందులో స్నానమాచరిస్తే...సర్వపాపాలు పోతాయన్నది నానుడి.  శతాబ్దాలుగా ఇదే విశ్వాసంతో భక్తులు గంగా స్నానం ఆచరిస్తున్నారు. అటువంటి గంగానది పుష్కరాలు శనివారం(ఏప్రిల్ 22) ఆరంభమయ్యాయి.  మే3వ తేదీతో ముగుస్తాయి.  12 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కర పర్వంలో లక్షలాది మంది   భక్తిశ్రద్ధలతో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.  బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు ప్రారంభ మయ్యాయి. సమస్త ప్రాణికోటి  మనుగడకు ఆధారం.  నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జల స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. గంగా పుష్కరం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పరమ పవిత్రమైన పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినపðడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన విూనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని భారతీయులు ముఖ్యంగా హిందువుల విశ్వాసం. ఈ కారణంగా గంగా నదిలో అనేక మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పితృ తర్పణాలు వదులుతారు.  గంగానది ప్రవహించే ప్రతిచోటా ఈ పుష్కరాలు జరుగుతాయి. అయితే, గంగోత్రి, రుషికేశ్‌, హరిద్వార్‌, వారణాసి, ప్రయాగరాజ్‌లో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతాయి. గంగా పుష్కరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీనే. భక్తులంతా కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు. ఇక్కడే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని భారతీయుల నమ్మకం. అంతేకాదు, గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భారతీయులు. గతించిన తమ ఆత్మీయులకు గంగా జలాల్లో పిండ ప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే, గంగా పుష్కరాలు భారతీయులకు ఎంతో ప్రత్యేకం. తెలుగు ప్రజల కోసం కాశీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 29న వారణాసిలోని గంగా ఘాట్‌ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని నరేంద్ర వెూదీ పాల్గోనున్నారు.

తిరుమలలో ఎమ్మెల్సీ దందా.. బ్రేక్ దర్శన టికెట్ల కుంభకోణం

 హిందువులు దేవాలయాల వైపు భక్తులు కన్నెత్తి చూడకూడదు అన్నట్లుగా అర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ధరలను జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా పెంచేసింది.  కొద్ది రోజుల క్రితం కాణిపాకం వరరసిద్ధి వినాయకుని దేవాలయంలో నిత్యం జరిగే, పంచామృత అభిషేకం టికెట్ ధరను ఒక్క సారిగా, రూ. 750 నుంచి రూ.5000లకు పెంచారు. అయితే  భక్తులు హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగడంతో, అబ్బే అదేమీ లేదు అలా పెంచితే ఎలా ఉంటుందని భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే బోర్డు పెట్టామని, అధికారులు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఆ తరువాత  విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సర్కార్ స్వాములు సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్‌ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడంతో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనానికి దూరమవుతున్నారు. తిరుమల వెంకన్న దేవుడు మొదలు రాష్టంలోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయ వనరులుగానే చూస్తోందని, మరో వంక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల సహా అన్ని ప్రముఖ ఆలయాలలో అన్యమత జోక్యం పెరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ముడుపులు కట్టి స్వామి వారలకు సంర్పించుకుంటున్న కోట్లాది రూపాయల సొమ్ములను జగన్ రెడ్డి ప్రభుత్వం కొల్ల గొడుతోందని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తిరుమలలో ప్రత్యేక ప్రవేశదర్శనం, బ్రేక్ దర్శనం టికెట్ల కుంభకోణంలో సాక్షాత్తూ ఒెక ఎమ్మెల్సీ ప్రమేయం బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.  తిరుమలలో ప్రోటోకాల్‌ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ స్కామ్‌ వ్యవహారం తీవ్ర దూమారం  రేపుతోంది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీతో పాటు మరో ఇద్దరిపై తిరుమల టూ టౌన్‌ పోలీసులు కేసు నవెూదు చేసింది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ఆయన సహచరులను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం శుక్రవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం విజిలెన్స్‌ వింగ్‌ అధికారుల ఫిర్యాదుతో ఏ1గా ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌, ఏ2గా డేగ రాజు, ఏ3గా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై  ఐపీసీ సెక్షన్‌ 420 ,468, 472, రెడ్‌ విత్‌ 34 ప్రకారం తిరుపతి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నవెూదు చేశారు. వీరిలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి నోటీసులిచ్చి వదిలేయగా.. డేగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌ కోసం గాలిస్తున్నారు. 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటగిరీ కింద ఆరుగురు భక్తులకు దర్శనం కల్పించేందుకు ఎమ్మెల్సీ  .లక్ష రూపాయలు వసూలు చేశారని, శ్రీవారి దర్శనం టిక్కెట్లను అక్రమంగా పొందేందుకు నకిలీ ఆధార్‌ కార్డులను ఉపయోగించారని టీటీడీ విజిలెన్స్‌ విభాగం పేర్కొంది. 14 మందికి ప్రోటోకాల్‌ కేటగిరీ కింద వీఐపీ బ్రేక్ దర్శనం మంజూరుకు సంబంధించి జేఈవో కార్యాలయానికి ఎమ్మెల్సీ ముందస్తు సమాచారం పంపారని తిరుమల వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఫిర్యాదు చేసింది. ఇక తిరుమల ఆలయంలో దర్శన టిక్కెట్ల బ్లాక మార్కెటింగ్‌కు ఒక ప్రజా ప్రతినిధి పాల్పడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అంతకముందు షేక్ సబ్జీ ఇతర భక్తులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున దర్శనానికి వచ్చినప్పుడు, భక్తులు సమర్పించిన ఆధార్‌ కార్డులు నకిలీవని విజిలెన్స్‌ వింగ్‌ గుర్తించింది. దర్శన టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకునేటపప్పు సమర్పించిన భక్తుల ఆధార్‌ కార్డులలోని చిరునామా హైదరాబాద్‌ కాగా, వారు వాస్తవానికి కర్ణాటకకు చెందినవారని తేలింది. విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ వారిని నిలదీయగా, రూ.500 ధర ఉన్న వీఐపీ దర్శనం టిక్కెట్ల కోసం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి రూ.లక్ష చెల్లించినట్లు తెలిసింది. ఇలా దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ ద్వారా భక్తుల నుంచి వచ్చిన అక్రమ సొమ్ము అంతా ఎమ్మెల్సీ కారు డైవర్‌ బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని విచారణలో తేలింది.

కరోనా పునరాగమనం.. అతి భయం వద్దు.. జాగ్రత్తలే ముద్దు

దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మరో వేరియంట్‌ వణికిస్తోంది.   ఫోర్త్‌వేవ్‌ అంటూ సర్వత్రా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు   పెరగగడం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న  కొత్త వేరియంట్‌ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు   కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదకరమైనదే అయినా పెద్దగా మరణాలు సంభవించలేదు. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే థర్డ్‌వేవ్‌ ముగిసింది. అయితే ఇప్పుడు కేసుల పెరుగుదల ఉధృతి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులను స్ఫురింప చేస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  మళ్లీ కరోనా సీజన్‌ మొదలైందా అన్న ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఎండమిక్ కు ముందు దశ అనీ,  అతిగా భయపడటం అనవసరమనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.  మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం ద్వారా ఎలాంటి ముప్పు లేకుండా ఈ దశ నుంచి బయటపడొచ్చనీ అంటున్నారు.అయితే కరోనా ప్రస్తత వ్యాప్తి తీవ్రతపై ఇంకా ఇంకా శాస్త్రీయమైన స్పష్టత రాలేదు.. ప్రస్తుతం సోకుతున్న కరోనా  లక్షణాలను అనలైజ్ చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంది.  శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు. దీంతో కొత్త వేరియంట్ విషయంలో త్వరలోనే ఒక  స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక అంచనా మేరకు దీని వ్యాప్తి తీవ్రత వేగంగా ఉంటుందనీ, గతంలో వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి కూడా ఈ కొత్త వేరియంట్ నుంచి లక్షణ లేదనీ వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. ప్రజలలో ఆందోళనను పెంచేందుకు తప్ప ఇటువంటి వార్తల వల్ల మరే ప్రయోజనం ఉండదు. ప్రజలలో పేనిక్ కలిగించే ఇటువంటి వార్తలను, వదంతులను నమ్మకూడదు. ఇక జనంలో కూడా కరోనా మూడో వేవ్ తరువాత ఆ మహమ్మారి అంతరించిపోయిందన్న భావనకు వచ్చేశారు. ఇప్పుడు ఎవరూ మాస్కులు ధరించడానికి పెద్దగా సుముఖత చూపడం లేదు. రెండేళ్లు పండుగలూ, పబ్బాలకూ దూరంగా ఉన్న ప్రజలు ఇక అందుకు ఇష్టపడటం లేదు. కనుకనే  పండుగలు.. శుభకార్యాలలో గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారు.  ఇది ఎంత మాత్రం సరికాదు. మొదటి సారి అత్యంత పకడ్బందీగా మహమ్మారిని కట్టడి చేసిన ప్రభుత్వాలు,  సెకండ్‌ వేవ్‌లో  మాత్రం పూర్తిగా విఫలమయ్యాయి. థర్డ్‌వేవ్‌లో ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించారు. అయితే ఆ తరువాత.. మహమ్మారి పునరాగమనాన్ని ఎదుర్కోనే విషయంలో మాత్రం ప్రజలలోనూ, ప్రభుత్వాలలోనూ కూడా సంసిద్ధత కొరవడింది.  అతి భయం అవసరం లేదు కానీ జాగ్రత్తలు పాటించే విషయంలో  ఎటువంటి నిర్లక్ష్యానికీ తావియరాదు.   

అవినాష్ అరెస్టు తథ్యం.. సీబీఐ దూకుడు అక్కడితో ఆగేనా?

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగానే.. న్యాయనిపుణులే కాదు.. సామాన్య జనం కూడా విస్మయం చెందారు. టీవీ టాక్ షోలలో విశ్లేషకులు కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ చివరి నిముషంలో మరో బెంచ్ కు మారడంపైనా సందేహాలు వ్యక్తం చేశారు.  మొత్తం మీద హైకోర్టులో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్టు నుంచి తాత్కాలికంగానే అయినా ఊరట లభించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని అంతా భావించారు. ఆ దిశగా పలు విశ్లేషణలూ చేశారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డి ప్రతి రోజూ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. దీంతో అవినాష్ రోజూ క్రమం తప్పకుండా గంటల తరబడి సీబీఐ విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు. అనూహ్యంగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 21) విచారించింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహంలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ వాదనల సందర్భంగా  సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు అలాంటి తీర్పులు ఎలా ఇస్తారని ఒకంత తీవ్రంగానే వ్యాఖ్యానించారు. అంతే కాదు హైకోర్టు ఇక అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నెల 25న  ముందస్తు బెయిల్ విషయంలో తుది తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్యులలో పేర్కొంది. అయితే ఆ తేదీ కంటే ఒక రోజు ముందే..సుప్రీం కోర్టు ఈ విషయంలో తన నిర్ణయం ప్రకటించనుంది. అయినా వివేహా హత్య కేసు విషయంలో ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు సీబీఐకి గడువు విధిస్తూ విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చిందంటూ న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే సామాన్య జనం కూడా తీర్పు ఇలా వచ్చిందేమిటి? అని విస్మయం చెందారు. సుప్రీం కోర్టు స్పందన కూడా  అలాగే ఉంది.   ఇక ఇప్పుడు ఈ నెల 24 వరకూ అంటే సోమవారం వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీం చెప్పినా.. అదేమీ ఆయనకు ఊరట కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచారణ కోసం ఆ రోజు వరకూ ప్రతి రోజూ అవినాష్ సీబీఐ కార్యాలయం గడప తొక్కాల్సిందే. గంటల తరబడి వారి ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన వలసిందే. సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలతో అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో అరెస్టు కాకతప్పదన్న విషయం తేలిపోయిందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆ తరువాత కూడా కేసు దర్యాప్తు ముగించడానికి సుప్రీం సీబీఐకి విధించిన గడువులో మరో ఐదారు రోజులు మిగిలే ఉంటాయి కనుక సీబీఐ అరెస్టుల పర్వం అవినాష్ రెడ్డితో ఆగుతుందా? అవినాష్ విచారణలో తేలిన అంశాలు అధారంగా మరి కొందరికి కూడా సమన్లు జారీ చేస్తుందా అన్న అనుమానాలను న్యాయ నిపుణులు, పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవండి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  ఇటీవలె 420 బర్త్ డే చేసుకున్నాడని ఎపీ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులుగా  ఉన్న విషయాన్ని ఈ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. వివేకా మరణానికి గుండెపోటు కాదని తేలిపోయింది. నరికి చంపినట్లు నిర్ధారణ అయ్యింది. స్వంత బాబాయి హత్యకు గురయితే ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను ఢిల్లీ వెళ్లి పైరవీ చేయించుకునే స్థాయికి దిగజారాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్  భాస్కర్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్ చేసింది.  వైఎస్ కుటుంబానికి చెందిన భాస్కర్ రెడ్డితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితుడు, హంతకులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఉండటం ఏపీ ప్రజలు ఊహించలేకపోతున్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు  కోరుకుంటున్నారని, ఆయన బర్త్ డే సందర్బంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా మెల్బోర్న్, ఐర్లాండ్లలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. విదేశాల్లో  కూడా చంద్రబాబు బర్త్ డే  వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రేస్ జీర్ణించుకోలేకపోతుందని, వైఎస్ వివేకా హత్య కేసు మూలాలు పులివెందుల చుట్టే తిరుగుతున్నాయని వాళ్లు గుర్తు చేశారు. వైఎస్ వివేకా కూతురు సునీత తన కుటుంబ సభ్యులను పోలీసులకు పట్టిస్తుంది. తన తండ్రి గుండెపోటుతో మరణించలేదని తొలుత చెప్పింది సునీత అయితే జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని  టీడీపీ ప్రశ్నిస్తోంది. 

వివేకా కొత్త భార్య ఎంట్రీ

వివేకానందరెడ్డి రెండు సార్లు పెళ్లి చేసుకున్న రెండవ భార్య  షేక్ షమీమ్  తెరముందుకు వచ్చింది. వివేకా హత్య జరిగిన నాలుగేళ్ల తరువాత షమీమ్ ఎంట్రీ అవినాష్ వర్గానికి కొత్త ఊపును తెచ్చింది. నాలుగేళ్లుగా కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తున్న షమీమ్ ను  హైదరాబాద్ కు తీసుకువచ్చి, సీబీఐ ముందుకు వెళ్లేందుకు శిక్షణ ఎవరిచ్చారో తెలుసుకునేందుకు పెద్ద తెలివితేటలు అవసరం లేదు. ఆ విషయాలను పక్కన పెడితే.. షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. తనను తన భర్త వివేకానందరెడ్డితో కలవకుండా సునీత, శివప్రకాశ్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. వివేకాతో పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్న షమీమ్ , ఈ వివాహానికి తన అనుమతి లేదని తేల్చేశారు. తన వివాహం 2010లో జరుగగా, 2015లో కొడుకు షెహన్ షా కలిగాడని ఆమె చెబుతోంది. అయితే వివేకాతో జరిగిన తన వివాహానికి ఎటువంటి సాక్ష్యాన్ని ఆమె అందించ లేదు.  2019లో హత్యకు గురైన వివాకా అప్పటికి నాలుగేళ్లు కూడా లేని ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని షమీమ్ చెబుతోంది. భూ సెటిల్మెంట్ లో తనకు ఎనిమిది కోట్లు వస్తాయన్న ఆశతో ఎదురు చూసినట్లు షమీమ్ చెప్పుకుంది. తనకు డబ్బు, తన కుమారుడికి రాజకీయ వారసత్వం రావాలని షమీమ్ కోరుకుంది. కానీ అలా జరగకపోవడంతో నాలుగేళ్లుగా ఆలోచించి ఇప్పడు సీబీఐ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. . నిన్నటి వరకూ వివేకా రాసిన వీలునామా చుట్టూ సాగిన చర్చ ఈ రోజు ఎక్కడా కనిపించలేదు. వేవేకా వీలునామారాశారని వాదించిన అవినాష్ వర్గం ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. కడప ప్రకాష్ నగర్ నుండి  వచ్చిన షమీమ్ వివేకా హత్యకు సంబంధించి ఏ విషయాన్నీ తన మూడు పేజీల  స్టేట్ మెంట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సహజంగానే అవినాష్ వర్గం నిరుత్సాహానికి గురైంది. మరో వైపు సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు ఆ వర్గాన్ని  మరింత  కలవరపెడుతున్నాయి. షమీమ్ పోరాటానికి, వివేకా హత్య కేసుకు సంబంధం  లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 25వ తేదీ వరకూఅవినాష్ రెడ్డి అరెస్ట్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించగా,  సుప్రీం కోర్టు అంతకు ఒక రోజు ముందే అంటే 24నే ఈ కేసు విచారిణ చేయనుంది. షేక్ షమీమ్ తన వాటా ఆస్తి కోసం, తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం అదే రోజు హైకోర్టు మెట్లు ఎక్కనుంది. చివరిగా ఒక్క మాట, వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా తన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గురించి గొప్పగా మాట్లాడేవారు. తండ్రి రాజారెడ్డి తమ్ముడికి వివేకానందుడి పేరు పెట్టడంతో నిజంగా వివేకానందుడి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాడని మురిసిపోయేవారు.. కానీ తాజా ఆరోపణలు దివంగత నేత అంచనాలు తప్పని తేల్చేశాయి. 

లోకేష్ పాదయాత్ర@1000 కిలోమీటర్లు!

విజయానికి తొలి మెట్టు విశ్వాసం .. మలి మెట్టు పట్టుదల.. ఈ రెండు కలిస్తే  అది లోకేష్ యువగళం పాదయాత్ర. అవును, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  విశ్వాసం ఊపిరిగా, పట్టుదల శ్వాసగా సాగిస్తున్న యువగళం పాదయాత్ర శుక్రవారం (ఏప్రిల్ 21)  వెయ్యి కిలోమీటర్ల  మైలు రాయిని చేరుకుంది. ఈ ఏడాది ( 2023) జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన యువగళం పాదయాత్ర,   శుక్రవారం (ఏప్రిల్ 21) నాటికి 77వ రోజుకు చేరుకుంది. సరిగ్గా ఇదే రోజున ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు  పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.  శుక్రవారం(ఏప్రిల్ 21) ఉదయం   ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి 77వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.  ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద  లోకేష్ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో  సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివరించే లక్ష్యంతో 400 రోజులలో 4 వేల కిమీ పాదయాత్రను ప్రారంభించి నప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించింది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం లోకేష్ పాదయాత్రపై పాతికకు పైగా కేసులు పెట్టింది. యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా ఓ వంక పోలీసులు మరో వంక,  వైసీపీ కార్యకర్తలు,  నాయకులు అవరోధాలు సృష్టిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో యాత్ర ప్రారంభానికి ముందే ప్రచార రథం, మైకు, సౌండ్ సిస్టం ఇతర ప్రసార సాధనాలను, ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి తంబళ్ళపల్లి మధ్యలో సగటున ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు చొప్పున పెట్టారు. దీనిని బట్టే పోలీసులు లోకేష్ పాదయాత్ర విషయంలో ఎంత దుర్మార్గంగా వ్యహరించారో వేరే చెప్పనక్కర లేదు.  అయినా లోకేష్, ఎవరికి  చెప్పవలసిన సమాధానం వారికీ చెపుతూ  మొక్కవోని ధైర్యంతో ముదుకు సాగుతున్నారు. అంతే కాదు, పాద యాత్రతో పాటుగా లోకేష్ ఎక్కడి కక్కడ వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశ మవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసు కుంటున్నారు. వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే  ప్రజలు తమ ముందుంచిన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.   అలాగే, ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా  సహా ప్రజల ముందుంచుతున్నారు. చర్చకు సిద్దమని సవాళ్లు  విసురుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన సంస్థలు, అన్న కాంటీన్ల ముందు సేల్ఫీలు దిగుతూ ...జగన్ రెడ్డి సర్కార్’ సెల్ఫి సవాళ్ళు విసురుతున్నారు.. దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు  పరుగెడుతున్నాయి. అందుకే యాత్ర ప్రారంభంలో అవహేళన చేసిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు. జన ప్రభంజనమై సాగుతున్న యువగళం గర్జనలకు భీతిల్లి పోతున్నారు.

లోకసభ ఎన్నికలకు కేసీఆర్ పక్కా వ్యూహం

అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్  అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా  వ్యూహంతో ఉన్నట్లు కనబడుతోంది.   2024 ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాలని కొంతమంది మంత్రులకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.  ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని  ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూచించారు. మరికొంత మంది ఎంపీలకు పార్టీ నాయకత్వ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జి. జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులను ఎంపీలుగా పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్ స్థాపన దినోత్సవం తర్వాత పోటీదారుల విషయం మరింత  క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.  2024లో కనీసం తొమ్మిది లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడానికి నేరుగా మంత్రులను రంగంలోకి దించాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి, సికింద్రాబాద్, నల్గొండ లోకసభ స్థానాలకు మంత్రులను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. , మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ , చేవెళ్ల. లోక్‌సభ ఎన్నికల కోసం మంత్రులతో పాటు అసెంబ్లీ, మండలిలో  ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను కూడా  ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. బీఆర్ ఎస్ ఇప్పటి వరకు నల్గొండ, సికింద్రాబాద్ నియోజకవర్గాలను కైవసం చేసుకోలేదు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసింది. మెదక్ ఎంపీ కొత్త కోట ప్రకాశ్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. 2014లో మొదటి సారి, 2019లో రెండోసారి గెలుపొందారు.  2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలపై సీఎం ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. 2024లో మొత్తం 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో సీఎం "మిషన్-16" లక్ష్యాన్ని నిర్దేశించారు, మిగిలిన ఒక్క హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని దాని మిత్ర పక్షమైన మజ్లిస్ కే వదిలివేసారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో పార్టీ తన ప్రభావాన్ని చూపాలంటే తెలంగాణలో లోక్‌సభ న్నికల్లో క్లీన్‌స్వీప్ చేయాల్సిందేనని కేసీఆర్  గట్టి అభిప్రాయం. 2019 లోక్‌సభ ఎన్నికలకు  సీఎం మిషన్-16 లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు.  పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్  2014లో 11 లోకసభ స్థానాలలో గెలుపొందింది.   2019లో టీఆర్ఎస్  9 స్థానాలకు  పడిపోయింది. అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను మార్చినట్లయితే దీనికి చెక్ పెట్టవచ్చని బీఆర్ఎస్  నాయకత్వం అభిప్రాయపడుతోంది.   

అసలు గవర్నర్ అవసరమేంటి

కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మరో పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్ చేత కక్ష్య సాధింపు చర్యలు జరుగుతాయా? దక్షిణాదిన తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ లతో వచ్చిన విభేధాలే ఇందుకు తార్కాణంగా కనబడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవస్థ బీజేపీకి అస్త్రాలుగా మారారు.   ఎందుకంటే దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ గవర్నర్ల పనితీరుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అయిష్టతతో ఉండటమే ఇందుకు నిదర్శనం. అటు స్టాలిన్ ప్రభుత్వం.  ఇటు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన  బిల్లులు గవర్నర్ల వద్ద ఆమోదం పొందకపోవడంతో వివాదం రాజుకుంది. తెలంగాణ శాసన సభ ఆమోదం పొందిన మూడు  బిల్లులను   గవర్నర్ తమిళసై ఆమోదం చేయకపోవడంతో  ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్ కు తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. గవర్నర్ తమిళ సై బీజేపీ ప్రభుత్వం చేత నియామకం అయ్యారు.  కాబట్టి కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని  తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం తనను అనేక సార్లు అవమానపర్చిందని, ఎటు వంటి ప్రోటోకాల్ పాటించలేదని గవర్నర్ తమిళ సై ఆరోపణ. తగ్గేదే లే అన్నట్టు  వ్యవహరించింది తమిళసై.   ఆపి వేసిన మూడుబిల్లులను ఆమోద ముద్ర వేసినప్పటికీ రాష్ట్ర పతి పరిశీలనకు మరో రెండు బిల్లులను పంపింది. కీలకమైన ఈ రెండు బిల్లులను ఆపడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. వివరణ కోసం మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు తమిళ సై. అయితే తమిళ సై మీద తీవ్ర అగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అసలు గవర్నర్ పోస్టు జాన్తా నై అంటున్నారు.  రాష్ట్ర శాసన సభ ఆమోదం శిరోధార్యం అని సరికొత్త వాదనకు తెరలేపారు. గవర్నర్ పోస్టులు రాష్ట్రాలకు అవసరమే లేదని ఆయన వాదన. గవర్నర్ పోస్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారమేనని ఆయన అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని బీజేపీ గవర్నర్ లను వినియోగించుకుంటుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.   బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్ లు రాజకీయ ఉద్దేశాలతో పని చేస్తున్నారని  అన్నారు.  తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని అక్కడి  గవర్నర్ ఇరుకున పెట్టారు. అక్కడ కూడా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే ఆమోద ముద్ర వేయకపోవడంతో తమిళనాడు శాసనసభ కొత్తగా ఒక బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్ర శాసన సభ ఆమోదిస్తే అదే ఫైనల్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంది. డిఎంకే, కూటమి పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి.  దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వచ్చిన విభేధాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  తెలుగునాట గవర్నర్ తో విభేధాలు కొత్తేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో టిడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి విభేధాలు తారాస్థాయికి చేరాయి. చికిత్స కోసం అప్పటి సీఎం హోదాలో ఎన్టీఆర్ అమెరికా బయలు దేరారు. అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి ప్రత్యామ్నాయం లేదు. పార్టీ స్థాపించిన ఏడు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగడం, అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు.  ఎన్టీఆర్ ను గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.  టిడీపీ పార్టీలో, ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న నాదెళ్ల భాస్కర్ రావును కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకుంది. కరడు గట్టిన కాంగ్రెస్ వాది అయిన  అప్పటి గవర్నర్ రామ్ లాల్ ఈ వ్యవహారంలో  కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి సీట్లో నాదెళ్ల భాస్కర రావు ను కూర్చోబెట్టారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఖంగుతిన్నారు. తన సీటుకే ఎసరు పెట్టిన గవర్నర్ వ్యవస్థను ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. నాడు ఎన్టీఆర్ గవర్నర్ వ్యవస్థను తప్పు పడితే నేడు కేటీఆర్ గవర్నర్లు రాష్ట్రాలకు అవసరం లేదని వాదిస్తున్నారు.   గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్ పార్లమెంటులో తాజాగా ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ దిశగా రాజ్యంగానికి సవరణ చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రాల అధికారాలు, కేంద్రం హక్కుల మధ్య ఉండాల్సిన సమతౌల్యాన్ని గవర్నర్ వ్యవస్థ దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను ప్రజలు ఎన్నుకోలేదని, కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల విధి నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్లకు ఉండకూడదని తన బిల్లులో ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ , డీఎంకే సపోర్టుగా వామ పక్ష పార్టీ అయిన సీపీఐ  కూడా రాజ్యాంగ సవరణ జరగాలని వాదించడం చర్చనీయాంశమైంది. 

ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా?.. అవినాష్‌కి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడం దారుణమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను శుక్రవారం (ఏప్రిల్ 20) విచారించిన సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిలుపై స్టే విధించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.  తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.  అయితే సోమవారం ఉదయం వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ పిటిషన్ ను  సోమవారం ఉదయమే విచారిస్తామని సుప్రీం పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం చేసిన వ్యాఖ్యలు వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది.  తొలి సారిగా తన తండ్రి హత్య కేసు దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని సునీత ఆరోపించారు. అవినాష్ రెడ్డిని ఏపీ సీఎం జగన్ కాపాడుతున్నారని కూడా సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఏపీ సీఎం, తన సోదరుడు అయిన జగన్ పై కూడా సునీత ఆరోపణలు చేశారు. ఒక వైపు కేసు దర్యాప్తు జరగుతుండగానే సీఎం హోదాలో అసెంబ్లీలో జగన్ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిందితుడికి క్లీన్ చిట్ ఇవ్వడమేమిటని పేర్కొన్న ఆమె.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం సకల యత్నాలు చేసిందని ఆరోపించారు.  మొత్తం మీద హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా   అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చేసింది. దీంతో సోమవారం అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణలు వ్యక్తం చేస్తున్నారు. 

అవినాష్ రెడ్డి అరెస్ట్‌ ఇక లాంఛనమే

తెలంగాణ హైకోర్టు విధించిన 25వ తేదీ పరిమితిపై సుఫ్రింకోర్టు స్టే విధించింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యమైంది. ఏప్రిల్ 30వ తేదీలోకగా విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు పట్టించుకోక పోవడంపై వివేకా కుమార్తె సుప్రీంకోర్టు తలుపుతట్టారు. 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలులోనే ఉండగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా  ఆదేశాలు అవినాష్ రెడ్డి వర్గాన్ని ఇరకాటంలో పడేశాయి.  కేసు కీలక దశలో ఉన్న తరుణంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ పై జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అవినాష్ రెడ్డి అనేక అనవసర కారణాలతో విచారణను అడ్డుకోవడమో... జాప్యం జరిగేటట్లు ప్రయత్నించడమో చేస్తున్నారని వైయస్ సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదననను.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహన్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. సిద్ధార్థ వాదనలపై బెంచ్ తీర్పు వెలువరించింది. తాజా పరిణామాలతో సీబీఐకి కొత్త బలం వచ్చినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే.. సీబీఐకి క్షణాల్లో పని అనేది వారి వాదన.  కాగా అవినాష్ న్యాయవాదుల విజ్ణప్తి మేరకు సుప్రీం కోర్టు ఆయనను సోమవారం వరకూ అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. 

శరద్ పవార్ దారెటో తేలిపోయిందా?

విపక్షాల ఐక్యత కోసం అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తున్న శరద్ పవార్ ఇప్పుడు అదే విపక్ష కూటమికి దూరమౌతున్నారా? విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పారిశ్రామిక వేత్త అదానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన రాజకీయ రూటు మారిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదానీ, మోడీ నెక్సస్ పై విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. పవార్ మాత్రం అదానీ, మోడీ సంబంధం, మోడీ విద్యార్హత తప్ప మరో సమస్యే లేదా అంటూ చిటపటలాడుతున్నారు. దీంతోనే ఆయన విపక్షాల ఐక్యతకు కాకుండా విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారా? కమలానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పరిశీలకులు సైతం అదే దారిలో విశ్లేషణలు చేశారు. ఆ అనుమానాలకూ, విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా అదానీతో శరద్ పవార్ బేటీ అయ్యారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్వయంగా ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. వీరిరువురి మధ్యా జరిగిన చర్చలేమిటన్నది పక్కకు పెడితే.. హిడెన్ బర్గ్ నివేదిక తరువాత అదానీపై వెల్లువెత్తుతున్న విమర్శలు, జేపీసీ కోసం విపక్షాల డిమాండ్ నూ పట్టించుకోకుండా కేంద్రం నిర్మొహమాటంగా అదానీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో శరద్ పవార్, అదానీ బేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పైపెచ్చు విపక్షాల విమర్శలను ఖండిస్తూ పవార్ అదానీకి మద్దతుగా నిలవడంతో ఈ భేటీ రాజకీయ ప్రాముఖ్యతను  సైతం సంతరంచుకుంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో శరద్ పవార్ కేంద్రానికి మద్దతుగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు. 

కర్నాటక ఎన్నికల సమరంలో యాచకుడు.. ఇండిపెండెంట్ గా పోటీ

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలంటే వందలు వేలు లక్షలు కాదు కోట్లలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే కాదు, చివరకు  పంచాయతీ వార్డు మెంబరుగా పోటీచేసినా అభ్యర్ధులు లక్షల్లో ఖర్చుచేస్తున్న సంఘటనలు ఉన్నాయి.  అంత ఖర్చు చేసినా చివరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని ఇంటికి పంపుతారో తెలియదు.   ఎన్నికలో పోటీ చేయాలంటే చదువు అవసరం లేదు కానీ, డబ్బుల మూటలు మాత్రం మేండటరీగా మారిపోయిన రోజులివి. అటువంటిది కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో యాదగిరి నియోజక వర్గం నుంచి బిచ్చమెత్తుకుని బతికే యంకప్ప అనే యాచకుడు బరిలోకి దిగారు. యాదగిరి పట్టణంలో బిచ్చమెత్తుకుని బతుకుతున్న ఆయనకు ఇల్లూ వాకిలీ    లేవు. పొద్దంతా ఇక్కడా అక్కడా బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునే, యంకప్ప రాత్రికి ఏ గుడిలోనో తలదాచుంటారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కానీ,  పోటీ చేయాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. అంతే ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి, బిచ్చమెత్తి డిపాజిట్  చెల్లించేందుకు అవసరమైన రూ.10వేలు సేకరించారు. ఆలా బిచ్చమెత్తి తెచ్చిన రూ.10వేల చిల్లర నాణేలనే డిపాజిట్  గా చెల్లించారు. ఆ నాణేలను లెక్కించేందుకు అధికారులకు రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. కాగా  యంకప్ప డిపాజిట్ సొమ్ములు సేకరించడంలోనే పనిలో పనిగా   ప్రచారం కూడా కానిచ్చేశారు.. ఈ ఎన్నికల్లో  తాను ఎందుకు పోటీ చేస్తున్నది ప్రజలకు చెప్పి మరీ,  డిపాజిట్ మొత్తం సేకరించారు. ఈ విషయం ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఎన్నికలలో పోటీ కోసం కోసం అవసరమైన డిపాజిట్ డబ్బుల కోసం యాచిస్తున్నానని ఆయన ప్రజలకు చెప్పి మరీ అడుక్కున్నాడు. ఆయన నామినేషన్’ ఆమోదం పొంది, పోటీలో నిలిచి గెలిస్తే   యంకప్ప చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. యంకప్పే కాదు, యాదగిరి నియోజక వర్గం, నియోజక వరం ప్రజలు కూడా చరిత్ర పుటల్లో నిలిచి పోతారు.అయితే, గతంలోనూ కొందరు పేదలు పోటీ చేసిన సందర్భాలు లేక పోలేదు. అయితే, సక్సెస్ అయిన సందర్భాలు మాత్రం అతి స్వల్పం. ఇంతకీ కొసమెరుపేమిటంటే.. దిగ్గజాల మధ్య యంకప్ప ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు.